Previous Page Next Page 
ఆలింగనం పేజి 25


    ఉత్సాహంగా ఉరకలు వేసుకుంటూ, పట్టాలు తొక్కుకుంటూ రైలు బండి దగ్గరౌతోంది.

 

    నేను దూరంగా వెళ్ళిపడ్డాను! పక్కనుండి అది రయ్యమని దూసుకుపోతుంటే గులకరాళ్ళు నా చెంపకి కొట్టుకుని దెబ్బ తగిలాయి. మోచేతినుండి చిక్కని రక్తం... బొట్లు బొట్లుగా...

 

    "దెబ్బ తగిలిందా?"

 

    ఆ ప్రశ్నకి అతని వైపు చూశాను.

 

    "కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందీ? అయినా స్టేషన్ కి ఎవర్నీ రావొద్దన్నానుగా...అలా చూస్తావే? గుర్తు పట్టలేదా?" అని అడిగాడతను.

 

    నేను సంభ్రమంగా గాలికి ఊగుతున్న అతని ఒత్తైన జుట్టుని చూస్తున్నాను. చిన్నగా ఉన్నా, సూటిగా చూస్తున్న ఆ కళ్ళూ, పొడవుగా ఉండి కొద్దిగా ఒంగిన ఆ ముక్కు ఎక్కడో చూశాను...

 

    "నేనే చైతన్యని! గుర్తు పట్టలేదా? నేను చూడు నిన్నెలా గుర్తు పట్టానో?" అతను నవ్వుతున్నాడు. చైతన్య! ఔను అత్తయ్య ఉత్తరంలో వ్రాసింది తాతయ్యని చైతన్యతో పంపించమనీ, ఆదివారం వస్తున్నాడనీ!

 

    నేను చిన్ననాడు చీదరించుకున్న చీపిరితలవాడు...ఇప్పుడు నవయువకుడై ఎత్తుగా, దృఢంగా తయ్యారయి నా ముందు నిలబడ్డాడు! ఎటువంటి అద్భుతాలైనా చెయ్యగల పైవాడితో ఎవరు పోటీ పడగలరూ!

 

    చైతన్య చెయ్యి అందించాడు!

 

    నా మోచెయ్యి చూసుకుంటూ 'అబ్బా!' అన్నాను.

 

    "అంత కొంచెం రక్తం చూస్తేనే అబ్బా అంటే ఎలా? ఇందాక నేను చూడకపోతే ఈపాటికి" అంటూ అర్దోక్తిలో ఆపేశాడు. 

 

    కొంపదీసి...ఇతనికి అంతా అర్థం అయిపోలేదు కదా! అని అదాటుగా చూశాను. చైతన్య నవ్వుతున్నాడు. నేను లేచి నిలబడ్డాను.

 

    "ఇల్లు ఎంత దూరం? నడిచి వెళ్ళిపోవచ్చా?" ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని ముందుకు సాగుతూ అడిగాడు.

 

    "ఆ!" అతని వెంట నడుస్తూ అన్నాను.


                                   *  *  *


    చైతన్య పేరుకి తగ్గట్టు గల గలా మాట్లాడ్తున్నాడు.

 

    "కరణంగారి తల్లి ఆచారవంతురాలు అత్తయ్యా! పాపం మొగుడు నీళ్ళల్లో మునిగిపోతుంటే చాకలి రంగడు నీటిలోకి దూకి రక్షించబోయాడుట. ఆవిడ ఎంతటి నిష్టాగరిష్టురాలూ... 'ఒద్దురా బడుద్దాయి ఆయన మడిలో ఉన్నారూ...' అని తాకనిచ్చింది కాదుట. ఆయన కాస్తా మూడు మునకలేసి బుడుంగుమన్నాడు! పోతే పోయె... తెల్ల చీరలో నందివర్ధనం పువ్వులా మడి ఆచారం మాత్రం కొరబోనీయదు!"

 

    "కబుర్లేనా అన్నం తినేది ఉందా?" నాన్న నవ్వుతూ అన్నారు.

 

    తాతయ్యకి ఎక్కడలేని ఓపికా వచ్చేసింది. చైతన్యతో ఊరి సంగతులు అన్ని చెప్పించుకుంటున్నాడు.

 

    "ఆ చదువు సంగతి పక్కనపెడ్తే కుర్రాడు మహా బుద్ధిమంతుడు. చాకులాంటివాడు!" అని అమ్మ పక్కలువేస్తూ సర్టిఫికెట్ ఇచ్చేసింది.

 

    వీధి అరుగుమీద కూర్చుని నేను అన్నీ వింటూనే ఉన్నాను. అత్తయ్య వ్యవసాయం అంతా చైతన్యే చూసుకుంటున్నాడట. బాగా కలిసొచ్చిందిట. ఆవిడికి ఈ ఏడు నాతో చైతన్య పెళ్ళి చేసేయాలనుందట!

 

    "ఆడపిల్లవాళ్ళం మనమే అడగాలని మీ అక్కయ్య బెట్టుకుకూర్చుంది కానీ ఆవిడకి కోడలు ఎప్పుడొస్తుందా అని ఉంది!" అంది అమ్మ.

 

    రైలుకిందపడి చచ్చిపోయినా బావుండేది! ఒకడ్ని ప్రేమించి ఇంకోడ్ని పెళ్లాడడమా అనుకొన్నాను.

 

    చైతన్య అరుగుమీద కొచ్చాడు. నన్ను చూసి "నువ్వు ఇంకా నిద్రపోలేదా?" అన్నాడు.

 

    "ఉహూ!"

 

    "సరే...అయితే కబుర్లు చెప్పు" అంటూ పక్కన కూర్చుని జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు.

 

    "నువ్వు సిగరెట్ తాగుతావా?" అని అడిగాను.

 

    "ఆ...ఎక్కడోచాటున దొంగతనంగా చుట్టాలు కాలుస్తుంటే చూసి అమ్మ ఆరోగ్యం పాడయిపోతుందనీ సిగరెట్టు త్రాగమంది" అన్నాడు.

 

    నాకు నవ్వొచ్చింది ఆవిడ ప్రేమకి!

 

    "నీ బి.ఏ. ఎప్పుడౌతుంది?" అడిగాడు!

 

    "బి.ఏ. కాదు బి.ఎస్.సి."

 

    "ఏదైతేనేం...ఎప్పుడౌతుందీ?"

 

    "ఇంకో సంవత్సరం వుంది"

 

    "ఆహా! ఆడపిల్లలూ, మగపిల్లలూ కలిసే చదువుకుంటారా?" అని అడిగాడు చైతన్య.

 

    "ఔను!" అన్నాను.

 

    "ముక్తా...సినిమాల్లో చూపించినట్లు ప్రేమలూ, పోట్లాటలూ అన్నీ జరుగుతుంటాయా?"

 

    నేను మాట్లాడలేదు.

 

    "ఆడపిల్లలు పొట్టిగా జుట్టు కట్ చేసుకుని, మగవాళ్ళలా ప్యాంట్ లూ, షర్టులూ వేసుకుని అస్సలు సిగ్గుపడరటగా!" అని అడిగాడు.

 

    "ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు?"

 

    "నువ్వు!...అలా మారిపోయావేమోనని! లేదులే...నిన్ను చూస్తే అలా అనిపించడంలేదు. చక్కగా జడవేసుకుని, లంగా ఓణీలో సంప్రదాయబద్దంగానే ఉన్నావు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS