Previous Page Next Page 
మంచివాడు పేజి 24

"వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకొంటారట!" గబగబా అనేశాడు శేషయ్య.
గోపాలరావు శేషయ్య ముఖంలోకి విస్మయంగా చూశాడు.
శేషయ్యకు భయం భయంగా వుంది. అరిచేతుల్లో చెమట, కాళ్ళలో కొద్దిగా వణుకు.
"మీ అబ్బాయే ఈ విషయం మీతో చెప్పమని మా అమ్మాయి ద్వారా కబురు పంపించాడు... అందుకే_" తన తప్పేంలేదని సంజాయిషీ ఇచ్చుకొంటున్నట్టు అన్నాడు శేషయ్య వణుకుతున్న కంఠంతో.
గోపాలరావు ముఖం గంభీరంగా మారింది.
"క్షమించండి నేను తప్పుగా మాట్లాడితే..."
గోపాలరావు శేషయ్య ముఖంలోకి అదోలా చూశాడు.
"నాకు అభ్యంతరం లేదు" అన్నాడు గోపాలరావు.
శేషయ్య కళ్ళు మెరిశాయి.
అంతలోనే అనుమానం వచ్చింది.
గోపాలరావు నిజంగా ఆ మాట అన్నాడా? తనకు అలా పొరపాటుగా వినిపించిందా?
"కాని ఒక షరతు!"
శేషయ్య తలెత్తి చూశాడు.
"నువ్వు ఈ ఉద్యోగం మానెయ్యాలి."
శేషయ్య తృళ్ళిపడి గోపాలరావు ముఖంలోకి చూశాడు.
గోపాలరావు ముఖంలో శేషయ్య ఆశించినట్టు కోపం కన్పించలేదు.
పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడుతూ వుంది.
"ఇష్టమేనా!"
"సరే!" బొంగురు పోయిన కంఠంతో అన్నాడు శేషయ్య.
"నా దగ్గిర పనిచేసే గుమాస్తా కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటే ఈ ఆఫీసులో నాకేం గౌరవం వుంటుంది చెప్పు. నువ్వే ఆలోచించు!"
"నిజమే" శేషయ్య మనసులోనే అనుకున్నాడు.
"ఇప్పుడే రాజీనామా రాసి ఇచ్చెయ్. వెంటనే యాక్సెప్టు చేస్తాను. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టించుకోవచ్చు."
శేషయ్య కళ్ళముందు గోపాలరావూ, ఆ గదిలోని ప్రతి వస్తువూ గిర్రున తిరిగినట్టు అయింది.
"ఏమిటయ్యా మాట్లాడవు?" ఈ సారి గోపాలరావు కంఠం కొంచెం తీవ్రంగా వుంది.
"క్షమించండి సార్! నేను చాలా తెలివితక్కువగా మాట్లాడాను."
శేషయ్య గిర్రున తిరిగి బయటికి వస్తూవుంటే గోపాలరావు జాలిగా చూస్తూ" పాపం, అమాయకుడు! అనుకున్నాడు.
దాంతో సరికొత్తగా ప్రారంభం అయిన పాత ప్రేమకథ ముందుకు నడవనని మొరాయించి నేలమీద చతికిలపడింది.

                               *    *    *    *
రమేశ్ కాలేజీలో రేఖను తప్పించుకొని తిరుగుతున్నాడు.
రేఖ కాలేజీ మానేసింది.
రేఖకు రమేశ్ మీద చాలా కోపం వచ్చింది.
ప్రేమ ద్వేషంగా మారింది.
కసి పెరిగింది.
రమేశ్ ను తుమ్మచెట్టుకు కట్టించి చింత బరికెతో బాదాలనిపించింది.
ఆ చంపా ఈ చంపా వాయించాలనిపించింది.
రేఖ ఒక గవర్నమెంటు ఆఫీసులో యల్.డి.సీ.గా చేరింది.
రమేశ్ ను మర్చిపోకుండా వుంది. నిరంతరం ఏదో అశాంతి తరుముతూనే వుంది.
రమేశ్ ను కలుసుకొని కసితీరా తిట్టాలి. ఆ చంపా ఈ చంపా వాయించాలి. అప్పుడుగాని తన మనసు శాంతించదు.
రేఖ ఊహల్లోనే రమేశ్ ను ఎన్నోసార్లు చెప్పుతో కొట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS