10
కావేరీకి కొత్త చీరకట్టారు. తలంటారు. వదులుగా జడవేసి మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టిన మాలని నాలుగు వరుసలుగా మడిచిపెట్టారు. కాళ్ళకి పసుపు రాశారు...యివన్నీ సుభద్రమ్మ చేసింది కూతురికి అలంకారం పెద్దకూతురు పార్వతి వున్నా సరే! ఆ గ్రామంలో పెద్దలనబడే వారందరినీ భోజనానికి పిలిచారు. యిరుగు పొరుగు ఆడవారు వచ్చి వంటలు చేయటం, మరికొందరు వారికి సహాయపడటం! పదకొండుగంటలకే లగ్నం పెట్టుకోవటం వలన ఈ హడావుడి. వరండా అరుగులమీద చాపలు పరిచారు. ఎక్కువసేపు కూర్చోలేని వారికి మంచాలు వాల్చి ఉతికిన దుప్పట్లు పరిచి వుంచారు.
దూరపు బందువయిన రాజమ్మని కబురు చేసి తీసి తెప్పించింది.
కామాక్షమ్మ అన్నగారింటికి వెళ్ళేసరికి కావేరీని పీటలమీద కూర్చోబెట్టి పూజ జరిపించుతున్నారు పూజారిగారు. దగ్గిర కూర్చుని అన్ని అందించుతోంది రాజమ్మ. పార్వతి కూడా ఆ దగ్గిరే నిలబడి వుంది....
వినాయకరావు కొత్త గ్లాస్కోపంచే, సన్నగడి షర్టు వేసుకుని తలంటుకుని దేవుని ముందుండే కుంకుమ తీసి నొసలు మధ్య కుంకుమ బొట్టు పెట్టుకుని గ్రామ పెద్దలమధ్య కూర్చున్నాడు. కామాక్షమ్మ ఆ యింటికి వచ్చేసరికి సుభద్రమ్మ వంటల పర్యవేక్షణలో మునిగి తేలుతూ వుండిపోయింది. ఆడబడుచుని చూడగానే చిరునవ్వుతో ఎదురువెళ్ళి మర్యాదగా లోపలికి తీసుకుని వచ్చింది. కాబోయే వీపరాలు కదా!
పరంధామయ్య చెల్లెలిని చూసి నవ్వుతూ అడిగాడు.
"ఇంత ఆలస్యం చేశావేమిటమ్మా!"
"మీరంతా వున్నారుగా అన్నయ్యా?...కావేరీకి బట్టలు, నగలు వినాయకం చేతనే యిప్పించు. పూజారిగారికి కూడా చెప్పాను. ఒకవేళ మరిచి పోతారేమో? దగ్గిరవుండి అజ చూసుకో!...ఏమయినా రావలసి వున్నవి రాకపోతే నాతో చెప్పు!"
"అలాగేనమ్మా!...నువ్వు కూర్చోవమ్మా!..." చాప చూపించాడు.
చాపమీద కూర్చోబోతూ పార్వతిని చూసింది. పార్వతి కూడా మేనత్తను చూసి నవ్వి దగ్గిరకు వచ్చింది.
"ఎప్పుడొచ్చావు పార్వతీ?..." అనడిగింది కామాక్షమ్మ.
"రాత్రి చాలా పొద్దుపోయింది అత్తయ్యా వచ్చేసరికి! నాన్న వ్రాసిన కార్డు ఆలస్యంగా అందింది. మావారు పెళ్ళికి రెండు రోజులు ముందు వస్తానన్నారు...ఈ వార్త వస్తుందని ఎదురుచూస్తూనే వున్నాను!"
"వదిన ఒక్కతే యాతనపడుతుంది పనులుతో! నువ్వు వుంటావుగా?"
"ఆఁ. వుండాలనే వచ్చాను అత్తయ్యా!"
వినాయకం మాత్రం కావేరీనే చూసుకోసాగాడు. యిప్పుడతనికి ఎంతో తృప్తిగావుంది. ఆనందంగా వుంది. అందరూ అనటమే కాదు, నిజంగా నా కావేరి బంగారుబొమ్మ! రతనాల మొగ్గ! ఆ అందమంతా తనదే!....తనదే!...పాపం సినిమాలకి మొహం వాసిపోతోంది రోజుకో సినిమా చూపించాలి! తల్లికి సినిమాలంటే యిష్టం వుండదు. "వద్దని" అంటే నచ్చచెప్పాలి! తన కావేరీతోనే తన లోకం! తన కోరికలన్నీ తీర్చేయాలి! ...అవసరం అయితే ఒకసారి మద్రాసు తీసుకెళ్ళి సినిమా వాతావరణం అంతా చూపించి తీసుకురావాలి!
"ఈ రోజుకి సరిగ్గా పదిరోజులున్నది శుభముహూర్తం! మిధున లగ్నమందు. రాత్రి పదిగంటల ముప్పయి ఎనిమిది నిమిషాలకి వివాహ మహోత్సవము."
అని చదివి ఆ తెల్లకాగితానికి నాలుగువైపులా పసుపు రాసి పరంధామయ్యకి యిచ్చారు పూజారిగారు. మరొకటి వినాయకానికి యిచ్చి పరస్పరం మార్చుకొమ్మన్నారు.
మేనమామకి శుభలగ్న పత్రిక చేతిలో వుంచి వంగి కాళ్ళకి నమస్కరించాడు ఎంతో వినయంగా! ఆప్యాయంగా మేనల్లుడిని భుజాలు పట్టుకుని లేవదీసి గుండెలకి హత్తుకున్నాడు.
"నా కళ్ళముందే వుండాలని బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో వినాయకం?" అన్నాడు గద్గద స్వరంతో!
"నా గుండెల్లో దాచుకుంటానుగా మామయ్యా!....కావేరీకి ఎలాంటి లోటూ రానివ్వనుగా!" వినాయకం మనస్పూర్తిగా జవాబు యిచ్చాడు మేనమామకి! చివరకు అందరూ వెళ్ళిపోయారు. వినాయకం ఎవరు చూడకుండా గబ. గబ, కావేరి వున్న గదిలోనికి వెళ్ళాడు.
ఈ అందాల బొమ్మ కొద్ది రోజులలో తన భార్య కాబోతున్నది. అలా అనుకుంటూ వుంటే వినాయకానికి ఎంతో సంతోషంగా వుంది.
దగ్గరకు వెళ్ళి వంచిన తలని తన రెండు అరచేతులతోనూ చెంపలను పట్టుకుని పైకి లేపాడు.
"నాకీ రోజున ఎంత సంతోషంగా వుందో మాటలతో చెప్పలేను కావేరి?..."అన్నాడు ఎంతో ఆప్యాయంగా!
కావేరి నవ్వేసిందిగాని పెదవి విప్పి ఒక్కమాట మాట్లాడలేదు. అదంతా సిగ్గువలన అనుకున్నాడు.
"నీకెలా అనిపించుతుంది కావేరి?" చెంపల మీద చేతులు భుజం మీదకి వచ్చాయి.
ఈసారి కూడా జవాబు చెప్పలేదు కావేరి! నిర్లిప్తంగా చూస్తూ వుండిపోయింది. ఆమెలో ఎలాంటి చలనమూ కనిపించలేదు.
యిది వరకు బాగానే మాట్లాడేదిగా? ఈ రోజు ఏమయింది? ఎందుకింత మౌనంగా వుంది? అన్న సందేహం కలిగింది వినాయకానికి? తానేమన్నా పరాయివాడా? అంటే అదీలేదు! మరెందుకలా మూగనోము పట్టింది? ....అలాగనీ అడగలేకపోయాడు.
"ఈ ముదురాకు పచ్చ పట్టుచీర నీ రంగుకి బాగా నప్పుతుందని నేనే కావాలని పట్టుపట్టి ఈ రంగు చీర కొనిపించాను అమ్మతో! నీకు నచ్చిందా కావేరి?...
"ఊఁ.."
"అమ్మ వడ్డాణం ఎప్పుడూ పెట్టుకునేది కాదు! ఇనపపెట్టే తీసి నప్పుదంతా వడ్డాణం పట్టుగుడ్డలో చుట్టి వుండటం చూసి అడిగేవాడిని. నువ్వెప్పుడూ పెట్టుకోవేమిటమ్మా! అని! నేను యింకేమి పెట్టుకుంటా నురా? నీ పెళ్ళానికి పెడతానులే! అనేది. ఆ తరువాత అమ్మ మర్చి పోయినా నేను మాత్రం మరిచిపోలేదు. అందుకని నిన్న అడిగాను. వడ్డాణం కావేరికి పెట్టమని!...అమ్మ ఏమనుకున్నదో? ఏమో? ఈరోజు మన పెళ్ళి ఖాయం అనుకున్న సందర్భంలో నీకని పెట్టింది...ఈ బంగారపు వడ్డాణం నీ సన్నని నడుముకి ఎంత అందాన్ని యిచ్చిందో చూడు?...పచ్చని నీ శరీర ఛాయలో ఈ బంగారపు గాజులు కలిసిపోయాయి చూశావా?...అరే! గోరింటాకు కూడా పెట్టుకున్నావా?...నేను చూడనే లేదు...ఎంత అందంగా నిండుగా వున్నదో?..." అంటూ కుడిచేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు వినాయకరావు.
అప్పటికి చలనం వచ్చినట్లయింది కావేరీలో! వినాయకరావు చల్లటి పెదాల స్పర్శకి శరీరం రోమాంచితమయిపోయింది. మైమరచినట్లుగా కళ్ళు మూసుకున్నది...ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించటంతో యిద్దరూ దూరంగా జరిగారు.
