Previous Page Next Page 
పరిహారం  పేజి 23


    "నువ్వు అందని పండువని నాకు తెలుసు మనూ! మరీ అంత ప్రపంచం తెలియని అమాయకురాలిని కాదు" పారిజాత కన్నుల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.  "ఇది కేవలం నాన్న ఆత్మసుఖంగా వెళ్ళిపోవడం కోసం ఆడే నాటకం. నువ్వు నాన్నతో చెప్పేదానికి తరువాత విలువేమీ ఉండదు ఆమాట పట్టుకుని నిన్ను ఎప్పుడూ నిర్బంధించనని నీకు వాగ్దానం చేస్తున్నాను"
    "ఈ నాటకానికి నీకు ఇంకెవరూ దొరకలేదా?"
    "నటించేవాళ్ళకు ప్రతిఫలం ముట్టజెప్పాలిగా? నీకైతే అక్కరలేదు
    మనోహర్ కొద్దిసేపు అన్యమనస్కంగా ఉండిపోయి చివరికిలేస్తూ "పద పారిజాతా!" అన్నాడు.
    పది నిమిషాల తరువాత తిరిగి వచ్చి అతడు బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళిపోయాడు.
                          *    *    *
    మనోహర్ తిరిగి వచ్చేసరికి రాత్రి పదిగంటలవుతోంది.
    అతడు భోజనం చేసి పైకి వెళ్లబోయేంతలో తల్లి నిలవేసింది.
    "ఏరా! కోడల్ని యెప్పుడు తీసుకువస్తున్నావు?"
    "............"
    "ఆ పిల్ల అంటే మామూలు దయ, ప్రేమ తప్ప ప్రత్యేకం ఏం లేదన్నావు, అది భార్యగా మారేది కాదన్నావు, కాని నువ్వు కన్న తల్లిని మోసగించే మొనగాడివయ్యావు, నా కంఠంలో ప్రాణముండగా దాన్ని కోడలిగా అంగీకరించనని తెలియదా!"
    "తెలుసునమ్మా!" కొడుకు కంఠం మందస్వరాన పలికింది.
    "తెలిసి ఈ పని ఎందుకు చేశావు?"
    "మనిషిగా..... నా కర్తవ్యం నిర్వర్తించడం కోసం! అభాగ్యుడు తన మరణ సమయంలో నిశ్చింతగా శాంతిగా వెళ్ళిపోవడం కోసం చేసాను. కాని, పారిజాత నీ కోడలిగా వస్తుందని భయపడకమ్మా! కోడలి ఎన్నిక పూర్తిగా నీ ఇష్టానికే వదిలిపెడుతున్నాను!"    
    "ఇంకా ఎందుకురా ఈ బూకరింపులు? కన్నతల్లి ముందే నాటకాలాడే కొడుకువు అయ్యావు!"
    "నేను నాటకమాడి మోసగించింది కృష్ణారావు మాస్టారినమ్మా! నిన్ను నేనెప్పుడూ మోసగించను. తండ్రి శాంతిగా వెళ్ళిపోవడం కోసం పారిజాత ఈఒక్క సహాయం కోరింది."
    "మీ మీ మధ్య ఏమేం రహస్యాలు, వ్యవహారాలున్నాయో నాకు అనవసరం. మనూ! ఆపిల్ల అంటే నీకు ప్రేమ ఉండొచ్చు. పెళ్ళి చేసుకోవాలనే కోరికా ఉండొచ్చు కాని, ఇది నేనెంతో కష్టపడి కూర్చుకొన్న అంతస్తు. ఈ అంతస్తుకు తగిన అంతస్తుతోనే వియ్యమందుతాను. ఏనాటికీ దిక్కూ మొక్కూ లేని ఆ ముష్టిపిల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు తెలిసిందా?"
    "నేను నీ మాట కాదన్న రోజు కదమ్మా నువ్వు ఈ మాటలన్నీ అనాల్సింది?"
    "అయితే నేను చెప్పినట్లు వింటానని ప్రమాణం చెయ్యరా!"
    "ఏమిటమ్మా ఆడపిల్లను ఆంక్షల్లో పెట్టినట్టు! ఇప్పుడు నేను ఏం చెడిపోతున్నాననీ? ఏం కానిపని చేస్తున్నాననీ?" మనోహర్ లో విసుగు పైకెగసింది.
    "నిన్ను నా చేతుల్లో పెట్టుకోక పోతే ఏ పారిజాత లాంటి రాక్షసో నిన్ను వల్లోవేసుకొని నా ఆశల్ని నేల కూలుస్తుందిరా! చెప్పు, నేను చెప్పినట్టు వింటావా లేదా?"
    "ఏం చెయ్యాలి చెప్పు?"
    "తక్షణం నువ్వు సూటుకేసు సర్దుకొని మీ మేనమామ ఊరికి వెళ్ళు."
    "వెళ్ళి ఏం చేయాలి?" అయోమయంగా చూశాడు తల్లి ముఖంలోకి.
    "నేను పిలిచేదాకా రాకు!"
    "మరి ఉద్యోగం!"
    "పోతే పోయింది"
    "పిచ్చిదానవమ్మా! నేను పారిజాతను చేసుకోవాలనే అనుకొంటే ఇవన్నీ అడ్డుగా నిలువగలవా? అయినా నీ సంతృప్తి కోసం అలాగే వెడతాను"
    తెల్ల వారేసరికి మనోహర్ మేనమామ ఊరికి వెళ్ళిపోయాడు.
    అతను వెళ్ళిపోయిన కొంచెం సేపటికే కోమలమ్మ కాంపౌండ్ పారిజాత హృదయ విదారకమైన ఏడుపుతో ప్రతిధ్వనించసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS