వెనక్కి చూడకుండా పరుగెత్తారు రాజన్, సురేంద్రలు.
గన్ పౌడర్ ప్యూమ్స్ చిమ్ముతున్న గంధకపు వాసన ఆహ్లాదంగా పీలుస్తూ నేలపైన వున్న పాతిక లక్షల కరెన్సీని, అంతే ఖరీదు చేసే 'క్రాక్ ని' చూసి ఇంకోసారి నవ్వాడు సర్కార్.
అంతా సర్దమన్నట్టు అనుచరులకి సౌంజ్ఞ చేస్తూ చివరగా నేలపైకి వంగేడు.
ఇంకా పూర్తిగా బిగుసుకోని రావూఫ్ చేతి చూపుడు వేలు మాత్రం బయటికి విడదీసి తనే ఓ పేరు రాసేడు ఇసుక నేలపై.
తాము మోసగించబడ్డామన్న ఆలోచనతో ఎక్కడో గుజరాత్ లో వున్న ఓ గాంగ్ ని రెచ్చగొట్టడానికి, ఇటు పోలీసులకు తమపై అనుమానం రాకుండా చేయడానికి, ఎదుగుతున్న ప్రత్యర్థి ఆట పూర్తిగా కట్టించడానికి, రావూఫ్ చనిపోతూ రాసినట్టు ఓ పథకం ప్రకారం అక్కడ సర్కార్ రాసిన పేరు "ధనుష్కోటి"ది.
* * * *
చట్టానికి ఆధారాలతో అందని నొటోరియస్ క్రిమినల్ గా పోలీస్ వ్యవస్థకీ, పరమ కిరాతకుడిగా అండర్ వరల్డ్ ముఠాలకీ తెలిసిన సర్కార్ సామాన్యమైన వ్యక్తి కాదు.
బయటి ప్రపంచానికి ఒక పారిశ్రామికవేత్తగా కనిపిస్తూ రాష్ట్రమే గాక దేశం నలుమూలలా విస్తరించిన చీకటి ప్రపంచపు ఎన్నో ముఠాలకి కింగ్ పిన్ గా వ్యవహరించే ఒక కోటీశ్వరుడైన గాడ్ ఫాదర్ జయచంద్రకి కుడి భుజం.
* * * *
న్యాయం జరగని నిరపరాధిలా చీకటి కౌగిలిలో ప్రపంచం చిక్కుకున్న వేళ...
డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న శశాంకని చూస్తూ "భోంచేయి శశాంకా" అన్నారు రాజమణి.
అన్నం కెలుకుతూ చాలాసేపటి నుంచి అలాగే వుండిపోయిన శశాంక ఇక నిభాయించుకోలేనట్టు లేచి ప్లేటులోనే చెయ్యి కడుక్కున్నాడు.
అదే డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసేటప్పుడు తండ్రికి తెలియకుండా కృప తనతో చేసే అల్లరి గుర్తుకొచ్చిందో, లేక ఏమీ చేయలేకపోతున్న తన నిసహాయతే అతడి గుండెల్ని మండించిందో ఉద్వేగంగా మెట్లెక్కి వెళ్ళబోతుంటే పిలిచారాయన మరోసారి.
"ఎన్నాళ్ళిలా?" తనకే తెలియని జవాబు... అందుకేనేమో అల్లుడి కళ్ళలోకి సూటిగా చూడలేనట్టు సోఫా అంచుపై వున్న చేతిని తల ఆనించి నేల చూపులు చూస్తూ వుండిపోయారాయన.
కేవలం నాలుగురోజుల వ్యవధిలో పాతికేళ్ళ వృద్ధాప్యం పెరిగినట్టు నీరసించిన మామగారిని చూసి సైతం తట్టుకోలేకపోయాడు శశాంక.
"మామయ్యా... ఎందుకు నన్ను మనిషిని చేశారు... నాకెందుకు కొత్త ప్రపంచంలో చోటిచ్చారు... ఏ వెల్లువలోనో కొట్టుకుపోవాల్సిన పూచికపుల్లలాంటి నాకో ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎందుకు మీరు శ్రమ పడ్డారు... నేను కోరింది నాకు దక్కనపుడు దక్కింది నేను కోరింది కానపుడు ఇది గెలుపుగా నన్ను ఎలా అన్వయించుకోమంటారు. అన్యాయంగా నాకు కృపని దూరం చేసినవాళ్ళ విషయంలో పట్టించుకోని యీ న్యాయవ్యవస్థకి నన్నెందుకు కట్టుపడి వుండమని సంకెళ్ళు వేశారు. గోతు గాద్గదికమై పోతుంటే చాలా బలంగా నిగ్రహించుకుంటున్నాడు శశాంక.
రాజమణి జవాబు చెప్పలేదు. చెప్పగలనని అనుకుని ఏదో న్యాయం జరిగిపోతుందని ఆశించి తప్పు చేసినట్టు ఆయన కూడా ఇప్పుడిప్పుడే తనను తాను సంబాళించుకోలేని స్థితికి చేరిపోతున్నారు.
"నేను మహాత్ముడ్ని కాదు మామయ్యా... చాలా మామూలు మనిషిని. ఈ ఆటవిక వ్యవస్థలో కనిపించని న్యాయాన్ని వెదుక్కుంటూ ఎందుకు బ్రతకాలీ అని ఆలోచించే అతి సామాన్యమైన వ్యక్తిని. ఎందుకు నేను నిశ్శబ్దంగా వుండిపోవాలి... తప్పు చేయని నేను ఒక జీవితకాలంపాటు ఈ మానసికమైన క్షోభతో నన్ను నేనెందుకు శిక్షించుకోవాలి? కనీసం అదే ఆటవిక న్యాయాన్ని నేనూ అమలుపరిచి రవ్వంత పగ తీర్చుకున్నా దక్కే ఆత్మ తృప్తి ఈ బ్రతుక్కన్నా గొప్పది కదూ... మామయ్యా ఒక్క అవకాశం మీ అపురూపమైన ప్రపంచం నుంచి నా ప్రపంచంలోకి వెళ్ళగలిగే ఒక్క అవకాశమివ్వండి... అది చాలు. ఆ తర్వాత..." టక్కున ఆగేడు మాటాడుతున్న శశాంక.
అప్పటికే నేల కోరిగిపోయివున్న రాజమణిని చేరి ఆందోళనగా పైకి లేవదీశాడు.
"మా...వ...య్యా"
ఒక సన్ని ఆక్రందన గుండె చీకటి బోనులోంచి రాబోయి అక్కడే సమాధైపోయింది.
తన నమ్మకాల ప్రమిదలో ఆవిరైపోయిన ఆశావాదపు చమురుతో ఇక వెలిగే శక్తి లేని దీపంలా ఆరిపోయారాయన.
తను బ్రతికుండగా శశాంకని ఆవేశపడనివ్వనని ఆదేశించిన రాజమణి ఆ అవకాశమిస్తూ రాలిపోయారో లేక మనసును దహించే మరణయాతనకి తనంతతానుగా తల ఒగ్గారో కాని...
సరిగ్గా ఇక్కడే...
శశాంక కళ్ళలోని చివరి అశ్రు బిందువు ఆవిరై పోయింది.
ఫెటేల్మని తెంచుకున్న సంకెళ్ళు అతడు సాగించబోయే మానవ మేధానికి ముందు రణన్నినాదంలా చప్పుడు చేసిందీ అప్పుడే...
