సార్! మీకు సినిమా ఫీల్డు గురించి సరిగా తెలిసినట్లుగా లేదు. అంచేత నేను ఇస్తున్న ఆఫరు వాల్యూ మీకు అర్ధం కావడం లేదు. నాపేరు బాబూ సేట్. సినిమా ఫీల్డులో నేను అవునంటే అవునూ -- కాదంటే కాదూ అన్నమాట ! సార్! నా పేరు బాబూ సేట్ - నాకు ఇంకో పేరు సిల్వర్ జూబ్లీ సేట్! ప్రేక్షకులకు పిచ్చెక్కిపోయే సినిమాలు తీస్తాను . ప్రేక్షకుల రివార్డు ఎట్లానూ వస్తుంది. అవార్డులు కూడా సాధించుకోగల ధైర్యం ఉంది. నా ఆఫర్ ని మీరు కాలదన్నుకోకండి౧" ఆ టెన్షన్ లో సిగరెట్లు కోసం జేబులు తడుముకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. లేవు.
"రేయ్ సుభాష్! రేయ్ తింగరి వెధవా! ఎక్కడ చచ్చావురా! నీ యమ్మకడుపు మాడా! ఇట్రా!" అని ఒక పొలికేక పెట్టాడు బాబూ సేట్.
నిర్మాత గారు పిలిస్తే పరుగెత్తుకు వచ్చే సుభాష్ దగ్గర్నుంచి జవాబులేదు.
"రేయ్ సుభాష్ - రేయ్ దొంగనాయలా! సిగరెట్లు తెమ్మని చెప్పరా!" అన్నాడు బాబూ సేట్.
సుభాష్ ఉలకలేదు -- పలకలేదు.
"ఏమయ్యాడే నీ సుభాషూ?" అన్నాడు బాబూ సేట్ , కోడలుపిల్ల వేపు తిరిగి రూడ్ గా.
"క్షణం క్రితం దాకా ఇక్కడే వుండేనే!" అంది ఆమె అనుమానంగా.
"పో! పోయి పిలుచుకురా వాడ్ని , లేకపోతే నువ్వే ప్రొడక్షన్ మేనేజర్ దగ్గరి కెళ్ళి సిగరెట్లు తే! ఫో! " అన్నాడు.
ఈలోగా-
పోదలవేనక అలికిడి అయింది.
"సుభాష్ గాడేనా!" అన్నాడు బాబూ సేట్.
కానీ -
పొదల చాటునుంచి వచ్చింది సుభాష్ అనే ఆ రాక్షసి పాత్రదారి కాడు.
వచ్చింది ఒక హాండ్సమ్ యంగ్ మాన్. అతనితో బాటే ఒక అందమైన అమ్మాయి.
వాళ్ళు ఆ పిక్చర్ లో హీరో హీరోయిన్లు.
బాబూ సెట్ ని చూడగానే మహా వినయంగా ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టాడు కుర్రహీరో . అతనికి అదే మొదటి పిక్చరు .
హీరోయిన్ మాత్రం నిర్మాతని చూడి అంతగా భయపడుతున్నట్లుగా కనబడలేదు. కాస్త దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది.
నిర్మాత హీరో ని అస్సలు పట్టించుకోలేదు కానీ హీరోయిన్ తో సరదాగా -- ఏం పిచ్చి ! ఎట్లా వుంది షూటింగూ ?" అన్నాడు.
బోలెడంత సిగ్గు అభినయించింది హీరోయిన్.
"షూటింగుకేం !" అంది.
"ఇవాళ నైటు కాల్ షీటు కూడా చేస్తావా?"
"మీరు ఎట్లా చెబితే అట్లా!" అంది హీరోయిన్.
"సర్...." అన్నాడు కొత్త కుర్ర హీరో మాటల మధ్య సందు చేసుకుని.
"సర్! నాలుగురోజుల పాటు ఇక్కడ నాకు వర్క్ లేదని చెప్పారు. చెన్నయిలో ఒక పిక్చరు చెయ్యాలి. వెళ్ళి రమ్మంటారా?"
"తప్పకుండా వేళ్ళూ" అన్నాడు నిర్మాత వెంటనే.
కుర్ర హీరో మొహంలో గొప్ప రిలీఫ్ కనబడింది.
వినయంగా నమస్కారం పెట్టి వెనక్కి నడుస్తూ వెళ్ళిపోయాడు.
ఈలోగా ప్రొడక్షన్ మేనేజరు సిగరెట్లతో సహా అక్కడికి చేరుకున్నాడు.
అతనితో అన్నాడు నిర్మాత.
"వాడు చెన్నే వెళ్తాట్ట."
"ప్లయిట్ టిక్కెట్టు బుక్ చేయించనా సార్!"
"ఎందుకూ వెస్ట్ -- రైలూ టిక్కెట్టు ఇప్పించు -- రిటర్ను టిక్కెట్టు అక్కర్లేదు. వన్ వే. శనిగాడు వదిల్తే చాలు !" అన్నాడు బాబూ సేట్.
ప్రొడక్షన్ మేనేజర్ మహా చలాకీ మనిషి.
అవలించకుండానే పేగులు లెక్క పెట్టగలడు. ఒకసారి కుర్ర హీరో వెళ్ళిన వైపు చూసి, ఆ తర్వాత రాజు వైపు వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ , అంతా అర్ధమయింది అన్నట్లుగా తలపంకించాడు.
"వాడి ప్లేసులో మిస్టర్ యూనివర్స్ .......వీర్ని పెట్టుకుంటున్నాం . ఇప్పటిదాకా తీసింది తగలేట్టేసి వీరితో మళ్ళీ షూటింగ్ చెద్దాం" అన్నాడు నిర్మాత బాబూ సేట్.
"అసలు నేను ఇంతవరకు ఒప్పుకొందే" అన్నాడు రాజు.
"ఒప్పించేదాకా వదలను కదా!' అన్నాడు బాబూ సేట్ నవ్వుతూ.
అంటూనే , సిగరెట్ట్ ప్యాకెట్ తీసి, ఒక సిగరెట్ ని పెదాల మధ్య పెట్టుకుని, లైటర్ తో అంటించబోయాడు.
ఈసారి ఇంక సంకోచించలేదు రాజు.
మెగా ప్రొడ్యూసరు బాబూ సెట్ పెదాల మధ్య వున్న సిగరెట్ ని లాగేసి, అతని చేతిలో వున్న సిగరెట్ పెట్టేనీ, లైటర్ నీ కూడా లాక్కుని తన జేబులో వేసుకున్నాడు.
"నో స్మోకింగ్!" అన్నాడు అక్షరం అక్షరం ఒత్తి పలుకుతూ.
ప్రొడక్షన్ మేనేజర్ ముందు తన పరువు పోయినందుకు పట్టలేనంత ఆగ్రహం వచ్చింది బాబూ సేట్ కి. అతి కష్టం మీద కోపాన్ని అణుచుకున్నాడు. రాజు తనకి లొంగే ఘటం కాదని అతనికి పూర్తిగా అర్ధమయింది.
రాజు సృష్టివైపు తిరిగాడు. "పద వెళ్దాం సృష్టీ!" అని వృద్ద దంపతుల దగ్గరికి నడిచి "మీరు కావడిలో కూర్చోండి -- రాముడు మడుగు వెతుక్కుంటూ వెళ్దాం " అన్నాడు.
"అట్లాగే నాయనా!" అంది ముసలావిడ . అని, నోరు ఊరుకోనట్లుగా, "వెళ్తామే కోడలు పీనుగా ! పుట్టింటినుంచి మెట్టినింటికొచ్చాక అత్తమామలే తల్లిదండ్రులను కోవాలని శాస్త్రాలు చెబుతాయి.
అత్తమామలను ఆరళ్ళు పెట్టి నువ్వు పుట్టినింటికీ, మెట్టినింటికీ కూడా చెడ్డ పేరు తెచ్చావు కదే! దేవుడు లేడూ! నువ్వెంత సుఖపడతావో మేము చూస్తాంలే! నెల తిరక్కముందే నువ్వు ముండమోయ్యకపొతే నన్నడుగు !" అంది అఘయిత్యంగా.
'చాల్లే వూర్కోండి-- అత్తింటికి వచ్చిన కోడల్ని సొంతకూతురు కంటే ఎక్కువగా చూసుకుని పుట్టిల్లు మర్చిపోయేలా చేయాలని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి . మీరు నన్ను కన్న కూతురిలా చేశారా ఏమిటి?నేను మిమ్మల్ని కన్నవాళ్ళలా చూడ్డానికి. దేవుడు అందుకే మీ ముసలాళ్ళ నిద్దరికీ కళ్ళు బోయేటట్టుగా చేశాడు. కోడళ్ళని చంపుకు తినే ఇట్లాంటి అత్తల కడుపున పుట్టిన నీ కొడుక్కి కాష్టం బెట్ట!" అంది అక్కసుగా.
వాళ్ళు తిడుతున్నా తిట్లన్నీ తనకే తగుల్తున్నాయని గ్రహించినా ఏం చెయ్యలేని కొడుకు "అమ్మా! నువ్వోర్కోవే!' అని తల్లితోనూ -- "ఒసేయ్ ! ఇంటి కెళ్దాం పదవే !" అని భార్యతోనూ సర్ది చెప్పడానికి నానా తంటాలూ పడుతున్నాడు.
కానీ అటు ముసలాళ్ళు ఇటు కోడలు పిల్లా ఎవరూ ఎవరికీ తీసి పోనట్లుగా గొంతులు చించుకుని అరుచుకుంటున్నారు.
జోక్యం చేసుకోబోయిన సృష్టిని అదిలించి కొట్టారు ముగ్గురూ కూడా.
ఇక లాభం లేదన్నట్లుగా భుజాలు ఎగరేసింది సృష్టి.
"వీళ్ళకి పగా, ప్రతీకారం మాత్రమే ముఖ్యమైనట్లుగా వుంది రాజూ -- వీళ్ళ ఖర్మానికి వీళ్ళని వదిలేసి మనదారిన మనం పోదాం పద!" అంది కోపంగా.
