"పదమూడు పాటలా! ఇక కథేముంటుందయ్యా సినిమాలో?"
"కథేమీ లేదు సార్! ఈ పాటలకి కుర్రాళ్ళతోపాటు ముసలాళ్ళు కూడా థియేటర్లో గోలగోలగా డాన్సులు చేస్తున్నారు. అయిదుగురిలో ఓ హీరోను ముసలాడుగా పెట్టడం కూడా ఇందుకోసమే"
"సరే చివరికేమిటవుతది?"
"ఐదుగురు హీరోలూ హీరోయిన్ని వేరు వేరు సందర్భాలలో రక్షిస్తారు. ఆ అమ్మాయికి తెలుస్తుంది. ఐదుగురూ తనని ప్రేమిస్తున్నారని. వెంటనే తన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పాత పేపర్లవాడికి అమ్మేసి, కనిపించిన ప్రతివాడి దగ్గరా చెయ్యి చాచి....."
"అడుక్కుంటుందా?"
"ఛ! కాదు సార్! ప్రతి వాడిదగ్గరా చెయ్యిచాచి ఐదు వేళ్ళలో ఒక వేలు పట్టుకోమని అడుగుతూంటుంది. అందరూ ఈమె ఎలాగైనా ఓ ఇంటిది కావాలనే సహృదయంతో తలోచెయ్యీ వేసి తలోవేలూపట్టుకుంటూంటారు. హీరోయిన్ కు ఎంతకీ లెక్కతేలదు. ఎంతెక్కువ మంది ఓ వేలు పట్టుకుంటే వాణ్ని చేసుకుందామని. ఎన్నాళ్ళు గడిచినా ఎవరిని కట్టుకోవాలో అర్ధంకాదు. కూడికలు, తీసివేతలూ, భాగాహారాలూ చేస్తుంటుంది. చివరలో విలన్ కుట్రమూలంగా పెద్ద ఫైటింగ్ జరిగి, గాయపడిన ఐదుగుర్నీ ఓ ట్రాక్టరులో పడేసి డ్రైవ్ చేసుకుంటూ దూరతీరాలకు వెళ్ళిపోతుంది. శుభం!" చెప్పటం ఆపాడు రైటరు.
పెదరాయుడు నిస్సత్తువగా లేచి నిలబడ్డాడు. చినరాయుడు వైపు చూసి, గేటువైపు నడవసాగాడు. చినరాయుడు కూడా ఫాలో అయ్యాడు.
వెనుకనుంచి డబ్బింగ్ రైటర్ కేక పెట్టాడు. "సార్! ఎక్కడికెడుతున్నారు?"
పెదరాయుడు చినరాయుడితో అన్నాడు. "బావా! ఈరోజే రెండు టిక్కెట్లు రిజర్వు చేయ్!"
"ఎక్కడికి బావా! బొంబాయికా?"
"కాదు. దూరతీరాలకు"
* * *
బావా బామ్మర్దులిద్దరూ లగేజి సర్దుకుంటున్నారు. డబ్బింగ్ పిక్చరు తీయాలని ఆంధ్రానుంచి వీళ్ళొచ్చినట్లు ఆనోటా ఈనోటా తెలిసి ఒక ప్రొడక్షన్ మేనేజర్ చనువుగా తలుపు తట్టి లోపలికొచ్చాడు. అతని పక్కనే ఓ ముఫ్ఫై ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు.
"నమస్కారములు సార్!" అన్నాడు అవసరమైనదానికంటే ఎక్కువగా నవ్వేస్తూ.
పెదరాయుడు ఎవరు నువ్వు అన్నట్టు చూశాడు.
"నా పేరు వేళాయుధం. ఇతను బొంబాయి నుంచి పనిమీద వచ్చాడు. అక్కడ ఇంగ్లీషు పిక్చర్లకి హిందీలో డబ్బింగు స్క్రిప్టులు రాస్తూంటాడు. మన తెలుగువాడే సార్!" అన్నాడు.
"అయితే ఏమిట్ట?"
"మీరు డబ్బింగ్ సినిమా చెయ్యాలంటే ఇంగ్లీషు నుంచీ తెలుగులోకి చెయ్యండి సార్! గొప్పగా హిట్టవుతుంది! మావాడు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు!" అన్నాడు.
వచ్చిన వాళ్ళను పొమ్మని అనలేక కూర్చోమని చెప్పి కాఫీలు తెప్పించాడు పెదరాయుడు.
"ఇప్పుడు చెప్పబ్బీ బొంబాయిలో ఎన్ని సినిమాలు డబ్బింగు చేశావు?" డబ్బింగు మనిషిని అడిగాడు.
"చాలా ఇంగ్లీషు సినిమాలు హిందీలోకి అనువాదం చేశాను సార్!" అని సినిమాల లిస్టు చెప్పాడు.
"నువ్వేమనుకోకు-నేను కొంచెం కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడతా! ఓ ఇంగ్లీషు సినిమా ఫ్యామిలీ టైపు అయితే కుదరదు కదా! ఎవరూ సూడరు కదా ఇక్కడ? యాక్షన్ సినిమాలైతే అందరూ సూత్తారు కదా! సరే, పాయింటుకొస్తాను. మరలాంటి సినిమాల్లో హీరో బోలెడుమంది విలన్లతో ఫైటింగు సెయ్యాల. అది కూడా మన సిన్మాల్లోలాగా ఒంటిచేత్తో వందమందిని మూతిమీద కొట్టీ, దవడకింద కొట్టి అరగంట సేపు ఫైటింగు సెయ్యడు కదా! తనకో, తన పెళ్ళానికో, తన బిడ్డకో, లేక దేశంకో అన్యాయం చేసినోళ్ళని మిషన్ గన్నుతో పేల్చిపారెయ్యటమే! అవునా?"
"అవున్సార్!"
"మరి అలా విలన్లని కాల్చిపారేసేవోడు గాంధీగారిలా శాంతంగా కాల్చడు కదా! కాల్చేసే ముందు ఏదో బూతు మాట అని, టపటపమని పేల్చేయాల"
"అవున్సార్!"
"తెలుగులో అయితే సెన్సారొప్పుకోదు కాబట్టి, 'రాస్కెల్, బ్రూట్' అని మాత్రం తిడతారు. అదే ఇంగ్లీషులో అయితే..." అని చినరాయుడికేసి తిరిగి "ఏంటి బావా, ఆ ఇంగ్లీషు డైలాగులు" అని అడిగాడు.
"యు బాస్టర్డ్ అంటారు. యూ సన్నాఫె బిచ్ అని కూడా అంటారు!" చినరాయుడు చెప్పాడు.
"మరి దానర్ధం పెద్ద బూతుమాటే కదా! మరి దానికేం రాస్తావ్?"
బొంబాయిబాబు ఇబ్బందిగా చూశాడు.
"సాధ్యమైనంత వరకూ మామూలు మాటలు రాస్తాను సార్!" అన్నాడు.
"మరి పెదాలు వేరే కదులుతయ్యే! నువ్వు రాసే మాటకి మూమెంటుండొద్దూ? అదే క్లోజప్పయితే ఇంకా తప్పనిసరి! తెరమీద భయంకరమైన రేపు సీన్లూ, బాంబులు వెయ్యడాలూ, మిషన్ గన్ల మోతలూ నిండి వుంటే నువ్వు పయిత్రంగా రాస్తానంటే ఎలా? దానికి దీనికీ లంకె కుదరొద్దూ?"
బొంబాయి బాబు నిజాయితీగా ఒప్పుకున్నాడు.
వేళాయుధం కలగజేసుకున్నాడు. "సారూ! అదెలాగో మానేజ్ చేసుకోవచ్చు. మీరు ఊఁ అంటే ఆ హీరోని ఇండియా పిలిపించి నాలుగైదు డ్యూయెట్లు తీసి అతికిస్తే బాగా ఆడుతుంది సారూ!" అన్నాడు.
పెదరాయుడికి ఒళ్ళు మండింది. అయినా శాంతంగానే "ఆ హీరో ఇండియా వచ్చినట్లు కథలో లేకపోతే?" అడిగాడు.
"భలేవోరు స్వామీ! ఆడు ఇండియా ఎందుకొస్తాడు? డ్రీమ్ సాంగ్స్!" అన్నాడు వేళాయుధం.
"అంటే అమెరికావోడికి ఇండియా కలలొస్తాయా?"
"ఆమా సార్! మనం అమెరికా బోయినట్లు కలలు రావడంలా?"
పెదరాయుడు లేచి నిల్చున్నాడు. "సూడు ప్రొడక్షన్ మానేజరూ! అసలు ఇందాకే కథ అయిపోయింది. అయినా నువ్వొచ్చావు గాబట్టి కొంచెం సాగదియ్యాల్సి వచ్చింది. ఇక నాతో డిస్కర్షన్ పెట్టుకోమాక! ఇప్పటికే ఎనిమిది పేజీలు దాటేటట్టుంది. నాది మాటంటే మాటే! ఇంకొక్క లైను కూడా ఎక్కువ మాట్లాడేది లేదు. వెళ్ళిరండి!" అన్నాడు పెదరాయుడు.
ఇద్దరూ వెళ్ళిపోయారు. చినరాయుడు బావగారి కుశలబుద్ధిని, వ్యవహారదక్షతనూ చూసి ముచ్చటపడిపోయాడు.
* * *
