చివరి ప్రయత్నంగా ముసలాళ్ళతో అనునయంగా అన్నాడు రాజు.
"కావట్లో కూర్చోండి వెళ్దాం"
ఒంటిమీద ఉన్న బట్టలు జారిపోతున్న స్పృహ లేకుండా ముసలావిడే తడుముకుంటూ వెళ్ళి కోడలు మీద పడిజుట్టు పట్టుకుంది. వదిలించబోయిన రాజుని "నువ్వుండరా ముండమోపి వెధవా ......." అని పక్కకు నేట్టబోయింది.
"రాజూ! వీళ్ళ సంగతి ఇంక వదిలేయ్! ఈ ఫ్యామిలీలో అవసరాలూ, అహంకారాలూ తప్ప ఆప్యాయతలూ, అనురాగాలు అస్సలు లేనే లేవు . పద! మన దారిన మనం వెళ్దాం!" అంది సృష్టి.
ఇద్దరూ ముందుకి నడిచారు.
అదే టైంలో ........
ఒక గిరిజనుడు భయాందోళనలతో దిక్కుతోచనట్లుగా అటుకేసే పరిగెత్తుకు రావడం వాళ్ళకు కనబడింది. అతను రాజు సృష్టి లను చూడగానే 'అయ్ బాబోయ్! అయ్ బాబోయ్! అటేళ్ళకండి- కబంధుడు మిమ్మల్ని మింగేస్తాడు ! అయ్ బాబోయ్ ఒక రాక్షసుడు ఇంకో రాక్షడుడ్ని మింగేయడాన్ని చూడ్డం ఇదే మొదలు !" అన్నాడు గోలగోలగా.
"భయపడకు ! ఏం జరిగిందో సరిగ్గా చెప్పు !" అన్నాడు రాజు.
ఆయాసం కాస్త తగ్గి వూపిరందాక చెప్పడం మొదలు పెట్టాడు గిరిజనుడు.
'అయ్ బాబోయ్! బాబోయ్! పొద్దుగాల లేచి ఎవరి మొహం చూశానో గానీ రాక్షసుడు ఎదురయ్యాడండీ.... నాకు రెట్టింపు పోడుగున్నాడు. పీపాలాంటి కడుపండీ- మా దెయ్యాలమర్రి మానులాగా . ఇంత లావున్నాడు సార్! నన్ను నిలబెట్టి "బీడీ వుందా?" అని అడిగాడండీ......నాకు తెలవకడుగుతా- రాక్షసులు బీడీలు కాలుస్తారా సార్?"
గిరిజనుడికి కనబడిన ఆ కారెక్టర్ రాక్షసుడి వేషంలో ఉన్న సుభాషు అయి వుంటాడని రాజుకీ, సృష్టీకి తక్షణం అర్ధమయింది.
ఈ గిరిజనుడికి కనబడగానే బీడీ కోసం యధాలాపంగా అడిగి ఉంటాడు. ఆ సుభాషు -- ఇతను దానికి అదిరిపోయి ఉంటాడు. అంతవరకూ బాగానే ఊహకు అందుతోంది.
కానీ -- రాక్షడుడిని ఇంకో రాక్షసుడు మింగేయడమేమిటి?
అందులోనూ కబంధరాక్షసుడా? అంటే ఏమిటి ?
కధ జానపదంలో నుంచి పౌరాణికం లోకి మళ్ళుతుందా ఏం?
"ఏం జరిగింది ? సరిగ్గా చెప్పు ?" అన్నాడు రాజు గిరిజనుడికి ఇంత పొడుగున రోషం పొడుచుకు వచ్చింది.
"నేను చెబుతోంది మీరు నమ్మడం లేదు.
ఈ కళ్ళతోనే నేను చూశాను. బీడీ అడిగిన రాక్షసుడుని ఇంకో వెయ్యి చేతుల రాక్షసుడు టప్పున పట్టుకున్నాడు. వెయ్యి కొండ చిలువలు వాణ్ణి చుట్టేసుకున్నట్లే అనుకోండి. వాడి ఎముకలు సున్నంలాగా అయిపోయి ఉంటాయి. వాణ్ణి కాళ్ళూ చేతులూ , ముక్కూ మొహాలు చెవులూ నోరూ అన్నీ లేకుండా ఒక ముద్దలాగా చేసేశాక ఆ ముద్దని గుహలాంటి చెవులో నోరూ అన్నీ లేకుండా ఒక ముద్దా లాగా చేసేశాక ఆ ముద్దని గుహలాంటి నోట్లో కి చేతులతో తోసేసుకున్నాడు కబంధుడు" అన్నాడు గిరిజనుడు.
షాక్ వల్ల అతనికి హల్సూసినేషన్స్ కలుగుతున్నాయేమో అనిపించింది రాజుకి.
"నాకు అర్ధమయింది" అన్నట్లు సాభిప్రాయంగా చూసింది సృష్టి.
ఏమిటన్నట్లుగా చూశాడు రాజు.
"నా వూహే గనుక కరక్టే అయి ఉంటే, సుభాష్ ని పట్టుకున్న కబంధుడు ఒక చెట్టు అయి ఉండాలి. మాన్ ఈటర్ ట్రీ!" అంది మెల్లగా.
"ఏమిటి ! మనుషుల్ని తినే చెట్టా?" అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
'అవును రాజూ! పురుగులనీ, పిట్టలనీ తినే మంసాహరపు చెట్లు ఉన్నాయని మనందరికీ తెలిసిందే గదా!"
"అయితే ?"
"కొన్ని రకాల మొక్కలూ, చెట్లు వుంటాయి. అవి మాములు చెట్ల లాగా కాకుండా, డైరెక్టుగా మాంసాహరాన్ని తీసుకుంటాయి. యుట్రిక్యూలేరియా, డ్రోసిరా, డయోనియా నెపందీస్ లాంటి మొక్కలు ఈ కేటగిరికే చెందుతాయి. ఇవన్నీ సైజులో చిన్న మొక్కలే అయినా కీటకాలు తమ మీద వాలగానే వాటిని రకరకాల పద్దతులతో పట్టేసుకుని జీర్ణం చేసుకుంటాయి. డ్రోసిరా మొక్క తాలుకూ ఆకుల మీద సన్నటి గొట్టాల లాంటి నాళికలు వుంటాయి. వాటి సాయంతో పురుగుల్ని పట్టేసుకుంటుంది ఆ మొక్క. నేంపధీస్ అనే మొన్న ఉందా దాని తాలుకూ ఆకులూ కూజా షేపులో వుంటాయి. ఆ కూజాకి ఒక మూట వుంటుంది. కూజాలో ఏదో దొరుతుకుందని ఆశపడ్డ కీటకాలు అందులో దూరగానే మూత కాస్తా టప్పున మూసుకుపోతుంది.
ఇకపోతే డయోనియో మొక్క తాలుకూ ఆకులూ దొప్పల షేపులో వుంటాయి. ఏదైనా పురుగు దాని మీద వాలగానే రెండు దొప్పలు దగ్గరకు వచ్చి పురుగుని ట్రాప్ చేసేస్తాయి."
"చెట్లు పురుగులనీ ఇంకా మాట్లాడితే పిట్టలనీ కూడా తినడం దాకా ఒకే! కానీ ఏకంగా ఏడడుగుల మనిషిని మింగే వృక్షాలు ఉంటాయా?" అన్నాడు రాజు అనుమానంగా.
సాలోచనగా అంది సృష్టి. కబంధుడనే రాక్షసుడి ప్రస్తావన రామాయణంలో వుంది. నిజానికి కబంధుడు రాక్షసుడు కాడనీ, కబంధుడు అనబడేది ఒక మాన్ ఈటింగ్ ట్రీ అయి ఉండవచ్చుననీ ఒక వూహ ఉంది.
"ఆ ఊహకి ఆధారం ఏమిటి ?" అన్నాడు రాజు.
ఇక్కడ రామాయణ గాధని కొద్దిగా మననం చేసుకుందాం. అరణ్యవాసం టైంలో కుటీరంలో ఒంటరిగా ఉన్న సీతని మాయ సాధువు వేషంలో ఉన్న రావణాసురుడు ఎత్తుకుపోయాడు. సీతని వెదుకుతూ రాముడూ, లక్షణుడూ అడవిలో తిరుగుతూ వుంటారు. అప్పుడు కబంధుడు అనే రాక్షసుడు రాముణ్ణి లక్ష్మణుడిని తనకి ఉన్న అనేకమైన చేతులతో పట్టేసుకుంటాడు. కబంధుడు ఒక బ్రహ్మాండమైన కొండ సైజులో ఉన్నాడనీ అతడికి కాళ్ళు లేవనీ, కానీ అసంఖ్యాకంగా చేతులు ఉన్నాయనీ , ఆ చేతులు కూడా మొండానికి అతికించబడినట్లుగా ఉన్నాయనీ రామాయణంలో వర్ణన ఉంది.
ఆ చేతుల మధ్య సింహాలు, పెద్ద పులులూ, వంటి క్రూర మృగాలు కూడా చిక్కుకుని ఉన్నాయిట. ఎలుగుబంట్లు కూడా అ పట్టు తప్పించుకోలేక విలవిల్లాడుతున్నాయట. కబంధుడికి గుహలాంటి నోరు ఉందిట. ఈ మృగాలని అతడు నోట్లో వేసుకుని మింగేస్తున్నాడట. ఈ వర్ణన అంతా చూస్తె కబంధుడు రాక్షసుడు అయి ఉండడనీ ఒక మాంసాహార వృక్షమై ఉంటుందనే ఒక ఊహ వుంది. అది సైజులో మహావృక్షం గనకా కేవలం క్రిమి కీటాకాదులతో సరిపెట్టుకోలేదు గనకా పెద్ద సైజు జంతువులనీ, మనుషులనీ కూడా తింటూ ఉండి ఉండవచ్చును."
"అట్లాంటి వృక్షాలు ఇంకా ఉన్నాయంటావా?" అన్నాడు రాజు.
"పురుగుల్ని తినే డ్రోసేరా లాంటి మొక్కలు ఇంకా ఉన్నాయని మనకు తెలుసు. కబంధ వృక్షాలు నిజంగా ఇంకా ఉన్నాయా? అంటే మళ్ళీ మనం రామాయణంలోకే వెళ్ళాలి " అని ఒక్క క్షణం ఆగి, మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది సృష్టి. "తమని పట్టుకున్న కబంధుడి చేతుల్లో నుంచి విడిపించుకున్నారు రామ లక్షణులు. ఆ కబంధహస్తాలని నరికేశారు. ఆ తర్వాత ఆ రాక్షసుడిని కాల్చి బూడిద చేసేశారు. అప్పట్నుంచి కబంధుడి పీడ విరగడయిందిట. అంటే ఆ వృక్షజాతులనీ సమూలంగా నాశనం చేశారని అర్ధం.
అట్లాగే - రామలక్షణులు అంతకు ముందే విరాధుడనే ఇంకో రాక్షసుడిని కూడా చంపేసి ఉంటాడు. వర్ణనలని బట్టి చూస్తె, విరాధుడు కూడా ఒక మాంసాహార వృక్షమై ఉండవచ్చుననిపిస్తుంది. ఆ రాక్షసుడు ఎంతకూ చావకపోవడంతో రామలక్షణులు ఒక గొయ్యి తీసి అతడిని భూస్తాపితం చేశారట.
