Previous Page Next Page 
తప్పు పేజి 24

               
                                                       12

    పద్మనాభం వుండి వుండి బావగారు అంటుంటే శ్రీకాంత్ కి తేళ్ళూ జేర్రులూ పాకినట్లు గా వుంటుంది. 'మీరలా పిలవద్దండి. నేను వట్టి శ్రీకాంత్ నే' అనాలని పిస్తుంది . అతనంత చనువుగా కలుపు గోలుగా మాట్లాడుతుంటే తనావిధంగా అతనితో చెప్పడం సభ్యత కాదని తాత్కాలికంగా భరిస్తూ వచ్చాడు.
    మరో వారం రోజుల నాటికి అతను చూడవలసిన ప్రదేశాలు చూడడం పూర్తయిపోయింది. శ్రీకాంత్ అక్కడ వున్నన్ని రోజులూ ముభావంగానే వున్నాడు. ఆగ్రా లో తాజ్ మహాల్ చూస్తున్నప్పుడు వెనక నుంచి యెవరో త్రోయగానే ముందుకు పడేవాడు. హేమనళిని చటుక్కున అతని చేతిని అందుకునేది. 'మీరు పట్టుకోకపోతే నేను పడిపోయే వాడిని. చాలా థాంక్స్.' అన్నాడు కృతజ్ఞత గా చూస్తూ.
    హేమనళిని అతని మొహం లోకి అరనిమిషం చూసి 'మిమ్మల్ని పడిపోనిచ్చే దాన్ని కాను. నాన్నగారు జాగ్రత్తగా చూడమని చెప్పాక నిర్లక్ష్యంగా వదిలేస్తానా.' అన్నది.
    'అంటే?' అని ప్రశ్నించాలను కుని శ్రీకాంత్ పెదాల మధ్యే బిగించేసుకున్నాడు ఆ మాటని.
    రెండు రోజులు ఆగి 'యింక నేను వెడతానండి. ' అన్నాడు వో రోజు ప్రొద్దుటే రామచంద్ర చౌదరి గదిలోకి వెళ్లి.
    అతను కాస్సేపు శ్రీకాంత్ ని 'నీలాంటి వాళ్లు ఎన్నాళ్లు వున్నా వున్నట్లే వుండదోయ్. అక్కడికి వెళ్లి మాత్రం ఏం చేస్తావు. మరో  పది రోజుల కి యెలాగూ రావాలి. అంత మాత్రం దానికి వెళ్ళడం , రావడం వృధా శ్రమ కద.' అన్నాడు.
    'అది కదండీ అమ్మ బెంగ పెట్టుకుంటుంది.'
    హేమనళిని కిలకిలా నవ్వింది. 'నాన్నా యింకా యియన కిడ్డీ యేనండి. యెక్కడైనా చిన్న పిల్లలూ, ఆడపిల్లలూ అమ్మ కోసం బెంగ పెట్టుకుని కలవరిస్తారు కానీ యిదేమిటండి యీయన.'
    శ్రీకాంత్ తలెత్తి ఆ పిల్ల వైపు చూశాడు. ఆ పిల్ల కళ్లల్లో అయస్కాంత శక్తులతో యెదుటి మనుష్యుల్ని చిత్తూ చేసేస్తుంది. వెంటనే బుర్ర వొంచేసుకుని 'మా అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంటుంది. నేను వెళ్ళకపొతే తిండి కూడా తినదండి.' అన్నాడు.
    'అంతా గాస్ నాన్నగారూ. అమ్మని అడ్డం వేసుకుంటూన్నారాయన.' శ్రీకాంత్ వుక్రోషంగా మాట్లాడుతున్న కొలదీ హేమనళిని రెచ్చగొడుతోంది. అది గమనించి అతను కాస్సేపు వూరుకుని 'నేను రేపు వెళ్ళి పోతానండి.' అన్నాడు.
    రామచంద్ర చౌదరి యెదిగిన కూతురి పక్కనే నిలుచున్న ఆ యువకుడిని చూస్తూ అంతవరకూ వూహ గానాలు చేయసాగాడు. శ్రీకాంత్ ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పగానే తేరుకుని 'అలాగే నోయ్ వెళ్ళగానే మాత్రం వుత్తరం రాయి. లేకపోతె మీ నాన్నతో చెప్పాల్సి వస్తుంది.' అన్నాడు.
    శ్రీకాంత్ 'వూ' కొట్టి వూరుకున్నాడు.
    కలకత్తా కి అతను ప్రయాణం అవుతుంటే యేకాంతం గా వున్న అతడికి దగ్గరగా వచ్చి చనువుగా పక్కనే కూర్చుంది హేమ నళిని. అతను ఆ పిల్ల వైపు చూశాడు. కదిలీ కదలనట్లు ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు దోబూచులాడ సాగాయి. అతని వైపు చూస్తూ 'మీరు యీ డిల్లీ స్టేషను వదిలాక మమ్మల్ని అనుక్షణం గుర్తు పెట్టుకోవాలనేమీ రూల్ లేదు. మా యింటికి నాకు జ్ఞానం వచ్చాక యెంతో మంది రావడం యెరుగుదును. అందరూ యేరు దాటినా వాళ్ళే మీరు స్నేహం పూర్వకంగా ఉత్తరాలు రాస్తుండండి. నాన్నగారు మీ నాన్నగారితో ఏదో చెప్పాలను కుంటున్నట్లు అమ్మతో అనగా విన్నాను. యీపాటికి అయన వుత్తరం కూడా రాసేసి వుంటారు.'

                                            
    'పైకి అలా మాట్లాడినా నాన్నగారికి తెలుసును యెవరికి యెంత వరకూ అపేక్ష నురాగాలు పంచి యివ్వాలో. మిమ్మల్ని చూస్తూనే మీకు ప్రత్యేకం అయిన స్థానాన్ని యిచ్చారు అయన. మీ స్నేహం మరుపు రానిది. మేము జ్ఞాపకం వుంచుకున్నట్లే మమ్మల్ని మీరు గుర్తు చేసుకోవాలి. అని నిర్భందించడం అవివేకం. మీరు........' హేమనళిని అంత వరకూ అని ఆపేసి గబుక్కున బుర్ర వొంచేసుకుంది. ఆవిధంగా తల వంచడం తో ముత్యాల్లా కన్నీటి చుక్కలు ఒకతోక్కటే రాలి నల్లని చీర మీద తెల్లగా నక్షత్రాల్లా పడి మెరవసాగాయి.
    శ్రీకాంత్ ఒక్క సెకండు కాలం నివ్వెర పోయాడు. తరువాత తల తిప్పి విదిలించి 'మీరు యెందుకిలా అయిపోతున్నారు?' అని ప్రశ్నించాడు.
    హేమనళిని నవ్వింది. ఆ పిల్ల యెప్పుడూ నవ్వుతూనే వుంటుంది. కొందరు నవ్వినా ఆ నవ్వులో అనేక అర్ధాలు జోప్పిస్తారు. యేడ్చి మొత్తుకుని తమ బాధల్నీ బాహాటంగా వ్యక్త పరిచే స్త్రీలు ప్రపంచం లో నూటికి తొంబై తొమ్మిది మంది వుంటారు. కానీ హేమ నళిని లాంటి వాళ్ళు నవ్వుతూ నే గుండె కోతల్ని తీయగా భరిస్తారు. ఆ పిల్ల నవ్వులో ప్రపంచం లో విషాదం అంతా మూటగట్టి శ్రీకాంత్ ముందు పరిచినట్ల యింది. ఆ విధంగా రెప్ప వెయకుండా చూస్తూ వుంటే అక్కడ హేమ నళిని మాయం అయిపోయి దీనంగా చూస్తున్న తల్లి కనిపించింది. 'అమ్మా,' అనాలని అనుకున్నాడు. కానీ అనలేక పోయాడు.
    శ్రీకాంత్ వైపు చూసి లేచి నిలుచుంటూ హేమనళిని అన్నది. 'మీరు యింటికి వెళ్ళేనాటికీ మీ నాన్నగారు శుభవార్త అందజేస్తారు. దేవుడు మంచితనం యింతా అంతా కాదని యిప్పుడు తోస్తుంది.'
    'మీరనేది యేమిటో నాకు అర్ధం కావడం లేదు.'
    'అందుకే అన్నాను నేను. స్టిల్ యూ ఆర్ ఏ కిడ్డీ అని.'
    'నేనేం పాపాయిని కాను.'
    'రోషం దేనికండి. చెప్పింది అర్ధం చేసుకోలేరు. పోనీ దాని అర్ధం యేమిటీ అని విపులంగా అడగరు. చిన్నపిల్లలు యిలా కాక మరెలా వుంటారు?'
    'నీలా' శ్రీకాంత్ చిరాకుగా అన్నాడు.
    హేమనళిని మొహం నిండా వెన్నెల లాంటి నవ్వు పులుముకుంది. 'మీరలా అంటుంటే యెంత బావుందో తెలుసా'
    'యేమిటి బావుండడం నన్ను సతయించవద్దు. వూరకే కిడ్డ్డీ అని చైల్డ్ లనీ మీ నాన్న దగ్గర కూడా నన్ను యిన్సల్ట్ చేస్తుంటే వూరుకున్నాను యిన్నాళ్ళూ....'
    'యింకా అంటాననుకోండి. ఒకవేళ. అప్పుడేం చేస్తారు?'
    'అప్పుడేం చేస్తానా?' శ్రీకాంత్ కి ఆపైన యేమనాలో తెలియలేదు. అతనికి వెంటనే గంగ జ్ఞాపకం వచ్చింది.
    'గంగ అయితే తన్ని తగలేద్దును. నువ్వు నాకు యేమీ కావు? నిన్నేం చేయగలను?' అనుకున్నాడు మనసులో.
    'చెప్పరేం ? అప్పుడేం చేస్తారు ?' హేమ నళిని రెట్టించింది.
    'యేవీ చేయను?' శ్రీకాంత్ గంబీరంగా సూట్ కేస్ సర్దుకోవడం లో నిమగ్నుడై పోయాడు.
    అతను రైలు యేక్కాక కనుమరుగయ్యే వరకూ ఫ్లాట్ ఫాం మీద నిలబడి చేయి గాలిలోకి వూపుతూనే వున్నారు అన్నా చెల్లెళ్ళు యిద్దరూ.
    రైలు అంతకంతకు దూరం అయిపోతుంటే పద్మనాభం తండ్రి వైపు తిరిగి 'కుర్రాడు చాలా తెలివైన వాడే నాన్న గారూ. మంచి అభివృద్ధి లోకి వస్తాడు. చెల్లాయి అదృష్ట వంతురాలు' అన్నాడు.
    రామచంద్ర చౌదరి తనలో తనే నవ్వుకున్నాడు. 'యిన్నేళ్ళ సర్వీసు లోనూ యెవరు యెటువంటి వాళ్లో తెలుసుకోలేనా పద్మా. యేమ్మా హేమా అబ్బాయి బావున్నాడు కదూ.' అని అడిగాడు దారిలో.
    హేమనళిని బుర్ర వొంచుకుని పమిట కొంగుని వెలికి చుడుతూ ఆలోచనలో పడిపోయింది.
    పద్మనాభం చెల్లెల్ని క్రీగంట గమనిస్తూ ' దానికి యిష్టం అయింది కనుకే నోరు మూసుకుంది నాన్నగారు. దానికే యీ పెళ్ళి యిష్టం లేకపోతె తోక తొక్కిన త్రాచులా మన మీదికి యెగిరి పడేది యీ పాటికి.' అన్నాడు.
    'ఛ? అతనికి చెల్లెలు కూడా ఉందిట. అతనిలాగే వుంటుందిట. నువ్వూ చేసుకో' అన్నది హేమనళిని.
    పద్మనాభం నవ్వి 'వుడుక్కోకు చెల్లాయి. అతనికి చేల్లెలేమీ లేదు. తమ్ముడున్నాడు. పోనీ చేసుకుందాం అనుకున్నా అతనికి పెళ్ళి అయిపొయింది.' అన్నాడు.
    రామచంద్ర చౌదరి పిల్లల మాటలు వింటూ కారుని యింటి దారి పట్టించాడు.

                            *    *    *    *
    కలకత్తా చేరుకునేవరకూ శ్రీకాంత్ పరిపరివిధాల ఆలోచిస్తూనే వున్నాడు. ఈ వుద్యోగం లో చేరినట్లయితే తిరిగి రామచంద్ర చౌదరి కుటుంబంతో స్నేహం పెంచుకోవాలి. తను యిష్టపడక పోయినా తప్పించుకునేందుకు వేరే మార్గం లేదు. తండ్రి శిలా శాసనం లాంటి మాటలకి తను ఎదురాడలేడు. పోనీ స్నేహంగా వుంటే ఏం? అనుకుంటే ఆ యింటిల్లి పాదీ చిత్రంగా మాట్లాడుతున్నారు. హేమ నళిని కళ్ళల్లో నీళ్ళు అర్ధం చేసుకో లేని పసివాడు కాడు తను. కానీ తన మనసూ శరీరమూ యేకం అయి గంగ పరిష్వంగం కోసం యెదురు చూస్తూ వుంటే ఈ పిల్ల నెలా చేసుకోవడం.
    ప్రతి వ్యక్తీ చూసిన వెంటనే స్పందించే మనసు కాదె తనది. గంగ .....అతని వూహల పల్లకి లో గంగ పెళ్లి కూతురై కూర్చుని వుంది. గంగ కి యెదురుగా అతను కూర్చుని క్రీ గంట సిగ్గుతో మొగ్గ వలె ముడుచుకు పోయిన గంగని చూస్తూ పారవశ్యం చెంద సాగాడు. రైలు కుదుపుతో స్టేషన్ లో ఆగినప్పుడల్లా అతని భావాలు చెదిరి పోయేవి. హేమ నళిని ని చూసినప్పుడు అతనికి తల్లి సాక్షాత్తూ గుర్తుకు వచ్చేది. తల్లి తరవాత ఆ స్థానాన్ని చెల్లెలో, అక్కో భర్తీ చేస్తుందని అంటారు. హేమ నళిని అతని మనో వీధిలో సోదరిని మించి పోయింది. యేమైనా సరే డిల్లీ వెళ్ళకూడదని నిర్ణయించు కున్నాడు అతను దృడంగా.
    తండ్రి ముందుగా యెదురు వచ్చి 'యింటర్వ్యూ యెలా జరిగింది?' అని ప్రశ్న వేశాడు.
    శ్రీకాంత్ తండ్రికి సమాధానం యిచ్చి తల్లి దగ్గరికి వెళ్ళాడు. కొడుకుని చూసి గోవింద 'వచ్చావా' అన్నది సంతోషంగా.
    అతను తిరిగి యిదివరకు తను పని చేస్తున్న కంపెనీ కి వెళ్ళడంతో చటర్జీ సంశయంగా అడిగాడు. ఏం మళ్ళీ అదే కంపెనీ లో చేరావు? రేపు నువ్వు సెలెక్టు అయినట్లు వచ్చి జాయిన్ అవమంటే అప్పుడు యిది మళ్ళీ వదులు కోవలసిందే కదా. ఒక్కసారే అందులో చేరుతే పోలేదా.'
    'నేను డిల్లీ వెళ్ళను నాన్నగారూ.' శ్రీకాంత్ మాటకి చటర్జీ దిగ్భ్రాంతుడయాడు. కనుబొమ్మలు ముడివేసి 'ఏం? ఎందుకనీ?' అని అడిగాడు.
    'నాకా వుద్యోగం నచ్చలేదు నాన్నగారు,'
    'ఫారిన్ పంపుతారు వాళ్ళు. ఫారిన్ నుంచి వచ్చాక జీతం యెక్కువ చేస్తారు. డబ్బుతో వుంది శ్రీకాంత్ ఈ ప్రపంచం. నువ్వేందుకీ అవకాశాన్ని కాలదన్నుకుంటున్నావో నాకు అవగాహన కావడం లేదు."
    '................'
    'మాట్లాడవేం శ్రీకాంత్. అదృష్టవంతులకి తప్ప యిలాంటి అవకాశాలు అందరికీ దొరకవు.."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS