Previous Page Next Page 
ది సెల్ పేజి 23


    హరిశ్చంద్రుడు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి- ఫిర్యాది కూడాను. అయితే అనుకున్నట్టు గాక మరోలా సాక్ష్యం చెప్పాడు. అంతా చూసినట్టు ముద్దాయి మాత్రం బోనులో వున్న వ్యక్తి కాడని చెప్పాడు. ఇంక తీర్పు ఏ విధంగా వుంటుందో విందాము.
    "ఈ కేసు దర్యాప్తు నుండి పోలీసువారు ఎక్కువ శ్రమపడి కేసు పాడుచేసి వుండాలి. లేదా ముద్దాయి హైలీ ఇన్ ఫుఇన్ షియల్ అయివుండి సాక్షులను తనవేపు త్రిప్పుకుని అయినా వుండాలి. లేదా పరిస్థితులు ఓ అమాయకుడిని నేరస్థునిగా బోను ఎక్కించి అయినా వుండాలి. ఏది ఏమైనా ఇప్పటివరకు విన్న సాక్ష్యాధారాలను పరిశీలించి, వాదప్రతివాదనలను విని, ఈ కేసులో చనిపోయిన వినాయకరావు చావుకు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాలి! భావి భారత పౌరుడిని, ఒక ఆదర్శ విద్యార్థిని, ఇంత అమానుషంగా పొట్టన పెట్టుకున్నందుకు ఈ కుళ్ళు రాజకీయాలకు మేధావుల మనస్సు తప్పక చలిస్తుందని, మరి ఏ కాలేజి చరిత్రలో ఇటువంటి రాజకీయ అరాచకం జరగకూడదని విశ్వసిస్తూ, ముద్దాయిని నిర్దోషిగా పరిగణిస్తూ ముద్దాయి పై కేసు కొట్టివేయటమైనది."
    ఉత్కంఠతో వింటున్న జనం ఒక్కసారిగా వుస్సురంటూ కోర్టు హాలు నుండి ఒక్కొక్కరు మెల్ల మెల్లగా వెళ్ళిపోయారు.
    కోర్టు బయట "భలే న్యాయం! చరిత్రలో చెప్పుకోదగ్గ న్యాయం! ఇలా అయితే రోజుకో హత్య చేస్తా? ఇదే కోర్టుకు వస్తా!" ఒక్కగాని ఒక్క కొడుకుని పోగొట్టుకున్న వినాయకరావు తండ్రి పిచ్చివాడిగా జుట్టు పీక్కుంటూ అన్న మాటలు జడ్జి గారికి వినపడకపోలేదు.
    "ఉన్నత పదవి! ధర్మాసనం! ప్చ్!" అంటూ నిట్టూర్చారు జడ్జి.
    చట్టం రెండు రకాలుగా కనిపిస్తుంది. సామాన్య మానవుడు బయట వూహించేది ఒక రీతి. విధానాలను బట్టి, శిక్షా స్మృతులను బట్టి మరో రీతిగా వుంటుంది.
    వినాయకరావు చావుకి ఈ శతాబ్దిలో యావత్ ప్రజానీకం సిగ్గుపడాల్సిందే. మరి యిటువంటి కేసులో ముద్దాయి తెలివిగా తప్పించుకుంటే, ఒక్కగాని ఒక్క కొడుకుని పోగొటకున్న కన్నతండ్రి హృదయం ఏ విధంగా తట్టుకుంటుంది. అది వూహకి అందటం కష్టమే! ఈ కేసులో తను ఇచ్చిన జడ్జిమెంట్ అసంపూర్తి ఏమోననిపించింది ఆ క్షణంలో న్యాయపతికి. ధర్మాసనంమీద కూర్చున్న తను ఏమీ చేయలేక మౌనముద్రలో వుండిపోయాడు.

                                          *    *    *

    ఆనాటి జడ్జిమెంటు సరియైనదో కాదో! ముద్దాయికి, అబద్దపు సాక్ష్యంతో ముద్దాయిని గట్టున వేసిన హరిశ్చంద్రుడికి, ముక్కుపచ్చలారని కొడుకుని పోగొట్టుకున్న పితృహృదయానికి మాత్రమే తెలుసు.
    నాటి ప్రత్యక్ష సాక్షి హరిశ్చంద్రుని ఒక్కగాని ఒక్క కూతురు రాధ మానభంగం చేయబడి గొంతు నులిమి, వికృతంగా చచ్చింది. మానభంగానికి ప్రత్యక్షమైన సాక్ష్యం లేకపోయినా, పరిసర పరిస్థితులు చూసిన రాధ క్లాస్ మేటు సునీల చూసినంతమటుకే చెప్పింది. చూడనిదానిని ఎవరెన్ని చెప్పి ఏ విధంగా మభ్యపెట్టినా, అది సత్యమైనా, చూడలేదుకాబట్టి దేవుడి ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పింది.    
    కన్నవారిని అతి దారుణంగా పోగొట్టుకున్న కన్న తండ్రులు పదహారు సంవత్సరాల వెనుకటి ఆలోచనల నుండి వాస్తవానికి వచ్చారు....
    ఈసారి హరిశ్చంద్రుడు పిచ్చివాడిలా జుత్తు పీక్కుంటూ అరుస్తున్నాడు. "నా కూతురికి అన్యాయం జరిగిపోయిందిరో! నా పాపాలే దానికి శాపాలయ్యాయిరో! నా స్వార్థమే దాన్ని పొట్టన బెట్టుకుంది...
    ...ఆనాడు ముప్పయివేలకి అమ్ముడుబోయిన నాకు ముప్పయిలక్షలు పెట్టినా నా కూతురు తిరిగి రాదు..." అంటూ బోరున విలపించాడు.
    కోర్టు బయట హరిశ్చంద్రుని ఘోషను విన్న వినాయకరావు తండ్రి వయసు భారంతో తృప్తిగా కన్ను మూశాడు.

                                                           *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS