పడగొడ్డాం రండి
తిమ్మారావుకి హఠాత్తుగా పేరు సంపాదించి ప్రముఖ వ్యక్తిగా మారిపోవాలని అనిపించింది.
న్యూస్ పేపర్లలో, పత్రికల్లో అతని పేరు మారు మోగిపోవాలి! కాని ఎలా?... ఎలా??...ఎలా???
ఆలోచిస్తూ అలా రోడ్డుమీద నడుస్తుంటే అతనికి రామారావు కనిపించాడు. అలా క్లోజ్ ఫ్రెండు కనిపించేసరికి తిమ్మారావు అతన్నిగట్టిగా కౌగిలించుకుని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
అతన్ని చూస్తే రామారావుకి కూడా కూసింత దుఃఖం వచ్చింది.
"కాస్త నీ కౌగిలి సడలిస్తావా?... నా కళ్లు ఒత్తుకోవాలి!!..." అన్నాడు రామారావు.
తిమ్మారావు రామారావుని వదిలిపెట్టి జేబులోంచి కర్చీఫ్ తీసి నోట్లో కుక్కుకుని "ఉహు... ఉహు... ఉహు..."అంటూ కుమిలిపోయాడు.
రామారావు తన చొక్కా ఎత్తి కళ్లు తుడుచుకుందామని అనుకున్నాడు గానీ చొక్కాని టక్ చేయడంవల్ల కుదరదు కాబట్టి ముందుకు వంగి తిమ్మారావు చొక్కా ఎత్తి తన కళ్లు తుడుచుకున్నాడు.
"ఊర్కో... ఊర్కో... కష్టాలు మనుషులకి కాకుండా మానులకి వస్తాయా?..." తిమ్మారావు భుజం తట్టి ఊరడించాడు రామారావు.
రామారావు ఊరడింపు మాటలు వినేసరికి తిమ్మారావుకి దుఃఖం వచ్చింది.
"ఉహు... ఉహు... ఉహుహుహు..." ఊర్కే కుమిలిపోసాగాడు.
"బాధపడకు... అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవల్సిన వాళ్లమే... ఇంతకీ మీ ఆవిడ ఎలా పోయిందీ?" వీపు నిముర్తూ అడిగాడు రామారావు.
తిమ్మారావు కళ్లు ఇంతింత చేసి రామారావు వంక ఆశ్చర్యంగా చూశాడు.
బాబుబూ... బీబాబు బూబూ...బా?" అన్నాడు.
రామారావు తిమ్మారావు నోట్లోని కర్చీఫ్ నిలాగేసి "ఊ... ఇప్పుడు చెప్పు!" అన్నాడు.
"మా ఆవిడ పోయిందని నీకెవరు చెప్పారు?!" ఆశ్చర్యంగా అడిగాడు.
"భలేవాడివే!... నీ దుఃఖం చూస్తుంటే నేనామాత్రం కనిపెట్టలేనని అనుకున్నావా?..."
"చాల్లే నోర్ముయ్... మా ఆవిడకేం నిక్షేపంగా... గట్టిగా రాయిలా ఉంది..."
"మరెందుకు అలా బాధపడ్తున్నావ్?"
తిమ్మారావు తనకి ఉన్నట్టుండి హఠాత్తుగా పేరు సంపాదించాలని ఉందనీ కానీ అందుకు ఏం చెయ్యాలో తోచడంలేదనీ... ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోతుందనీ చెప్పాడు.
"నేనిలా ఎవరికీ ఉపయోగపడకుండా ఏ మాత్రం ప్రత్యేకతా లేకుండా నిస్సారమైన జీవితాన్ని గడిపి ఏదో ఒకరోజు రాలిపోవల్సిందేనా?" గుడ్లనీరు కుక్కుకుంటూ అడిగాడు.
"బాధపడకు... బాధపడకు... ఆలోచిస్తే ఏదో ఒక మార్గం తగలకపోదు..."
అలా అని రామారావు కళ్లు పైకి పెట్టి ఆలోచించసాగాడు.
"పోనీ సంగీతం నేర్చుకోనా?" ఆశగా అడిగాడు తిమ్మారావు.
"సంగీతం... డాన్స్... మొదలైన వాటిగురించి మర్చిపో... వాటికి సంవత్సరాల కృషి కావాలి!.... అంత కృషి చేసినా నీకు పేరొస్తుందనే నమ్మకం లేదు..."అన్నాడు రామారావు.
రామారావు ఈ మాట అనగానే తిమ్మారావు రామారావు రెండు చెవులూ పట్టుకుని తన తలని రామారావు తలకేసి "ఢం... ఢం... ఢం"అని కొట్టి వదిలిపెట్టాడు."చచ్చాను నాయనోవ్..."అన్నాడు రామారావు నుదురు తడుముకుంటూ, నొసలు మీద బొడిపెకట్టింది.
"ఎందుకిలా సడెన్ గా నీ బుర్రకాయతో నా బుర్రకాయ్ ఢీకొట్టావ్?"బాధగా అడిగాడు రామారావు.
నువ్వలా డిస్కరేజింగ్ గా మాట్లాడేసరికి నాకు వెర్రెక్కిపోయింది.అదే ఇంట్లో అయితే గోడకేసి తల కొట్టుకునేవాడిని... ఇక్కడ గోడలు లేవుగా... అందుకని నీ తలకేసి నా తలని కొట్టుకున్నా..."చెప్పాడు తిమ్మారావు.
"ఏడవలేకపోయావ్!... ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు... దీన్ని తక్షణం మానుకో!!..." నొసలు రుద్దుకుంటూ అన్నాడు రామారావు.తిమ్మారావు బుద్దిగా తల ఊపాడు.
"సరేగానీ నాకు మంచి ఆలోచన వచ్చింది... నువ్వు దెబ్బకి పేరు ప్రఖ్యాతులున్న వాడివి అయిపోతావ్!!..."
తిమ్మారావు సంతోషంతో కెవ్వుమని అరిచి రామారావు పీకపట్టుకుని ఊపేస్తూ "ఏంటి?ఏంటి?ఏంటి?" అని కుతూహలంగా అడిగాడు.
నువ్విలా నా బుర్రకేసి నీ బుర్రని ఢం ఢం అని కొట్టడం, పీకలు పిసికేయటం ఇలాంటి పనులు చేస్తే నేనేం చెప్పనంతే..."కోపంగా చూస్తూ అన్నాడు రామారావు.
తిమ్మారావు నాలుక కర్చుకుని రామారావు పీక వదిలేసి చెంపలేస్కున్నాడు"ఇప్పుడు చెప్పు..."అన్నాడు.
"ఏముందీ... బాగా పాపులర్ అయిన ఇంగ్లీషు రచయితల నవలలు తీస్కుని కాపీ కొట్టేసి తెలుగులో రాసెయ్యడమే!!... ఇర్వింగ్ వాలెస్, ఆర్థర్ హెయిలీ, సిడ్నీషల్టన్... ఇలాంటి రచయితల నవలలన్నమాట!!... అంతే నువ్వో గొప్ప రచయితవి, ఆంధ్రుల అభిమాన రచయితవి అయిపోయి గొప్ప పేరు సంపాదిస్తావన్నమాట!!..."చెప్పాడు రామారావు.
"కానీ అలా కాపీకొట్టేస్తే తప్పుకాదూ?.... అందరికీ తెలిసిపోదూ?... అమాయకంగా అడిగాడు తిమ్మారావు.అతని అమాయకత్వానికి రామారావు ఘోల్లుమని నవ్వాడు.
"నీ అమాయకత్వాన్ని దొంగల్దోలా... హిహి... నువ్వెక్కడో వెర్రిపీనుగులా ఉన్నావ్... ఇప్పుడు రాస్తున్న క్రైం,కమ్ సస్పెన్స్ కం హారర్ నవలలు రచయిత లంతా ఇంగ్లీషు నవలలు కాపీకొట్టే రాస్తున్నారు... అసలీమధ్య అయితే కాపీకొట్టి కాస్త సొంతంగారాసే ఓపికలేక ఏకంగా వాక్యానికి వాక్యం మక్కీకి మక్కీ ట్రాన్సిలేషన్ చేసి పడేస్తున్నారు... పాఠకులకే తెలుసు కాపీ అని... మిగతా ఊళ్లలో ఉండేవారికి తెలీదుగా?అయినా పెద్ద పట్నాలలో ఉండే జనాభాకంటే పల్లెల్లో ఉండే జనాభానే ఎక్కువ... అదీకాకుండా సాధారణంగా ఇంగ్లీషు నవలలు చదివేవాళ్లు తెలుగు నవలలు జోలికి పోరు.కాబట్టి నీ నవల కాపీ నవలని కొద్దిమందికి మాత్రమే తెలుస్తుంది... అయినా ఇలా హఠాత్తుగా పేరు సంపాదించాలని అనుకునేవాడివి సిగ్గూ శరం వదిలేస్కోవాలన్నమాట... అలాగేనా?హి"
తిమ్మారావుకి రామారావు చెప్పింది చాలా బాగా నచ్చింది.అసలు ఈ రోజుల్లో సొంతంగా రాసేవాడు పిచ్చోడనీ, కాపీలు కొట్టేవాళ్లే నెంబర్ వన్ రచయిత అవుతారనీ నచ్చజెప్పాడు రామారావు.
ఆ దెబ్బకి తిమ్మారావు వెంటనే ఓ డజను ఇంగ్లీషు నవలలు కొనుక్కుని ఇంటికి తీస్కెళ్లాడు. వాటిని బాగా చదివి నచ్చిన సీన్సుని ఒక్కో నవల్లో ఒక్కోటి తీస్కుని మక్కీకి మక్కీ ట్రాన్స్ లేషన్ చేసి'హింసపెడ్తా చిత్రహింసపెడ్తా'అనే నవల రాశాడు.
ఆ నవల "తెలుగు డబ్బా" అనే పత్రికలో సీరియల్ గా ప్రచురించబడి అశేష పాఠకుల మన్ననలు అందుకుంది.
ఆ దెబ్బతో తిమ్మారావు రచయితైపోయాడు.
