Previous Page Next Page 
ఆలింగనం పేజి 27


    మరునాడు చైతన్య ఏవో పురుగుమందులూ, ఎరువులూ కొనుక్కోవాలని బయలుదేరాడు.

 

    "అమ్మ ముక్తా...వాడికి సిటీ కొత్త. నువ్వు కూడా వెళ్ళవే" అంది.

 

    చైతన్య వెంటనే "ఒద్దు అత్తయ్య...నాకు ఆడపిల్లని వెంటపెట్టుకువెళితే ఇబ్బందిగా వుంటుంది" అన్నాడు.

 

    అమ్మ నవ్వి "అయితే ఒద్దులే" అంది.

 

    అసలు సంగతి తెలిసిన నేను ఏమీ అనకుండా గుంభనంగా ఊరుకున్నాను.

 

    చైతన్యకి కాఫీ అందిస్తుంటే "నిన్ను కష్టపెట్టే పనులేం చెయ్యదలచుకోలేదు ముక్తా. అందుకే అత్తయ్యతో అలా అన్నాను. ఇప్పుడేకాదు ఎప్పుడైనా నీకేమైనా కావలిస్తే మొహమాటపడకుండా నాకు ఉత్తరం రాయి. నాకు చేతనైన సహాయం చేస్తాను" అన్నాడు.

 

    ఏ ఆచ్ఛాదనా లేని అతని ఛాతీ చాలా విశాలంగా ఉంది. లోపల అంతకన్నా విలువైన హృదయం ఉంది అని అప్పుడు తెలిసింది!

 

    చొక్కా వేసుకుంటూ "మా ఊరోసారి రా! భూదేవికి పసుపు రాసినట్లున్న ఆవచేలూ, సారె పెట్టినట్లున్న అరటి, కొబ్బరి తోటలూ చూస్తే వదలలేవు.

 

    "మట్టి అరుగులు అలకలేనన్నావ్! పేడనీళ్ళు కళ్లాపి చల్లి, పచ్చని ముంగిట్లో తెల్లని వరిపిండితో ముగ్గులు పెట్టినప్పుడు ఆ అందం...వచ్చే సువాసనా ఒక్కసారైనా అనుభవించకపోతే జన్మ వృధా!" అన్నాడు.

 

    పచ్చని పైర్లమధ్య గాలికి పెరిగిన అతనికి ఈ పట్టణాల్లో ఇరుకు బతుకుల గురించీ విశాలమైన భవంతుల్లో ఉండీ సంకుచిత్వంగా ఆలోచించే బడాబాబుల గురించీ ఏం తెలుస్తుంది? నేను చెప్పినా అర్థంకాదు!

 

    పెళ్ళి చేసుకోనివాడ్ని ఎందుకు ప్రేమించాలి? నీకు బుద్ధిలేదా? అంటాడు.

 

    నిజంగానేలేదు! ఒక్కసారైనా సందీప్ తో ఆ ప్రస్తావన తెచ్చానా? అతను రమ్మనచోటికల్లా వెళ్ళాను. అడిగినదల్లా చేసాను. అంతే!

 

    చైతన్య మధ్యాహ్నానికి వచ్చాడు.

 

    అమ్మ పడుకుని లేవలేక "ముక్తా వాడికి అన్నం వడ్డించవే" అంది.

 

    బయట తిరిగి వచ్చినందుకేమో మళ్ళీ స్నానం చేశాడు.

 

    పీట వాల్చి కంచం పెట్టాను.

 

    "నువ్వు తిన్నావా?" అడిగాడు.

 

    "ఆ..." అని బచ్చలకూర పప్పు, వంకాయకూర, చల్లమిరపకాయలూ వడ్డించాను.

 

    "ఈ కారం నాకు సరిపోదు కానీ ఇంకో నాలుగు పచ్చి మిరపకాయలు పట్రా!" అన్నాడు.

 

    అతను పచ్చిమిరపకాయల్ని అలవోకగా కొరికి తింటూ చెప్పే తియ్యని కబుర్లు విన్నాను. వాళ్ళ ఊళ్ళో జరిగే తీర్థం గురించీ తిరణాల గురించీ చెప్పి నవ్వించాడు. మనసు చాలా తేలికపడింది.

 

    "తాతయ్య బట్టలు సర్దు. సాయంత్రం బండికి బయలుదేరాలి. రిజర్వేషన్ చేయించాను" అన్నాడు.

 

    అప్రయత్నంగా "అప్పుడేనా?" అన్నాను.

 

    "ఇప్పటికే అక్కడ ఎన్ని పనులు ఆగిపోయి ఉంటాయో!" అన్నాడు.

 

    బస్తీల్లో మేం ఆ వయసులో వృధా చేస్తున్న టైం సంగతి గుర్తుకొచ్చింది!

 

    తాతయ్య నన్ను దగ్గరగా తీసుకుని తలమీద ముద్దు పెట్టుకున్నాడు. అమ్మతో "మళ్ళీ నీ చేతి ముద్ద తినే భాగ్యం ఉందో లేదో!" అన్నాడు.

 

    "మావయ్యా అలా మాట్లాడితే అసలు ఆ వూరు వెళ్ళద్దు!" కన్నీళ్ళతో అంది అమ్మ.

 

    అమ్మ పేరంటానికి వెళ్ళినా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే తాతయ్య, ఆవిడతో ఎంతగా ఎటాచ్ అయిపోయాడో మాకు అందరికీ తెలుసు!

 

    నాన్న ఆటో తీసుకొచ్చారు.

 

    "అమ్మ మిమ్మల్నందరినీ సంక్రాంతి పండక్కి రమ్మన్నది" అన్నాడు చైతన్య.

 

    "తప్పకుండా వస్తాం. అక్కని అడిగానని చెప్పు. నాన్నకి ఏమాత్రం నలతగా వున్నా వెంటనే తీసుకొచ్చెయ్!" అని జాగ్రత్తలు చెప్పారు నాన్న.

 

    అమ్మ అత్తయ్యకి చీరా, మిఠాయిలూ ఇచ్చింది!

 

    "ముక్త ఏదీ?" చైతన్య అడిగాడు.

 

    నేను గదిలోనే ఉన్నాను. ఎవరైనా వెళ్తుంటే వీడ్కోలు ఇవ్వడం బాధాకరమైన పని! చిన్నప్పటినుంచీ నాకు ఇష్టంలేనిపని! అందుకే బయటికి రాలేదు.

 

    "ముక్తా..." చైతన్య గదిలోకి వచ్చాడు.

 

    "అమ్మ నీ గురించే అడుగుతుంది మొదటగా! ఏం చెప్పమంటావ్?" అని అడిగాడు.

 

    నా మెడలోని అటుకుల గొలుసు తీసి మౌనంగా అతనికి అందించాను.

 

    "ఒద్దు ముక్తా... అంతపని చెయ్యకు! ఆవిడ తట్టుకోలేదు. దయచేసి అలాంటి పనులు చెయ్యకు. నువ్వు చెప్పినట్లే నేనే నెమ్మదిగా నాకు పట్నం పిల్లలంటే ఇష్టంలేదని చెప్పేస్తాలే! సంతలో పశువుని బేరం చేసి కొన్నట్లు నిన్ను పట్టుకెళ్తానని ఎలా అనుకొన్నావ్? కనీసం నీ మనసున్నచోటైనా నువ్వు ఆ విషయం అతనికి తెలియబరిచి ఆనందంగా ఉండు" అన్నాడు.

 

    నాకు ఆపుకోలేనన్ని కన్నీళ్ళు వచ్చాయి.

 

    "వస్తాను" అతను వెళ్ళిపోతుంటే, ఎవరో ఆత్మబంధువు వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఓ మంచి స్నేహితుడు దూరం అవుతున్న ఫీలింగ్!


                                                         *  *  *


    "నేను పూర్తిగా మోసపోయాను. జీవితంలో దారుణంగా దగాపడ్డాను" అలా అంటుంటేనే నా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

 

    చిత్రా, వైజయంతీ నావైపు చూస్తూ కూర్చున్నారు.

 

    అమ్మ బజారుకి వెళ్ళింది. నాన్నగారు ఆఫీసుకి వెళ్ళారు. ఆ రోజు ఆయన రిటైర్ మెంట్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS