చినరాయుడు చెప్పాడు. ఇలా ఓ డబ్బింగు సినిమా తీద్దామని ఉందని, ఏదైనా లేటెస్ట్ తమిళ్ సినిమా బావుందంటే చెప్పమన్నాడు. డబ్బింగ్ రైటర్ ఈ మాట వినగానే ఆనందంతో ఇద్దరికీ షేక్ హేండిచ్చాడు.
"మీరు మంచి సమయానికి వచ్చారు. ఓ తమిళ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది!"
అని తమిళ సినిమా పేరు చెప్పాడు.
"ఆ అరవ టైటిల్ మాకు అర్ధం కాదు కానీ, తెలుగులో మంచి టైటిలు చెప్పు డబ్బింగు రైటరూ!" అన్నాడు పెదరాయుడు.
"ప్రేమ మైకం" అని పెడదాం.... అరేవా! వండర్ ఫుల్! మీరడగంగానే వెంటనే స్ట్రయికయింది ఈ టైటిల్!" అని ఉక్కిరిబిక్కిరవుతూ అలా వెడుతున్న ఒకణ్ణి పిలిచి "అన్నా .... ఆర్ముగం! ఇంగె వా! ఇప్పుడే ఛాంబర్ కి పోయిటి ఒరు నల్ల టైటిల్ రిజిష్టర్ పణ్ణిటివా. పేరు "ప్రేమ మైకం" అని, పెదరాయుడితో "ఓ ఐదువేలు ఇలా పడెయ్యండి. రాహుకాలం కూడా వెళ్ళిపోయింది! మంచిరోజు- టైటిల్ రిజిష్టర్ చేయిద్దాం!" అన్నాడు.
పెదరాయుడు మొహం చిట్లించాడు.
"చూడు డబ్బింగ్ రైటరూ! నీకు నచ్చగానే మాకునచ్చేస్తుందా! డబ్బులెట్టే ప్రొడ్యూసర్ని నేను! కాస్త దూకుడు తగ్గించు! టైటిల్ బానే ఉందికానీ, ఆ అరవ సినిమా కథేంటో తెలీకుండా ఎలా ప్రోమిసింగు చెయ్యమంటావయ్యా?" అని ఆ వచ్చినతనితో "చూడబ్బాయ్ ఆర్ మృగం!" అన్నాడు.
"ఆర్ మృగం ఇల్లె సార్! ఆర్ముగం!" వినయంగా అన్నాడతను.
"సరేలే, ఏదో ఒకటి. నువ్వెళ్ళు. నేను మళ్ళీ కబురు చేస్తాలే!" అని రైటరు వైపు తిరిగి, "ముందు కథ చెప్పు" అన్నాడు పెదరాయుడు.
డబ్బింగ్ రైటరు చిన్నబుచ్చుకున్నాడు.
"నువ్వే ఇంత చిన్నబుచ్చుకుంటే, ప్రొడ్యూసర్ని నేనెంత పెద్దబుచ్చుకోవాలి? సరే మూడ్ లోకి రా! కథ చెప్పు. కథ బాగుంటే నిన్నే బుక్ చేస్తాం!" అన్నాడు పెదరాయుడు.
డబ్బింగ్ రైటరు మళ్ళీ ఉత్సాహం పుంజుకున్నాడు. ఆర్ముగాన్ని వెళ్ళమని చెప్పి, కథ చెప్పాడు. "ఓ కాలేజీ అమ్మాయి ఆ అమ్మాయిని ఐదుగురు ప్రేమిస్తుంటారు"
"ఐదుగురా! కొంపదీసి మహాభారతాన్ని సోషలైజ్ చెయ్యలేదు కదా!" సందేహం వెలిబుచ్చాడు పెదరాయుడు.
"ఛ ఛ -- లేదు సార్! కథ వినండి. ఆ అమ్మాయి కాలేజీకి వెడుతున్నప్పుడు ఒక హీరో ఆ అమ్మాయి నడిచినంతమేరా పాదాల అడుగున మట్టి సేకరిస్తూంటాడు. ఆ మట్టంతా తీసుకెళ్ళి తన రూములో పోస్తుంటాడు..."
"ఇదేం హాబీ! ఆడి రూము వాస్తు బాగోలేదా? వాయువ్యంలో మెరక పొయ్యాలా?" అడిగాడు పెదరాయుడు.
"కాదు సార్! వినండి! ఇంకో కాలేజీ స్టూడెంట్ ఆమె తల్లో పూలు సేకరించి, తన పుస్తకాల మధ్య దాస్తూంటాడు."
పెదరాయుడు నిట్టూర్చాడు. "ఊఁ... కానీ.... వెర్రి వేయివిధాలు! తరువాత?"
"మూడోవాడు కాలేజీ ఎగ్గొట్టి మారువేషంలో ఆమె ఇంట్లో చాకలాడుగా చేరి జీతం తక్కువైనా సరే, కేవలం ఆ అమ్మాయి లంగాలు, ఓణీలు, చుడీదార్లూ మాత్రమే ఉతుకుతుంటాడు."
"ఆ మూడేనా మిగతావి కూడా ఉతుకుతూంటాడా! సిగ్గులేకపోతే సరి! ఈ సంగతి ఆ అమ్మాయి తండ్రికి తెలిస్తే ఈడిని ఉతికి ఆరెయ్యడూ?" అన్నాడు పెదరాయుడు.
"అక్కడే ఉంది గొప్ప పాయింటు! హీరోయిన్ ఫాదర్ కి ఈ ఐదుగురు చేసే పనులూ తెలుసు. తెలివిగా వాళ్ళని జీతం లేని సర్వెంట్స్ కింద వాడుకుంటూంటాడు."
"సంబడం! బాగానే ఉంది! మిగతా ఇద్దరు పక్షులూ?"
"భలే! పక్షులు అని మీరంటే సడెన్ గా తట్టింది. ప్రేమ పక్షులు. ఇది కూడా రిజిష్టర్ చేద్దామా సార్" ఉద్విగ్నంగా అన్నాడు డబ్బింగు రైటరు.
"ముందు కథ చెప్పవయ్యా మగడా!"
"నాలుగోవాడు ముసలాడు.అంటే ఓ యాభై ఏళ్ళు ఉంటాయిలెండి. ఆ కాలేజీలో లెక్చరరు. ఆయనకు పెళ్ళయిన కొత్తలోనే భార్య పోయింది. ఈ అమ్మాయి లవ్వులో పడతాడు. క్లాసుకి కాస్త ముందుగానే వచ్చి స్టూడెంట్స్ వచ్చేలోపల హీరోయిన్ పర్మనెంటుగా కూర్చునే సీటుని శుభ్రంగా తుడిచి, ఆ రుమాలుని భద్రంగా దాచుకుంటాడు. తిరిగి క్లాసయిపోయి స్టూడెంట్స్ వెళ్ళిపోయాక కాసేపు తనివితీరా ఆ సీటుని ముద్దాడి ప్రేమగా నిమిరి, కళ్ళొత్తుకుని, భారంగా వెళ్ళిపోతూంటాడు. అంతే కాదు. క్లాసు మధ్యలో హీరోయిన్ ని గంభీరంగా బ్లాక్ బోర్డు దగ్గరకు పిలిచి, చాక్ పీస్ తో ఒక ఈక్వేషన్ చెయ్యమంటాడు. తర్వాత ఆమె వదిలేసిన చాక్ పీస్ ముక్కను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకుని, ఇంటికెళ్ళి దాన్ని పొడి చేసి ఓ గ్లాసుడు నీళ్ళలో కరగబెట్టి ఆ నీళ్ళు తాగేస్తూంటాడు."
పెదరాయుడు మొహం వికారంగా పెట్టాడు.
"ఇక ఐదవవాడు వీళ్ళందరికంటే ముందే ఆ అమ్మాయిని ప్రేమించి ఆ విషయం చెప్పటానికి ధైర్యం చాలక, మధ్యలోనే చదువు మానేసి సొంతంగా ఓ బారు పెట్టుకుని, రోజూ తాగి, పొద్దునా సాయంత్రం కాలేజీ గేటు దగ్గర ఓ కుక్కను నిమురుతూ కూర్చుంటాడు."
"సర్లే.....సర్లే.....పాటలేమన్నా ఉన్నాయా?"
"అన్నీ సూపర్ హిట్ సాంగ్స్ సార్! ఐదుగురు హీరోలకీ ఐదు సోలో సాంగ్స్, హీరోయిన్ కి రెండు సోలోలు, ఒక గ్రూప్ సాంగ్, ఐదుగురికీ హీరోయిన్ తో డ్రీమ్ సాంగ్స్. మొత్తం పదమూడు పాటలు."
