Previous Page Next Page 
ప్రతీకారం పేజి 23


    ఆ కుర్రవాడు ఐ.సి.యస్. ఆఫీసరా! ప్రాణాలకు తెగించి పరాయి పిల్లను రక్షించినవాడు. తను ప్రేమించిన యువతిని చంపడమా? అసంభవం? కారు బయలుదేరుతున్నప్పుడు అతను ఒక్కసారిగా కేకపెట్టి నీళ్ళలోకి దూకాడు. తను కార్లో నుంచి తొంగి చూసింది. బోటు దొర్లిపడి వుండటం కనిపించింది. కాని తమ పిల్లకు ప్రాణం పోయేలా వుంది. అందుకే ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా తాను వచ్చేసింది. తను కారు ఆపలేదు. ఒళ్ళో బిడ్డ గుడ్లు తేల వేస్తుంటే, పక్కన తల్లి లబోదిబోమంటూ వుంటే తన మనసులోకి మరో విషయం చొరలేదు.
    రవి నిర్దోషి? అది యాక్సిడెంట్ మాత్రమే తను అతన్ని నిర్దోషిగా నిరూపించగలదు. హిప్పీరావూ, హేమ కూడా సాక్ష్యం చెబుతారు.
    రాధాదేవి స్నానం చేసి ఇంటికి తాళంపెట్టి బయలుదేరింది.

                                              18

    "రాక్షసుడా నా ఈ ఇరవై సంవత్సరాల శ్రమా బూడిదలో పోశావు. నీకు ఊహ తెలిసినప్పటినుంచీ మంచినే బోధించాను. ఆదర్శమూర్తిని చెయ్యాలని ఆరాటపడ్డాను. అహింసామూర్తిని చెయ్యాలని కలలుకన్నాను. ఆ కలలు నిజం అవుతున్నాయని ఆపోహపడ్డాను."
    రవి తండ్రి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు. కటకటాల వెనక నిల్చొని.
    "నువ్వు హంతకుడివి. క్రూరత్వం మన రక్తంలోనే ప్రవహిస్తోంది. నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోతే నిండు ప్రాణాన్ని తీస్తావటరా? రజనీ నీతో కలిసి పెరిగిందే! నిన్నెంత అభిమానించేది? పుత్తడి బొమ్మలాంటి ఆ పిల్లను ఎలా చంపగలిగావురా? అవున్రా నువ్వు చంపగలవు! నువ్వు నా కొడుకువు! నీ రక్తంలోనే విషం వుంది. వారసత్వం పుణికి పుచ్చుకున్నావు" ఉద్రేకంతో వూగిపోతున్నాడు జగన్నాథం.
    రవి నింపాదిగా, శాంతంగా తండ్రి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.
    జగన్నాథం పిచ్చిపట్టిన వాడిలా ఏదేదో మాట్లాడుతూనే వున్నాడు.
    "నాన్నా! నేను రజనీని చంపానని నువ్వు కూడా నమ్ముతావా?" రవి కంఠం అతి ధీనంగా పలికింది.
    "నమ్మక ఏం చేస్తానురా? నువ్వు హంతకుడివే! నాకు బాగా తెలుసు. ఇంకా అబద్ధాలు కూడా ఎందుకు ఆడతావు? చేసిన తప్పుకు నేను అనుభవించలేని శిక్ష నువ్వైనా అనుభవించు. నేను ఉరికంబం తప్పించుకున్నాను. కానీ నువ్వు తప్పించుకోలేవు. అప్పటికి గాని మన వంశ శాపం విముక్తి కాదు."
    నాన్నకు పిచ్చి పట్టలేదు కదా? తను హత్య చేశానంటాడేం? రవి ఆశ్చర్యంగా తండ్రి ముఖంలోకి ఓ క్షణం చూసి "నా మాట నమ్ము నాన్న! నేను హత్య చెయ్యలేదు. రజనీని నేను చంపలేదు. నువ్వు ఇచ్చిన శిక్షణ వృధా కాలేదు నాన్నా! నువ్వు ఆశించిన ఆదర్శ శిఖరాలను అధిరోహించి నిన్ను సంతృప్తి పరచాలని అహర్నిశలూ ఆరాట పడ్డాను. కాని దురదృష్టవశాత్తు చెయ్యని అపరాధం నెత్తిన పడింది. ఉరికంబం ఎక్కడానికి నేను భయపడటం లేదు. నువ్వు కూడా నన్ను హంతకుడిగా భావిస్తున్నావనేదే నా బాధ!" అన్నాడు రవి.
    జగన్నాథం రవి ముఖంలోకి దీక్షగా చూశాడు. కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూశాడు.
    అది హంతకుడి ముఖమా? ఆ కళ్ళు హంతకుడి కళ్ళా? ఎప్పటికి కాదు. రవి హంతకుడు కాదు. ఆ కళ్ళలో నిజాయితీ, ఆ ముఖంలో నైర్మల్యం___వాడు హంతకుడు కాదు. తను ఇచ్చిన శిక్షణ వృధా పోలేదు.
    జగన్నాథం కళ్ళు చెమర్చాయి.
    "బాబూ! నిజమే చెబుతున్నావా?" ఆనందం దుఃఖం జగన్నాథం కంఠంలో ఒకదాన్నొకటి ఒరచుకున్నాయి. రవి రెండు చేతులూ అందుకున్నాడు.
    "నా మాట నమ్ము నాన్నా! నేను రజనీని చంపలేదు"
    "నమ్ముతాను బాబూ! నువ్వు రజనీనే కాదు ఏ ప్రాణినీ చంపలేవని నాకు తెలుసు. కాని నిజం చెప్పు బాబూ అసలు ఏం జరిగింది? రజని ఎలా చనిపోయింది? ఆ ప్రమాదం ఎలా జరిగింది?" ఆత్రంగా అడిగాడు జగన్నాథం.
    రవి జరిగిన విషయం వివరంగా చెప్పాడు. జగన్నాథం రిలీఫ్ గా నిట్టూర్చాడు. పరుగులాంటి నడకతో పోలీస్ ఇన్ స్పెక్టర్ దగ్గిరకు వచ్చాడు.
    "ఇన్ స్పెక్టర్ గారూ! మా రవి హత్య చెయ్యలేదు. నా బిడ్డ హంతకుడు కాదు. నా మాట నమ్మండి" అంటూ రవి చెప్పిన విషయాలు వివరించి చెప్పాడు.
    ఇన్ స్పెక్టర్ మౌనంగా అంతా విన్నాడు. అదోలా నవ్వుతూ జగన్నాథం ముఖంలోకి చూశాడు.
    "నిజమండీ! మా రవి అబద్ధం ఆడడు. మీరు అలా నవ్వుతూ నా మాట కొట్టిపారెయ్యకండి."
    "హంతకుడు హత్య చేసినట్టు ఒప్పుకుంటాడయ్యా? ఈ పదిహేను సంవత్సరాల సర్వీసులో ఎవడూ తను తప్పు చేసినట్టు ఒప్పుకోవడం నేను చూడలేదు. చివరికి మేము కొందరిచేత నిజం కక్కిస్తామనుకోండి. అది వేరే సంగతి" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "నా మాట నమ్మండి" ప్రాధేయపూర్వకంగా అన్నాడు జగన్నాథం.
    "బాల్ - బేబీ కథ ఎంత హాస్యాస్పదంగా వుందో మీకు మీ బిడ్డమీద వున్న ప్రేమకొద్దీ అర్థం కావడం లేదు."
    "మా రవి అబద్ధం ఆడడండీ! నేను రవిని ఎలా పెంచానో తెలిస్తే నా మాటల్ని ఇంత తేలిగ్గా తీసివెయ్యరు."
    "అయినా నాకు చెప్పి ప్రయోజనం లేదు. ఆ కథ ఏదో కోర్టులోనే చెప్పి జడ్జిగారిని నమ్మించండి" అన్నాడు ఇన్ స్పెక్టర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS