Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 23

    సీతాలు పావుగంట ఎడతెరిపి లేకుండా తిట్ల వర్షం కురిపించింది. తింగరయ్య కాగితం కలం తీస్కుని దాని తిట్లన్నీ రాస్కున్నాడు.
    "మీ లాంటి యదవలదగ్గర నేను పంచెయ్యను"గట్టిగా అరిచింది సీతాలు.
    "హిహి..." సీతాలుని చూసి ముచ్చటేసి నవ్వాడు.
    "నీ..." అతని నవ్వు చూసి ఒళ్ళు మండి ఓ బూతు విసిరింది సీతాలు.
    "హిహి..."
    "నీ..." మరో బూతు
    "హిహి..."
    "నీ..."ఇంకోటి
    "హిహి.."
    "రేపట్నుండి పన్లోకి రాను దొంగ సచ్చినోడా" అని విసురుగా వెళ్లిపోయింది.
    అదెళ్ళగానే తింగరయ్య దైవాదీనంకి ఫోన్ చేసి రమ్మనాడు."ఈసారి మాంచి ఇంటర్వ్యూ ఇస్తాను..."అన్నాడు.
    "ఏమో నాకు నమ్మకం లేదు.. ఫోన్లోనే చెప్పండి ఏమేం తిట్లు నేర్చుకున్నారో..."అన్నాడు దైవాదీనం.
    తింగరయ్య ఫోన్లో సీతాలు దగ్గర నేర్చుకున్న తిట్లన్నీ తిట్టాడు.
    "హబ్బే... మరి కాస్త పవర్ పుల్గా ఉండాలి... మరి మీరు రాజకీయ నాయకులు కదా... అంత చిన్న తిట్లైతే ఎలా?" అని మందిలించి ఫోన్ డిస్కనెక్ట్ చేశేశాడు దైవాదీనం.
    ఈసారి తింగరయ్యకి మరో బ్రిలియంట్ అయిడియా వచ్చింది.
    ఊళ్ళో అప్పుడు ఆడ్తున్న "సిలిపెదవా?""అల్లరి పిచ్చివోడు" సినిమాలు చూసి వాటిల్లోని డైలాగులు బట్టిపట్టి దైవాదీనంకి వినిపించాడు.
    "ఈ మాత్రం బూతులు చాల్తాయా?" అని ఆశగా అడిగాడు.
    దైవాదీనం పెదవి విరిచాడు.
    తింగరయ్యని చాలా నిస్పృహ ఆపరించేసింది. నేను జీవితంలో మంచి రాజకీయ నాయకుడ్ని కాగలనా? అని మధనపడ్డాడు.
    ఆ రోజు తింగరయ్య టీవీలో వస్తున్న తెలుగు స్పాన్సర్డ్ ప్రోగ్రాం ఒకటి చూస్తున్నాడు. అతనెప్పుడూ తన ఆలోచనల్లో తన పనుల్లో ఉంటాడు. టివి ప్రోగ్రాములు అస్సలు చూడడు. అతనికి అదే మొదరిసారి తెలుగు స్పాన్సర్డ్ ప్రోగ్రాం చూడడం.
    అది చూస్తున్న కొద్దీ అతనిలో ఆవేశం పెల్లుబికింది... టివీలో ఇంత, దరిద్రం నాటకాలు వస్తాయా?...
    కాస్సేపు చూశాక అతనిలో సహనం నశించి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు.
    "దరిద్రం నాటకం... నీ... నీ... నీ... నీ..."
    "హవ్వ... హవ్వ... అవేం తిట్లండీ... ఏ తెలుగు సిన్మాల్లోనూ చూడ్లేదు... ఎప్పుడూ విన్లేదు ఇలాంటి బూతులు!!..."అంది చెవులు మూస్కుంటూ శాంతమ్మ.
    తింగరయ్య భార్యవంక ఆశ్చర్యంగా చూశాడు.
    "నిజంగా అంత బాగా తిట్టానా నేను!" అని అడిగాడు.
    "తిట్లా?... పచ్చి బూతులు... విన్లేక చచ్చా..." అంది శాంతమ్మ.
    "ఆవేశంతో ఏం తిట్టానో తెలీదు... ఏం తిట్టానో కాస్త చెప్పు..." ఉత్సాహంగా అడిగాడు.
    శాంతమ్మ చెప్పింది.
    ఆ బూతులు విని తింగరయ్య సిగ్గుతో చితికిపోయాడు.
    నేనేనా ఇట్టా తిట్టింది?
    "యాహూ"అని అరిచి దైవాదీనంకి ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు.
    దైవాదీనం రాగానే శాంపిల్ గా కొన్ని బూతులు వినిపించాడు.
    దైవాదీనం ఈసారి తృప్తిగా తల ఊపాడు.
    "పర్లేదు!ఇహ మిమ్మల్ని ఇంటర్య్వూ చేసి మా పత్రికలో వెయ్యొచ్చు!" అన్నాడు.
    దైవాదీనం తింగరయ్యని ఇంటర్య్వూ చేశాడు. ఆ ఇంటర్య్వూలో ఇతర పార్టీ నాయకుల్ని బండబూతులు తిట్టాడు తింగరయ్య. దాన్ని యధాతథంగా ప్రచురించాడు దైవాదీనం.
    కొందరు ప్రెస్ రిపోర్టర్లు ఆ ఇతర రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని "పొద్దున్నే సుత్తి" పత్రికలో తింగరయ్య... అలా విమర్శించాడు... దానికి మీరేమంటారు?" అని అడిగారు.
    దానికి వాళ్ళు తింగరయ్యని బండన్నర బండ బూతులు తిట్టారు.
    మర్నాడు ఆ తిట్లన్నీ అన్ని పత్రికల్లో వచ్చాయ్.
    తరువాత దానికి జవాబుగా తింగరయ్య మళ్ళీ వేశ్య అయినా వింటే సిగ్గుపడే బూతులు వాళ్ళని తిట్టాడు. ఆ తిట్లు మళ్ళీ పత్రికల్లో పడ్డాయ్. బహిరంగ సభల్లో కూడా వాళ్ళనీ వాళ్ళనీ తిట్టడం మొదలు పెట్టాడు. ఆ తిట్లు తిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి పత్రికలు వాటిని ప్రచురించసాగాయి. తింగరయ్య తిట్లకి ప్రతిగా వాళ్ళూ తిడ్తూనే ఉన్నారు.
    అలా ఆ తిట్ల ధర్మమా అని తింగరయ్య పేరు ప్రతిరోజూ న్యూస్ పేపర్లలో పడ్తూంది. ఆ విధంగా అతనికి పబ్లిసిటీ వచ్చి పాపులర్ అయ్యాడు.ప్రజలకి అతనిపేరు బాగా అలవాటైంది.
    తరువాత ఎన్నికలొచ్చాయ్. వాటిల్లో తింగరయ్య పార్టీ ఘనవిజయం సాధించింది.
                                                  *    *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS