లోపలికి రాబోతున్న పార్వతి వినాయకాన్ని చూసి నవ్వుతూ అంది_
"ఇక్కడ వున్నావా మరిదీ?...పెళ్ళి యింకా పది రోజులు వుంది పదకొండవ రోజు నుంచీ పగలూ రాత్రిళ్ళు గది తలుపులు మూసేసుకుని బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చును! నీ కోసం అత్తయ్య వెతుక్కుంటున్నది. నువ్వింకా యింటికి వెళ్ళావేమోనని కూడా అనుకుంటున్నది....త్వరగా వెళ్ళు వెళ్ళు!" తొందర చేసింది నవ్వుతూ.
సిగ్గుతో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ బైటికి వెళ్ళాడు. వెళ్ళుతూ కూడా వెనక్కి తిరిగి కావేరిని చూసి నవ్వాడు.
కావేరికి నవ్వు రాలేదు! కళ్ళప్పగించి మాత్రం చూస్తున్నది.
అదే ఎంతో అదృష్టం అని అనుకున్నాడు వినాయకం అలా తిరిగి తిరిగి చూస్తూ నడవటం వలన వస్తున్న మేనమామకి ఢీ కొట్టాడు.
"ఏమిట్రా వినాయకం?"
అని మేనమామ అడిగేసరికి సిగ్గుపడిపోయి త్వరత్వరగా బైటికి వెళ్ళిపోయాడు వినాయకం.
అది చూసిన పార్వతికి ఎంతో నవ్వు వచ్చింది.
"పెళ్ళయ్యే వరకూ మరిదిగారు ఆగేటట్టులేరు!" అంది కావేరిని చాస్తూ నవ్వుతూ!
కావేరికి నవ్వు వచ్చిందిగాని అక్కలాగా ఎక్కువ శబ్దం వచ్చేలా నవ్వలేదు.
వినాయకం అంటే కావేరికి యిష్టమే! కాని తన పెళ్ళి యింత త్వరగా నిర్ణయించుతారని అనుకోలేదు. తన ఆశలన్నీ అడియాశలు అయ్యేటట్టున్నాయన్న బాధ కావేరిని అమితంగా క్రుంగదీస్తున్నది. తాను సినిమా హీరోయిన్ అయ్యే మార్గం వున్నదా? లేదా? అన్నది కూడా తెగటం లేదు అదొక కుమ్మరి పురుగయి మనసుని తొలచి వేస్తున్నది. శంకరం బావకి అవనిదే వినాయకం బావకి చేయనన్న అత్తయ్య మరలా యిలా మార్చుకున్నదేమిటి? తాను యింతలో చేసుకోనన్నాడా పేద బావ? అసలు కారణం ఏమిటో కావేరికి అంతుబట్టలేదు....
"పట్టుచీర విప్పి ఈ కొత్తచీర కట్టుకోమంది అమ్మ!" అంటూ తన చేతిలోని చీరను కావేరికి యిచ్చింది పార్వతి.
నడుముకి వున్న వడ్డాణం తీసి మంచం మీద పెట్టింది. అక్క యిచ్చిన చీర కట్టుకుంది. జాకెట్టు ఉక్సు తీయబోతుంటే గొలుసు అడ్డం వచ్చింది! అది కూడా తీసి వడ్డాణం పక్కన వుంచింది.
కావేరికి మేనత్త పెట్టిన వస్తువులను చూసి పార్వతి ఎంతగానో మురిసిపోయింది...చేత్తో పట్టుకుని మరీ చూసింది. బంగారం నాణ్యతను పరిశీలించింది, ముంజేతులకి వున్న బంగారపు గాజులను లెక్కపెట్టింది. ఉంగరంలోనిరాయి మెరవటం చూసి అచ్చెరువొందింది. ఎంతయినా అత్తయ్యది పెద్ద మనసు! తననే శంకరం బావకి చేసుకోవాలని ఎంతో ప్రయత్నించింది. కాని ఆ మహానుభావుడు తన చదువయితేనే గాని చేసుకోనన్నాడు....తననే చేసుకుని వున్నట్లయితే ఈ బంగారమంతా తనకే పెట్టి వుండేది అత్తయ్య. తన పెళ్ళికి డబ్బు సర్దుబాటు కాకపోవటంతో అత్తయ్యే సర్దింది...తిరిగి యివ్వమని అడిగినట్లు గుర్తులేదు.
తన తండ్రి అంత కట్నం యిచ్చి పెళ్ళి చేస్తే నాలుగు కాసులుతో సూత్రం గొలుసు పెట్టటానికి తన అత్తవారు ఎంతో బాధ పడ్డారు. వారికి పెట్టించుకోవటం తప్ప పెట్టటం మాత్రం తెలియదు. అంతటి మూర్ఖులు! ఈ గొలుసు కూడా వ్యవసాయపు ఖర్చులకని తాకట్టుకి తీసుకువెళ్ళటమే తప్ప పట్టుమని ఓ రెండు నెలలు తన మెడలో వున్న పాపాన పోలేదు. ప్చ్! ఏం మనుష్యులో? ఏం లోకమో?
వడ్డాణం విలువ ఎంత వుంటుందో? గాజుల విలువ ఎంత వుంటుందో అయిదు వరసల ఆ బంగారపు గొలుసు విలువ ఎంత వుంటుందో పేరు పేరునా అంచనా వేసి మొత్తం వాటి విలువ లక్ష రూపాయలుగా తేల్చి, ఆ మాటే పైకి అనేసి "అమ్మో" అనుకుంటూ గుండెల మీద చేతులుంచుకుంది.
"ఏమిటే? లక్ష రూపాయల విలువా?..." అంత వరకూ మౌనముగా వున్న కావేరి అప్పుడు నోరు విప్పింది!
"అవునే! నలభై కాసుల బంగారం! యిదేమన్నా తక్కువనుకుంటున్నావా? అక్కడికీ నేను తక్కువ కాసుల బంగారం లెక్క వేశాను. సరిగ్గా చెప్పాలంటే యాభై కాసుల బంగారం వుటుంది.."అంది పార్వతి పట్టుచీర మడతపెడుతూ!
అంతవరకూ వాటిమీద దృష్టి మరల్చని కావేరి అప్పుడు చూసింది వాటివైపు! తళతళా మెరిసిపోతున్నాయి. ఆ గొలుసు వేసుకునేసరికి మెడంతా బరువనిపించింది. నడుముకి వడ్డాణం పెట్టుకుంటే కట్టేసినట్లయింది. వేలికి ఉంగరం పెట్టుకుంటే బిగించి పట్టేసినట్లనిపించింది. చేతికి గాజులు తొడుక్కుంటే కదిల్చినప్పుడంతా గలగలమంటూ శబ్దంచేస్తున్నాయి. అన్నీ పెట్టుకునేసరికి ఎంతో బరువు అనిపించింది. తీసేస్తే యిప్పుడు ఎంతో తేలికగా వున్నట్టయింది.
"నువ్వెంతో అదృష్టవంతురాలివే కావేరీ! ఎలాంటి అలవాటూలేని వినాయకం నీకు భర్త అవుతున్నాడంటే నాకెంత ఆనందంగా వుందో తెలుసా? అత్తయ్యంత మంచిది యింకెవ్వరూ వుండరు. నువ్వుమాత్రం ఆ యింటి కోడలిగా అడుగుపెట్టటంతోనే ఏదో అధికారం వచ్చేసిందనుకోకు! ఎంతో అణుకువగా వుండి అత్తయ్య వినాయకం మెప్పు పొందు! ఎంచక్కా నిన్ను వున్న ఊరిలోనే అత్తవారింట వేస్తున్నారు. నాకయితే ఎంతో దూరం! కావాలన్నట్టుగా లంకల్లోకి విసిరేశారు నాన్నా! శంకరం బావ చదువు వంకతో పట్నం చేరాడుగాని, లేనట్లయితే నేను శంకరం బావకి పెళ్లాన్నయి వుండేదాన్ని కాని నాకా అదృష్టంలేదు."
పార్వతి నిట్టూరుస్తూ బయటకి వెళ్ళిపోయింది.
అందరూ తనను అదృష్టవంతురాలంటున్నా తనలో ఆ భావం కలుగకపోవటం కావేరికి ఆశ్చర్యం అనిపించలేదు. సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్న తనకి పెళ్ళిచేస్తున్నారన్న బాధ నిలువెల్లా దహించివేస్తున్నది. తను ఎలా హీరోయిన్ అవ్వాలి? అన్నదే ఆలోచన! ఆ ఆలోచనతోనే ఏమీ మనసుకి పట్టించుకోకపోతున్నది. అందరూ ఎంతో సంతోషంతో వుంటే కావేరి నిర్లిప్తంగా వుండటానికి కారణం! తను సినిమాహీరో యిన్ ఎలా అవ్వాలా అన్నదే!
"కావేరీ! బయటికి రా! మీ అత్తయ్య యింటికి వెళతానంటున్నది?" తల్లి పిలుపు వినిపించేసరికి బయటికి తప్పలేదు కావేరికి.
"అప్పుడే పెళ్ళికూతురుకళ వచ్చేసింది కోడలుపిల్లకి!" రాజమ్మ హాస్యమాడింది.
కావేరి నవ్వింది తలవంచుకునే! పెళ్ళికూతురు అన్నప్పుడు.
11
కావేరికి, వినాయకరావుకి వివాహమని తెలిసిన సుబ్బులు హతాళురాకయిపోయింది. ఎప్పటికయినా వాళ్ళూవాళ్ళూ ఒకటేనన్న అభిప్రాయం కలిగింది. వినాయకంమీద ఎంతో ఆశపెట్టుకుంది ఆఖరికి ఈ విధంగా అయిందన్న బాధ కలిగింది.
