Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 24

   
    ఆ తర్వాత అందరూ బఫె తీసుకోటానికి లేచారు.    
    అరగంటలో బఫే పూర్తి అయింది. లాష్ట్ న ఫ్రూట్ సలాడ్ తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి దగ్గర శలవు తీసుకుని వెళ్ళారు.    
    మరో గంట తర్వాత ఇన్ స్పెక్టర్ శివకాంత్ కీర్తి అక్కడ మిగిలారు.
    
                                     17
    
    "ఇప్పుడప్పుడే కొత్త కేసులేమీ లేవా?" ఇన్ స్పెక్టర్ శివకాంత్ అడిగాడు.    
    "ఈ క్షణంవరకూ లేనట్లే." నవ్వుతూ చెప్పింది కీర్తి.    
    "అంటే!"    
    "మరోక్షణంలో పైనుంచి ఫోన్ కాల్ రావచ్చు. ఏదో కేసు అప్పగించవచ్చు. నేను వెంటనే డ్యూటీలో దిగొచ్చు."    
    "ఇవన్నీ చ్చు....చ్చు....లేకదా!"    
    "వస్తారుట....ట...ట...అన్నమాటలే వక్కోసారి నిజం అవుతాయి అలాంటప్పుడు....చ్చు ....చ్చు...లు కూడా నిజం కావచ్చు కదా?"    
    "నీవు భలే తమాషాగామాట్లాడతావు కీర్తి!" అన్నాడు శివకాంత్ యింకేమనాలో తెలియక.    
    "వొక్కోసారి తమాషాలే నిజాలవుతాయి శివకాంత్" గంభీరంగ అంది కీర్తి.    
    కీర్తి శివకాంత్ ఇరువురే వున్నప్పుడు వాళ్ళు పేరు పెట్టి ఏకవచనంతోనే మాట్లాడుకుంటుంటారు.    
    ఫోను ట్రింగు మనటంతో ఏదో చెపుదామని నోరు తెరచిన శివకాంత్ చటుక్కున నోరుమూసుకున్నాడు.    
    కీర్తి సోఫాలోంచి లేచి రెండంగల్లో ఫోను దగ్గరకు వెళ్ళి రిసీవర్ అందుకుంది.    
    కొంపదీసి ఫోన్ కాల్ పై నుంచి కాదు కదా! అర్జంట్ కాల్ అయితే కీర్తి శరవేగంతో యిక్కడ నుంచి వెళ్ళి పోతుంది. ఈ రోజుకూడా తన మనసు బైట పెట్టే ఛాన్స్ పోతుంది. అనుకుంటూ దిగాలు పడికూర్చున్నాడు శివకాంత్.    
    "అలాగే తప్పకుండా...ఏం ఫరవాలేదు. ఈ నైట్ కే కదా ఓ.కె."కీర్తి ఫోనులో అంటుంటే ఒక్కముక్కా అర్ధం కాలేదు శివకాంత్ కి.    
    రిసీవర్ క్రెడిల్ పై నుంచి వచ్చింది కీర్తి.    
    "ఈ నైట్ కి వెళ్ళాలా!" శివకాంత్ అడిగాడు.    
    "వెళ్ళాలి తప్పదు. "శివకాంత్ ఎదురు గుండాసోఫాలో కూర్చుంటూ అంది కీర్తి.    
    "వక్కరోజుకూడా నిన్ను ఊరికే కూర్చోనివ్వరుకదా! కేసులు అప్పగించటానికి నీవు తప్ప మరెవరూ లేరా! ఇంతకీ కేసు ఏమిటంటే?"    
    "భోజనం" చెప్పింది కీర్తి.    
    "భోజనమా?" శివకాంత్ తెల్ల బోయాడు.    
    "ఎస్, గీతానాయుడు ఈ నైట్ కి వాళ్ళింట్లో విందుకి పిలిచింది. ప్రస్తుతానికి భోజనం కేసు తగిలింది."    
    శివకాంత్ ఫక్కున నవ్వి "ఇదాకేసు!" అన్నాడు.    
    "ఆ....మరే." అంది కీర్తి.    
    "అమ్మయ్య యిప్పటికిప్పుడు ఏకేసు లేదు."    
    "ఆమాట నేను కదా అనుకోవాల్సింది?" కీర్తి చిరునవ్వుతో అడిగింది.    
    "నీవేమీ అమ్మయ్య అనుకోవు. గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోటం బద్ద కస్తుల పని అని చెపుతుంటావు కదా, కేసు అప్పగిస్తే చాలు రెడీ."    
    "మనం మన కర్తవ్యాన్ని ఎప్పుడూ మరువకూడదు శివకాంత్ ముఖ్యంగా మనం చేసేజాబ్ చాలా బరువుబాధ్యతలతో కూడుకున్నది. రెక్ లెస్ గ అణుమాత్రం కూడా ప్రవర్తించకూడదు."    
    "నిజమే ననుకో...."నశిగాడు శివకాంత్.    
    "నిజమేననుకోకాదు నిజం" నిజం అన్నమాటని నొక్కి పలుకుతు అంది కీర్తి.    
    శివకాంత్ మళ్ళీ పెదవి కదపలేదు.    
    కొద్ది సేపు ఆగి కీర్తి అడిగింది "ఏమిటో మాట్లాడాలి అన్నావ్?"    
    "ఏ... ఏమిలేదు."    
    "అదేంటి కంగారు పడుతున్నావ్ కదా!"    
    "అన్నాననుకో!"    
    "ఖాళీగా వుంటావా  మాట్లాడాలి కీర్తి అని అడిగావు కదా!"    
    "అడిగాననుకో!"    
    "ఈ కో భాష తీసేసి విషయానికి రా"    
    కీర్తిని మాటల్లో పెట్టి ప్రేమ పెళ్ళి విషయం కదుపుదామనుకున్నాడు శివకాంత్. అదెలాగో తెలియలేదు. ధైర్యం చేసి ముక్కుసూటిగ అడగలేడు. అలా అని దాచుకోలేక పోతున్నాడు.    
    "విషయమేమిటో చెప్పు శివకాంత్!" అంది కీర్తి అతని ఆలోచనచూసి.    
    "చాలా రోజులైంది కదా ఇలా నీతో కాసేపు కూర్చుని మాట్లాడి అందుకే అడిగాను. ఎంత సేపు మన ప్రాణానికి కేసులు, కేసులు."    
    "డ్యూటీ విషయంలో నీకూ నాకు చాలా బేధం వుంది శివకాంత్! మీకు శలవు వస్తుంది. అవసరమయితే శలవు తీసుకోవచ్చు. డ్యూటీలేనప్పుడు హాయిగ ఎంజాయ్ చేయవచ్చు. నాడ్యూటీ అలాకాదు ఉత్తప్పుడు ఖాళీగా వుండవచ్చు. డ్యూటీలోకి వెళ్ళానంటే ఆ కేసు పూర్తి అయిందాకా బైటికి రావటానికి లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS