అప్పుడే పోలీసు స్టేషన్ కు వచ్చిన రాధ జగనాథాన్ని చూసి గడపలోనే నిల్చుండిపోయింది.
ఇరవై సంవత్సరాల జీవితాన్ని ధారపోసి నా బిడ్డను అహింసా మూర్తిగా తీర్చిదిద్దాను. వాడు ఏ ప్రాణికి హాని చెయ్యలేడు. నా రవి హంతకుడు కావడానికి వీల్లేదు. ప్రపంచం అంతా కోడై కూసినా నేను నమ్మను ఇన్ స్పెక్టర్" ఉద్రేకంగా అన్నాడు అతను.
"అవన్నీ నా దగ్గిర చెప్పి ప్రయోజనం లేదని చెప్పావు గదండీ? ఆ సాక్షులు ఎక్కడ వున్నారో వెదకండి. వాళ్ళు దొరికితే మీ రవిని నిరపరాధిగా ప్రూవ్ చెయ్యవచ్చు" అంటూ ఇన్ స్పెక్టర్ లేచి నిలబడ్డాడు.
జగన్నాథం కూడా లేచి నిలబడ్డాడు.
రాధాదేవి గిర్రున తిరిగి కారులో కూర్చుంది. ఆమె మస్తిష్కంలో రైళ్ళు ఢీకొంటున్నాయి. తల పగిలిపోతోంది. సీట్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది.
అయితే రవి జగన్నాథం కొడుకా? ఇంత కాలానికి జగన్నాథం మీద పగ సాధించే అవకాశం లభించింది. దాన్ని జారిపోనివ్వకూడదు.
కాని...రవి మంచి కుర్రాడు. అతను ప్రాణాలకు తెగించి పరాయి బిడ్డను రక్షించాడు. తను 'నూరేళ్ళు వర్ధిల్లు' అని దీవించింది. తండ్రి చేసిన పాపానికి ఆ యువకుడ్ని బలి చేస్తుందా? హే భగవాన్! ఏమిటి తనకీ పరీక్ష?
కారు ఇంటి ముందు ఆగింది. రాధాదేవి పిచ్చిదానిలా తన గదిలోకి పరుగు తీసింది. భర్త ఫోటో ముందు నిలబడింది. భర్త ముఖంలోకి చూసింది. కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళు... ఆ ముఖం...ప్రతీకారాన్ని కోరుతున్నట్టు అనిపించింది.
అంతవరకూ కుమిలి కుమిలి రాజుతున్న పగ నాలుకలు చాచి విజృంభించింది. మందకొడిగా పడివున్న ద్వేషం కోరలు చాచి బుసలు కొట్టింది. అణువణువులో ప్రతీకార జ్వాల భగ్గుమంది.
ఆమె కళ్ళముందు గతం ముసుగు తొలగించింది. భర్త ఆర్తనాదం, తన దీనాలాపన, జగన్నాథం అట్టహాసం, చెవుల్లో గింగురుమన్నాయి. కాలనాగులా విషం కక్కుతున్న జగన్నాథం నిలువెత్తున నిల్చుని కన్పించాడు.
"నీ ఆత్మ శాంతించే రోజు___నా గుండెల్లో భగభగ మండుతున్న అగ్ని చల్లారే రోజు... ఎంతో దూరం లేదు. కన్నకొడుకు చెయ్యని అపరాధానికి ఉరికంబం ఎక్కినప్పుడు జగన్నాథం పడే దారుణ వేదన చూసేరోజు దగ్గిర్లోనే వుంది" ఈ మాటల్నే తిరిగి తిరిగి ఉచ్చరించింది రాధాదేవి.
రాధాదేవి బయటకి వచ్చి హిప్పీరావూ, హేమ వున్న గది తలుపులు కొట్టింది.
హిప్పీరావు తలుపులు తెరిచాడు. రాధాదేవి రూపం చూసి భయపడి ఒక అడుగు వెనక్కు వేశాడు.
"మీరు వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి"
హిప్పీరావు అయోమయంగా రాధాదేవి ముఖంలోకి చూస్తూ నిల్చున్నాడు. హేమ బెదరి పోయింది.
"ఏమిటలా చూస్తారు? వెంటనే సామాన్లు సర్దుకోండి" అంటూ లోపలకు వెళ్ళి ఐదు నిముషాల్లో తిరిగి వచ్చింది.
హిప్పీరావూ, హేమ నిల్చున్న చోటే చలన రహితంగా వున్నారు.
"మీ మంచికే చెబుతున్నాను. ఇక మీరు ఒక్క క్షణం ఇక్కడ వుండటానికి వీల్లేదు, హేమ తండ్రి మిమ్మల్ని వెతుకుతున్నాడట. ఇక్కడ వున్నట్టు తెలిస్తే బాగుండదు, ముందు మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్ళి చేసుకోండి. అన్ని విషయాలూ చక్కబడ్డాక హేమ తండ్రికి నేను నచ్చచెప్పి మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తాను. ఎక్కడ వున్నా ఉత్తరాలు మాత్రం రాస్తూ వుండండి. ఈ నెయ్యి రూపాయలూ ఖర్చులకి వుంచండి!" అంటూ రాధాదేవి హిప్పీరావు చేతిలో వెయ్యి రూపాయల కట్ట పెట్టింది.
"మరి! బేబీ!" ఎలాగో తేరుకొని ప్రశ్నించింది హేమ.
ఓ క్షణం ఆలోచించి "బేబీ నా దగ్గరే వుంటుంది. మీరు వెళ్ళి సరదాగా ఊళ్ళు తిరిగి రండి. వెంటనే బయలుదేరండి!" హెచ్చరిస్తున్నట్టు అన్నది రాధాదేవి.
హిప్పీరావూ, హేమ వెళ్ళిపోయారు.
రాధాదేవి బేబీని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. బేబీని తీసుకొని కాన్వెంటుకు వెళ్ళి హాస్టల్లో చేర్పించి వచ్చింది.
శరీరంలోని నరాలన్నీ విచ్చిపోతూ వుంటే. మంచంమీద అలసటగా వాలిపోయి కళ్ళు మూసుకుని పడుకుంది రాధాదేవి.
19
రజని మృత్యువు మూర్తినీ, అతని భార్యను బాగా కృంగదీసింది. రజని తల్లి ఏడ్చి ఏడ్చి, చివరకు ఏడ్చే ఓపిక కూడా లేక బల్లిలా మంచానికి అతుక్కుపోయింది. మూర్తి ఒక్కసారిగా పదేళ్ళు పైన పడినట్టు కన్పిస్తున్నాడు.
"వాడు చిన్నప్పటి నుంచీ దుర్మార్గుడే. ఇంట్లో పెట్టి నిప్పు అంటించినప్పుడే అనుకున్నాను...వీడు ఎప్పుడో ఒకనాడు నా బిడ్డను పొట్టన పెట్టుకుంటాడని. ఆయన నన్ను నోరెత్తనిచ్చాడా? ఆ మనిషి వాళ్ళను నమ్మి నా కడుపుకు చిచ్చు పెట్టాడు" మంచంలో పడుకుని రజని తల్లి నీరసంగా అస్తమానం గొణుగుతూ వుంటుంది.
మూర్తి వింటూనే ఉంటాడు. కాని పెదవి కదపడు. లోలోపల కృంగిపోతున్నాడు.
ప్రకాశ్ అప్పుడప్పుడూ వచ్చిపోతూ ఉంటాడు. ఆ కూర్చున్నంతసేపూ జగన్నాధాన్నీ, రవినీ దూషిస్తూనే ఉంటాడు. మూర్తి అన్నీ మౌనంగా వింటాడు ఉలకడు, పలకడు.
విని విని ఒకరోజు మూర్తి "ప్రకాశ్! నీకు పుణ్యం ఉంటుంది ఇంకెప్పుడూ వాళ్ళ పేర్లు నా ముందు ఎత్తకు. నేను నడుం విరిగిన పామును, నన్ను రెచ్చగొట్టి ఏం ప్రయోజనం" అన్నాడు.
