Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 25


    "ఎక్కడ?" అంది.

 

    "మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఆటవీ పోరంబోకులో నూరు ఎకరాలు యివ్వమని ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నాం కదా. ఆ భూమినే శాంక్షన్ చేశారు."

 

    వంద ఎకరాల భూమి కళ్ళ ముందు కదులుతోంది ఆమెకి. అందుకే నోట మాట రాలేదు.

 

    "ఆ భూమిలో రైతుల శిక్షణను ఏర్పాటు చేయడానికి అవసరమైన భవనాలను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కూడా మంజూరు చేసింది. ఆ డబ్బుతో అక్కడున్న చెట్లనూ, పుట్లనూ కొట్టిద్దాం. చుట్టు పక్కలున్న పేద రైతుల్ని పిలిచి, వాళ్ళ దగ్గర పనులు చేయించుకుందాం. మొత్తం భూమంతా చదునయ్యాక మామిడితోటలు, చినీ తోటలు పెట్టిద్దాం. అయిదారేళ్ళకు కాపుకొస్తాయి. పిచ్చ డబ్బు మన ఒళ్ళో వచ్చి పడతాయి" మొత్తం వివరించి చెప్పాడు.

 

    "మరి రైతులకు శిక్షణ!"

 

    "అదే శిక్షణ! లేకపోతే ఎద్దుల్లో ఏది కుడో, ఏది ఎడమో తెలియని మన రైతులకు శిక్షణ యిచ్చేదేమిటి? శిక్షణ పేరిట వాళ్ళ దగ్గర పనిచేయించుకుని మనం తోటలు పెంచుకోవటమే"

 

    "అంటే రైతుల్ని కూలీలు కింద మార్చడమన్న మాట" అన్నది సరితాదేవి.

 

    "ఎగ్జాట్లీ అంతే! రోజుకూలీ వాళ్ళ ముఖాన పడేసి వాళ్ళ దగ్గర పని చేయించుకోవడమే. తోటలు పెరిగాక ఫలసాయం అంతా మనకే. తోటల్లో వచ్చిన డబ్బు ఏం చేశారని ఎవరడుగుతారు? రోజు కూలీ తీసుకున్న రైతులు అడగరు కదా? నూరెకరాల తోటలో సంవత్సరానికి కొన్ని లక్షలు వస్తాయి. మనిద్దరికీ ఆ ఆదాయంలో సగం సగం" అన్నాడు దాసు.

 

    ఆయన అన్న చివరి మాటలు ఎందుకనో నచ్చలేదు ఆమెకి. తోటలో సగం సగం అనడం ఆమె ఇష్టపడలేదు. నూరెకరాల తోట తనకే వుండిపోవాలని ఆమె ఆశ. అందుకే ప్రపోజల్ ని మొగ్గలోనే తుంచెయ్యాలని "మీరు కోటీశ్వరులు! ఇలాంటి తోటలో భాగం తీసుకుంటారా? ఏదో మాట వరసకి అంటున్నారుగానీ" అంది సరితాదేవి.  

 

    ఆమె అంతరంగాన్ని గ్రహించలేనంత చవటకాదు పరమేశదాసు. "అంటే సగం యివ్వవన్నమాట" అన్నాడు డైరెక్టుగానే.

 

    "ఇవ్వననలేదు. మీరు ఇచ్చినా తీసుకోరని అంటున్నాను" అన్నది సరితాదేవి.

 

    "ఏదైనా ఒకటే" అన్నాడు ఆయన మెల్లగా. కానీ ఎక్కడో ఆమె మాటలు ఆయన్ని బాధపెడుతున్నాయి. క్షణం క్రితం వరకు ఆ ప్రాజెక్టులో భాగస్వామిగా వుండాలని కోరుకున్నాడు ఆయన.

 

    ఆమె అడ్డు చెబుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడిలా దెబ్బ తగిలేసరికి దానిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నాడు.

 

    "సరే నీ ఇష్టం సరితా" అన్నాడు కాసేపయ్యాక నిర్లిప్తంగా. పైకి అంత కూల్ గా అన్నా లోపల మాత్రం ఆయన వుడికిపోతున్నాడు. ఇల్లు అలకగానే పండగ కాదని తెలుసు ఆయనకి. ఎంత ద్రోహం చేసైనాసరే, చివరికి మనిషినే గల్లంతు చేసైనా సరే ఆ భూమిని తను అనుభవించాలని నిర్ణయించుకున్నాడు.

 

    ఇంకా ఆమె పడుకునే వుండడం వల్ల ఆయన ముఖంలో మారిన రంగుల్ని ఆమె పసికట్టలేక పోయింది. అయితే అప్పటివరకు వాళ్ళిద్దర్నీ కీహోల్ నుంచి రహస్యంగా చూస్తున్న ఒక వ్యక్తి మాత్రం దాసు ముఖంలో వచ్చిన మార్పుని పసికట్టాడు.

 

                                                    *    *    *    *    *

 

    "ఇంతకీ ఆనందరావు దగ్గరికి వచ్చింది ఎవరు? రమణా లేక దెయ్యమా?" మౌనిక అడగడంతో తరుణ్ మిగిలిన కథ చెప్పడం ప్రారంభించాడు.

 

    "తనతో గడిపిన స్త్రీ కళ్ళు బావి దగ్గర చూసిన ఆకారపు కళ్ళులాగా కనిపించడంతో స్పృహ తప్పిన ఆనందరావుని తల్లి వచ్చి లేపింది. చేత్తో బలంగా కొడుతున్నా లేవని కొడుకుని చూసి ఆ ముసలి తల్లి గాభరా పడింది. పొయ్యి దగ్గరున్న బిందె లో నుంచి దోసెడు నీళ్ళు తీసుకొచ్చి ముఖం మీద చిలకరించింది.

 

    మెల్లగా కళ్ళు విప్పాడు ఆనందరావు. అప్పటికి కరెంట్ వచ్చింది. నెత్తిమీద బల్బు వెలుగు దేవత కనుగుడ్డులా మెరుస్తోంది.

 

    "ఏమైందిరా? ఎంత పిలిచినా లేవకపోతివి?" కొడుకు పక్కన కూర్చుని ప్రశ్నించింది సరస్వతమ్మ.

 

    మొత్తం జరిగినదంతా గుర్తొచ్చింది ఆనందరావుకి. అదంతా కల కాదని కిటికీలో నున్న కిరసనాయిల్ దీపం వెలుగుతోంది.

 

    "ఏం లేదులేవే" చిరాకుగా అన్నాడు.

 

    తల్లితో కలిసి భోజనం చేశాడు. పడుకున్నాడు గానీ నిద్ర రావడం లేదు. పక్కింటికి వెళ్ళి రమణికి ఇదంతా చెప్పి నవ్వు వచ్చింది నిజమా కాదా అని నిలదీయాలనుకున్నాడు. కానీ జరిగిన అల్లరి చాలని దుప్పటిని నిండుగా కప్పుకున్నాడు.

 

    అతనికి ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు. కానీ ఆవేళ బాగా పొద్దెక్కినా నిద్ర లేవలేదు. తన కొడుకుక్కి రాత్రి ఏదో అయిందని సరస్వతమ్మ గ్రహించింది. కానీ ఎంత బతిమలాడినా ఏం జరిగిందో చెప్పలేదు ఆనందరావు.

 

    ఆరోజు సాయంకాలం అతను గేదెలకు ఎండు కసువు పెరుక్కు రావడానికి గడ్డివాము దగ్గరికి వెళ్ళాడు.

 

    గడ్డివాము అతనింటి వెనకాల ఊరికి కాస్తంత దూరంలో వుంది. దాని పక్కనే రమణీవాళ్ళ పేడ దిబ్బుంది. అతను కసువు పెరుక్కుంటున్నప్పుడు రమణి కూడా ఇంటి చెత్తనంతా దిబ్బలో పోయడానికి అక్కడికి వచ్చింది.

 

    "ఏం ఆనంద్! పరధ్యానంగా వున్నావ్?" అంటూ పలకరించింది.

 

    అతను కంగారుపడి, అంతలోనే సర్దుకుని, "ఏదో ఉబుసుపోని ఆలోచన" అన్నాడు.

 

    "అంతేనా! అదేంటి నీముఖం అలా తయారైందే? మీ అమ్మ చెప్పిందంతా నిజమేనన్న మాట?" అంది రమణి ఆందోళనతో.

 

    "ఏం చెప్పింది?"

 

    "రాత్రి ఆమె షో నుంచి వచ్చేటప్పటికి స్పృహలో లేవటకదా. దెయ్యం తొక్కేసిందేమోనని ఆమె అనుమానం" అని అన్నది.

 

    రమణికి కూడా ఆ విషయం తెలిసిపోవడం చిన్నతనంగా అనిపించింది. తల్లి మీద కోపం వచ్చింది.

 

    "దెయ్యం నన్ను తొక్కడమేమిటి?" అతను ఏమీ తెలియనట్టు అన్నాడు.

 

    "దెయ్యంకాక ఆడపిల్ల తొక్కిందా?" ఆమె గలగలా నవ్వుతోంది. అలా నవ్వి ఆగి "అయినా నీకు ఆడపిల్లకూ, దెయ్యానికీ తేడా తెలియదనే నేను అనుకుంటున్నాను. ఆ రోజు నేను వస్తే దెయ్యమని గోల చేయలేదూ" అంది.  

 

    "ఏదో కంగారులో అలా చేశాను. ఎప్పుడూ అలా అమాయకంగా వుంటానా?" అన్నాడు ఆనందరావు బుంగమూతి పెట్టి.

 

    "ఇక అనవుగదా. అదే సంతోషం. ఈ రాత్రికీ వస్తాను. నిన్నటిలా దెయ్యం కథ చెప్పి నన్ను పరీక్షించకు" అని అక్కణ్నుంచి తుర్రుమంది.

 

    అంటే రాత్రి వచ్చింది నిజంగా రమణేనని నిర్ధారించుకున్నాడు ఆనందరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS