Previous Page Next Page 
ది సెల్ పేజి 24


                                                                    అనుభవం

    "నమస్కారం బాబు"
    ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు గుమ్మం దగ్గర నిలబడి అన్న మాటకి తలెత్తి చూసాడు నవీన రచయిత రావు.
    ఆ గొంతు మునుపెన్నడు విన్నట్టు లేదు. అతన్నింతకుముందు ఎక్కడా చూసినట్టు లేదు.
    సరాసరి వసారాలోకి వచ్చి రావు యిష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు వచ్చిన ముసలాయన.
    "మీరు ఎవరు...ఎందుకోసం వచ్చారు" ముసలాయనపై విసుక్కుంటూ అడిగాడు రావు.
    ముసలాయన ఓ నిట్టూర్పు విడిచి తన పేరు వివరాలు చెప్పాడు.
    "మీదగ్గర శృంగారం జాలువారే నవలలు ఏవన్నా వుంటే ఇవ్వండి" అరవైఏళ్ళ వృద్ధుడు అడిగిందానికి నిర్ఘాంతపోయాడు రావు.
    తన శృంగార భూయిష్ట రచనలు యువతీ యువకులనే గాక వయస్సు మళ్ళినవారిని గూడ ఉత్తేజితులను చేస్తున్నాయనే సంగతి అతనికి గర్వకారణమైంది.
    అంతలోనే రావుకి ఓ సంశయం కలిగింది. ఇంత ముసలివాడికి శృంగార రచనలు ఎలా నచ్చాయి? అయినా శృంగారానికి వయసుతో పనిలేదోమో? అనిపించింది ఆ క్షణంలో రావుకి.
    "మీకు పెళ్ళయిందా?" ముసలాయన అసందర్భంగా వేసిన ప్రశ్నకి ఓ క్షణం కోపం వచ్చింది రావుకి.
    ముసలాడు అది గమనించనట్లు "అబ్బే వూరికే అడుగుతున్నాను. మీ రచన లన్నింటిలోనూ శృంగారానికి ప్రాధాన్యతని ఇస్తారుకదా! పెళ్ళి కాకుండా బ్రహ్మచారిగా ఎలా రాయగలరా అని! పెళ్ళి అయ్యిందో లేదో తెలుసుకుందామని అడిగాను..."
    రావు అతని ప్రశ్నకు సమాధానం ఏమీ చెప్పలేదు.
    "మీరు ఇటీవలికాలంలో రాసిన "పొరిగింటాయన" నవలలో భర్త యింట్లో లేనప్పుడు పొరిగింటాయనతో భార్య ప్రేమకలాపాలు సాగించినట్లు, అది తెలిసికూడా భర్త ఏమీ తెలియనట్లు వూరుకున్నట్లు రాశారు. మీరు అతని స్థానంలో వుంటే..." ముసలాయన ఇంకా ఏదో మాట్లాడబోతుంటే
    వద్దని వారించి టేబిల్ మీదవున్న తన నవలలని మూడింటిని అతనిచేతిలో పెట్టి వెళ్ళండంటూ నమస్కారం పెట్టాడు రావు.
    ముసలాయన "అలానే, నేను వెళతాను, నేనిక రాకుండా ఇకనుంచి ఆలోచించి రాయండి" అంటూ గుమ్మం దాటాడు.
    ముసలాయన అన్న మాటలను అర్థంచేసుకోవటానికి ప్రయత్నించాడు రావు.
    రోడ్డుప్రక్కనవున్న డ్రయినేజిలో రావు చూస్తుండగనే రావు ఇచ్చిన మూడు నవలలు కసిగా విసిరాడు ముసలాయన.
    అప్పుడు అర్థం అయ్యింది రావుకి. ముసలాయన పేరు వివరాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అతనొక ప్రఖ్యాత రచయిత అనీ తన చవకబారు సాహిత్యం చదివి, తనకి కనువిప్పు కలిగించటానికే వచ్చాడని. కొత్తగా రాసిన నవల కాగితాలు, తీసి డ్రెయినేజిలోకి విసిరాడు రచయిత రావు, బహుశ రావుగా జీవిద్దామన్న భావనతో....

                                   *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS