9. "అన్నకు తగు త | మ్ముడు లక్ష్మణుడు
అన్నిట రాముని | సరిపోలువాడు |
అన్నకు తోడు నీ - డయై చెలగేడు
అజేయుడు శ | త్రు భయంకరుడు
సామాన్యుడు కా | రు సోదరు లిరువురు
నిను వెదకుచు మ | మ్ము కలసినారు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
10. "వాలి సుగ్రీవులు - అన్నదమ్ములు
వారి నడుమ చెల | రేగే తగవులు |
సుగ్రీవుని వా | లి పారద్రోలెను
తమ్ముని భార్యను - తాను హరించెను |
సుగ్రీవుడోడి - పారిపోయెను
ఋష్యమూకమను - గిరిపై దాగెను |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
11. "సుగ్రీవుని సే | వుంచుచు మేము
ఋష్యమూకమున - చేరియున్నాము |
ఆ సమయాన స | మీప వనాల
పొడగాంచినాము - రామ లక్ష్మణుల |
వల్కలధారులై | ధనుర్ధారులై
వెదకుచున్నారు - అడవులపాలై |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
12. "రామ లక్ష్మణుల - సుగ్రీవుడు గని
భయపడి పరుగిడి - శిఖరము బ్రాకెను |
వృత్తాంతమరసి - వేగరమ్మని
వారికడకు న | న్నొంటిగ బంపెను |
కాంచినాడ శ్రీ - రామలక్ష్మణుల
పొందినాడ ది | వ్యానుభూతుల |
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
13. "రామ లక్ష్మణుల - సుగ్రీవుని కడ
భుజముల నిడుకొని - నే జేర్చినాడ |
రామ సుగ్రీవులు - సంభాషించిరి
మిత్రులైరి ప్ర | తిజ్ఞల బూనిరి |
రాముడు వాలిని - సంహరింతునని
సుగ్రీవుడు ని | న్న న్వేషింతునని |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
14. "ఋష్యమూకమున - నీవు వైచినవి
సొమ్ములన్నియు - మాకడనున్నవి |
ఆ సొమ్ముల శ్రీ | రాముడు గాంచి
నిన్ను గనినటుల - కడు విలపించె |
నిన్నెడబాసిన - రామచంద్రుడు
నిద్రాహారము | లు మరచినాడు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
15. "కోదండపాణి - అండజూచుకొని
సుగ్రీవుడు కి | కిష్కింధ చేరుకొని |
పోరికి రమ్మని - వాలిని బిలిచె
ఇరువురి నడుమ - పోరు చెలరేగె |
శ్రీరాముడు ఒ | కే బాణముచే
అతి బలశాలిని - వాలిని గూల్చె |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
16. "సుగ్రీవుడు వా | నర రాజయ్యెను
నిను వెదకగ మ - మ్మాజ్ఞాపించెను |
వానర వీరులు - నలువంకలకు
వెడలినారు నీ - జాడ తెలియుటకు |
అంగదుడాదిగ - మేము కొందరము
దక్షిణ దిశగ - పయనించినాము |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
17. "రావణుండు నిను - గొంపోయేనని
లంకలోన బం | ధించి యుండునని |
పక్షిరాజు సం | పాతి మాట విని
సాగర తీరము - వేగ చేరితిమి |
శతయోజనముల - వారిధి దాటి
ఒంటిగ నేను - లంక జేరితి |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
18. "రామ భక్తుడ సు | గ్రీవు సచివుడ
వాయు తనయుడ - కామరూపుడ |
రామ దూతగ - నే వచ్చినాడ
అడుగడుగున లం | క వెదకినాడ |
కడకు నీ జాడ - తెలిసినాడ
నినుగాంచిన కీ | ర్తి పొందినాడ |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
