అప్పుడు మళ్ళీ అధికారికంగా టైముని ఒక గంట వెనక్కి తిప్పుతారు.
ఆ టైము మార్పుని బట్టి అందరూ తమ తమ గడియారాలని కూడా అడ్జస్టు చేసుకోవాలి.
తను చేసుకోలేదు.
ఏ పనీ టైంలో చేయడం తనకి కుదరదు. చివరికి టైము మార్చుకునే విషయంలో కూడా!
అరవై ఏళ్లు దాటాక ఇప్పుడింక అలవాట్లు మారతాయా?
ఒకప్పటి జంట రచయితలు సలీమ్ - జావీద్ లలోని జావీద్ అఖ్తర్ ఏం చెప్పాడూ?
ఒక రోజుకీ, ఇంకో రోజుకీ అస్సలు పోలిక ఉండకూడదుట.
ఇవాళ పొద్దున లేస్తే రేపు మధ్యాహ్నం లేవాలి. ఒక రాత్రి మేలుకుంటే, ఇంకొక పగలు నిద్రపోవాలి.
అంతే తప్ప, టైము టైముని చెప్పి, మనకి మనం శృంఖలాలు తగిలించుకోవడం ఎందుకూ?
ఆ విశృంఖలత్వమే తనకి సెకెండ్ నేచర్!
అదలా ఉండనీ. ఇవాళ ఈ గంటని ఎట్లా సద్వినియోగం చేయడం?
ఈ కారు లేకపోతే షికారుగా ఎక్కడకన్నా నడిచి వెళ్ళిపోయేవాడు తను?
సరే. బోస్టన్ కి వెళ్ళి అక్కడ ఇండియన్ రెస్టారెంట్ లో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చును గదా!
తన కబుర్లు వినడం ఆ రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళందరికీ ఇష్టమే.
ఒక గంట ప్రయాణం తర్వాత కారు బోస్టన్ నగరం చేరుకుంది.
అక్కడ ఉంది ఒక ఇండియన్ రెస్టారెంటు.
బోస్టన్ నగరంలో ఇండియా వాసనలు వస్తూనే ఉంటాయి. అక్కడ ఒక 'ఇండియా స్ట్రీట్' ఉంది. ఇంకో బాంబే స్ట్రీట్ కూడా వుంది. 'బాంబేక్లబ్' అనే ఒక హోటల్ వుంది. ఒక 'బాంబే థియేటర్' వుంది.
న్యూయార్క్ లో మాత్రం 'గాంధీ ప్లాజా' అనే ప్రాంతం లేదూ? అట్లాగే.
ఈ ఇండియన్ రెస్టారెంటులో తనకి పార్కింగ్ ఫ్రీ! తను ఇక్కడ పాతకాపు కదా మరి!
అడపా దడపా కాఫీ, కోక్, స్నాక్సూ కూడా ఫ్రీనే!
అందుకు కారణం వుంది. ఇక్కడ ఇండియాలో మనకు తెలిసిన కుటుంబ వ్యవస్థ వంటిది అక్కడ అమెరికాలో లేదు. అయినా కూడా, ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి.
అమెరికాలో పిల్లలు పెద్దలయ్యాక, పెద్దలు వృద్ధులయ్యాక, వాళ్ళని పిల్లలు పోషించే పరిస్థితి వుండదు. వృద్ధులు సర్వ సాధారణంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాంటి వాటిలో వుంటూ వుంటారు. అయితే 'పిండికొద్దీ రొట్టె' అన్నట్లుగా, డబ్బు పెట్టిన కొద్దీ ఫైవ్ స్టార్ సౌకర్యాలు కూడా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోనే దొరుకుతాయి.
పిల్లలు పెద్దలని కనిపెట్టి ఉండే ఆనవాయితీ కాకపోయినా సరే, వృద్ధులని అమెరికన్ సొసైటీ బాగానే చూసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సీనియర్ సిటిజెన్స్ కి రాయితీలు ఉంటాయి. ఆదరణ వుంటుంది. గౌరవం వుంటుంది. అంగవైకల్యం వున్నవాళ్ళకి కూడా అంతే!
అట్లాగే, బీదవాళ్ళని కూడా చాలా దయగా చూసుకోవడం అమెరికన్ సొసైటీలో ఆనవాయితీ.
నిజానికి తను బీదవాడు కాడు. సితార బాగానే సంపాదిస్తోంది.
ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో తయారయ్యే బట్టలు అక్కడ చౌకగా కొని, ఇక్కడ చాలా ఎక్కువ ధరకి అమ్ముతూ వుంటుంది. బాగానే వస్తాయి లాభాలు.
కానీ పైసలు పేరుకుంటున్నకొద్దీ పిసినారితనం పెరిగిపోయింది సితారకి. పైసపైసకీ లెక్కచేయడం మొదలయింది.
ఆనంద్ దగ్గర పర్సు వుంటుంది కానీ, అందులో పైసా కూడా ఉండదు. అవసరమైనప్పుడు సితార లెక్కగా అరాకొరా డాలర్లు అందులో పెడితే తప్ప!
తమ రెస్టారెంట్ కి రెగ్యులర్ గా వచ్చి పొదుపుగా ఒక్క కాఫీ ఊదుకుంటూ తాగడమో, లేదా 'ఫ్రెంచ్ ఫ్రైస్' అనే ఫింగర్ చిప్స్ ని వూరించుకుంటూ తినడమో మాత్రమే చేసే ఆనంద్ ని చూసి, వాళ్ళు అతన్ని బీదవాళ్ళ జాబితాలోనే చేర్చారు. దానికి తోడు వయసులో పెద్దవాడు కావడం ఒకటి.
అది చాలట్లుగా, కొద్దిగా కుంటుతూ నడుస్తాడు ఆనంద్.
షుగర్ కంప్లయింటు వలన కలిగిన కాంప్లికేషన్లు. డయాబెటిక్ న్యూరోపతీ! నరాలు చచ్చుబడిపోవడం.
వెళ్ళినప్పుడల్లా ఒకే ఒక్క కాఫీనో, లేదా కోక్, అదీ కాకపోతే ఫ్రైస్ మాత్రమే తీసుకుంటూ 'బీదవాడు' అనే బిరుదు సంపాదించడమూ, వయసు మీద పడుతూ వుండడం వల్ల వృద్ధుడనిపించుకోవడమూ, కుంటుతూ నడవడం వల్ల అంగవికలుడు అనిపించుకోవడమూ కూడా ఆనంద్ కి అందరి సానుభూతీ సంపాదించి పెట్టాయి.
అతను ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళినా, అమెరికన్ మెక్ డోనాల్డ్స్ కి వెళ్ళినా, బర్గర్ కింగ్ కి వెళ్ళినా కూడా అతను చేసే ఆ కొద్ది బిల్లుకే భారీ డిస్కౌంట్లు.
లేదా -
ఒక్కోసారి అంతా ఫ్రీ!
"లంగ్డా వస్తున్నాడు" అన్నాడు దీపక్ అనే వెయిటరు అతను కంప్యూటర్ సైన్సెస్ లో ఎం.ఎస్. చేస్తున్నాడు. జరుగుబాటు కోసం ఇండియన్ రెస్టారెంట్ లో పార్ట్ టైం వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు.
అమెరికాలో అంతే!
ప్రతివాళ్ళూ ఏదో ఒక పని చేయక తప్పదు. స్టూడెంట్స్ కూడా.
"లంగ్డా లంగ్డా అంటావు అసలు లంగ్డా అంటే ఏమిటి?" అన్నాడు 'అర్ విండ్'
తన పేరు 'అర్ విండ్' అని వుచ్చరిస్తాడు గానీ అది నిజానికి అరవింద్. మొదట్లో అతను ఆ పేరుని అరడజనుసార్లు చెబితే తప్ప ఆనంద్ కి అర్థం కాలేదు.
"లంగ్డా అంటే కుంటోడురా!" అని వివరిస్తున్నాడు దీపక్. అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. అతను కూడా ఎం.ఎస్ చేస్తున్నవాడే.
"కుంటి కులాసం - ఇంటికి మోసం" అన్నాడు కిశోర్.
అతను నెల్లూరు నుంచి వచ్చాడు. ఆ హోటల్లో 'దోశె మాస్టర్' - దోసెలు వేస్తుంటాడు. వేరే చెప్పేదేముంది! కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్.
"ష్!" అని వాళ్ళని మృదువుగానే గద్దించింది శృతి. అదే ఆమె అతన్ని మొదటిసారి చూడడం.
ఆనంద్ కూడా శృతిని చూడడం అదే మొదలు.
పరీక్షగా పట్టిపట్టి చూశాడు ఆనంద్.
శృతికి ఇరవై ఏళ్ళు వుంటాయి.
వయసు పొంగు కొందరిలో మరీ వుధృతంగా కనబడిపోతూ వుంటుంది. శృతిలో అంతే!
ఆమెని చూస్తూ తను ఒక దేవానంద్ లాగా ఫీలయ్యాడు ఆనంద్.
దేవానంద్ అంటే నిత్య యవ్వనుడు కదా- ఎవర గ్రీన్ హీరో!
ఎంతమందో కొత్త అమ్మాయిలను వెండితెరకి పరిచయం చేసి తెరవేల్పులుగా మార్చాడు కదా!
అది దేవానంద్ సంగతి!
తను - ఆనంద్ - తను ఫేడవుటయిపోయాడుగానీ తనే గనక స్వింగ్ లో ఉండివుంటేనా.
ఈ అమ్మాయిని ఒక సినిమాలో బుక్ చేసేసి వుండేవాడు.
కాదు కాదు.
ఈ అమ్మాయి కోసమే ఒక సినిమా తీసేసి ఉండేవాడు.
"మే ఐ హెల్ప్ యూ సర్!" అంది శృతి, ఆనంద్ కూర్చున్న టేబుల్ దగ్గరకి వస్తూ.
పెద్దలని 'సర్' అని సంబోధించడం అమెరికాలో బాగా వాడుక- చివరికి పోలీసులతో సహా అందరూ.
శృతి వయసు పొంగుకి ఆమె పొడుగు మరింత హంగు తెచ్చిన వైనాన్ని గమనించాడు ఆనంద్.
ఐదడుగుల పదకొండు అంగుళాలు ఉండి ఉండవచ్చును ఆమె హైట్!
లాంగ్ లెగ్స్! - పొడుగుకాళ్ళ సుందరి.
ఫ్యాషన్ మోడల్సులాగా, బ్యూటీ క్వీన్ లలాగా వుంది శృతి.
అరవయ్యో పడిలో పడిపోతున్న ఆ పెద్దాయన తనవైపు అలా ఎక్స్ రే కళ్ళతో పట్టి పట్టి చూడడం ఆ అమ్మాయికి అదోలా అనిపించింది.
"నువ్వెప్పుడన్నా మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళావా?" అన్నాడు ఆనంద్.
కొద్దిగా సిగ్గుపడింది శృతి.
"లేదు సర్!"
"నువ్వు గనక కాంటెస్టుకు వెళ్ళి వుంటే నువ్వే మిస్ యూనివర్స్ గా సెలెక్ట్ అయి వుండేదానివి - మా అమ్మాయి కాకుండా"
"అంటే...యూ...మీన్.."
"యా! మిస్ యూనివర్స్ సునయన - మై డాటర్!" అన్నాడు ఆనంద్.
కళ్ళు విప్పార్చి చూసింది శృతి.
ఈయన 'మిస్ యూనివర్స్' సునయనకి తండ్రా!
* * * *
"క్షణం తీరిక లేదూ, దమ్మిడీ ఆదాయం లేదూ!" అన్న సామెత నీలాంటి వాళ్ళని చూశాకె వచ్చి వుంటుందే అరుణా!" అంది భావన, కాస్త నిష్టూరంగా. "నిన్నంతా ఎక్కడికెళ్ళావ్?"
"పెద్ద కథలే! ఆండాళ్ళు గారు తెలుసా?"
"తెలియకేం! మిసెస్ అప్పడాలు" అంది అందరికీ అతి తేలికగా నిక్ నేమ్స్ తగిలించేసే అలవాటు వున్న భావన.
