17
"అన్నయ్యా!"
"ఏమ్మా, అరుణా!" అని చదువు కుంటున్న ఆనంద్ తలెత్తి చూసి "రజియా, నువ్వా!" అని ఆశ్చర్యపోయాడు.
"తప్పుగా పిలిచానా, అన్నయ్యా?"
ఆనంద్ గుండెల్లో ఒక్కసారిగా ఎవరో వెయ్యి శూలాలతో గుచ్చినట్లు బాధతో ఊగిపోయాడు. ఎవరిని ప్రేమించి తన ప్రేమను బయటికి చెప్పలేక లోలోపలే కుమిలి పోతున్నాడో ఆమె అన్నయ్యా అని దగ్గర చేరింది. అంతకన్నా ఎదురుదెబ్బ ఏం కావాలి?
"ఏం అన్నయ్యా, పలుకవు?"
భరించలేక పోయాడు ఆనంద్. ఎవరిని హృదయంలో భద్రంగా దాచుకొని భవిష్యత్తు ను గురించి కలలు కన్నాడో, ఎవరిని తన కలల్లో ఊహించుకొని గాలిమేడలు కట్టుకున్నాడో, వారే తన కలలను భగ్నం చేసి తన గాలిమేడలు కూల ద్రోస్తున్నారు. తన భవిష్యత్తు అంధకారమై పోతుంది. ఈ ప్రపంచం లో అంతా మాయ. అంతా భ్రమ, అంతా మోసం అని ఘోషిస్తుంది అతని హృదయం.
"నాతొ మాట్లాడకూడదను కున్నావా, అన్నయ్యా? అప్పుడు ఎంతో ప్రేమతో , ఆప్యాయతతో పలుకరించి కబుర్లు చెప్పి నవ్వించే వాడివే? ఇప్పుడు నేనేం తప్పు చేశానని నాకీ శిక్ష, చెప్పన్నయ్యా!"
"రజియా, నన్నిలా బాధించడం నీకు న్యాయం కాదు."
"బాధించేది నేను కాదన్నయ్యా! నువ్వే! నువ్వు మమ్మల్ని చిత్ర హింసకు గురి చెయ్యాలను కుంటున్నావు. ఇది నీకు ధర్మమా? ఒక చెల్లెలి జీవితంలో చిచ్చు రగుల్చడం నీకు న్యాయమా? అంతకన్నా నీ చేతులతో చంపెయ్య కూడదు!"
"రజియా!"
"నేను అన్నయ్యా అని పిలిస్తే భరించలేవు కదూ!"

"ఎవరి కోసం ఒక ఆప్త మిత్రుడి ని, ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితుడిని కక్షతో దూరం చేసుకున్నాడో, అందరికీ విరోధి అయ్యాడో, ఆమె ఈనాడు తన నుండి చెల్లెలి ప్రేమను కాంక్షిస్తుంది. కానీ తనకు కావలసింది అది కాదు. ఒకస్త్రీ ప్రేమ కావాలి. అది తనకు లభ్యం కదా? ఇదేనా తన ఇన్నాళ్ళ పూజకు ఫలితం? ఓ భగవంతుడా, నేను నీకేం అపకారం చేశాను? నాకీ శిక్ష ఎందుకు? ఇలాంటి పరిస్థితి నాకెందుకు కలిగించావు?"
"నన్ను అరుణతో సమానంగా చూడలేవా? నన్ను అరుణ అనుకోని నాలో అరుణ ను చూడలేవా? పోనీ ఒక అనాధ అయిన చెల్లిగా భావించ లేవా?"
"ఆమె ఒక్కొక్క మాట తనను దహించి వేస్తున్నది. ఆమె చూపులకు శక్తే వుంటే తను పశ్చాత్తాపంతో , పాపంతో భస్మమై పోయి ఉండేవాడు. ఆమె కన్నీరు తనను అగదాల్లోకి త్రోసి వెయ్యగలదు. కానీ తను తన ప్రేమను మార్చుకోగలడా? తన కెందుకు అంత బలహీనత నిచ్చావు? తానామేను చెలిగా భావించి మాట్లాడగలడా? తనకా శక్తి లేదు. కనీసం -- ఆ శక్తి నైనా ప్రసాదించావా!' మొర పెట్టుకుంటోంది అతని గాయపడ్డ హృదయం.
"అన్నయ్యా! నువ్వింత తెలివి తక్కువగా ప్రవర్తిస్తావనుకోలేదు. ఆనాడు రాజశేఖరం త్యాగం చూసైనా నీ బుద్ది మారుతుందన కొన్నాను. కానీ ఇంత మూర్ఖంగా రజియాను అపార్ధం చేసుకొని అందరి మనసులూ నొప్పిస్తావనుకోలేదు. నీలాంటి వారిని అన్నయ్య గా పొందినందుకు చింతిస్తున్నాను." అంది అరుణ కాస్త కోపంగా.
"అరుణా!' బాధగా మూలిగింది ఆనంద్ హృదయం.
తన ప్రియమైన చెల్లెలు అరుణే తనను అసహ్యించుకొంటుంది. ఇది తను సహించ లేడు. ఇందరిని బాధించే సుఖం తనకు వద్దు. తను రజియా నుండి ఒక చెల్లెలి ప్రేమనే పొంది ఆనందిస్తాననుకొన్నాడు.
"నీ బాధ నర్దం చేసుకో గల నన్నయ్యా! కానీ ఇది ప్రపంచం. ఇక్కడ మన మనుకొన్న వ్యక్తీ ని, మనం కోరుకున్న సుఖాన్ని మన మనుకొన్న రీతిగా పొందలేము. ఆ వ్యక్తీ గానీ, ఆ సుఖం గానీ మనకు లభించబోయే రీతిగా పొందాలి, అప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది. కానీ కోరని సుఖాలను కోరి , ఆశించరాని వస్తువులను ఆశించి, అవి లభ్యం కాని నాడు మొండిగా ప్రవర్తిస్తే నీకు మిగిలిదేమీ ఉండదు ఒక్క బాధ తప్ప. అంతేకాక ఇతరులకు బాధ కలిగించినట్లవుతుంది. అమృత హృదయాలు గల ఇతరులను నొప్పించిన నాడు నీకు జీవితంలో శాంతి, సౌఖ్యం ఏనాడూ లభించవు. మనం ఒక సమాజంలో కొన్ని సూత్రాలకు, అలవాట్లకు కట్టుబడి ఉన్నాము. వాటిని తప్పి చరిస్తే అవమానాలు పాలు కావలసి వస్తుంది. జీవితం లో కూడా మనం కొన్ని అదృశ్య శక్తులకు కట్టుబడి, వాటి చేత నడుపబడుతున్నాము. ఆ అదృశ్య శక్తులలో మంచీ, చెడూ రెండూ ఉన్నాయి. వాటిని విభజించుకొనేందుకు , ఆలోచించుకొనేందుకు మనకు దేవుడు మనసును, ఇచ్చాడు. దాన్ని సరిగా ఉపయోగించుకోలేని నాడు కర్తవ్యాన్ని మరిచి బానిసలమయి పరిస్థితుల నేడుర్కోలేము. అప్పుడు మన జీవితం అధోగతి పాలవుతుంది. మనం కేవలం నటులము. నటించలేక ఎదురు తిరిగినప్పుడు బాధలు పడవలసి వస్తుంది. మనకిచ్చిన పాత్రనే మన నటన కౌశల్యంతో మెప్పించాలి. అప్పుడే పేరు, తృప్తి, సౌఖ్యము, లభిస్తాయి. ఇంతకన్నా ఎక్కువగా నేను నీకు చెప్పే పాటిదాన్ని కాదు. తెలివి గలవాడివైతే నీ బుద్ది మార్చుకొని వారికీ క్షమాపణ చెప్పుకొని ఒక్కసారి రజియాను నన్ను పిలిచినట్లుగా చెల్లెమ్మా అని పిలువు. అప్పుడు చూడు నీలో ఇప్పుడున్న భరించరాని బాధ పోయి మోయలేని ఆనందం కలుగుతుంది. నువ్వలా చేయలేని నాడు నీలో మానవత్వం నశించింది అనుకోవలసిందే!"
"పోనీలే, అరుణా! అనవసరంగా అన్నయ్యను ఎందుకు నొప్పిస్తావు? నాతొ మాట్లాడ కుంటే పోనీలే, అన్నయ్యా! నీ మనసుకు కష్టం కలిగించు కోకు. వస్తాను" అని వెనుదిరిగింది రజియా కళ్ళు తుడుచుకుని.
"ఆగమ్మా, చెల్లీ!"
"నన్నేనా, అన్నయ్యా, పిలిచావు!" నమ్మలేక ఆనందంతో వెనుతిరిగి అడిగింది రజియా.
అరుణ సంతృప్తిగా ఒక శ్వాస విడిచింది.
"ఔనమ్మా, నిన్నే. నన్ను క్షమించు. అనవసరంగా మీ అందరినీ నొప్పించాను."
"అంతమాట లనకన్నయ్యా!"
"లేదు, చెల్లీ! ఈ పాపానికి నిష్కృతి లేదు. స్నేహం లోని విలువను గూడా గుర్తించలేక పోయాను. వాడిని అవమానించి బాధించాను. సహించి కూడా నా సుఖాన్నే కోరాడు. అటువంటి మిత్రుని శాశ్వతంగా పోగొట్టుకుంతానేమోనని భయంగా వుంది."
"లేదన్నయ్యా! రాజ్ నిన్ను తప్పక చేరదీస్తాడు" అంది రజియా కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలుతుండగా.
"ఇంకా ఎందుకు రజియా , ఈ కన్నీరు?' అని ఆనంద్ తన చేత్తో ఆమె కన్నీరు తుడిచి "ఏదీ ఒక్కసారి నవ్వమ్మా!" అన్నాడు.
రజియా నవ్వింది.
ఆ నవ్వు అతనిలో ఒక గ్రుడ్డి దీపాన్ని ఆర్పివేసి కొత్త జ్యోతిని వెలిగించింది.
* * * *
"రాజూ!"
ఉలిక్కిపడ్డాడు రాజ్ ఆ గొంతు విని.
"రాజా, నన్ను క్షమించరా!"
"ఇప్పుడే మొచ్చిందిరా అంత ప్రమాదం?"
"ఈ మాటలతో నన్ను చంపకు. నువ్వు క్షమించాను అంటే కానీ నాకు శాంతి లేదు."
"నీకంతగా వినాలని ఉంటె అలాగే అంటాను. ఇంతకూ ఇప్పుడు వచ్చిన నస్జ్తమేమిటి?"
"ఏమీ జరగని వాడిలా మాట్లాడి నా హృదయాన్ని మరింత గాయపరుస్తున్నావు." తలవంచుకొన్నాడు ఆనంద్.
"ఒరేయ్! ఏమిట్రా ఆడపిల్లలా తలవంచుకుంటావు! తప్పు చేస్తే నువ్వు ఎందుకు నన్ను దండించలేదు అని ధైర్యంగా అడగాలి. అదీ స్నేహం. తెలుసా?"
"పోనీ ఇప్పుడడుగుతున్నాను, చెప్పు."
"అరి పిడుగా! నాకే ఎసరు పెట్టావు అప్పుడే? పద. అలా పోయి వద్దాం."
ఇద్దరూ అక్కడి నుండి షికారు బయలు దేరారు.
"పరీక్షలు రేపే కదా? బాగా చదువు తున్నావా?' అడిగాడు రాజ్.
"ఏం చదువులో , పోరా! ఎంత చదివినా అర్ధ మయ్యి చావవు."
'అంత విసుగైతే ఎలారా? ఇంకా చాలాఉంది ."
"ఏమిటో! వేరొక ఈ ఇంగ్లీషు లిటరేచర్ తీసుకోన్నానా అని ఇప్పుడు ఏడుస్తున్నాను."
"పోనీ, ముందుగానే ఆలోచించలేక పోయ్యావా?"
'అప్పుడంత తెలివే ఏడ్చి ఉంటె ఇప్పుడీ బాధ వుండేది కాదు; అసలు దీనికి భయపడవలసిన ఖర్మ ఏం పట్టింది?"
"మొదటి సంవత్సరమే ఇంత నిరుత్సాహ పడితే పై సంవత్సరం ఏం చేస్తావురా?"
"ఏమిటో ఈ చదువులు? కూడు పెట్టలేని చదువులు. చదువై పోగానే ఉద్యోగం కోసం ప్రాకులాడాలి. అది దొరక్కుంటే ఏడుస్తూ కూర్చోవాలి. ఆ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఒకటి. సెలెక్షన్ ఒకటి. ఇన్ని సంవత్సరాలు చదివిన చదువులూ, పరీక్షలూ కాక ఇంటర్వ్యూ లో తిరిగి మళ్ళీ ఒక పరీక్ష. ఇన్ని బాధలు పడి ఉద్యోగం దొరికినా సుఖం లేదు. మన గోపీ గాడి పని మేలనుకో."
వారు తిన్నగా గోపీ దగ్గరికి వెళ్ళారు. వారిద్దరూ కలిసి రావడం చూసి ఆశ్చర్య పోయి ఏదో అర్ధం చేసుకోన్నాడు గోపీ.
"ఒరే రాస్కెల్! మేం బ్రతికి ఉన్నామన్న మాటే మరిచి పోయ్యావా?' అడిగాడు గంబీరంగా ఆనంద్.
