Previous Page Next Page 
పరిహారం పేజి 24


    కృష్ణారావు తన శరీరాన్ని వదిలి చిర విశ్రాంతికి వెళ్ళిపోయాడు.         
                                  9
    కృష్ణారావు చనిపోయి అప్పటికి వారం రోజులైంది. అతడి అంత్యక్రియలు రంగనాధం చేతిమీదుగానే జరిగాయి.
    ఒకరోజు పారిజాతను దగ్గరగా కూర్చోబెట్టుకొని రంగనాధం అడిగాడు "మీ మేనత్త ఒకామె ఎక్కడో అమీర్ పేటలో ఉందని విన్నాను. ఆవిడకు కబురు చేయనా?"
    "ఎందుకు మామయ్యా?"
    "ఆడపిల్లవు ఒంటరి దానవు ఎక్కడుంటావమ్మా. నేను మీ నాన్నకు స్నేహితుడినే కాని బంధువును కాను? పెళ్ళీడు పిల్లను నా ఇంట్లో ఉంచుకోలేను. నాకు మగ పిల్లలు లేకపోతే వేరేమాట?"
    "..............." పారిజాత తలవంచుకొని మౌనంగా విన సాగింది.
    "నువ్వు మా గిరిధర్ ను చేసుకుంటే ఏ చిక్కూ లేకపోయేది. నా కన్ని సంగతులు తెలిసీ కూడా నీ కింకా ఆలోచించుకొనే అవకాశం ఇస్తున్నాను. నువ్వు మరోసారి ఈ సంగతి గురించి ఆలోచించు. ఆడపిల్లకు అందమైన ఆశలు ఉండడం సహజమేగాని వాస్తవానికి విరుద్దంగా కోరితే అది దుఃఖహేతువే అవుతుంది గాని సంతోషాన్నివ్వదు!"
    అప్పటికీ పారిజాత మాట్లాడలేదు.
    ఆమె ముఖ కవళికలు గమనించి రంగనాధం ఒక నిట్టూర్పు విడిచాడు. మరి మాట్లాడక ఊరుకొన్నాడు.
    ఒకనాటి సాయంకాలం ఓ గంటసేపట్లో చీకటి పడబోతుందనగా పల్లెటూరి బైతులా ఉన్న ఒకతడు వచ్చి "రంగనాధం గారిల్లు ఇదేనా?" అంటూ అడిగాడు.
    రంగనాధం అప్పుడప్పుడే ఫాక్టరీనుండి వచ్చి టీ త్రాగుతున్నాడు.  "నేనే రంగనాధాన్ని.........మీరు"
    "కృష్ణారావు బావమరిది. ఆయన పోయిన సంగతి మీరు పంపిన మనిషివల్ల తెలిసి చాలా విచారించాము." 
    "అలాగా? కూర్చోండి. అమ్మా పారూ! మీ మేనత్త భర్త వచ్చాడు" అంటూ గదిలో ఉన్న పారిజాతను కేక వేశాడు రంగనాధం.
    పారిజాత వచ్చింది.
    "ఈ పిల్లేనా కృష్ణారావు కూతురు? ఎప్పుడో ఈ పిల్ల తల్లి పోయినప్పుడు చూశాను. అప్పుడు ఎముకలు ఎంచుకొనే ట్టుగా ఉంది! బ్రతుకుతుంది అనుకోలేదు ఎంతైపోయింది!"
    ముతక పంచెలో మూరెడు మీసాలతో ఉన్న మేనత్త మొగుడిని భయంభయంగా చూసింది పారిజాత
    "ఆ పిల్ల కింక ఎవరూ లేరని తెలుసుకదా? ఆ సంగతి ఏమాలోచించింది వాళ్ళ మేనత్త?"
    "ఆలోచించేదేముంది? ఆ పిల్లను తీసుకురావడానికే పంపించింది ఆమె"
    "సంతోషం మీరీమాత్రం దయచూపడం ఆ పిల్ల అదృష్టం!"
    "ఏదో తగిన సంబంధం చూచి త్వరలోనే ఓ ఇంటి దాన్ని చేయాలని కూడా అనుకొంటుంది వాళ్ళ మేనత్త"
    "అంత మంచి మనిషి ఆ పిల్ల తండ్రి బ్రతికి ఉండగా ఒక్కసారి కూడా తిరిగి చూడలేదేమిటి?"
    "మా ఆవిడ మహా పట్టుదల గల మనిషి. వెనుకటికి ఏవో జరిగాయి అన్నా చెల్లెళ్ళ మధ్య అన్న ఇంటికి కాలు పెట్టనని శపథంచేసింది. శపథం నెరవేర్చుకొంది."
    పారిజాత ప్రమేయం లేకుండానే అమీర్ పేటకు వెళ్ళడం నిశ్చయమైంది. ఆ పిల్లకు వెళ్ళాలని లేకపోయినా ఉండటానికే ఆస్కారం కనిపించలేదు. రంగనాధం మామయ్య అన్ని సంగతులు స్పష్టంగానే చెప్పివేసాడు. తను గిరిధర్ ను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తేనే ఇక్కడ ఉండాలి. మరో ఇంట్లో ఉండాలంటే ఆడపిల్ల ఒంటరిగా ఉండడం సాధ్యమా? తండ్రి పోయి తనా ఇల్లు ఖాళీ చేస్తూనే ఆ ఇంట్లోకి స్టూడెంట్స్ ఎవరో దిగారు! మరో ఇల్లు వెదుక్కొని ట్యూషన్సు కుదుర్చుకు ఉండడం మాటలు కాదు!   
    పారిజాతకు తనేదో గాఢాంధకారంలో కలిసిపోతున్నట్టుగా అనిపించింది. ఎక్కడో పల్లెటూరిలో మేనత్త చేతుల్లో వెళ్ళి పడుతోంది. ఆవిడ స్వభావం అంత మంచిది కాదని తండ్రి చెప్పగా వింది.
    ఈ సమయంలో మనూ ఉంటే ఎంత బాగుండేది? తన కేదైనా ఒక స్నేహితుడిగా దారి చూపేవాడేమో! చివరి చూపుకైనా నోచుకోకుండా ఎక్కడో -మేనమామ ఊరికి వెళ్ళి కూర్చొన్నాడతడు! అతని మనసులో తనకు ఎటువంటి స్థానముందో తనకు తెలియదు. కాని, అతడే తనకు సర్వస్వం! అతడి జీవితంలో పాలుపంచుకొనే అర్హత తనకు లేకపోతే లేకపోవచ్చు. కాని, అతడిని తన మనసులో ఆరాధించే అర్హత లేదని ఎవరు చెబుతారు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS