Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 23


    "మరి ఈ ఆస్తి నంతా ఎవరికో అంటగట్టాలంటే బుద్ది పుట్టడం లేదు."
    "నాన్నా! ఈ ఆస్తిని బావకే ఇచ్చెయ్యి. నాకేమీ వద్దు" అంది శారద.
    "శారదా! నువ్వు ప్రేమించిన వారిని చేసుకొని సుఖ పడగలవన్న ధైర్యం నీకుందా?"
    "ఉంది. అది లభించని నాడు ఖర్మే అనుకుంటాను. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు, నాన్నా?"
    "సరే, మీ సుఖానికి అడ్డు చెప్పే హక్కు నాకు లేనప్పుడు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. వారితో మాట్లాడి త్వరలో ముహూర్తం పెట్టిస్తాను" అని లేచి పొయ్యాడు ముకున్డయ్య భారంగా.
    "విజయం మనదే" అని రాజ్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు గోపీ.
    "శారదా! మేమలా వెళ్ళొస్తాం కానీ నువ్వు తీరికగా మీ కాబోయే భర్త గారికి ఉత్తరం వ్రాసుకో" అంటూ లేచాడు గోపీ.
    "ఫో బావా!" అని అక్కడి నుండి పరుగెత్తి పోయింది శారద.
    "ఒరేయ్ గోపీ! అతనికి ఇంజనీరింగ్ ఈ సంవత్సరంతో పూర్తవుతుంది కదూ!" అడిగాడు రాజ్, కారులో.
    'అవును, పాపం, మామయ్య ఒప్పుకోడని భయపడింది."
    "ఎక్కడికిరా, కారును నీ యిష్ట మొచ్చినట్లు పోనిస్తున్నావు?"
    "మీ యింటికి."
    "ఊ."
    "ఆ . లతను చూసి చాలా రోజులైందిరా" అన్నాడు గోపీ కారును కుడి వైపుకు త్రిప్పుతూ.
    హల్లో ఎదురైంది ఇందిర గోపీ కళ్ళు నలువైపులా వెతికాయి. అది చూసి నవ్వుకొని "పైనుంది. వెళ్ళండి" అంది ఇందిర.
    రాజ్ ను అక్కడే వదిలేసి పైకి పోయాడు గోపీ. గోపీని చూసి యెగిరి గంతేసింది లత.
    "వదినా, ఇవ్వేళ నిన్నొక విషయం అడగదలుచుకోన్నాను." అన్నాడు రాజ్.
    "ఏమిటో అడుగు రాజూ" అంది ఇందిర.
    "నాకు ఒకనాడైనా అన్నయ్యను చూపించ లేదేం?"
    "ఆ ప్రశ్న విన్న ఇందిర మొహం నల్లబడింది. మబ్బులు ఆవరించాయి ఆమె హృదయాన్ని. వెంటనే జవాబివ్వ లేకపోయింది.
    "నీ మనసును కష్ట పెట్టేధైతే క్షమించు, వదినా!"
    "లేదు, రాజు, నీతో చెప్తే నా ఈ ఆవేదనైనా తగ్గుతుంది. విను. నేను అందరిలా ప్రేమించి పెళ్లి చేసుకోలేక పోయినా తెలిసిన వరుడే అయినందువలన ఇష్టపడ్డాను. పెళ్ళి చేసుకొన్న కొద్ది రోజుల వరకూ జీవిత మాధుర్యాన్ని అనుభవించి నా అంత అదృష్ట వంతురాలు లేదని గర్వపడ్డాను. అలా సాగింది మా దాంపత్య జీవితం.
    "సంసారం లో కలతలు రావడానికి ఎంతోసేపు పట్టదు. అతి సామాన్య విషయాలే అతి భయంకరంగా మారవచ్చు. అందుకు మన దోహడమే కారణం. కొద్ది రోజుల తర్వాత అయన ఇంటికి ఆలస్యంగా రావడం మొదలు పెట్టాడు. కారణ మడిగాను. ఏదో సాకు చెప్పి తప్పించు కొన్నాడు. రోజూ అలా జరగడం భారించ లేకపోయ్యాను. సహజంగా మగవాడైన వారికి అటువంటి సమయంలో భర్తల మనే అధికార గర్వం బయలు దేరుతుంది. అదే జరిగింది. కీచులాటలు ప్రారంభమయ్యాయి.
    "ఒకనాడు త్రాగి ఇంటి కొచ్చారు. ఆశ్చర్య పోయాను. ఏడుపొచ్చింది. ఏడిచాను. ఓదార్చే వారు కూడా లేరు. పేకాట, త్రాగుడు ఎక్కువయ్యాయి. అడిగితె చెయ్యి చేసుకునేవారు. అడిగే అధికారాన్ని పోగొట్టుకొని కుక్కిన పెనల్లె రోజులు గడప సాగాను. అంతకన్నా ఎక్కువ ఏం చెయ్యగలను? అడిగితె "నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను . నోరు మూసుకొని పడి ఉండు." అనే అదిలింపు ధిక్కరిస్తే "బయటికి గెంటేస్తాను." అనే బెదిరింపు లతో వారిని దూరం చేసుకోలేక అలాగే కళ్ళు మూసుకొని కాలం గడిపాను.
    "ఆ తర్వాత కొద్ది రోజులకే నేను ఒక మగబిడ్డను ప్రసవించాను. ప్రసవపు రోజుల్లో దగ్గరే ఉన్న ఒక నర్శింగ్ హోమ్ లో చేరాను. అక్కడ ఉన్నన్ని రోజులూ ఒక్కసారైనా నా దగ్గరికి రాలేదు. ఏ అర్ధరాత్రైనా వస్తారని ఆశించాను. నా ఆశ నిరాశే అయింది. ఇంటి కొచ్చాను. ఆదరంతో పలుకరిస్తారనీ, బాబును చూసి మురిసి పోతారని ఇంటికి తిరిగోచ్చాను. నన్ను పలుకరించ లేదు సరి కదా, పండంటి బాబును తలెత్తి గూడా చూడలేదు. అతని ప్రవర్తన నాలో అతని పట్ల ఉన్న ప్రేమను తుడిచి పెట్టింది. ఒంటరిగా ఎన్నో రాత్రులు రోదించాను. నా రోదన భగవంతుడు కూడా వినలేదు. వినవలసిన అవసరం అతనికి లేకపోయింది. ఒకనాడు వాళ్ళ ఆఫీసు టైపిస్టు అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు "ఇదేమిటండీ" అన్నాను.
    "నా ఆనందానికి అడ్డు రావడానికి నువ్వెవరు?' అదీ జవాబు."
    "నేను మీకేం అన్యాయం చేశాను. నాలో ఏం లోపముంది?" అని నిలదీసి అడిగాను. కాళ్ళా వెళ్లా పడి ఏడిచాను. అతని హృదయం కరగలేదు.
    "అ దుఃఖం తో బాబు పై శ్రద్ధ తీసుకోలేక పోయాను. తత్ఫలితంగా బాబుకు జ్వరం వచ్చింది. డాక్టరు ను తీసుకు రమ్మని అడిగాను. మౌనంగా వెళ్ళిపోయారు. అ మరునాడంతా చూశాను. రాలేదు. నేనే డాక్టరు దగ్గరికి పరుగెత్తాను.
    "చాలా ఆలస్యం చేశావమ్మా! అయినా ప్రయత్నిస్తాను " అని డాక్టరు మందిచ్చింది. కానీ ఆమె మందులు కానీ, నా ప్రార్ధనల కానీ నా బాబును నాకు దక్కనియ్య లేదు. నాకు పిచ్చి పట్టినట్ల యింది. ఒక ప్రక్క బిడ్డ ఆరోగ్యం బాగులేక తల్లి విలపిస్తుంటే నిశ్చింతగా ఉండే అయన రాక్షసుడే ననిపించింది.
    "ఆ మరు రోజు ఆ విషయం తెలిసి ఇంటికి కొచ్చారు. వారిని చూడగానే నాలో కోపం మిన్ను ముట్టింది. భర్త అనే గౌరవ మివ్వలేక పోయాను. "ఎందుకొచ్చారు?" అని సూటిగా అడిగాను. "ఇందూ" అని బాధగా అన్నారాయన. అది గమనించే స్థితిలో లేను."నేను బ్రతికి ఉన్నానో లేదో నని చూడటానికి వచ్చారా!చూడండి. చూసి ఆనందించండి . కన్నతండ్ర యి ఉండి కూడా నా బాబును నాకు కాకుండా చేశారు. నా బాబును చంపేశారు." పిచ్చిగా వాగాను.
    "నన్ను క్షమించు, ఇందూ' అనగలిగారాయన.
    "మిమ్మల్ని క్షమించడానికి నేనెవరిని? మీరు నా హృదయాన్ని శిలగా మార్చేశారు. నా ఆనందాన్ని నాశనం చేశారు. నా జ్యోతిని ఆర్పేశారు. నాలో ప్రేమ అనేదే లేకుండా చేశారు. ఏ వ్యామోహంలో పడి నా హృదయాన్ని గాయపరిచారో ఎవరి కోసం నా ప్రేమకు దూరమయ్యారో, ఏ వ్యామోహం లో కన్న బిడ్డను చంపుకోన్నారో అక్కడికే పొండి. ఇక్కడ మీకేవ్వరూ లేరు. అందరూ చచ్చిపోయ్యారు. మీ ఆనందమయ జీవితానికి ఎవరూ ఆడ్డురారు. వెళ్ళిపొండి." పిచ్చిగా అరిచాను.
    "ఇందూ నా మాట విను. ఆవేశపడకు' అన్న వారి మాటలు విని "మీరు పోకుంటే నేనే పోతాను. మీలాంటి వారి దగ్గర కాపురం చెయ్యడం కంటే చావడం మేలు" అని వారు ఎంత బ్రతిమాలుకున్నా వినకుండా ఆనాడే వచ్చేశాను. ఇందులో నా తప్పుందో, వారి తప్పుందో తెలియదు కానీ అదృష్ట హీనులు జీవితంలో పరిస్థితులకు ఎదురు తిరిగితే చాలా బాధలు పడవలసి వస్తుందనే అనుభవాన్ని గడించాను. నేనలా వచ్చెయ్యడం తప్పంటావా , రాజా?"
    "లేదు, వదినా! పరిస్థితులు మానవుడిని రాక్షసుడు గా మారుస్తుంటాయి. ఆవేశం యుక్త యుక్త విచక్షణ లను నశింప చేస్తుంది."
    "నా బ్రతుకును చూసి అమ్మ అప్పుడప్పుడు తన పాపాలకు ఫలితం తన బిడ్డలను అనుభవించమంటున్నావా దేవుడా అని దుఃఖిస్తుంటుంది. ఎన్నోమార్లు తిరిగి వెళ్లాలని ప్రయత్నించాను. కానీ తిరిగి ఆ జీవితం తలచుకొంటే ఒళ్ళు జలదరిస్తుంది. మనశ్శాంతి, సుఖం, ఆనందం , భర్త , ప్రేమ, ఆదరణ, ఆప్యాయత  సానుభూతి -- వీటిలో ఏ ఒక్కటీ లేని ఆ జీవితం లోకి ప్రవెశించాలంటే భయపడి ఇక్కడే ఉండి ఈ జీవితాన్ని గడపడం మేలను కొన్నాను."
    "చీకటి లో ఉంటూ అదే ఆనందమను కొంటె ఎలా, వదినా? కష్టాలను ఎదురు కొన్నప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది."
    "అంత ధైర్యం ఆబలనైన నాకు లేదు, రాజూ!"
    'అలాగని వాటికి భయపడి పారిపోతే సుఖంగా ఉండలేం, వదినా!"
     "ఏమో ! ఇక వారితో సంసారం చేస్తానన్న నమ్మాకం నాకు లేదు. అది నాకంతగా ఇష్టం లేదు కూడా."
    ఈ మ్రోడు బారిన జీవితం పై ఇష్టమా?"
    "ఇక్కడేం లోకువ? అమ్మ ఉంది. లత ఉంది. అన్నిటీకి మించి నువ్వు ఉన్నావు. కావలసినంత ఆనందం, శాంతి, సౌఖ్యం లభిస్తున్నాయి."
    "ఇవన్నీ కృత్రిమాలు. నువ్వు భ్రమ పడుతున్నావు."
    "రాజూ!"
    "అవును వదినా! ఇదంతా నీ భ్రమే. ఈ కృత్రిమా నందాన్ని నువ్వు ఎక్కువ రోజులు అనుభవించ లేవు. నువ్వను కొనే ఆనందం వెనుక అంతులేని దుఃఖం దాగి వుంది. నువ్వు కోరే శాంతికి వెనుక అగాధమైన అశాంతి ఉంది. అది తెలిసీ నువ్వు కప్పి పుచ్చుతున్నావు. ఇంతకూ అయన పేరేమిటి? ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు?"
    "వద్దు , రాజూ వద్దు. నీబోటి వాళ్ళు అతనితో మాట్లాడ కూడదు. అయన కక్కడ అది సుఖంగా ఉంది. కనీసం ఆయనైనా సుఖంగా ఉంటె చాలు."
    "నువ్వూ ఏమీ చెప్పవన్నా మాట."
    "క్షమించు. నేనేం చెప్పలేను."
    "సరే" అన్నాడు రాజ్. "నువ్వు చెప్పానంత మాత్రాన తెలుసుకో లేనను కున్నావా, వదినా' అనుకొన్నాడు మనసులో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS