ఎంతో పెద్ద తుఫాను తాకిడి వస్తుందనుకున్న క్షణంలో తల్లి ప్రశంసలతో పాటు ముద్దుకూడా బహుమానంగా దొరకడంతో ఉష్ అని నిట్టూర్చి నవ్వింది ఆమని. గుండెదడ తగ్గిపోయింది.
"మమ్మీ! పట్నంలో మన ఇంటిలో వుండటానికి ఆయన ఒప్పుకున్నారు. వారిద్దరూ ఒకరికొకరు నచ్చారు. వెంటనే పెళ్ళి చేసేయడం మంచిది. నీకు త్వరగా మనుమడు వచ్చేస్తాడు" అంది ఆమని తల్లి యిచ్చిన చనువుతో.
"పెళ్ళి వెంటనే చేయాలనే విషయం నేను రాత్రి గ్రహించాను."
"మీరు నాలుగున్నర వరకు లేవరు కదా!?"
"పిచ్చిదానా! పెళ్ళి కావలసిన ఆడపిల్లలు ఇద్దరిని ఇంటిలో పెట్టుకుని ఏ తల్లి అయినా ఆదమరచి నిదురపోగలదను కుంటున్నారా?
మీ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? అని ఎవరయినా అడిగితే అదేం గోడలు దూకుతోందా? తొందరేముందిలెండి అని దాటవేయడం తల్లులకు పరిపాటి. ఇప్పుడామాట నేను అనలేను.
కాబట్టి వెంటనే ఆ ప్రయత్నాలు చేస్తాను" అనేసి క్రింది హాలులోకి వెళ్ళిపోయారు సుమిత్రాదేవి.
హమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ అక్కాచెల్లెలు తమ గదుల్లోకి వెళ్ళి పోయారు. మరో ఇరవై నాలుగు గంటల తరువాత ఆమని గ్రామం విడిచి వెళ్ళిపోతుంది.
తాను గడిపే ఆఖరు రోజు ఆనందంగా ఉండాలని కోరుకుంది.
పండుగ తిరునాళ్ళు పూర్తి అయినాయి, ఈరోజు కనుమ.
తిరునాళ్ళలో తిరిగి తిరిగి అలసి టిని విశ్రాంతి తీసుకునే దినం.
కనుమ పండుగ- వీధులలో సందడి ఏమీ ఉండదు.
సుమిత్ర గ్రామ పెద్దలకు కబురు పెట్టింది.
వారు వచ్చారు. వాల్మీకికి వార్త పంపించిందామె.
"తక్షణమే పెళ్ళి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం అభ్యంతరాలేమిటి?
అభ్యతరం ఏమీలేదని అవతలినించి సమాధానం వచ్చింది.
పెళ్ళి తతంగమంతా సక్రమంగా జరిపించాలంటే కరణం లింగమూర్తి చేతి క్రింద ఉండాలి. వెంటనే కబురు పంపించింది.
రాత్రి జరిగిన అవమానం లింగమూర్తి గుండెలమీదికి ఎక్కి త్రొక్కుతోంది. ఇంకా మర్చిపోలేదు. ఇంట్లోంచి భార్య క్షణమయినా కదలనీయదు. పోనీ ప్రశాంతంగా ఇంటిలోనే కూర్చుందామంటే రాల్సిపోయటం మానదు. చేసిన తప్పుకు చెంపలు వేసుకుంటున్నాడు.
జైలులో అనివార్యమయిన శిక్ష అనుభవిస్తున్నట్లు అయింది అతని పరిస్థితి. అలాంటి సమయంలో రాణి సుమిత్రాదేవి నించి పిలుపు అందింది.
బయటపడి ఊపిరి పీల్చుకునేందుకు ఈపాటి అవకాశమయినా దొరికింది బ్రతుకుజీవుడా! అనుకున్నాడు.
"వెళ్ళు వెళ్ళు! అమ్మగారికి నీ నిర్వాహకం అంతా తెలిసిపోయి ఉంటుంది. ఊరంతా జూస్తిరి. ఎవరి నోరు అని మూయిస్తావు. ముంత మూయటానికి మూకుడు ఉంది కాని లోకం నోరు మూయటానికి ఏమైనా ఉందా? నాలుగు వాతలు పెడితే కాని నీకు బుద్ధిరాదు.
నీది కుక్క బుద్ధి! ఎంగిలి తిరుగుళ్ళు ఇహనైనా మానుకుని బుద్ధిగా ఉంటావో, ఎక్కడ కొట్టినా కాలుకుంటే కుక్కలా వీధులు పట్టుకు తిరుగుతావో నేను కూడా వచ్చి అమ్మగారిని అడుగుతాను పద!" అంటూ భర్త వెంట ప్రయాణమయింది భార్య.
"నీ కాళ్ళు పట్టుకుంటా ఆ సంగతి మర్చిపోవే! అమ్మగారు ఎందుకో పిలిచి ఉంటారు. సమాధానం చెప్పుకుని తొందరగానే ఇంటికి తగలడతా కదా! ఈలోపు నీ ఝంఝాటం ఎందుకు?
కాస్త నోరు మూసుకో! అంటూ కదిలిపోయాడు కరణం.
"నన్ను నోరు మూయిస్తావులే! ఇదిగో దారిలో ప్రక్క చూపులు చూచినా ఆ దిక్కుమాలిన గజలక్ష్మి కొంపకెళ్ళి వెళ్ళినా ఉరిపోసుకు చస్తాను. ఆ తర్వాత నువ్వూ నీ పిల్లలూ ఏ గంగలో దూకుతారో నాకు తెలియదు. అని వెనుక నించి కేకపెట్టి మరీ చెప్పింది కరణం భార్య.
"అబ్బబ్బ! నాకు బుద్దొచ్చిందన్నా కదా! ఇంకా సతాయిస్తావెందుకూ? అని దులుపుకుంటూ కరణం లింగమూర్తి వెళ్ళిపోయాడు.
రాణిసుమిత్ర అతని కోసమే ఎదురు చూస్తూ హాలులో కూర్చుంది.
"నమస్కారం అమ్మగారూ!" అన్నాడు.
"మీరు ఇంటి దగ్గరే ఉన్నారా? హమ్మయ్య బ్రతికించారు.
"నేనెక్కడికి పోతాను తల్లీ! ఇంటిదగ్గరే తగలడ్డాను"
"గ్రామంలో అలా మరో వీధికి వెళ్ళారేమో!"
"అమ్మో! మీకు కూడా తెలిసిపోయిందా? బుద్ధి వచ్చింది అమ్మగారూ! ఇంకెప్పుడూ అలాంటి గడ్డి తినే పనులు చేయను"
"పిల్లలూ బాధ్యతలూ కలవారు. నాకు తెలుసులెండి. ఇక నుంచి మీరు జాగ్రత్తగానే ఉంటారు. పంతులుగారు ఊళ్ళో ఉన్నారా?"
"వైశాఖమాసం కదా! ఎక్కడయినా ముహూర్తాలు తగలడ్డాయేమో?"
"ఒకసారి వారిని పిలుచుకురండి."
కరణం లింగమూర్తి పరుగున వెళ్ళిపోయాడు.
పంచాంగం కట్టతో సహా పంతులుగారిని వెంట పెట్టుకుని తిరిగి వచ్చాడు.
"పంతులుగారూ! చంచలరావుగారి అబ్బాయికి మన గాయత్రికి పేర్లు కలుస్తాయో లేదో చూడండి. బాగుంటే వెంటనే పెళ్ళి చూపులకు పిలుద్దాం. పంతులుగారు పంచాంగం కట్ట విప్పి ఆవులించారు.
"రాత్రంతా ఏం చేశారు?"
"మీ దయవల్ల రాత్రి దొంగల దోపిడి పండుగకదా అమ్మగారూ ఈ నిష్ఠ దరిద్రుడు కరణం లింగమూర్తి ఆ గజలక్ష్మితో."
"హవ్వ నోరు ముయ్యి పంతులు ఇవన్నీ అమ్మగారితోనా?"
"అందుకని రాత్రి నిద్రలేదు" అంటూ మరోసారి ఆవులించాడు పంతులు.
"వీరి దాంపత్యం అన్యోన్యంగా చిరకాలం సాగుతుంది అమ్మగారూ! అమ్మాయిగారిది దేవగణం! అబ్బాయిగారిది మనుష్యగణం.
అమ్మాయిగారిది కన్యారాసి! అబ్బాయి గారిది మిధునరాసి! ఓహో! లక్కా బంగారంలా అతుక్కుపోతాయి జాతకాలు!
"కాని సంతానప్రాప్తి గురించి........."
"ఈ దంపతులకు సంతానప్రాప్తి లేదంటారా?"
"అమ్మమ్మా!! అంతమాట అనకండి. సలక్షణమయిన కొడుకు పుడతాడు. కాని ఏదో అడ్డుతెరల లాంటివి కన్పిస్తున్నాయి."
"ఫలితాంశం ఏమిటో ఖచ్ఛితంగా చెప్పండి. ఆ విషయంలో నేను రాజీపడను.
"సంతానప్రాప్తి ఉంది. కాని అలస్యమవుతుందనుకుంటా. అదయినా అబ్బాయిగారికి సలక్షణంగా ఉంది, బహు సంతానప్రాప్తి వారికి!"
"చాలు, చాలు! ముహూర్తాలు ఎప్పుడున్నాయి"
"చాల భాగం దాటిపోయాయి. జ్యేష్టమాసం రాకుండా చెయ్యాలి! అమ్మాయిగారు మీకు జ్యేష్ట పుత్రిక! అబ్బాయిగారు చంచలరావుగారి జ్యేష్ట పుత్రుడు! ఈ జంటకు జ్యేష్ట మాసంలో పెళ్ళి పనికిరాదు.
"ఆ తరువాత లగ్నాలు లేవు"
"అయితే ఏం చేయాలంటారు?" అని ప్రశ్నించింది కంగారుగా!
"దశమి గురువారంనాడు మీనలగ్నం ఒకటుంది. అదైతే వారికి దివ్యంగా ఉంటుంది" అంటూ తేల్చి చెప్పాడు పంతులుగారు.
"అంటే తొమ్మిది రోజులకే పెళ్ళా!" అని విస్తుపోయింది సుమిత్ర.
"లేకపోతే పుష్కరాలు వచ్చిపడతాయి కాబట్టి వచ్చే చైత్రందాకా ఆగాల్సిందే! క్రొత్త పంచాంగం రావాలి. అప్పుడు చూస్తే తెలుస్తుంది." అన్నాడు.
"మరి పిల్లలు పెళ్ళిచూపులు నెరవేర్చుకోవాలి కదా!?"
"అందుకు నిన్నటిరోజు అయితే బాగా ఉండేది అమ్మాయిగారూ."
"సరే మళ్ళీ కబురు చేస్తాను వెళ్ళిరండి. లింగమూర్తిగారికి యిచ్చి పంపండి? అంది సుమిత్ర. ఆమె ఆలోచనలో పడిపోయింది.
ఎప్పుడొచ్చారో గాయత్రి ఆమని ఆమె వెనుక నిలిచి ఉన్నారు.
"తొమ్మిది రోజులలో పెళ్ళిపనులు పూర్తి చేయటం అసాధ్యం! ఎలాగయినా పరుగెత్తించేద్దాం అనుకుంటే పెళ్ళి చూపుల తతంగం పూర్తి చేయటానికి మంచి ముహూర్తం దొరకలేదు. వచ్చే సంవత్సరం చైత్రం దాకా ఆగటం బాగుంటుందా? ఏం చేయాలో పాలుపోవటం లేదు బేబీ?" అంటూ సోఫాలో వెనక్కివాలి కూర్చుంది సుమిత్ర! చెరోవంక కూర్చున్నారామెకు!
"మమ్మీ! మీరు అర్ధం చేసుకుంటానంటే ఓ విషయం చెప్తాను" అంది ఆమని.
"ఏమిటది చెప్పు" అంది తల్లి అలసటగా ఉండి కళ్ళు విప్పలేదు.
"పంతులుగారు పెళ్ళిచూపులు రాత్రి జరిగితే బాగుండేదని అన్నారు కదా! రాత్రి జరిగినవే పెళ్ళి చూపులు అనుకుంటే తప్పేముంది. జగదీశ్వరస్వామి ఆలయంలోకి వెళ్ళి స్వామి సన్నిధిలో అక్కా బావ కలుసుకున్నారు.
అదే దైవసంకల్పం అనుకుందాం!
అంతకన్నా పవిత్రమయిన పెళ్ళిచూపులు ఉంటాయా?" అంది ఆమని!
చివ్వున కళ్ళువిప్పి చూసింది సుమిత్ర!
"ఆమనీ! భగవంతుడు ఈ ఏర్పాటు నీ ద్వారా చేయించాడు ఎంత గొప్పదానివి అయిపోయావే! అదే నిజమని అబ్బాయి కూడ ఒప్పుకుని ఈ ముహూర్తానికి ఈ పెళ్ళి జరిగితే మేమంతా నీకు ఋణపడినట్లే."
"ఛ అదేంటి మమ్మీ! మనలో మనకి రుణాలేంటి? అక్కకు త్వరగా పెళ్ళి కావటం కంటే నాకు కావాల్సింది ఏముంది? ఈపూటే నేను వెళ్ళి బావగార్ని కలుస్తా! ఒప్పిస్తా! మీరు ప్రయత్నంలో ఉండండి."
"అలాగేనమ్మా! కాని అల్లరి చిల్లరి పిల్లలా వెళ్ళకు. చక్కగా జరీ చీర కట్టుకుని పెళ్ళి పెద్దలాగా జీపులో వెళ్ళు! అబ్బాయి అంగీకారం నువ్వు సాధించి తీసుకు రాగలిగితే అక్క జీవితమంతా నీ పేరు తలుచుకుంటూ ఉంటుంది. వెళ్ళిరా తల్లీ!!" అని శిరస్సుని అరచేత్తో తాకి గద్గదస్వరంతో అడిగింది తల్లి! గాయత్రి వంక చూచింది ఆమని!
