Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 24


    వేమసాని ఆ యుద్ధాన్ని ఆపి మరణించిన రాజు వ్రాసిన శాసనాన్ని చదివింది. దాని ప్రకారం కొమరగిరి కొండవీడు ప్రభువు అతడు అసమర్థుడైనప్పుడే కోమటి వేముడు ప్రభువౌతాడు. అత్తమీది గౌరవంతో కోమటివేముడు తలవంచాడు. తగవు ఆగిపోయింది.
    అప్పటికే ఎండ నెత్తిమీది కొచ్చింది. కైమిత్రుడు రొప్పుతూ ఇహ లేద్దామా అన్నాడు.
    ప్రొద్దుకూకుతున్న వేళకు బంగ్లా చేరాము. నేను బంగ్లాలో కాలుపెడుతూనే ఆశ్చర్యపోయాను. వరండాలో ఎవరో ఒక ముసలిపండు కుర్చీలో కూర్చుని కళ్ళు చికిలించి చూస్తున్నాడు. అతని కళ్ళు కనిపిస్తున్నాయో లేదో చూచేవాళ్ళకు తెలియట్లేదు. నిశ్చలంగా కూర్చున్నాడు. ఓ యువకుడు వరండాలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
    నేను సభ్యత కోసం విష్ చేశాను. అతడు దగ్గరగా వచ్చాడు. చూస్తే నార్తిండియాలో పుట్టిపెరిగిన లక్షణాలు కనిపిస్తున్నాయి. చక్కని హిందీ శుభ్రమైన ఇంగ్లీషూ మాట్లాడుతున్నాడు.
    అవ్వను ఏకాకిని చేసి వెళ్ళిపోయిన ఆ బ్రాహ్మణుడు బ్రతికి వుంటే ఆ ముసలి వ్యక్తి అంతే ఉంటాడని వూహిస్తున్నాను. నన్ను పసిగట్టాడు కాబోలు ఆ యువకుడు "మా నాన్నగారు" అంటూ పరిచయం చేశాడు.
    "మీరు ఎక్కడి వారు?" అని ప్రశ్నించాను.
    "మాది కాశీ దగ్గర ఓ పల్లెటూరు. అయితే ఢిల్లీలో ఉంటున్నాం. మా నాన్నగారు ఎం.సి. కదండీ!" అన్నాడా కుర్రాడు.
    "అవ్వ టూరిస్టులందర్నీ పలకరించే అలవాటు ప్రకారం ఆ ముసలాయన దగ్గర చేరింది.
    "మందేవూరు బాబయ్యా" అని అడిగింది. ఉపక్రమణగా ఆయన ఏనాడో మర్చిపోయిన తెలుగు పదాలను కూడదీసుకుంటూ "ఒకప్పుడు తెలుగుదేశమే! ఇప్పుడు మాది ఢిల్లీ" అన్నారు. వాళ్ళ నాన్నగారు తెలుగు మాట్లాడటం చూచి ఆశ్చర్యపోయాడతడు. డాడీ! యూనో తెలుగు ఆల్సో? అంటూ ప్రశ్నించాడు. డాడీ తలూపాడు. ఆయన చూపులు సూటిగా అరణ్య గర్భంలోకి చొచ్చుకు పోతున్నాయి.
    "ఎన్నాళ్ళుంటారు బాబయ్యా!" అన్నది అవ్వ ఆశగా. టూరిష్టులు ఎక్కవరోజులుండాలని ఆమె కోరిక. టూరిష్టులే వేళకి ఓ ముద్ద పడేస్తారు. లెక్కచెయ్యకుండా పదిపైసలూ, పావలాలూ కూడా యిచ్చేస్తారు. ముసలాయన గొప్ప వేదాంతి. "ఎవరు ఎక్కడ ఎన్నాళ్ళుంటారో ఎవరు చెప్పగలరు?" అంటూ ఎదురుప్రశ్న వేశాడు.
    వాళ్ళు మాట్లాడుకొనేదానికర్థం ఆ యువకుడికి తెలియలేదు. నేను చెప్పాను. "మా నాన్నగారు పెద్ద ఫిలాసఫర్" అంటూ కామెంట్ విసిరాడతను. యధార్థమనిపించింది. "ఆ యీడులో ఆ మాత్రం ఫిలాసపీ ఎవరికైనా వుండాలండీ, ఉంటుంది కూడాను" అన్నాను ఇంగ్లీషులో.
    అవ్వ వరండా దగ్గరగా వెళ్ళి క్రింద నిలబడే ఆయన పాదాలమీద చేయివేసి ధీనంగా అర్థించింది.
    "మీరు తిన్నాక నాలుగు ఎంగిలి మెతుకులు నా మొకాన దయచేయించండి బాబయ్యా!"
    ముసలాయన కారడవిలో ఏదో వెదుకుతూ దూరంగా చూస్తున్నారు. యువకుడు అవ్వను సమాధానపరిచాడు.
    "నా బడ్డలాంటోడివి బాబయ్యా నువ్వు దయసూడాల" అంటూ అవ్వ తాను కూర్చునే చెట్టు క్రిందకి వెళ్ళిపోయింది.
    మరో రెండు కుర్చీలు వరండాలోకి చేరాయి. నేనూ ఆ యువకుడూ కూర్చున్నాము. ఆ ముసలాయన మీద నాకు ఎందువల్లనో వల్లమాలిన ఆసక్తి పుట్టుకొచ్చింది.
    "నమస్కారమండీ! మీరు ఎం.పి. అటగా పలకరించాను. "ఔను నాయనా! నేను తప్పనిసరిగా రాజకీయాలలో యిరుక్కుపోయాను" అంటూ వివరించారు. ఆయన మంచివాడే! యీ సమాధానంతో మనసువిప్పి చెప్పే స్వభావం కూడా వున్నదని గుర్తించాను.
    "అంత బాధేమిటొచ్చిందండీ! రాజకీయాలనేవి "బాండు" వ్రాసే ప్రభుత్వోద్యోగాలు కావుకదా! కావాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడే మానెయ్యవచ్చును కదా!" అన్నాను. "పొరపాటు నాయనా! ఒకసారి రాజకీయాల్లో కాలు పెట్టాక ఇక ఆ బురద కడుక్కోవటం అంతమాత్రాన జరిగేది కాదు. నేనున్నాను చూచావా? నాకు ఎనభై దాటాయి. ఇప్పటికి యాభై సంవత్సరాల క్రితం రాజకీయాలలో కాలు పెట్టాను. ఆ ప్రవాహంలో అనివార్యంగా కొట్టుకుపోయాను. తరువాత అంతో ఇంతో సంపాదించాను. అది నిలబెట్టుకోవాలంటే, రాజకీయాలలో ప్రమేయం తప్పనిసరి. నామీద ఆశ పెట్టుకున్న భార్యకూ, పిల్లలకూ ఏదో ఒకదారి చూపినవాడిని కావాలన్న తహతాహ. కాని, మనం చెయ్యాలని చేస్తే ఏమి జరుగుతాయి. మన జీవితాల వెనుక నిర్ణయశక్తులేవో ఉన్నాయనిపిస్తూంది అప్పుడప్పుడూ" అంటూ ముగించాడు.
    "బాబుగారూ? మీరేమీ అనుకోనంటే ఒకమాట అడగాలనుంది" అన్నాను సంశయిస్తూనే!
    "అడుగు బాబూ! సంశయం దేనికి. పెద్దవాళ్ళు విడమరచి చెప్పటానికి, చిన్నవాళ్ళు విశదంగా అర్థం చేసుకోవటానికీ కాకపోతే అనుభవాలనేవి ఎందుకు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS