Previous Page Next Page 
దేవదాసు పేజి 23

    ఆ రోజు సాయంకాలంపూట నీళ్ళు తెద్దామని నదికి వెళ్ళాను. చూశాను, దేవదాసు ముఖం వాడిపోయి వుంది. చేతిలో తుపాకి పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ వున్నాడు. నన్ను గుర్తుపట్టి దగ్గరకొచ్చి నిల్చున్నాడు. నేను భయంతో చచ్చిపోయాననుకో! రేవు దగ్గర ఎవరూ లేరు. నా ప్రాణం పోయినంత పనయిందనుకో. అతడు నన్ను కదిలించలేదు. చెడుగా ప్రవర్తించలేదు. కేవలం సజ్జనుడిలాగా, శాంత స్వభావంతో "మనో, బాగున్నావా?" అన్నాడు.
    ఇక నేను ఏం చేసేది? భయపడుతూ తల వంచుకుని "ఆఁ" అన్నాను.
    అప్పుడు ఆయన దీర్ఘమైన నిట్టూర్పు విడిచి "సుఖంగా వుండు చెల్లీ, నిన్ను చూడగానే చాలా సంతోషం కలిగింది" అని నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అక్కడనుంచి నేను పడుతూ, లేస్తూ పరుగెత్తాను. అమ్మో! బాబో! అదృష్టం బాగుంది. ఆయన చెయ్యిగానీ, మరొకటిగానీ ఏమీ పట్టుకోలేదు. ఈ విషయాలను అలా వుండనివ్వు. ఈ చెడు వృత్తిని సంబంధించిన విషయాలు వ్రాయడానికి యీ ఉత్తరంలో చోటు గూడా లేదు.
    నీకు చాలా శ్రమ కలిగించాను. ఏం చెల్లీ? ఇప్పటికీ ఒకవేళ ఆయనను మరచిపోయి వుండకపోతే తప్పకుండా నీకు చాలా కష్టం కలిగి ఉంటుంది. అయినా తప్పదు. ఒకవేళ అజాగ్రత్త వలన ఏదైనా అపరాధం  జరిగివుంటే, నీ సహజగుణంతో నీ స్నేహాన్ని కాంక్షించే యీ మనో అక్కను క్షమించు."
    నిన్న ఉత్తరం వచ్చింది. ఈ రోజు ఆమె మహేంద్రుణ్ని పిలిచి "రెండు పల్లకీలనూ, ముప్పై రెండు మంది బోయిలనూ ఏర్పాటు చెయ్యి. నేను ఇప్పుడే తాల్ సోనాపుర్ వెళతాను" అన్నది.
    మహేంద్రుడు ఆశ్చర్యంగా "పల్లకీని, బోయిలనూ నేను ఏర్పాటు చేస్తాను. కాని రెండు పల్లకీలు ఎందుకమ్మా?" అని అడిగాడు.
    "నీవు కూడా తోడుగా వస్తావు! ఒకవేళ నేను మరణిస్తే నోటిలో నిప్పు పెట్టడానికి పెద్దకొడుకు అవసరమవుతాడు."
    మహేంద్రుడు మరేమీ మాట్లాడలేదు. పల్లకీలు వచ్చిన తరువాత ఇరువురూ బయలుదేరి వెళ్ళిపోయారు.
    చౌదరిగారు ఇది విని గాభరాపడ్డాడు. దాస దాసీలను అడిగాడు. కాని ఎవరూ సరైన కారణం చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన తన బుద్ధిని ఉపయోగించి అయిదుగురు కాపలా జవానులనూ, దాసదాసీలనూ పంపించాడు.
    "దారిలో కలుసుకుంటే పల్లకీని వెనక్కు తిప్పుకొచ్చేమా వద్దా?" అని ఒక కాపలా జవాను అడిగాడు.
    ఆయన కొంచెం ఆలోచించి "వద్దు, వెనక్కు తిప్పుకొచ్చే పనేమీ లేదు. మీరంతా తోడుగా వెళ్ళండి. అందువల్ల వాళ్ళకేమీ ఇబ్బంది వుండదు" అన్నాడు.
    అదే సాయంకాలం దాటిన తరువాత రెండు పల్లకీలూ తాల్ సోనాపుర్ చేరాయి. కాని దేవదాసు గ్రామంలోలేడు. అదేరోజు మధ్యాహ్నం కలకత్తాకు వెళ్ళిపోయాడు.
    పార్వతి తల బాదుకున్నది_"దురదృష్టం!" అన్నది. తరువాత మనోరమను కలుసుకున్నది.
    "దేవదాసును చూడటానికి వచ్చావా?" అడిగింది మనోరమ.
    "కాదు, వెంటతీసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఆయనకు ఇక్కడ తనవాళ్ళనేవాళ్ళు ఎవరూ లేరు" అన్నది పార్వతి.
    మనోరమ అవాక్కయిపోయింది. "ఏమంటున్నావు? కొంచెమైనా సిగ్గుపడవేమిటీ" అన్నది.
    "సిగ్గా, ఇంకా ఎవరికి సిగ్గుపడాలి? నా వస్తువును నా వెంట తీసికొని వెళ్తాను. ఇందులో సిగ్గేముంది?"
    "ఛీ! ఛీ! ఏమంటున్నావు? అతనితో కొంచెమైనా సంబంధం లేదు_అటువంటి మాట నీ నోటితో అనకు."
    పార్వతి మలినపు నవ్వు నవ్వి "మనో అక్కా! జ్ఞానం కలిగిన తరువాత నుంచి ఏ మాటయితే నా హృదయంలో ఉంటూ వచ్చిందో అదే అప్పుడప్పుడు నా నోటినుంచి బయటికి వచ్చేస్తుంది. నీవు అక్కవు, అందుచేతనే ఈ మాటలను వింటున్నావు" అన్నది.
    మరుసటిరోజు పార్వతి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి మళ్ళీ పల్లకీ యెక్కి వెళ్ళిపోయింది.
                                 15
    ఇప్పటికి రెండు సంవత్సరాల క్రితం చంద్రముఖి తాను నివసించడం కోసం ఆశథ్ ఝారీ గ్రామంలో ఛోట్ నదీతీరాన ఒక ఎత్తయిన ప్రదేశంలో మట్టిగోడలతో రెండు చిన్న చిన్న పూరిళ్ళు కట్టించుకొన్నది. దగ్గరలో ఒక కళ్ళం వున్నది. అక్కడే ఆమెదే నల్ల గానూ, బలంగానూ ఉన్న ఆవు ఒకటి కట్టేసి వుంటుంది. రెండిళ్ళల్లో, ఒకటి వంటిల్లుగానూ స్టోరు గదిగానూ వుంటుంది. రెండో ఇంట్లో ఆమె నిద్రిస్తుంది. ఆమె నిద్రలేచేముందే రామ్ బాగ్దీ భార్య ఇళ్లూ, వాకిళ్లూ ఊడ్చి శుభ్రం చేస్తుంది. కళ్ళాపి చల్లుతుంది. ఇంటికి నలువైపులా తడికలు కట్టి వున్నాయి. ఆవరణ మధ్యలో రేగుచెట్టు ఒకటి వుంది. ఒకవైపు తులసికోట వుంది. ఎదురుగా నదీ ప్రవాహం వుంది. దాని చుట్టుప్రక్కల జనం ఖర్జూర చెట్లు, అరటి చెట్లు పెంచారు. చంద్రముఖి తప్ప ఆ రేవును మరెవ్వరూ ఉపయోగించరు. వర్షాకాలంలో నది నిండుగా తొణికిసలాడుతూ ప్రవహిస్తున్నప్పుడు చంద్రముఖి ఇంటి దిగువకు కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ సమయంలో ప్రజలు కొంచెం గాభరా పడుతుంటారు. పారతో మట్టిత్రవ్వి పైకి వేసి స్థలంమీద మెరక వేయడానికి పరుగులు తీస్తారు. గ్రామంలో ఉన్నత వర్ణాల ప్రజలు వుండరు. రైతులు, గొల్లలు, బోయీలు, కుర్మీలూ, బాగ్దీలూ, రెండిళ్ళవాళ్ళు గౌడలూ, రెండిళ్ళవాళ్ళు మాదిగలూ మొదలైన వాళ్ళు వుంటారు. చంద్రముఖి ఈ గ్రామానికి వచ్చి దేవదాసుకు ఉత్తరం ద్వారా తెలియచేసింది. జవాబుగా ఆయన కొంత డబ్భు పంపించాడు. ఈ డబ్బులో నుంచి చంద్రముఖి గ్రామంలో వాళ్ళకు అప్పులిస్తుంది. ఆపదలు వచ్చినప్పుడూ కష్ట కాలంలోనూ అందరూ వెళ్ళి ఆమె దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని వెళతారు. చంద్రముఖి వడ్డీ తీసుకోదు. అందుకు బదులు కందమూల ఫలాలూ, కాయగూరలూ, ఆకుకూరలూ ఎవరి యిష్టం వచ్చినవి వాళ్ళు ఇచ్చిపోతారు. అసలు కోసం కూడా ఎవరినీ బలవంత పెట్టదు, ఒత్తిడిచేయదు. ఇవ్వలేనివాళ్ళు యివ్వరు.
    చంద్రముఖి నవ్వుతూ "ఇక నీకు ఎప్పుడూ ఇవ్వను" అంటుంది.
    అతడు నమ్రతతో "ఈసారి పంట బాగా పండాలని ఆశీర్వదించు తల్లీ" అనేవాడు.
    చంద్రముఖి ఆశీర్వదించేది. ఒకవేళ మళ్ళీ పైరు బాగాకాక పంట బాగా పండకపోతే, వాళ్ళు మళ్ళీ రోదిస్తూ వచ్చి చేయి చాచేవాళ్ళు. చంద్రముఖి మళ్ళీ యిచ్చేది. లోలోపల నవ్వుకుంటూ ఆమె "మీరు బాగా వుండండి. నాకు డబ్బుకు కోరతేమిటీ?" అనేది.
    కాని ఆయన ఆ దేవదాసు ఎక్కడ వున్నాడు? ఆరుమాసాల నుంచి ఆయన కబురేమీ అందలేదు. ఉత్తరం వ్రాసింది. కాని జవాబు రాలేదు. లెటరు రిజిస్టర్ చేసింది. అది కూడా తిరిగి వచ్చింది. చంద్రముఖి ఒక గొల్లవానిని తన ఇంటి దగ్గర పనిలో అట్టిపెట్టింది, అతడి కొడుకు పెళ్ళికి కావలసినంత ధనసహాయం చేసింది. ఒక జత మురుగులు కొనిపెట్టింది. అతని కుటుంబమంతా చంద్రముఖి ఆశ్రయంలో వుంటున్నది. అతని పరివారంలోని వాళ్ళు అందరూ ఆమెకు విధేయులై వుంటారు. ఒకరోజు  ఉదయం చంద్రముఖి తన ఆశ్రితుడైన ఆ గొల్ల భైరవుణ్ణి పిలిచి "భైరవ్, ఇక్కడకు తాల్ సోనాపుర్ ఎంత దూరముంటుందో తెలుసా?" అని అడిగింది.
    భైరవుడు ఆలోచించి "ఇక్కడ నుంచి దాదాపు రెండు మైళ్ళ దూరంలో కచేరీ వుంటుంది."
    "అక్కడ జమీందారు ఉంటారా?" అడిగింది చంద్రముఖి.
    "అవును, ఆయన చాలా గొప్ప జమీందారు. ఈ గ్రామం కూడా ఆయనదే. ఆయన స్వర్గస్తుడై ఇప్పటికి మూడు సంవత్సరాలయ్యింది. ఆయన శ్రాద్ధ కర్మలప్పుడు జనమంతా ఒక నెలదాకా భోజనాలు చేస్తూనే వున్నారు, ఇప్పుడాయన కొడుకులు ఇద్దరున్నారు. ఆయన చాలా గొప్ప మనిషి_రాజా అనుకో."
    "భైరవ్! నీవు నన్ను అక్కడకు చేర్చగలవా?" అడిగింది చంద్రముఖి.
    "ఎందుకు చేర్చలేను? ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజే బయలుదేరుదాం" అన్నాడు భైరవుడు.
    చంద్రముఖి ఉత్సాహపడుతూ "ఆయితే భైరవ్, బయలు దేరరాదూ! ఈ రోజే వస్తాను." అన్నది.
    భైరవుడు ఆశ్చర్యపోయి "ఈ రోజే?" అన్నాడు. తరువాత చంద్రముఖి ముఖంవైపు చూస్తూ "అయితే నీవు త్వరగా వంట కానివ్వు. ఇంతలో నేను కొన్ని మొర్మొరాలు మూటగట్టుకొని వస్తాను." అన్నాడు.
    "ఈ రోజు నేను వంట చేయను. భైరవ్! నీవు మొర్మొరాలు తీసుకొనిరా" అన్నది చంద్రముఖి.
    భైరవుడు ఇంటివద్ద కెళ్ళాడు. దుప్పటి చివర కొన్ని మొర్మొరాలు కట్టుకొని, చేతిలో ఒక లాఠీ తీసుకొని వెంటనే తిరిగి వచ్చాడు. "అయితే పదండి. కాని మీరు తిండి కూడా తినరా?" అన్నాడు.
    "లేడు భైరవ్! ఇంకా నా పూజా పునస్కారాలు కాలేదు. సమయం దొరికితే అక్కడే అన్నీ పూర్తి చేస్తాను." అన్నది చంద్రముఖి.
    భైరవుడు దారి చూపుతూ ముందు ముందు పోతున్నాడు. అతడి వెనకే చంద్రముఖి చాలా ఇబ్బందిపడుతూ కాలిబాట మీదే నడుస్తూ వుంది. నడిచే అలవాటు లేని కారణంగా కోమలమైన ఆమె పాదాలు రెండూ బాగా గాయపడ్డాయి. ఎండకు ముఖమంతా మాడిపోయింది. తిండీ తిప్పలు లేక పోయినా కూడా చంద్రముఖి ఒకదాని తరువాత మరొకటి పొలాలన్నీ దాటుకుంటూ వెళ్తూ వుంది. దారిలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు ఆశ్చర్యపోయి ఆమె ముఖం వైపు చూస్తూ వున్నారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS