Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 23


    దేశం కోసం త్యాగం చేసిన మహావీరుల స్మృతికి చిహ్నంగా అక్కడ కొన్ని రాళ్ళున్నాయి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క వీరుని స్మృతి చిహ్నం. అవే వీర కల్లులు.
    వాటిలో సోమదేవుడి పేర స్థాపించిన వీరకల్లు కూడా వుంది. దాని ప్రక్కనే నునుపైన ఓ నల్లరాయి. దానిమీద వివరాలేమీ వుండవు కాని 'వేమాంబికవారు' అని మాత్రం చెక్కి వుంటుంది. అవి చూడగానే ఏ మనిషికయినా హృదయం కదులుతుంది. మనసులో ఆ వీరుల స్మృతి గీతాలు చెలరేగుతాయి. బండరాయిని తీసుకువెళ్ళి ఆ వీరకల్లుల మధ్య పారేస్తే మరునిముషంలో అదికూడ విషాద గీతాలను పాడుతుంది. అంత సజీవమయిన చోటు అది. అక్కడే ఆ మూలగూరమ్మ యెదుటనే కొమరగిరి, చినకోమటి వేముల మధ్య ముఖాముఖి యుద్ధం సాగింది. ఆ మూలగూరమ్మ సాక్షిగానే వేమసాని వారిద్దరిచేతా, ప్రమాణాలు చేయించింది. ఆ తరువాత కొండవీటి రాచకొలనులో కలకలం చెలరేగదని అప్పటి పెద్దలంతా ఆశించారు. కాని అలా జరుగలేదు. ఈ విషయాలన్నీ సంక్షిప్తంగా నా మిత్రులతో చెప్పాను. అంతటితో వారు నన్ను వదలలేదు. కవిమిత్రుడు అలా కాకుండా ఆ కథ వివరంగానే చెప్పమని, కొమరగిరి మీద సి.నా.రె. వ్రాసిన కవిత్వం చదివాక దానిని గురించి తెలుసుకోవాలనీ కుతూహలం ఎక్కువైందని పీడించసాగాను.
    దగ్గరలో అమీనాబాదు అనే చిన్న పల్లెటూరుంది, అక్కడకు అడపాదడపా వచ్చే టూరిష్టులకు ఆ గ్రామంలో కలో గంజో తినేందుకు ఏర్పాటు చేస్తారు. రూపాయల వర్షం కురిపించినా ఆ ఊళ్ళో రుచికరమైన భోజనం మటుకు దొరకదు. విశ్వనాధ వారన్నట్లు "ఏదో బ్రాహ్మణ పిండాన్ని" కనుక భోజన సదుపాయాల కబురు పంపి వీరిద్దర్నీ వీరకల్లుల మధ్యకు తీసుకువెళ్ళాను. అక్కడ కూర్చోమన్నాను.
    "ఈ స్మశానంలోనా?" బిక్కమొఖం పెట్టాడు కవి.
    "ఇది స్మశానం కాదు. చరిత్ర పేటిక. నోరు మూసుకుని పడుండు. లేకపోతే కధా లేదు గిధా లేదు" అన్నాడు రమణ.
    అంతటితో కవిగాడి నోరు మూతపడింది.
    "ఇదుగో నునుపుగా చెక్కే వున్నదే అరున్నరడుగుల నిలువాటి రాయి. ఇదే సోమదేవుని వీరకల్లు!"
    అదుగో ఆ రాయి అది మీ సి.నా.రె. వ్రాసిన కర్పూర వసంతరాయలు కావ్యంలోని హీరో గారిది. కొమరగిరిరెడ్డిదన్నమాట అని చెబుతున్నాను. కవిమిత్రుడు లేచి రివ్వున పోయి ఆ రాయిని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తత్తరపాటులో ముందుకు కొంచెం వేగంగా వంగాడు కాబోలు మూతిపళ్ళు కొంచెం కదిలాయి. రక్తం పెద్దగా రాలేదు. కాని నోరు కడిగించాను. కవిమిత్రుణ్ని రెక్కపట్టుకుని బరబరా యీడ్చుకొచ్చి నాముందుకు తెస్తూ "ఇప్పుడు పళ్ళు విరిగాయి, ఈసారి కదిలావంటే కాళ్ళు విరుగుతాయి అన్నాడు రమణ.
    కవిగారి జోరు కొంచెం తగ్గింది. నోట్లో చేతిరుమాలు కుక్కుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
    'ఇక్కడే కొమరగిరి-చినకోమటి వేముల మధ్య ముఖాముఖి యుద్ధం జరిగిందని చెప్పాను కదూ!
    అనవేమారెడ్డి చెల్లెలుగా గౌరవించే అంతఃపుర కాంత ఒకామె ఉండేది. ఆమె పేరు వేమసాని. ఆమెను కోమటి వేముడు 'అత్తా' అని సంబోధించేవాడు.
    అనవేమారెడ్డి పోగానే కొమరగిరి. అతనికన్న అయిదారేళ్ళు చిన్నవాడైన చిమకోమటి వేముడూ రాజ్య సింహాసనం అధిష్టించాలని పట్టు బట్టారు. ఎవరూ తగ్గలేదు.
    రాజధానిలో కలకలం బయలుదేరింది. అంతకుముందు కోమటి వేముడు చందవోలును పాలిస్తూ తండ్రి క్రింద సామంతుగా ఉండేవాడు. ఇప్పుడతని మరణంతో రాజు కావాలని పట్టు బట్టాడు.
    కొమరగిరి అనవేముడు నా తండ్రి తరపున రాజ్యం చేశాడు కనుక నిజమైన వారసుణ్ని నేనే పట్టుబట్టాడు. ధర్మా ధర్మాల చర్చలు చెలరేగాయి.
    శ్రీలవాసజియ్యారూ, కొమరగిరి సోదరిని వివాహం చేసుకున్న కాటయవేముడూ, అల్లాడరెడ్డి, ఇమ్మడీందుడూ వీరంతా కుమారగిరి పతాక ఎత్తారు.
    మామిడి సింగన్న, పెద్దియజ్వ, రాయవిబాచడు, వెలుగోటి రాయప నాయకుడూ వీరంతా కోమటి వేముని ధ్వజమెత్తారు. వారు వైష్ణవులు. వీరంతా శైవాను యాయులు. ఈ సమస్యపై తర్జన భర్జనలు జరిగాయి. కాని తేలలేదు. రాజ్యంలో అంతఃకలహం ఏర్పడే ప్రమాదం ముంచుకొచ్చింది. అది ఎవరికీ ఇష్టం లేదు.
    వేమసాని ఈ స్థితిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక ప్రకటన చేసింది. రాజ్య వారసత్వ విషయంలో తనకూ, అన్నగారికీ (అనవేముడు) దృఢమైన అభిప్రాయాలున్నాయని, ఆ అభిప్రాయాలాకు అనుగుణంగా అన్నగారొక శాసనం వ్రాసి తనకిచ్చిపోయారనే ఆమె ప్రకటించింది. అదేమిటో తెలుసుకోవాలని అటు వారూ, ఇటు వారూ ఉబలాట పడ్డారు. అయితే ఆమె శాసనాన్ని మూలగూరమ్మ సాక్షిగా మాత్రమే ప్రకటిస్తానన్నది.
    ఇక అంతటితో కొండవీడులోని ఎద్దుల బండ్లు మొత్తం కదిలాయి. అందరూ మూలగూరమ్మ దేవాలయానికి చేరారు. అప్పటికే మాటమాట పెరిగిన కొమరగిరీ-కమతి వేముడూ యుద్ధం చేయసాగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS