"నా మీద ఆయన కెందుకూ పగ?"
"అప్పారావుగారు చచ్చిపోయిన తర్వాత అతన్ని తల్చుకుంటూ నిన్న రాత్రి ఆయన ఏడ్చారట. అఫ్ కోర్స్...అదే పనిగా తాగుడు కూడా!"
"నా మీద అంత కక్ష ఉన్నప్పుడు నేనూ, మా అమ్మాయీ వాళ్ళావిడ ఆతిధ్యం తీసుకోవడం బాగుంటుందా?"
"ఆయన మనతో రావట్లేదుగా..."
"అయినా...?"
"మరేం అనకండి. ఉంటాను మరి!" అంటూ రాజేశ్వరి ఫోన్ పెట్టేసింది!
అనంతగిరి పిక్నిక్ సంగతి వినగానే రమణి సంబరపడి పోయింది. అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ ఈ విషయం చెప్పింది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు భవానీ వచ్చింది. ఆమెకి కూడా గంతులేస్తూ ఈ విషయం చెప్పింది.
ఆఫీసుకి బయల్దేరాడు రాజారామ్.
స్కూటర్ బయటికి తీసి చాలా రోజులయింది. ఆగి, ఒక క్షణం అటు చూసి మళ్ళీ ముందుకు నడిచాడు... ఈ టెన్షన్ లో ....తనేదీ డ్రయివ్ చెయ్యకుండా ఉంటేనే మంచిది!
ఫాన్సీ కార్నర్ ముందు ఆగి వేలాడగట్టి ఉన్న పేపర్లవేపు చూశాడు. అన్ని దినపత్రికలూ సుందరి ఫోటో ప్రముఖంగా వేశాయి. "ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా?" అని శీర్షికలు పెట్టాయి.
ఆటో ఎక్కి 'ఆంధ్రా టైమ్స్' ముందు ఆగాడు రాజారామ్. ఆఫీసులో పోలీసులు ఇంకా ఏదో హడావుడి చేస్తూనే ఉన్నారు. తిన్నగా వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అంతలో అల్లంత దూరాన ఎం. డీ చాంబర్స్ తలుపులు తెరుచుకుని బయటికి వచ్చిన ఇన్ స్పెక్టర్ మహావీర్ కన్పించాడు. రాజారామ్ దగ్గరికి వస్తూ విష్ చేశాడు.
అతను కూర్చున్న తరువాత "ఏమంటారు మీ ఇన్ స్పెక్టర్ దుర్గారావుగారు?" అన్నాడు రాజారామ్.
"ఆయన సంగతి నేను చూసుకుంటాను. కాని మీ ఎం. డీ ఏమిటీ మరీ అప్పారావుని లవ్ చేసినట్టు మాట్లాడ్తాడూ?" అంటూ అటూ ఇటూ ఓసారి చూశాడు మహావీర్. దగ్గర్లో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని... "మా అప్పారావు చెడ్డ మంచివాడు. చీమకి కూడా హాని తలపెట్టడు. మేధావి, అఖండుడు. అసాధ్యుడు. అమ్మో...చాలా గొప్ప వాడు....అతనికీ సుందరి కేసుకీ ముడి పెట్టడం అన్యాయం" అని మీ ఎం.డీ గారు దుర్గారావు చెవుల్లో ఒకటే నస!" అని ఆగాడు మహావీర్.
రాజారామ్ మాటాడలేదు.
"నేనివాళ అప్పారావుగారి బ్యాంక్ ఎకౌంట్ మీద ఓ కన్నేశాను. గత నెలలో ఆయన ఒక్కసారి పాతికవేల రూపాయలు డిపాజిట్ చేశాడు. ఎప్పుడో తెలుసా? సుందరి డిపాజిట్ చేసిన మరునాడు!?"
ఆ మాటలు వినగానే రాజారామ్ కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు.
"అదన్నమాట సంగతి. అంటే ఇద్దరూ తోడు దొంగలు..."
మహావీర్ రాజారామ్ వేపు చూస్తూ - "ఇప్పుడు మన ముందు రెండు సిద్దాంతాలు ఉన్నాయి. సుందరి ఇక్కడికి వచ్చి అప్పారావుని హత్య చేసింది. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ. సుందరి చెవిరింగుని ఎవరో అక్కడ పడేసి - పోలీసుల దర్యాప్తుని పక్కదారి పట్టించాలని చూశారు." అన్నాడు.
"రెండోది మీ దుర్గారావు గారి సిద్దాంతం!" నిర్లిప్తంగా అన్నాడు రాజారామ్.
"పోలీసులు ప్రతిదీ దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతిదాన్నీ అనుమానించాలి."
"మరి నా బేంక్ ఎకౌంట్ ఎప్పుడు చూస్తారు? ఆఫ్ కోర్స్ నా బేంక్ ఎకౌంట్లో అలాంటి పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు ఉండవు. వచ్చి చూడండి!"
ఇన్ స్పెక్టర్ మహావీర్ నవ్వాడు.
"నేను గ్రహించగలను. మీరు సుమిత్రని చంపలేదు. సుందరితో మీకు సంబంధం లేదు. అప్పారావు వ్యవహారం సరేసరి. మీ పక్షాన ఉన్న ఏకైక పోలీస్ ఆఫీసర్ని నేనే!"
"థాంక్యూ ఇన్ స్పెక్టర్!"
ఇన్ స్పెక్టర్ మహావీర్ వెళ్ళిపోయాడు. రాజారామ్ తన పనిలో మునిగిపోయాడు. డెస్క్ రూం లో టెంపో నిమిష నిమిషానికీ ఎక్కువ అవుతోంది. వార్తలు ప్రవాహంలా వచ్చి పడ్తున్నాయి.
సాయంత్రం మూడు గంటలప్పుడు రాజారామ్ ఇంటికి ఫోన్ చేశాడు. అవతల రమణి 'హల్లో' అంది.
"ఏం చేస్తున్నావ్ రమణి?"
"నేనూ భవానీ కేరమ్స్ ఆడుకుంటుంన్నాం..."
"గుడ్! ఇంకా..."
"అన్నట్టు డేడీ....రాజేశ్వరి ఆంటీ కన్పించిందా?"
"ఇంకా లేదు"
"డేడీ ఆవిడకి నేను బంగారం రంగు గౌను సంగతి చెప్పాను. ఈ సంగతి ఆంటీతో చెప్పు డేడీ!"
"ఓ యస్."
"నాకా గౌను కావాలి డేడీ!"
"ఓకే"
0 0 0
'గౌను కాదు కొండమీద కోతి కాదు, ఆకాశంలో చంద్రుడి నయినా తెచ్చి ఇస్తానమ్మా!' అనుకున్నాడు రాజారామ్.
రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రాజేశ్వరి సీటు దగ్గరికి వెళ్ళాడు రాజారామ్.
"ఎలా వుంది రమణి?"
"మామూలే!"
రాజేశ్వరి అతని వేపు అభిమానంగా చూసింది.
"బేబీస్ యూనివర్స్ లో కనిపించిన వ్యక్తి అతను కాదేమో అంటుంది"
"అలాగా?"
"రమణి చూసిన వ్యక్తి అతను కాకూడదనే నా కోరిక. ఒకవేళ అదేకనక నిజమైతే అతను రమణిని ఓ కంట కనిపెడ్తున్నాడు. రమణిని అనుసరిస్తున్నాడు అనుకోవాల్సి ఉంటుంది." అంటూ మరి మాట్లాడలేక రాజారామ్ ఆగిపోయాడు.
