"నేను అలా మారిపోతే నీకేం?"
"అదేవిటి ముక్తా అలా అంటావ్? ప్యాంట్ షర్టులతో కాలవ నుండి నీళ్లెలా తెస్తావు? అట్లతద్దీ, ఉండ్రాళ్ళతద్దీ నోములెలా నోస్తావు? అమ్మ చూడబోతే నీకోసం బోలెడు నగలు కూడబెట్టింది. జడలేకపోతే నాగారం, పాపిడిబిళ్ళ ఎక్కడ పెట్టుకుంటావ్?" అని పెద్దగా నవ్వాడు.
"చాలా దూరం వెళ్ళావే!" అన్నాను.
"ఆ ఇంకా చెప్పనా? నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా... మరి నిన్ను ఎవరూ ప్రేమించలేదా? అహ...నువ్వు ఎవర్నీ ప్రేమించవనుకో...అది వేరే సంగతి!"
"ఏం? నేను ఎవర్నీ ప్రేమించనని ఏవిటి గ్యారంటీ"
"ఎవరినైనా ప్రేమిస్తే అంత చలిలో తెల్లవారుఝామున రైల్వే స్టేషన్ కి నాకోసం వస్తావా చెప్పు? ఎంత పల్లెటూరి బైతునైనా నాకూ తెలివుంది తెలుసా?"
నేను ఇబ్బందిగా చూశాను.
"ఇంకో సంవత్సరం చదవాల్సిందేనా?" అని అడిగాడు.
"లేకపోతే డిగ్రీ ఎలా వస్తుందీ?"
"నీకు డిగ్రీ వచ్చినా, రాకపోయినా వర్ధనమ్మ కోడలనే అంటారు మా ఊళ్ళో జనం!" అన్నాడు చైతన్య.
"బావా...నీకు పెళ్ళి చేసుకోవడానికి మీ ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు దొరుకుతారుగా, నన్ను వదిలెయ్!"
"ఏం?" తెల్లబోతూ అడిగాడు.
"నువ్వు అన్నావే సంప్రదాయబద్దంగా అని... అలా ఉండలేను" అన్నాను.
చైతన్య సీరియస్ గా సిగరెట్ పీలుస్తూ ఆలోచించాడు.
"అత్తయ్యతో, అమ్మానాన్నతో నాకు బస్తీ అమ్మాయి అయితే ఒద్దు అని చెప్పెయ్యి" అన్నాను.
అతను నావైపు సీరియస్ గా చూసి "నాకు చదువు లేదనేగా ఇలా అంటున్నావు?" అన్నాడు.
"అదికాదు! నువ్వు కోరుకునే భార్యలా పవిత్రంగా తులసికోట చుట్టూ తిరుగుతూ...నాకెలా సాధ్యం? నేనింకా పెద్ద చదువులు చదవాలి...ఉద్యోగం చెయ్యాలి. చిన్నక్క మా కుటుంబంకోసం ఎలా కష్టపడుతుందో?"
"కాళిందికి కూడా పెళ్ళి చేసేయవచ్చుగా!" అన్నాడు.
"కానీ అక్క ఒప్పుకోవడం లేదు. తాను ఇంత చదివిందీ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవడానికికాదు. అమ్మా నాన్నలని సుఖపెట్టడానికి అంటుంది."
"నువ్వూ అంతేనా?" సీరియస్ గా అడిగాడు.
"ఆ...ఇంకా చదవాలి. నిన్ను పెళ్ళిచేసుకుని నీతో మీ ఊరొచ్చి ఆ మట్టి అరుగులు నేను అలకలేను. నిన్ను కించపరచాలని కాదు...నన్ను అర్థం చేసుకో!"
చైతన్య నా దగ్గరగా జరిగాడు.
"నిజం చెప్పు ముక్తా...నువ్వు ఎవరినైనా ప్రేమించావా?" అన్నాడు.
నేను జవాబు చెప్పలేదు. తల కొద్దిగా ఊపాను.
"అతను నాకన్నా బావుంటాడా?" అడిగాడు.
"నీకన్నా బావున్నా, నీకంటే గొప్పవాడు కాదు!"
"పెళ్ళి చేసుకుంటాడా?"
నాకు సందీప్ జ్ఞాపకం వచ్చాడు.
"చేసుకోడు!" అన్నాను.
"మరి...మరి...ప్రేమించానన్నావ్?"
"ఔను. నేను ప్రేమించాను"
అతను అర్థమైనట్లు చూశాడు.
"ప్రేమించావా?" దిగులుగా "నేను నిన్ను చూడగానే ప్రేమించాను ముక్తా. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు నిన్ను మొదటిసారి చూసినప్పుడే అన్నాడు.
ఆ మసక చీకటిలో అతని ముఖం చాలా నిర్మలంగా, స్వచ్చంగా వెన్నెలచారపడి ప్రకాశిస్తోంది! ఎంతగా చీదరించుకున్నానూ! అయినా ప్రేమించాడుట! నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా అతని హృదయభాండాన్ని పగలగొట్టాను. అతన్ని చూస్తే చాలా జాలేసింది. దగ్గరగా జరిగాను. ఓపక్కకి తిరిగివున్న అతని పచ్చని చెంప మెరుస్తోంది. నెమ్మదిగా నా చేత్తో అతని చెంప నిమరబోయాను.
అతను నా చేతిని దూరంగా తోసేశాడు.
"ఆడది చేతులు పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా జీవితంలో ఒకేసారని నా నమ్మకం! నా ఉద్దేశం ప్రకారం చేతులు పట్టుకునే ఉంటావు. కాళ్ళు కూడా పట్టుకో...పెళ్ళి చేసుకోమని అడుగు. అంతేకానీ ఇలా అనవసరమైన జాలితో సానుభూతితో ఎంగిలిపడకు. నేను పవిత్రతకు విలువనిస్తాను!" అన్నాడు చైతన్య.
నాకు కొరడాతో కొట్టినట్లయింది. చైతన్య ఏమీ తెలీని వయసులో నన్ను ప్రేమించి ఆ సంగతి మనసులోనే పెట్టుకుని ఇప్పటిదాకా ఆరాధిస్తున్నాడు.
మరినేనో...రెండు బాదంకాయల కోసం చిన్నప్పుడు మొదటిసారి శివకి ముద్దుపెట్టాను. వయసొచ్చాకా కార్లో తిరగడంకోసం, ప్రెసిడెంట్ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకోవడం కోసం...సందీప్ తో బెడ్ వరకూ వెళ్ళాను.
నన్ను పెళ్ళిచేసుకోవాలని వచ్చిన వ్యక్తి నాలో ఇంకా పవిత్రత ఆశిస్తున్నాడు!
వెన్నెల కొద్దిగా ఒణుకుతున్నట్లుంది.
నేను బాధతోనో, పశ్చాత్తాపంతోనో ముఖాన్ని దోసిట్లో పెట్టుకుని దుఃఖించాను.
"నేను చదువుకోలేదు కాబట్టి మొరటుగా మాట్లాడేనేమో తెలీదు కానీ ఎవరైనా తన కాబోయే భార్య పవిత్రంగా వుండాలనే ఆశిస్తాడు ఆముక్తా" అన్నాడు.
నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
ఓ సానుభూతి పవనం నా తలమీదుగా ప్రసరిస్తుందనీ, ఓ ఓదార్పు కిరణం నా భుజాన్ని తాకి నన్ను సేదదీరుస్తుందనీ ఆశించాను.
చాలాసేపటికి ముఖంమీద నుండి చేతులు తప్పించి అతనికోసం చూశాను. అతను లేడు. లోపల తాతయ్య పక్కన పడుకుని నిద్రపోతున్నాడు.
* * *
