Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 23


    'ఒహ్! నేను దుఃఖాన్ని ప్రేమిస్తున్నాను. భ్రాంతి నన్ను వంచిస్తున్నది!' ఒక్క నిట్టూర్పు విడిచి, కదిలాడు భార్గవరామ్ - 'రా, దేవతా' అంటూ,
   


                                      7


    పరుపులో మెత్తగా ఒళ్ళు విరుచుకొంటూ లేస్తూనే, నిన్న కర్రను పామనుకొని బావను కౌగలించుకొనడం గుర్తొచ్చి మనసు మాధ్యుర్యాలమధ్య పరవశించింది. 'నేను ఆశలు అల్లుకోవడానికి అవకాశమిచ్చిన బావనన్ను వంచిస్తాడా?' అన్న ధైర్యం 'ఏమో! వింత మనిషి ఉన్నట్టుండి ఏమైనా చేయవచ్చు? అన్న శంక ఆమెను ఆశ నిరాశలమధ్య ఊగిసలాడిస్తున్నాయి.

    ముఖ ప్రక్షాళనం గావించుకొని టీ కోసం వంటశాలలోకి వెళ్ళింది దేవదాసి. "బావకు టీ తీసుకువెళ్ళారా, సుబ్బయ్యగారూ?"

    ముఖమంతా ఎలాగో చేసుకొన్నాడా బ్రాహ్మణుడు, "బాబుగారు తమగదిలో తలక్రిందులు తపస్సు చేస్తున్నారమ్మా"

    ఫక్కుమంది దేవదాసి,  "ఏమిటలా అంటున్నారు సుబ్బయ్యగారు!"

    "నవ్వుతారేమమ్మా? బాబుగారు తమ గదిలో శీర్షాసనంలో ఉన్నారమ్మా"

    దేవదాసి ముఖంలో పరిహాసం తొలగి చటుక్కున గాంభీర్యం అలుముకొంది. ఆమె ఎంత అణచుకొందామని ప్రయత్నించినా వ్యక్తమవుతున్న ఒక విషాదభావం చూచి లోలోపల ఒక నిట్టూర్పు విడిచాడు సుబ్బయ్య.

    "బావ ఆసనాలు వేస్తాడా?"

    "వేసేవాడు అప్పుడు విదేశాలనుండి తిరిగి వచ్చినప్పటి నుండి ఆసనాలు వేయగా, ముక్కు మూసుకుకూర్చోగా చూడలేదు. ఆ ఏకాంత ప్రియత్వం ఆ పరధ్యానం కొంచెం వదిలి మీలో నవ్వుతూ తిరగడం చూచి మాకేమిటో ఆశ కొట్టుకవచ్చింది.  తల్లీ! కొంచెం మారి వచ్చాడనుకొన్నాం. మళ్ళీ మొదటికి వచ్చినట్లుంది వేషం!

    ఇవాళ బావ మరోరకంగా పరిచయమయ్యాడు దేవదాసికి. సంధ్యావందనం కూడా అతడు చేయగా చూడలేదు దేవదాసి. కేవలం మిధ్యావాది తప్ప అతడిలో ఆస్తికత ఉందనికూడా అనుకోలేదామె.

    "దేనిని గురించి అతడి మనస్సు? ముక్తా? భగవంతుడా? ఆనందమా? స్వర్గమా?"

    మెట్లెక్కుతూంటే దేవదాసి గుండె విచిత్రంగా కొట్టుకుంది.

    భార్గవరామ్ గది తలుపులు మూసి ఉన్నాయి. కిటికీ నుంచి  లోనికి చూచింది. తూరుపు దిక్కుముఖమై, ఇస్త్రీ నుండి తీసిన శుభ్రమైన టవల్ మీద పద్మాసనంలో ఉన్నాడు భార్గవరామ్. నిశ్చలంగా కన్నులు మూసుకొని నీలి మేఘానికి అంచులు వేసే చందమామవలె అతడిలో వెలుగుతున్న అఖండ ఆత్మజ్యోతి ఒక పవిత్రమైన తేజస్సును ఆ ముఖమండలంలో వెలువరిస్తుంది.

    ఆ క్షణంలో అతడిని ప్రియుడుగా భావించుకోడానికి సంసారిగా ఊహించడానికి, సాహసం చాల్లేదు దేవదాసికి. అతడు తనతో సరదాగా మాట్లాడుతూ సామాన్యుడివలె వ్యవహరించినప్పుడు కలిగే ఆశ. ఈ మూర్తిని చూస్తుంటే దరిదాపులకు లేకుండా పారిపోయింది!

    బరువెక్కిన హృదయంతో క్రిందికివచ్చేసింది. నిలిచిన చోట నిలవకుండా కూర్చొన్నచోట కూర్చోబుద్ధికాకుండా మనస్సంతా దిగులుగా తయారైంది.

    దేవదాసి స్నానం చేసివచ్చి సుబ్బయ్య వంటకు సాయంగా కూరగాయలను తరిగిపెడుతూ కూర్చుంది. "బావ ఇవతలికి, వచ్చేదెప్పుడు, సుబ్బయ్యగారూ?"

    షుమారు పన్నెండు అవుతుందేమో?"

    "ఎప్పటికీ ఇంతేనా?" ఇవాళ కొంచెం ముందుగానే అతడు ఇవతలికి వచ్చేస్తే బాగుండుననిపించింది దేవదాసికి.

    "ఆఁ? ఏ రాత్రివేళనో లేచి పెరటినూతినీళ్ళు నాలుగు బాల్చీలు మీద గుమ్మరించుకొని వెళ్ళి ఆ గదిలో ప్రవేశించాడంటే తిరిగి యవతల ప్రపంచంలో పడేది ఏ పన్నెండు గంటలకో!"

    "పరిమితాహారమంటూ సగం కడుపుకుతింటూ, అర్థరాత్రులు లేచి ముక్కు మూసుక్కూర్చోవడం అదంతా చూసి కృష్ణవేణమ్మతల్లి కుళ్ళి కుళ్ళి ఏడవని దినంలేదుపాపం! భూదేవిలా ఇంత దుఃఖాన్ని భరించింది!"

    "ఊఁ"



                                                                             8


    "ఒరేయ్, రాఘవుడూ! ఒరే, నాగన్నా ఎక్కడర్రా సామాను తీసుకు వెళ్ళి ఇంట్లో పెట్టండిరా"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS