హడావిడిగా గోవిందస్వామి పెడుతున్న కేకలు విని, నిన్న పట్నం వెడుతూ రెండుమూడు రోజులదాకా రానని చెప్పిన అతడు అప్పుడే వచ్చాడేమిటాని ఆశ్చర్యపోతూ తరుగుతూన్న దోసకాయను పళ్ళెంలో పెట్టేసి ఇవతలికి వచ్చింది దేవదాసి. మామయ్యను టాక్సీ కారునుండి దింపి ఓ రెక్క పట్టుకొని మెల్లగా నడిపించుకు వస్తున్నది మేనత్త!
టాక్సీ డ్రైవరు చేతిలో చార్జీడబ్బు పెట్టి, మరోవంక సాయంగా వచ్చాడు గోవిందస్వామి.
"అత్తయ్యా!" వరండా మెట్లు దిగి ఆనందంగా ఎదురేగింది దేవదాసి. అత్తయ్య భుజంమీద చేతులువేసి కొద్దిగా వంగి. మెల్లమెల్లగా వేస్తూన్న మామయ్య అడుగుల వంకే చూచింది కుతూహలంగా.
రావుగారి అడుగు మామూలుగా పడటంలేదు. వంకరగా పడుతున్నది ఇంకా కాలు పాదం పూర్తిగా నేలమీద ఆనడంలేదు. "అప్పుడే వచ్చేశారేం, అత్తయ్య? మామయ్యకు ఓ నెల రోజులైనా పడుతుందని చెప్పాడే, గోవిందస్వామి."
కృష్ణవేణి మూతి ముడుచుకొని "మీ మామయ్యనే అడుగు" అన్నట్లు చూచింది.
ఆయన చిన్నగా నవ్వి అన్నారు; 'వాళ్ళు ఉండమన్నారమ్మా స్నానం, సంధ్యావందనం, దేవతార్చగా అదీ చేసుకొనేవాడిని. ఇక్కడికే నాలుగు నెలలు మంచంలో నరకం అనుభవించాను. ఇక నావల్ల కాదనిచెప్పి ఇంటికి వచ్చేశాను పట్టుబట్టి, పూర్తిగా నయం కాకుండానే వచ్చేశానని మీ అత్తయ్యకోపం!
"జీవితం తల్లికడుపున పడబోతున్న సమయమిది! కాలం కేవలం బ్రతకడానికే ఖర్చు పెట్టుకొంటే జన్మ వ్యర్థమే. ఈ శేషదినాలుసద్గతికోసం ప్రాకులాడ్డంలో గడపడం నాతప్పా, దేవత తల్లీ? మీ అత్తయ్యకేమో నేను పూర్ణారోగ్యవంతుడనయి ఇంకా నవయువకుడి వలె ఈ సంసార సామ్రాజ్యాన్ని ఏలాలనికోరిక?" చిలిపితనపు కళ్ళలోనించి భార్యవంక చూశారు.
"ఇదివరకే ఒకడు తయారై కన్నందున జీవితాన్ని తరింపజేశాడు. ఇక మీరుకూడా వాడిజతకు వెళ్ళండి! నా పూజలు, నానోములు అన్నీ ఫలించాయనుకొంటాను" కృష్ణవేణి పెదవులదిరాయి. కల్ళల్లో గిర్రున నీళ్లు తిరిగింది.
రావుగారిని వరండాలోకి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోపెట్టారు. నడకవల్ల కలిగిన ఆయాసాన్ని లెక్కించకుండా అన్నారాయన; "అటువంటి సుపుత్రుడిని కన్నందుకు నిజంగా నీజన్మ ధన్యమే, వేణూ! దుఃఖపడవలసింది అతడిని చూచికాదు. మనలను చూచి; ఈ దుర్గతి నీ కొడుక్కు పట్టనందుకు ఆనందించు.
భర్తగారి హితవచనాలు కృష్ణవేణి దుఃఖాన్ని తొలగించలేదు. కొడుకును మమతానురాగాలలో ముంచెత్తి లాలించి పెంచి అతడినుండి కోరేది విరాగాన్ని కాదు: తల్లిగా తనను అభిమానించే ప్రేమించే కొడుకును!
"నీ బావ ఏడే?" నవ్వుతూ మేనకోడలివంక తిరిగింది కృష్ణవేణి.
"గదిలో ఉన్నాడు" తలొంచుకొని మెల్లగా అక్కడినుండి జారిపోయింది దేవదాసి.
"ఏమయ్యా, గోవిందస్వామీ? మీకోడలి కొంగు వదలడంలేదు చినబాబు అనిచెప్పావే?"
"నిజం తల్లీ! అబద్దం నేనెందుకు చెబుతాను? ఎప్పుడూ ఏదో ముచ్చట్లాడుతూ, నవ్వుతూ అమ్మాయిగారితో ఉండేవారు!"
అక్కడికి గంటతో సహా తయారైన సుబ్బయ్య కల్పించుకొని "నిజమమ్మా! అమ్మాయీ అబ్బాయీ చిలకాగోరింకల్లా కలసి మెలసి తిరుగుతూంటే చూచి మాకళ్ళు ధన్యమయ్యాయనుకొన్నాం. కాని, ఈ వేళ మళ్ళీ పూర్వవాసన సోకినట్టుంది" అన్నాడు విచారంగా.
"ఉహూఁ" ఆశాభంగం పొందినదానివలె కృష్ణవేణి ముఖం వివర్ణమైంది. ఏ శాపవశం చేతనో దగ్గరికివచ్చే కొడుకు దూరమౌతున్నట్టనిపించింది. కొడుకు మనసు దేవదాసిమీద లగ్నమైందేమో, అతనికిష్టమైతే దవతను కోడలిగా చేసుకొంటే తనకు కొదవేమీ ఉండదనుకొంది. 'హుఁ! నన్ను దుఃఖపెట్టడానికే పుట్టిన కొడుకు నాకీపాటి సుఖమెలా ప్రసాదిస్తాడు? నా భ్రాంతి, పేరాశ కాకపోతే?" ఆవేదనగా నిట్టూర్చింది.
* * *
శుక్లపక్షపు చవితి చంద్రవంక త్వరత్వరగా పడమరగా నడక సాగిస్తున్నది. కొంచెం నీలిమతో కూడిన లేత వెన్నెలకాస్తున్నది.
డాబామీది బయల్లో మంచంవాల్చుకు పడుకొన్నాడు భార్గవరామ్. దగ్గరే పిట్టగోడమీద కూర్చొనుంది దేవదాసి. అత్యంత ప్రశాంతమైన ఆ వాతావరణంలో దేవదాసి కంఠం నిర్వికారంగా ప్రశ్నించింది; "నీ సాధనలక్ష్యం ఏమిటి బావా?"
"సంకల్ప రాహిత్యం!"
"సాధకుడికి అదే చివరి మెట్టా?"
"పూర్ణజ్ఞానానికి అదే చివరిమెట్టు. అది అతడి స్వస్వరూపప్రాప్తి."
"స్వర్గవైకుంఠలోకాలు కోరదగినవికాదా?"
జీవుని మరొక సంకల్పం తప్ప స్వర్గవైకుంఠలోకాలెక్కడున్నాయి. దేవదాసీ, కొన్ని జీవుల సంకల్పాల సముదాయమే ఈ జగతి! ఈ జగత్తు యదార్థంకానట్లే ఆ లోకాలు సత్యంకావు, అది ఒక భావన!"
"సంకల్ప రహితమైన స్థితే ఆత్మస్వరూపమంటావ్!"
"ఆఁ"
