Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 23

                           
    "సుందరి అనే అమ్మాయితో ఈ గొడవ ప్రారంభంఅయింది. సుందరి అప్పారావుకి బాగా తెలుసునని అనుమానం....అన్నట్టు ఇన్ స్పెక్టర్.....మరి ఆ చెవిరింగు సంగతేమిటి? అప్పారావుకి కొంచెం దూరంలో పడి ఉందా రింగు. అప్పారావుకి సుందరి బాగా తెలుసు. సుమిత్ర హత్యా రహస్యం కూడా అప్పారావుకి తెలుసునని నా అనుమానం. అదే అతనికి చావుకి దారి తీసి ఉండాలి!" అన్నాడు రాజారామ్.

    "రాజారామ్ గారూ, మీరో విషయం మరిచిపోతున్నారు. ఆ చెవిరింగుని మీరే కనిపెట్టారు. సుమిత్ర యింటికి మీరు వెళ్ళారు. అక్కడా సుందరి చెవిరింగుని మీరు సంగ్రహించి అప్పారావు గదిలో పడేశారని నేననుకుంటే మీరేం అంటారు?"

    "ఆ అవసరం నాకేం ఉంది?"

    "ఎందుకా మమ్మల్ని దారి తప్పించడానికి...మిస్ లీడ్ చెయ్యడానికి! అప్పారావు గారికీ, సున్దరికీ ఏదో సంబంధం ఉందని మమ్మల్ని నమ్మించడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. సరే నేనోమాట అంటాను. మీరు వినండి. అప్పారావుగారు చచ్చిపోయారని మీకు ముందే తెలుసు. సుందరి చెవిరింగుని మీరే ఆ గదిలో పడేశారు. అప్పారావు గారు చాలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ పర్సన్ అయ్యారు. ఒక పెద్ద డెయిలీకి ఎడిటర్ కూడా అయ్యారు. అలాంటి వ్యక్తికి సుందరిలాంటి మాసేజ్ గర్ల్ తో ఏం పని?" అని సవాలు చేస్తున్నట్టు అడిగాడు దుర్గారావు.

    "అదే తెలిస్తే ఈ కేసు మబ్బులా విడిపోయేది...." అన్నాడు రాజారామ్.

    "సరే-ఇన్ స్పెక్టర్ గారూ మీరేదో ఒక నిర్ధారణకి రండి. వచ్చాక ఏం చేద్దామో ఆలోచిద్దాం. ఎందుకంటే మాది న్యూస్ పేపర్! ఇంకా చాలా పనుంది. మీ ప్రశ్నలు అయ్యాక మేము ప్రొసీడ్ అవుతాం!" అన్నాడు చైర్మన్ రాజభూషణరావు హఠాత్తుగా.

    ఆ మాటల్లోని అర్ధం గ్రహించాడు ఇన్ స్పెక్టర్. "ఓకే రాజారామ్ గారూ, మీతో తర్వాత మళ్ళీ మాట్లాడ్తాను" అన్నాడు. అన్నాక మహావీర్ కలిసి బయటికి వెళ్ళిపోయాడు.

    "ఒక్కటి మాత్రం స్పష్టం! రాజా, నువ్వు అప్పారావుని కొట్టావు. మనం అనుకున్న ఒప్పందాన్ని నువ్వు కేర్ చెయ్యలేదు.  దిసీజ్ టూ మచ్. ఇప్పటికయినా మించి పోయింది లేదు....నువ్వు వేరే ఆలోచన పెట్టుకోవడం మంచిది!" అన్నాడు విరించి రాజారామ్ కళ్ళలోకి చూస్తూ. అతని గొంతులో కాఠిన్యం!

    "అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? రాజారామ్ ని పొమ్మంటావా?" అన్నాడు చైర్మన్ అతనివేపు చూస్తూ.

    అతనేం మాట్లాడలేదు.

    చైర్మన్ రాజారామ్ ని దగ్గరికి రమ్మని సోఫాలో కూర్చోమని సైగ చేశాడు.

    "రాజా, నువ్వు అప్పారావుని హత్య చేశావా?" అనడిగాడు శాంతంగా.

    "లేదు సార్!"

    "అలాంటప్పుడు నీకు భయంలేదు. విరించీ, మనవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనమే ఆదుకోవాలి. అంతే కాని......ఇలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు." అన్నాడు చైర్మన్ అదే తన నిర్ణయం అయినట్టు.

    విరించి గొంతు సర్దుకున్నాడు. "అది కాదు సర్..."

    "మరేమిటి?" బులెట్ లా వచ్చింది ప్రశ్న.

    "నా అభిప్రాయం ఏమిటంటే...పరిస్థితి చక్కబడే వరకూ ఈ వ్యవహారంలో రాజా జోక్యం కలగచేసుకోవద్దని! ఈ న్యూస్ స్టోరీలో ఇంపార్టెంట్ పెర్సన్ అతనే....అంచేత దీన్ని అతని అసిస్టెంట్స్ డీల్ చెయ్యడం మంచిది!"

    రాజారామ్ మొహం ఎర్రబడింది.

    "సరే మీ ఇష్టం" అన్నాడు.


                                                                       0    0    0


    రాజారామ్ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఎనిమిది దాటింది. అప్పటికి రమణి మంచం మీద నిద్రపోతుంది. పక్కనే కుర్చీలో భవాని కూర్చొని ఉంది. రాజారామ్ వెళ్ళే సరికి ఆమె లేచి నిలబడింది ఈ అలికిడికి రమణి కళ్ళు తెరిచింది. తండ్రిని చూస్తూ..."నాన్నా!" అంది. రాజారామ్ మౌనంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. "వెళ్ళిపోవద్దు డేడీ!" అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంది రమణి.

    'వెళ్ళివస్తానని' కళ్ళతోనే చెప్పి వెళ్లిపోయింది భవాని.

    'నాన్నా...నేనో విషయం చెప్పనా?"

    "చెప్పమ్మా...."

    "అతన్ని చూశానని చెప్పాను కదూ?"

    "అవును"

    "నాకిప్పుడనిపిస్తూంది....నేను అతన్ని కాక మరోర్ని ఎవర్నో చూశానేమో అని..."

    "అంతేనంటావా?"

    "అవునూ...అతన్ని చూశానూ, వెంటనే నాకు భయ్యం వేసింది ఎందుకో? 'అతని'లాగే కన్పించాడు. అందుకే భయపడ్డాను. కానీ నాన్నా....అతని కళ్ళు చీకట్లో నల్లపులి కళ్ళు నాన్నా!"

    "సరేగాని, ఆ విషయం మరి ఆలోచించకు హాయిగా నిద్రపో."

    "అలాగే"

    "జో కొట్టావా?"

    "అలాగే"


                                                                      0    0    0

     
    ఉదయం పది గంటలవుతోంది. రాజారాం ఆఫీసుకు వెళ్ళడానికి తయారు అవుతున్నాడు. అంతలో టెలిఫోన్...లైన్ లో రాజేశ్వరి.

    "హలో...నేను రాజేశ్వరిని"

    "గుర్తు పట్టాలే నీ గొంతు"

    "నేనిప్పుడే మిసెస్ విరించితో మాట్లాడాను. రేపు శనివారం...మీరూ రమణీ వాళ్ళింట్లో పదిగంటలకల్లా ఉండాలి"

    "విశేషం"

    "మనం అంతా కలిసి ఆ వేళ అనంతగిరికి పిక్నిక్ వెళ్తున్నాం. నేను కూడా ఉంటాను."

    "నాకు నో అబ్జెక్షన్. రమణికి కూడా డిటో. కాని మాతో పాటు ఆ లేడీ ఇన్ స్పెక్టర్ కూడా తీసుకురాక తప్పదు. బాగుండదేమోనని..."

    "ఏం ఫర్వాలేదు. నేనీ విషయం మిసెస్ విరించికి చెప్తాను. అన్నట్టు డియర్ సర్ మీకో విషయం చెప్పనా? చైర్మన్ గారికి మీ పట్ల ప్రత్యేకమయిన అభిమానం ఏర్పడింది. మీకు మంచి జరగాలని ఆయన కోరుకుంటున్నారు. వీలైనంత హెల్ప్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కాని విరించిగారి విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతన్ది పాము పగ"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS