"సందీప్...నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అతని భుజం గుచ్చి పట్టుకుని అడిగాను.
"ఊహూ!" నా ఓణీ తీసేసి గాల్లోకి విసుర్తూ అన్నాడు.
"సందీప్?" అనుమానంగా అతన్ని కుదుపుతూ నన్ను పెళ్ళి చేసుకోవా?" అని అడిగాను.
"ఎప్పుడు చెప్పాను చేసుకుంటాననీ?"
నాకు ఈడ్చి చెంపమీద కొట్టినట్లయింది.
దిగ్గుల లేచి కూర్చుని "మరి...మరి... ఇదంతా ఏమిటి? ఎందుకు చేస్తున్నావు?" అన్నాను.
"థ్రిల్ కోసం" అన్నాడు.
నేను వగరుస్తూ, "సిగ్గులేదూ! నన్ను మోసం చెయ్యాలనుకుంటున్నావా? అని అరిచాను.
"ఇందులో మోసం ఏవుందీ? నీకు మాత్రం బాలేదా?" అతను కోపంగా అడిగాడు.
నేను ఒక్క గెంతులో లేచి నా ఓణీ అందుకున్నాను.
"నీ నిజస్వరూపం ఇప్పటికైనా తెలియజేసినందుకు నీకు చాలా థాంక్స్!" దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా అన్నాను.
సందీప్ కి పిచ్చెక్కినట్లు "యూ స్టుపిడ్ గర్ల్! గెట్ అవుట్...నేను నిన్ను మోసం చెయ్యడం ఏవిటి? ఎప్పుడైనా నిన్ను తప్ప ఎవర్నీ ప్రేమించననీ, పెళ్ళి చేసుకోననీ అన్నానా? నేనే హీరో కాలేజీలో అందరికీ తెలుసు నీకు తెలీదా? అసలు నేను నిన్ను చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ఆశకి హద్దుండాలి!" అన్నాడు.
ఒక్కొక్క మాట నాకు ఒక్కో ముడిని విప్పుతూ కళ్ళ గంతలు పూర్తిగా తొలగిపోయాయి.
అతనేమిటో నేను ఎక్కివచ్చిన మెట్లు చెపుతున్నాయి! నీరసంగా కిందికి దిగొచ్చాను.
సందీప్ వాళ్ళుండే లొకాలిటీ చాలా అప్...జారిపడిపోతాం...జాగ్రత్త!" అన్న ప్రతాప్ మాటలు గుర్తొచ్చాయి.
ఏరి నా స్నేహితులంతా?
ఒక్కొక్కరే నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. నేనే సందీప్ కోసం వాళ్ళందర్నీ వదులుకున్నాను. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత తన్నేసుకున్న సామెత నా పట్ల నిజమైంది.
ఇల్లు ఎలా జేరానో నాకే తెలీదు!
అమ్మ అన్నం తినడానికి రమ్మని పిలుస్తోంది. తాతగారి దగ్గు ఉండుండీ ఒంట్లో కదలిక తెస్తోంది.
నాన్న అడుగుల శబ్దం నా మంచం దగ్గరగా వినిపించి కళ్ళువిప్పాను.
ఆయన నా ప్రక్కన కూర్చున్నారు!
ప్రేమగా నా తల నిమురుతూ "నేను రిటైరవుతున్నానురా!" అన్నారు.
నేను నిర్లిప్తంగా చూశాను.
"అయినా నాకే బాధాలేదు. నా తల్లి నా బాధ్యతలన్నీ తనమీద వేసుకోవడానికి సిద్ధంగా ఉంది... ఇదిగో... ఏం రాసిందో చదువు!" అని ఉత్తరం చేతిలో పెట్టారు.
ఉత్తరం తెరిచాను. కాళింది దస్తూరి ముత్యాల్లా ఉంది. తనకి గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందనీ కర్నూలు పోస్టింగ్ ఇచ్చారనీ, నాన్నగారు ఇంకేం వర్రి అవక్కర్లేదనీ రాసింది. నా చదువూ, పెళ్ళీ అన్ని బాధ్యతలూ ఇంక తనవేననీ, అమ్మా, నాన్న కాలుమీద కాలు వేసుకుని కూర్చుని రెస్ట్ తీసుకోవచ్చనీ రాసింది.
