Previous Page Next Page 
దేవదాసు పేజి 24

    చంద్రముఖి ఒక ఎర్రంచు చీర ధరించి వుంది. చేతిలో రెండు బంగారపు మురుగులున్నాయి. తల మీద లలాటం దాకా ముసుగు వున్నది. శరీరమంతా ఒక ముతక దుప్పటిలో కప్పబడి వుంది. సూర్యుడు అస్తమించబోతూ వున్నాడు. అప్పటికి ఇరువురూ గ్రామంలోకి చేరుకున్నారు. చంద్రముఖి కొంచెం నవ్వి "భైరవ్! ఈ రెండు మైళ్ళు ఇంత త్వరగా ఎలా దాటి వచ్చాం?" అన్నది చంద్రముఖి.
    భైరవుడు ఈ పరిహాసాన్ని గ్రహించలేక సరళ భావంతో_"ఈ సారికైతే వచ్చేశావు. కాని నీ యీ శుష్కించిన దేహం ఈ రోజే మళ్ళీ తిరిగి వెళ్ళగలదా?"
    'ఈ రోజేమిటి? రేపు కూడా ఇలా ఇంత దూరం నడవలేను.' అనుకున్నది లోలోపల. "భైరవ్! ఇక్కడ బండి దొరకదా?" అన్నది పైకి.
    "ఎందుకు దొరకదు? ఎద్దులబండి దొరుకుతుంది. మాట్లాడి తీసికొని రమ్మంటావా?" అన్నాడు భైరవుడు. బండి మాట్లాడుకు రమ్మని ఆదేశించి చంద్రముఖి జమీందారు ఇంట్లోకి ప్రవేశించింది.
    భైరవుడు బండి మాట్లాడటానికి మరోవైపుకు వెళ్ళిపోయాడు. లోపల పై అంతస్తులోని వరండాలో పెద్ద కోడలు (ప్రస్తుత జమీందారు గృహిణి) కూర్చొని వుంది. ఒక దాసీ చంద్రముఖిని అక్కడికే తీసికొని వచ్చింది. ఇరువురూ ఒకరినొకరు ఒకసారి పరిశీలనగా చూసుకొన్నారు.
    చంద్రముఖి నమస్కారం చేసింది. పెద్దకోడలు ఒంటి మీద నగలు ఎక్కువగా ధరించదు. కాని ముఖంలో అహంకారం మాత్రం కొట్టవచ్చినట్లే కన్పిస్తూ వుంది. రెండు పెదవులు, పళ్ళు పళ్ళకప్పు, తాంబూలం కారణంగా నల్లబడిపోయాయి. బుగ్గలు కొంచెం పైకి ఉబ్బి వున్నాయి. ముఖం అంతా నిండుగా వుంది. కేశాలంకరణ చాలా అందంగా వుంది. రెండు చెవులకూ కలుపుకొని చిన్నవీ, పెద్దవీ ఇరవై ముప్పై కమ్మలదాకా వుంటాయి. ముక్కు క్రింద ఒక బులాకీ వ్రేలాడుతూ వుంది. రెండు ముక్కులకు వున్న బెజ్జాలకు లవంగాలు పెట్టుకొని వుంది. అవి ముక్కు పుడకలు పెట్టుకొనేవి.
    చంద్రముఖి చూసింది. పెద్దకోడలు చాలా లావుగా వుంది. రంగు నలుపు. కళ్ళు చాలా పెద్దవి. గుండ్రటి ముఖము, నల్లంచు చీర ధరించి వుంది. నారింజ రంగు చోళీ ధరించి వుంది. ఇదంతా చూడగానే చంద్రముఖి మనసులో కొంచెం ద్వేషం లాంటిది ఉత్పన్నమయింది. పెద్ద కోడలు చూసింది. చంద్రముఖి కొంచెం వయస్కురాలైనప్పటికీ ఆమె సౌదర్యం ఏమీ తగ్గిపోలేదు. ఇరువురూ దాదాపు సమవయస్కులు. కాని పెద్ద కోడలు మనసులో దీనిని అంగీకరించలేదు. ఆ గ్రామంలో పార్వతి తప్ప ఇంత సౌదర్యం మరెవ్వరి దగ్గరా కన్పించలేదు. ఆశ్చర్యపోయి "నీవు ఎవరివీ?" అని అడిగింది.
    "నేను మీ జమీలో వుండే ప్రజలలో ఒక దానిని. ఖజానాకు శిస్తు కొంత బకాయిపడి వుంది. అది చెల్లించడం కోసం వచ్చాను."
    పెద్ద కోడలు లోలోపల సంతోషించి "మరి ఇక్కడికి వచ్చావేం? కచేరికి వెళ్ళు" అన్నది.
    చంద్రముఖి తియ్యని నవ్వు నవ్వి_"అమ్మా! నేను చాలా కష్టాలలో వున్న స్త్రీని. డబ్బంతా చెల్లించలేను. మీరు చాలా దయగలవారని విన్నాను. అందుచేతనే మీ దగ్గరకు వచ్చాను, కొంత మాఫీ చేస్తారని."
    ఈ రకమైన మాట పెద్దకోడలు తన జీవితంలో మొదటిసారే విన్నది. ఆమెలో దయ వుందనీ, శిస్తు మాఫీ చేయగలదనీ చెప్పిన కారణంగా చంద్రముఖి వెంటనే ఆమె ప్రేమకు పాత్రురాలైనది. "రోజుకు ఎన్నో రూపాయలు నేను వాదులుకోవలసి వస్తూ వుంటుంది. ఎంతోమంది వచ్చి నన్ను ప్రాధేయపడుతుంటారు. నేను మాఫీ చేయలేను. అంచేత అందరూ నా మీద క్రోధంగా కూడా వుంటాను. అయితే నీవు ఎన్ని రూపాయలు బకాయిపడి వుంటావు?" అన్నది.
    "ఎక్కువ లేదమ్మా, మొత్తం రెండు రూపాయలు. కాని నాకు ఈ రెండు రూపాయలే గగనం అనుకోండి. ఈ రోజంతా నడిచి ఇక్కడకు వచ్చాను."
    "ఆహా! నీవు కష్టాలలో వున్న స్త్రీవి. నీ మీద దయ చూపడం ఉచితమైనది కూడా. ఓ బిందూ, ఈమెను అటు తీసికొని వెళ్ళు. రెండు రూపాయలు నేను మాఫీ చేయమన్నానని దీవాను గారితో చెప్పు. సరే, నీ యిల్లు ఎక్కడా? అన్నది పెద్దకోడలు.
    మీ జమీందారులోనే నమ్మా__అశథ్ ఝారీ గ్రామంలో. సరే మంచి దమ్మా. అమ్మా! చినదొరగారు లేరా?" అన్నది చంద్రముఖి.
    "అభాగ్యురాలా! ఇంకా చిన దొరగారెవరు? ఇంకా నాలుగు రోజులు పోయిన తరువాత అంతా నాదే అవుతుంది." అన్నది పెద్దకోడలు.
    "ఎందుకమ్మా! చినబాబుగారికి బాగా అప్పు వున్నదా?" అని అడిగింది చంద్రముఖి ఉద్విగ్నురాలై.
    పెద్ద కోడలు కొంచెం నవ్వి "నా దగ్గరే అనేక గ్రామాలు తాకట్టు పెట్టి వున్నాయి. లేకపోతే ఇప్పటికే అంతా అమ్ముడుపోయేది. కలకత్తాలో మద్యానికీ, ఒక వేశ్యకూ ధనమంతా దోచి పెడుతున్నాడు. ఆ డబ్బుకు అంతమే లేదు, ఇంతని లెక్కే లేదు.
    చంద్రముఖి ముఖం వాడిపోయింది. కొంచెం ఆగి "అయితే అమ్మా! అంచేతనే చినబాబుగారు ఇంటికి కూడా రారా?" అని అడిగింది.
    "ఎందుకురారు? డబ్బు అవసరమయినప్పుడు వస్తారు. భూమి తాకట్టు పెడతారు. మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ మధ్య రెండు మాసాల క్రితమే వచ్చారు. పన్నెండు వేల రూపాయలు తీసికొని వెళ్ళారు. బ్రతుకుతారనే ఆశ కూడా లేదు. శరీరంలో అనేక చెడురోగాలు! ఛీ! ఛీ!"
    చంద్రముఖి వణికిపోయింది. ఆమె చిన్నబోయి "ఆయన కలకత్తాలో ఎక్కడ వుంటున్నాడు?" అని అడిగింది.   
    "చాలా దుస్థితిలో వుంటున్నాడు. ఎక్కడ వుంటున్నాడో ఎవరికైనా తెలుస్తుందా? ఏ హోటల్లో వుంటున్నాడో, ఏ స్నేహితుడి ఇంట్లో వుంటున్నాడో_అతనికే తెలియాలి." అన్నది పెద్ద కోడలు.
    చంద్రముఖి హఠాత్తుగా లేచి నిలబడి "ఇహ నేను వెళ్తున్నాను" అన్నది.
    పెద్ద కోడలు కొంచెం ఆశ్చర్యపోయి_"వెళ్తావా? ఓ బిందూ...." అన్నది.
    చంద్రముఖి మధ్యలోనే అందుకున్నది_"ఆగండి అమ్మగారూ, నేను స్వయంగానే కచ్చేరీకి వెళతాను" అని చెప్పి ఆమె నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఇంటి బయటికి వెళ్ళి చూసింది. బైరవుడు ఎదురు చూస్తూ వున్నాడు. యెద్దుల బండి ఒక ప్రక్కన నిలబడి వుంది. ఆ రాత్రికే చంద్రముఖి ఇంటికి తిరిగి వచ్చింది. ప్రొద్దున్నే మళ్ళీ భైరవుణ్ని పిలిచి "భైరవ్! నేను ఈ రోజు కలకత్తాకు వెళతాను. నీవు నాకు తోడుగా రాలేవు. అంచేత మీ అబ్బాయిని తోడు తీసికొని వెళతాను. ఏమంటావు చెప్పు?" అన్నది.
    భైరవుడు_నీ యిష్టం అమ్మా. కాని కలకత్తాలో ఎక్కడికి వెళ్తావమ్మా? ఏదయినా ముఖ్యమయిన పని వుందా?"
    చంద్రముఖి_"అవును భైరవ్! ముఖ్యమయిన పని వుంది."
    భైరవుడు_"ఎప్పుడొస్తావు?"
    చంద్రముఖి_"అది చెప్పలేను భైరవ్. ఒకవేళ వీలైతే త్వరగానే వస్తాను. లేకపోతే ఆలస్యమవుతుంది. ఒకవేళ అసలు రాలేకపోతే ఈ యిల్లూ, వాకిలీ అంతా నీవే తీసుకో."
    మొదట భైరవుడు అవాక్కయిపోయాడు. అతడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏమిటమ్మా ఇలా చెపుతున్నారు! నీవు రాకపోతే ఈ గ్రామములోని వారందరూ యెలా వుండగలరు?"
    చంద్రముఖి కూడా కళ్ళు చెమర్చాయి. కొంచెం తియ్యగానే నవ్వి "ఇదేమిటి భైరవ్? నేను రెండు సంవత్సరాల క్రితమేగదా వచ్చింది. ఇంతకు పూర్వం మీరందరూ ఎలా వుండేవాళ్ళు?"
    మొరటువాడైన భైరవుడు దీనికి సమాధానం చెప్పలేడు. కాని చంద్రముఖి మనసులో అంతా తెలిసే వుంది. భైరవుడి కొడుకు కేవలం ఆమెకు తోడుగా వస్తున్నాడు. బండిమీద అవసరమైన సామాగ్రి వేసికొని వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు, అందరూ చూడటానికి వచ్చారు. చూసి రోదిస్తూ వున్నారు. చంద్రముఖి కూడా కన్నీళ్ళును ఆపుకోలేక పోయింది. ఆ కలకత్తా నాశనంగానూ, దేవదాసే అక్కడ లేకపోతే కలకత్తాలో రాణీ పదవి లభించినా కూడా దానిని తృణంతో సమానంగా వదిలేసి కలకత్తాకు ఎన్నడూ వెళ్ళేదే గాదు.
    రెండో రోజు ఆమె క్షేత్రమణి ఇంటికి వచ్చింది. ఆమె పూర్వం వున్న ఇంట్లో ఇప్పుడు వేరే వాళ్ళు వుంటున్నారు. క్షేత్రామణి అవాక్కయిపోయింది. "అక్కా! ఇంతవరకూ ఎక్కడున్నావు?" అని అడిగింది.
    చంద్రముఖి వాస్తవాన్ని దాచి "అలహాబాదులో వున్నాను" అన్నది.
    క్షేత్రమణి ఒక్కసారి ఆమెను ఆపాద మస్తకం తేరిపార జూసి "నీ సొమ్ములన్నీ ఏమైపోయాయి అక్కా?" అన్నది.
    చంద్రముఖి నవ్వి క్లుప్తంగా "అన్నీ వున్నాయి" అన్నది.
    అదే రోజు చిల్లర దుకాణాదారుణ్ణి కూడా కలిసి "దయాల్, నాకు ఇంకా ఎంత డబ్బు వస్తుందీ?" అని అడిగింది.
    దయాల్ చాలా ఇబ్బందిలో పడ్డాడు. "అదే అరవయ్యో, డెబ్భైయ్యో  ఇవ్వవలసి వుంటుంది. ఈ రోజు లేవు. రెండు  రోజుల తరువాత ఇచ్చేస్తాను." అన్నాడు.
    "నీవు ఏమీ ఇవ్వనవసరం లేదు, నాకు ఒక పని చేసి పెడితే."
    "ఏం పని?"
    "రెండు మూడు రోజుల లోపలే మన పేటలో ఒక అద్దె ఇల్లు చూసిపెట్టు_తెలిసిందా?"
    దయాల్ నవ్వి "తెలిసింది" అన్నాడు.
    "ఇల్లు బాగుండాలి. మంచి మంచి పరుపులూ, దుప్పట్లూ, మంచమూ, లాంప్, రెండు కుర్చీలూ, ఒక టేబుల్ వుండాలి_తెలిసిందా?"  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS