కాని అండర్ వరల్స్ గాంగ్స్ ఉపయోగించే సైఫర్ టెస్ట్స్ ప్రకారం "మాడ్యులర్ అర్థమేటిక్స్" లో కలిపితే వచ్చేది 481.
865
626
___
481
కలిపిన వరసలోని స్థానాన్ని పక్క వరసకి అనుసంధాన పరచిన మాడ్యులర్ అర్థమేటిక్స్ లోని ఆ సంఖ్యని రావూఫ్, రాజన్ లు ఒకసారి డీకోడ్ చేసుకుంటే అర్థమైపోయింది.
ఇంగ్లీషు ఆల్ఫాబెట్స్ వరుసక్రమంలో 481 సూచించేది DHA.
ధనుష్కోటిలోని మొదటి అక్షరాన్ని సూచించే ఆ ఇంగ్లీషు ఆల్ఫాబెట్స్ తో సంతృప్తిచెందిన రెండు జంటలూ మరో నిమిషంలో కారెక్కారు.
ముందు అనుకున్న ప్రకారం వెళ్ళాల్సింది హయత్ నగర్ దారే రెండో మైలురాయి పక్కనుంచి వెళ్ళే మార్గానికి.
కాని సిటీ అవుత స్కర్ట్స్ లో పోలీస్ పెట్రోలింగ్ ఉధృతం కావడంతో కారుని రాజన్ సూచన్ల ప్రకారం జూబ్లీహిల్స్ మళ్ళించారు.
అక్కడ నవాబు ప్రహరీని ఆనుకుని వున్న తోటలో ప్రవేశిస్తుండగా సురేంద్ర ఓ మారు వెనక్కి చూశాడు.
ఎవరూ అనుసరించడం లేదన్న నిర్థారణకు రాగానే "ప్రొసీడ్" అన్నాడు.
మరో అయిదు నిమిషాలలో ఆ రెండు జంటలూ పాడుబడిన రెండంతస్తుల మేడలోకి చేరుకున్నారు.
సురేంద్ర సూట్ కేస్ ని తీసుకుని వేగంగా గ్రౌండ్ ఫ్లోర్ ని చేరగానే రావూఫ్ మరో బ్రీఫ్ కేసుతో అతడ్ని అనుసరించాడు.
తోడుగా ఆయుధాల్ని కూడా లోపలికి తేవడం వారు మరిచిపోలేదు.
రావూఫ్ డ్రైవర్ని చూస్తూ తను తెచ్చిన బ్రీఫ్ కేసు తెరవమన్నట్టుగా సౌంజ్ఞ చేశాడు.
స్టెన్ గన్ ఓవార నమ్మకంగా వుంచినా అతని చేయి తన మొలపైకి వెళ్ళింది. అవసరమైతే నడుంకి వేలాడే 9 MM షార్ట్ ఆటోమేటిక్ పిస్టల్ని ఉపయోగించాలన్నట్టుగా.
తనకన్నా తన స్థానబలంపై ఎక్కువ నమ్మకం గల సురేంద్ర అదేమీ పట్టించుకోకుండా ఓ ప్లాస్టిక్ బేగ్ లో వున్న క్రాక్ ని ఓ సూదితో కొద్దిగా బయటకు లాగి నాలుకపై పెట్టుకుని రుచి చూశాడు.
అప్పటికే రాజన్ ఇరవై అయిదు లక్షల క్యాష్ ని లెక్కపెట్టి చూపిస్తున్నాడు డ్రైవర్ కి.
కేవలం పది కిలోల 'క్రాక్'కి అంత డబ్బు వెచ్చించినా ధనుష్కోటికి నష్టం లేదు.
కొందరు ముక్కు పొడుంలా, మరికొందరు సిగరెట్లలోను పేక్ చేసుకుని ఉపయోగించే క్రాక్ మార్కెట్ లో చలామణీ అయితే నాలుగు రెట్ల లాభాన్ని ఆర్జించే ధనుష్కోటి ఈ ఒక్క డ్రగ్ ట్రాఫికింగ్ కే కోటీశ్వరుడైపోతాడు.
ఒక చిన్న వెయింగ్ మెషిన్ తో ప్లాస్టిక్ బాగ్ ని బరువు చూసి సంతృప్తిగా తల తిప్పిన సురేంద్ర పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు.
"హేండ్సప్"
చేతిలో స్టెన్ గన్ తో ఓ భారీకాయుడు పై మెట్టుపై నిలబడి ఉన్నాడు. "మిస్టర్ రాజన్... ఉత్సాహాన్ని ప్రదర్శించకు"
రాజన్ చేతిని వెనక్కు తీసుకుని స్థబ్దంగా నిలబడిపోయాడు.
ఆ వచ్చిన వ్యక్తి ఎవరో, ఏ ముఠాకి చెందినవాడో, ఎలాంటి భయంకరుడో సురేంద్రకి తెలుసు. అందుకే అచేతనంగా వుండిపోయాడు. ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా.
రాజన్ వెన్నులో సన్నగా చలి మొదలైంది.
ఆ గదిలో ఇసుక రేణువు కదిలిన చప్పుడు సైతం వినిపించేటంత నిశ్శబ్దం.
రావూఫ్ కొద్దిగా తొందరపడ్డాడు. అంతే.
ఓ తూటా అతడి కుడి కన్నులోనుంచి మెడుల్లా అబ్లాంగేటా వేపు ప్రయాణం చేసింది.
అది కాల్చింది వెనుక నిలబడ్డ వ్యక్తి కాదు. మూల వున్న కిటికీ దగ్గర నిలబడ్డ అతని అనుచరుడు.
సన్నని మూలుగుతో బోర్లాపడ్డ రావూఫ్ తన ప్రయత్నాన్ని అక్కడ ఆపినా మరికొంతసేపు బ్రతికేవాడు. మరోసారి నేలను చూసి స్టెన్ గన్ వేపు చేతులు చాపాడు.
అంతే... రేపిడ్ సక్సెషన్ తో దూసుకొచ్చిన సబ్ మెషిన్ గన్ కార్ట్రిడెస్ రావూఫ్ కపాలపు ముక్క నొకదాన్ని లేపి మెదడు ముద్ద డ్రైవర్ పై పడేటట్టు చేశాయి.
భయంతో డ్రైవర్ పరిగెత్తబోతుంటే ఓ షాట్ గన్ ప్లగ్ అతని నోటిలో నుంచి దూసుకుపోయి బాధగా నేలపైకి జారేడు.
కొనవూపిరితో కొట్టుకోవడం ఇష్టం లేనట్టు ముందు హెచ్చరించిన భారీకాయుడు స్టెన్ గన్ తో డ్రైవర్ ఒంటిని తూట్లుగా మార్చేడు.
ఆ శబ్దానికి నేల కూలేటంతగా ప్రతిధ్వనించిందా బిల్డింగ్.
"సర్కార్" ఆ వ్యక్తి కాళ్ళపై బడ్డాడు సురేంద్ర. "మమ్మల్ని చంపకు"
సర్కార్ నవ్వేడు మృదువుగా. ఓ హత్యాకాండని జయప్రదంగా ముగించేక మాత్రమే అలా నవ్వుతాడు.
"పది నిముషాల టైమ్ ఇస్తున్నాను. చేతులు పైకెత్తుతూ పారిపోండి సరేనా" బుజ్జగిస్తున్నట్టుగా చూసి "చెప్పండి ధనుష్కోటికి. మీ గాంగ్ లోని కొందరు ఇన్ ఫార్మర్స్ విషయంలో జాగ్రత్తపడమని పోండి" అన్నాడు తోడేలులా నవ్వుతూనే.