"చిన్నక్కలా చదువుకోవాలి!" నాన్న నా మొహాన్ని పైకెత్తుతూ అన్నారు.
ఆ కళ్ళల్లోకి చూడలేకపోయాను. కన్నీళ్ళతో నా కళ్ళు రెండూ మనసేశాయి! పరీక్ష పాసయిన పసిపిల్లాడిలా నాన్న ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నారు.
పశ్చాత్తాపంతో నా హృదయం కాలిపోతోంది.
పాడుపడిన గుడిలో కరడుగట్టిన శిలలా ఉన్నాడు చందమామ! ఆ రాత్రి...జరిగిన పరాభవాన్ని పదే పదే జ్ఞాపకంచేస్తూ నన్ను ఏడిపించింది.
తెల్లవారుతోంది అనగా...నాకు ఓ పాడు ఆలోచన వచ్చింది. ఇంటికి దగ్గరగావున్న స్టేషన్ లోంచి 'కూ' అన్న రైలుకూత వినగానే లేచి బయలుదేరాను.
* * *
'తొలిపొద్దు తెమ్మెర త్రోవలో పయనమైన పరువెత్తు కోయిల పాటవోలె' అన్నంత అందమైన అమాయకత్వంలోనుండి ఒక్కసారిగా భయంకరమైన వాస్తవంలోకి తోసి వేయబడ్డాను!
నిన్నలన్నీ మిన్నలలో కలిసిపోయాయి.
ఏదీ ఆ అందమైన సాయంత్రం...భావుకుడైన నా చెలికాడి భుజం మీద తలవాల్చి...చెట్లమీదా కంచెలనిండా విచ్చుకున్న పువ్వుల్ని చూస్తూ...చిరునవ్వుల్ని ముంగిట్లో ముగ్గులులా తీర్చిదిద్దుకున్న ఆ అద్భుత క్షణాలేవి?
రసహీనమైన ఈ రోజు... నా జీవితంలోంచి చెరిపెయ్యాలి. అతను లేని రేపుని ఎదుర్కొనే సాహసం ఈ చిన్న హృదయానికి లేదు!
దూరం నించి రైలు వస్తోంది...అమ్మా, నాన్నా, తాతయ్యా, చిన్నక్కా అందరూ తలపుకొచ్చారు. కళ్ళు గట్టిగా మూసుకున్నారు. నేను సర్వం కోల్పోయాను. బ్రతికి ప్రయోజనంలేదు. ప్రేమలేని బ్రతుకు మకరందంలేని వాడిన పూలతో సమానం! పట్టాలమీదుగా ముందుకి నడుస్తున్నాను.
మృత్యువు దీపం పట్టుకుని పరుగెత్తుకు వస్తున్నట్లు ధనా...ధనా...రైలు వేగం పెరుగుతుంది.
ఇంకా కొన్ని క్షణాలు...ఆ సమయంలో కూడా సందీప్ జ్ఞాపకం వచ్చాడు. అతని ఆధారాల నుండి జాల్వారిన ప్రేమామృతపు రుచి మరువలేనిది!
ఈ విషయం తెలిసి రేపు సందీప్ ఏం చేస్తాడో?
నీతాతో సినిమాకి వెళ్ళిపోతాడు!
ఛీ...గబగబా అడుగులు వేశాను. లంగా అంచు పట్టాలకి తగులుకుంది. ఒంగి తీసుకోబోతుంటే గుర్తొచ్చింది. చిక్కుపడనీ...ఎక్కడో అక్కడ చిక్కు పడాల్సిందేగా...కోరివచ్చిన మృత్యువు కూతవేటు దూరంలో ఉన్నాడు. దగ్గరకొచ్చేలోపల విరహమా?
