వెళ్ళిరా! ఏం చేసుకొస్తావో మరి? కాయ అవుతుందా? పండు అవుతుందా? అంతా నీ చేతిలో ఉంది అన్నట్లు నవ్వింది గాయత్రి!
అమ్మగారూ అక్కగారూ అలా ఆశీర్వదించి ప్రోత్సహించటంతో వేయి ఏనుగుల బలాన్ని పుంజుకుని తారాజువ్వలాగా లేచింది ఆమని.
గదిలోకి వెళ్ళి డ్రసప్ అవుతూ ఉంటే గాయత్రి వచ్చింది.
"చెల్లీ! ఈ పట్టుచీర కట్టుకువెళ్ళు! వారి దగ్గరకు పోతున్నావుకదా. చాలా బావుంటుందే! పోయిన పుట్టినరోజు పండుగనాడు అమ్మగారు ఈ బనారస్ పట్టుచీర నాకు కొని యిచ్చారు. ప్రత్యేకంగా వేయించి తెప్పించారు. దీని ఖరీదు ఎంతో తెలుసా!? ఇరవై నాలుగువేలు" అంది.
బంగారు జరీ పూలు కుట్టి ఉన్న చిలకపచ్చ చీర వంక అదొకలా చూచింది ఆమని. గొంగళి పురుగుని చూచినట్లు ముఖం చిట్లించుకుంది.
"అక్కా! మరొకరు వాడుకునే వస్తువు ఏదయినా నేను ఉపయోగించను. ఆ విషయం నీకు తెలుసు కదా! నాకు ఇతరులు వాడిన వస్తువులు ముట్టుకోవాలంటే అలర్జీ!" అంది ఆమని.
గాయత్రి ముఖం చిన్నబుచ్చుకుంది.
"మనమధ్య కూడ అలాంటివి ఉంటాయేమిటి? అక్కాచెల్లెళ్ళం కదా. శుభాన్ని సమకూర్చుతాయని పెద్దవాళ్ళు కట్టుకున్న చీరల్ని అడిగి బ్రతిమాలి తీసుకుని మరీ కట్టుకుంటారు. క్రొత్తగా చీరలు కొనుక్కున్నవాళ్ళు ఎవరికయినా ఇచ్చి వాళ్ళు కట్టుకున్న తరువాత తీసుకుపోయి కట్టుకుంటారు.
చల్లగా కాపురం చేసుకునే ముత్తయిదువలు కట్టుకున్న చీరలు ముచ్చటపడి తీసుకుంటారు. మగవాళ్ళకి తెలియకుండా ఆడవాళ్ళమధ్య అదో సంస్కృతి నడుస్తూ ఉంటుంది. అలాంటిది నా చీర వద్దంటావేమిటి?
ఒక్కసారే కదా కట్టుకున్నాను.
"మన శరీరాలు వేరయినా ప్రాణం ఒక్కటే కద ఆమనీ!" అంది.
"అక్కడే ఉంది పాయింటు! యూ ఫూల్! మన ప్రాణం ఒక్కటే కాని శరీరాలు వేరుకదా! అందుకని ఎవరి తిండి ఎవరిబట్ట వారిదే! వేరువేరుగా ఉండాలి. అయినా నాకు అలాంటివి అలర్జీ కలిగిస్తాయని చెప్తూ ఉంటే వెంటపడతావెందుకు?" అంది ఆమని.
"ఆ! నీ వెంటపడితే నువ్వు ఉద్దరిస్తావని మాటలెందుకు కాని త్వరగా వచ్చెయ్యి. నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటా! భోజనం కూడ చేయను" అంది గాయత్రి.
"నాకోసం ఏమీ కాదులే! నీ వాల్మీకి అంగీకారం వార్త తెస్తానా? లేదా? అని ఎదురు చూస్తుంటావు. కాయ కాదు. పండే చేస్తాను. చూస్తావు కదా!?" అంటూ డ్రసప్ అయిపోయి వెళ్ళిపోయింది ఆమని.
జీపులో కూర్చుంది. తల్లి ఆజ్ఞాపించినట్లే పట్టుచీర కట్టుకుంది. ఏనాటినించో అవి బీరువాలో మూలుగుతున్నాయి. మొదటిసారి బయటకు తీసింది.
జీపు ఫాంహౌస్ ముందు ఆగింది.
లాన్ చెయిర్ వేయించుకుని గార్డెన్ లో కన్పించాడు వాల్మీకి.
ఆమె జీపు దిగి రావటం రెప్పవేయకుండా చూచాడు.
దగ్గరకు వచ్చాక నవ్వుతూ పలకరించాడు.
"భలేవారండీ! చాలా ఆరిందలాగ చీర కట్టుకు వస్తుంటే మీ అక్క గారేమో అనుకున్నాను మొదట, వెల్ కం" అన్నాడు.
"అదికాదు లెండి! మీ మనసులో అక్కగారి గురించిన ఆలోచనలు ఉండి ఉంటాయి అందుకే నేను అలా కన్పించాను."
"పెళ్ళి అయి మీరు మా యింటికి వచ్చిం తరువాత నేను ఇలా గంభీరంగా డ్రస్ చేసుకోవటం మానేయాలన్న మాట?" అంది.
"అదేం? ఎందుకలా?" ఇప్పుడు ఊరికే అక్కగారు అనుకున్నారు. అప్పుడు అక్కగారనుకుని కొంగుపట్టి లాగేస్తారేమో!? నేను సిగ్గుపడాలి బాబూ!" అంది ఆమని.
"యూ సిల్లీ! ఎంత తమాషాగా మాటాడతావు? అవునూ ఏమిటిలా ప్రత్యక్షమయిపోయావు? కాఫీ డ్రింక్స్ ఉన్నాయి. ఏం తీసుకుంటావు?"
"నేనొక వరం అడగటానికి వచ్చాను. ఇస్తానంటే మీరేమిచ్చినా తీసుకుంటాను. సరేనా?" అంది ఆమని.
"ఆలాగే వాగ్ధానం చేస్తున్నాను. ఏం కావాలో చెప్పు?"
"వేడివేడి కాఫీ అంటే నాకు చాల యిష్టం అంది. వెంటనే పనిమనిషిని పిలిచి కాఫీ తెప్పిస్తాడనుకుంది.
కాని అతడే లేచి లోపలకు వెళ్ళాడు.
వెనకాలే లేచి వెళ్ళింది. ఆ వంటగది ఒకసారి చూచిందామె.
అతను స్టౌ వెలిగించి కాఫీ పెట్టాడు.
"అదేమిటి బావగారు! పనివాళ్ళు లేరా?"
"అతిధులకు నా చేత్తో మర్యాద చేస్తేనే కదా తృప్తి."
"ఎంత మంచివారండీ బావగారు మీరు. అక్క అదృష్టవంతురాలు."
"మీ అక్కగారిని పొగిడేందుకు వచ్చావా? వచ్చిన పని ఏమిటో చెప్తావా?" రెండు కప్పులలో ఒకటి ఆమెకు అందించాడు.
డైనింగ్ టేబిల్ ముందు కూర్చున్నారు.
"మీ పెళ్ళికి ముహూర్తాలు దగ్గరలోనే ఉన్నాయట. అమ్మగారు పంతులుగారిని పిలిచి అడిగారు. కాని ఒక్క చిన్న చిక్కు వచ్చిపడింది."
"ఏమిటా చిక్కు!" నవ్వుతూ ప్రశ్నించాడు.
"పెళ్ళిచూపులు జరుపుకునేందుకు మంచి ముహూర్తం లేదు."
"మీ అక్కగారిని నేను చూసేశాను కదా! ఇంకా పెళ్ళిచూపులేమిటి?"
"ఆలయంలో స్వామి సన్నిధిలో అనుకోకుండా జరిగిన పెళ్ళిచూపులు దైవ నిర్ణయం బావగారు. దైవసంకల్పానికి మించినది ఏమీ లేదు.
కాని సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చూపులు అనేవి జరగకపోతే మీకు అదొక లోటుగా ఉంటుందేమో అని మమ్మీ బాధ పడుతున్నారు.
మీ జాతకాలు బాగా కలిశాయి! అంది ఆమని.
"అమ్మగారు పెద్దవారు కదా సెంటిమెంట్స్ ఉంటాయి. దేవుడు జరిపిన పెళ్ళిచూపులు కన్నా మనం జరుపుకునేవి గొప్పవి కావు.
అదలా ఉంచండి! ముహూర్తం గురించి ఏమన్నాడు పంతులుగారు?
"ఓహో! మీకూ తొందరగానే ఉందన్నమాట. ఇక తొమ్మిది రోజుల తరువాత దశ మీనలగ్నం గురువారం నాడు మీ పెళ్ళి.
"మీకు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు!" అంటూ చేయి అందించింది ఆమని.
"థాంక్స్" అంటూ ఆమె చేయి నొక్కి వదిలేశాడు వాల్మీకి.
ఆమెలో మచ్చలేని చంద్రుణ్ణి చూచాడు. ఒక పసిపాపను చూచాడు, మంచితనం తప్ప మరేమీ తెలియని స్నిగ్ధ మనోహర మంజులమూర్తిని చూచాడు.
అటువంటివారితో బంధుత్వం తన అదృష్టమే అనుకున్నాడు.
కబుర్లపోగులా అతనితో మరికొద్దిసేపు కాలక్షేపం చేసి సెలవు తీసుకుంది.
ఇంటికి వెడుతూనే ఆ వార్తని అమ్మగారికి అందించింది.
అక్కగారిని ఊరించి ఊరించి ఏడిపించింది.
ఎప్పుడయితే అభ్యంతరాలన్నీ అడ్డు తొలగాయని భావించిందో వెనువెంటనే రాణి సుమిత్ర పంతులుగారిని పిలిపించి లగ్నపత్రిక రాయించింది.
ఆమె మీద ఒక పెద్ద బాధ్యత వుంది.
వాల్మీకి తరపున పెద్దవారు ఎవరూ లేరు. అన్నీ అతనే స్వయంగా చూచుకోవాలి. అతడు తమ మనిషి అయింతరువాత అటువంటి శ్రమ ఎందుకు పడాలి అని ఆలోచించింది. రెండు ప్రక్కల పెద్దరికపు బాధ్యతలు తానే తీసుకోవాలని ఎంతో ఉత్సాహంతో అనుకుంది.
గాయత్రి ఎంతో అదృష్టవంతురాలు. నేరుగా భర్త ఒడిలోకి వెడుతుంది. అత్తలు, ఆడబిడ్డలు అడ్డంకులు ఏమీ లేవు. అతనికి కూడ తాను తప్ప పెద్దవాళ్ళు ఎవరున్నారు. ఎంత బరువు అయినా ఆ బాధ్యతని తనే మోయాలి.
గాయత్రిని తీసుకుని వెళ్ళింది. స్వామి దర్శనం చేయించి అయిదుగురు ముత్తయిదువుల చేత అక్షింతలు వేయించింది.
ఆమనిని తీసుకుని, స్వామి పాదాల దగ్గర వుంచి ఆశీస్సులు అందుకున్న లగ్నపత్రికలు తీసుకొని నేరుగా ఫాంహౌస్ కి వెళ్ళింది.
ఆమని చేతులమీదుగా అతని తరుపున ఒక ముత్తయిదువను పిలిపించి ఆమెకు లగ్నపత్రికలు అందించింది.
"ఈ ఫార్మాలటీస్ అన్నీ ఎందుకు? మీరు స్వయంగా శ్రమపడాలా?" అన్నాడు వాల్మీకి. ఆత్మీయత నిండిన ఆమె మాటలు ఆమెను అలరించినాయి.
"బాబూ! ఇంటిలోమాత్రం పెద్దలు ఎవరున్నారు. దంపతులు కావలసిన మీ ఇద్దరూ నా బిడ్డలే! గాయత్రి ఒకటి, నువ్వు ఒకటి కాదు బాబూ నాకు. ఇది కాదు. ఈ క్షణంనుంచి ఈ ఇంటి పనులు, బాధ్యతలు శాస్త్రోక్తంగా జరుగవలసిన తతంగాలు అన్నీ నేనే చూచుకుంటాను. వరుసకు చూచుకుంటే నాకు ఇది పుట్టినిల్లే అవుతుంది.
మీ నాన్నగారు చంచలరావుగారు నాకు అన్న వరుస అవుతారు. ఆడబడుచుగా ఈ పుట్టినించే వేడుకలు నేను చూచుకుంటాను. నువ్వు నిశ్చింతగా వుండు" అని అందామె.
"కుర్రవాడు కలిసిపోయేవాడు ఆమనీ! చొరవ తీసుకున్నా తప్పేంకాదు. అంతా మనమే చూచుకుందాం, అంది మాతృత్వం తాలూకు మమతలు తీర్చుకునే ఉత్సాహంతో.
"అలాగే మమ్మీ! మీరు మరీ అధికంగా శ్రమించకండి! ఆరోగ్యం జాగ్రత్తగా చూచుకోండి" అంది ఆమని.
వెంటనే సుమిత్రాదేవి ఆ యింటి పని వారందరిని సమావేశపరచి విషయాలన్నీ వివరంగా తెలుసుకుంది. పెళ్ళి అనగానే పనివారంతా పొంగిపోయారు. కొన్ని సంవత్సరాలుగా కళను కోల్పోయిన యిల్లు.
కోడలు వస్తోంది అనగానే పొంగిపోయారు.
బాబు గురించి ఆ యింటి గురించి వివరాలు అన్నీ అందించారు.
అర్జంటుగా పూర్తి కావలసిన రిపేర్లు రంగులు వేయించటం వస్తువులు కొనుగోలు చేయటం వాటిని సరి అయిన స్థానంలో అమర్చంలాటి కార్యక్రమం అంతా వారికి అప్పగించింది.
