బ్లడ్ ప్రెజర్ అనుకోగానే తనకి వున్న షుగర్ కంప్లయిట్ కూడా గుర్తు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన డ్యూడేట్ దాటిపోయింది. సితారకి అది గుర్తులేదా? ఎప్పుడు వెళ్ళమంటుందో! ఎప్పటికప్పుడు గుర్తులేనట్లే ఉంటుంది తను. ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండటం తనకి చిన్నతనం అనిపిస్తుంది.
దగ్గరలోనే ఉన్న చర్చికి అనుబంధంగా ఒక ఛారిటీ క్లినిక్ కూడా నడుపుతున్నారు. వారానికోసారి ఫ్రీగా చూస్తారుట. ఇకనుంచి తను అక్కడికి వెళితే?
"లేచి తయారవండి. నేను ఫిలడెల్ఫియా వెళ్తున్నాను. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను."
"ఇడ్లీ ఇవాళేనా?" అన్నాడు ఆనంద్ ఉత్సాహం తెచ్చుకుంటూ.
వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వారానికొక్కసారే ఇడ్లీ!
"సారీ రవ్వ అయిపోయింది. ఇండియన్ స్టోర్ కెళ్ళి తెచ్చుకోవాలి?"
"ఒక్కసారే ఓ రెండు కిలోలు ఎందుకు తెచ్చేసుకోకూడదూ?" అని అరవాలనిపించింది ఆనంద్ కి. కాపీనం! కాపీనం!
కానీ, ఇది అమెరికా! అన్నీ లెఖ్ఖ ప్రకారమే జరగాలి. దేశం కాని దేశం డబ్బు ఖర్చుపెట్టేసుకుంటే రేపు ఏమవుతుందో?
పైసా కోసం ప్రాణభయాన్ని మించిన టెన్షను.
నిరంతరం!
మాట్లాడకుండా లేచి బాత్ రూమ్ వైపు నడిచాడు.
అది మూడు బెడ్ రూంలు, 'రెండున్నర బాత్ రూంలు' ఉన్న ఇల్లు.
'రెండున్నర బాత్ రూంలు అనేది అమెరికాలో కామనే. మాస్టర్ బెడ్ రూంకి అటాచ్ డ్ బాత్ రూం వుంటుంది. ఇంకొకటి కామన్ బాత్ రూం.
సర్వసాధారణంగా ఈ 'సగం బాత్ రూం' కింద పరిగణించబడే మూడవ బాత్ రూంలో టాయిలెట్ కమ్మోడ్, వాష్ బేసినూ మాత్రమే ఉంటాయి. అక్కడ స్నానానికి వీలు వుండదు.
మేడ మీద వున్న మామూలు బాత్ రూంలోకే వెళ్ళాడు ఆనంద్.
బాత్ రూం అయినా సరే, చుక్క నీళ్ళు కిందపడకూడదు! ఎందుకంటే చెక్క ఫ్లోరింగ్. ఆ మాటకొస్తే ఇల్లంతా చెక్కతో చేసిందే.
కింద మాత్రం కాంక్రీటు బేస్ మెంట్.
ఇక దానిమీద ఫ్లోరింగూ, గోడలూ, కప్పు, కప్ బోర్డులూ - సమస్తం చెక్కతో చేసినవే! అమెరికాలో పూర్తిగా కాంక్రీటుతో కట్టుకునే ఇల్లు బహు తక్కువ.
కారణం చలిపులి!
కాంక్రీటు కట్టడాలలో చలి చాలా ఎక్కువగా ఉండి, చంపేస్తూ ఉంటుంది. అందుకనే ఇళ్ళు చెక్కతో కట్టుకుంటారు. అయినా సరే, ఇంట్లో హీటింగ్ సిస్టం ఉండాల్సిందే. లేకపోతే చలికి గడ్డకట్టుకుపోయే పరిస్థితి.!
"పన్నెండున్నరకి ఫ్లయిట్ అరైవల్! మర్చిపోకండి!" అని మరోసారి హెచ్చరించి యాంత్రికంగా 'బై' చెప్పి బయటికి వెళ్ళిపోయింది సితార.
గ్యారేజ్ తాలూకు షట్టర్స్ రిమోట్ కంట్రోల్ ద్వారా తెరుచుకున్న శబ్దం వినబడింది. మరో నిమిషం తర్వాత, మళ్ళీ షట్టర్స్ మూసుకున్న శబ్దం సన్నగా వినబడింది.
సన్నగా మూలిగింది ఆనంద్ హృదయం.
వైఫ్ కి అర్థం ఇలా ఉండడమేనా? లైఫ్ కి అర్థం ఇలా గడిచిపోవడమేనా?
ఎదురుగా ఉన్న సోఫాని ఎడం కాలితో బలంగా తన్నాలన్నంత బలమైన కోపాన్ని అతికష్టంమీద అదుపులో పెట్టుకున్నాడు ఆనంద్.
కప్ బోర్డు తెరిచి, రెండు బ్రెడ్ స్లయిసెస్ తీసుకుని, పక్కనే ఉన్న జార్ లో నుంచి చాకుతో పీనట్ బట్టర్ కొద్దిగా తీసుకుని ఆ స్లయిసెస్ కి పూశాడు. వేరుశనగలో నుంచి తయారుచేసే ఆ 'వెన్న' బావుంటుంది. ఇంకాస్త తీసుకోవాలని చాకు జార్ లో పెట్టి, ఆలోచించి, మళ్ళీ మానేశాడు ఆనంద్.
బటర్ తొందరగా అయిపోతే తనని నేరస్తుడిలా చూస్తుంది సితార.
ఎందుకొచ్చిన గొడవ!
అలితో పోరుకంటే అర్థాకలితో ఉండడమే మేలు!
శాండ్ విచెస్ తినేసి బ్లాక్ కాఫీ తాగాడు.
ఇక్కడ పేపరు రాదు. పేపర్ తెప్పిస్తే ఖర్చుకదా! తెప్పించకపోతే, నెలకో ఇరవయ్యో, అరవయ్యో డాలర్లు ఆదా! న్యూస్ హెడ్ లైన్లు కంప్యూటర్ నెట్ వర్కులో చూసుకోవడమే శరణ్యం!
బాత్ టబ్ లో దిగి, పక్కనే పార్టీషన్ లాగా వున్న ప్లాస్టిక్ కర్టెన్లు లాగాడు ఆనంద్. అవును మరి! స్నానం చేస్తున్నప్పుడు నీళ్ళు చింది చెక్కనేలమీద పడితే చిక్కే!
స్నానం పూర్తిచేసి, త్వరత్వరగా డ్రెస్ చేసేసుకున్నాడు ఆనంద్.
అద్దంలో చూసుకున్నాడు.
ఫర్వాలేదు-అరవై దాటినా కూడా ఇంకా ఇరవై తాలూకు ఛాయలు పూర్తిగా పోలేదు.
తను అందగాడే!
మరి ఒకప్పుడు సినిమా హీరోగా షైనయిన వాడుకదా తనూ!
అది గతం!
ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు తను ఆనందం అనేది ఏ కోశానా లేని సగటు జీవి ఆనంద్. అంతే!
మళ్ళీ ఇంకోసారి అద్దంలో చూసుకున్నాడు ఆనంద్.
నాట్ బాడ్!
నాట్ బాడ్ అట్ ఆల్!
సైడ్ బర్న్స్ దగ్గర, కణతల దగ్గరా జుట్టు నెరిసిపోతేనేం!
తను అలనాటి హాలివుడ్ హీరో స్టివార్ట్ గ్రాంజర్ లాగా లేడూ?
స్టివార్ట్ గ్రాంజర్ 'ప్రిజనర్ ఆఫ్ జెండా'లో హీరో!
ఆ పేరు తను వున్న పరిస్థితికి భలేగా సూటయిందే!
ప్రిజనర్!
ఖైదీ! జీవిత ఖైదీ!
ఇదంతా తను చేతులారా చేసుకున్నదే!
'చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహదేవా!' అని కదా అన్నారు.
అంతలోనే అతనికి ఇంకో ఆలోచన తట్టి అదోలాంటి నవ్వు మొహం మీదికి వచ్చింది.
చేసుకున్నవాళ్ళకి సరే!
చేసుకోని వాళ్ళకి?
తను ఈ సితారని ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు గదా అసలూ!
పెళ్ళి కాకుండానే పెడాకులయిపోయింది తన బ్రతుకు.
కంప్యూటర్ ఆన్ చేశాడు ఆనంద్....వెదర్ రిపోర్టు చూడడానికి.
ఇక్కడంతా అంతే! ఎక్కడా పర్సనల్ టచ్ అనేది వుండదు. వాతావరణం తెలుసుకొవాలన్నా, టిక్కెట్లు బుక్ చెయ్యాలన్నా అన్నిటికీ కంప్యూటరే!
పరమ యాంత్రికం!
వెదర్ చూస్తేనే వెన్నెముకలో నుంచి చలి పుట్టుకు వచ్చింది. రెండు డిగ్రీల సెంటిగ్రేడు!
కిటికీ దగ్గర నిలబడి చూశాడు. అన్ని ఇళ్ళకప్పులూ కూడా మంచు టోపీలు పెట్టుకుని ఉన్నట్లుగా ఉన్నాయి. రాత్రంతా కురిసిన తెల్లటి చిప్స్ లాంటి స్నోఫ్లేక్స్ గడ్డకట్టి ఒక్కొక్క కప్పూ ఒక్కొక్క ఐస్ బ్లాక్ లాగా కనబడుతోంది.
రోడ్లమీదంతా కూడా అడుగున్నర ఎత్తున మంచు పేరుకుపోయి వుంది.
చలిపులిని ఎదుర్కోవడానికి గానూ పొరలు పొరలుగా దుస్తులు ధరించాలి. ఇప్పుడు తను వేసుకున్నట్లుగా.
ముందు బనియన్, దానిమీద దళసరి బట్టతో కుట్టిన షర్టు, దానిమీద స్వెట్టరు, ఆపైన అమెరికాలో అందరూ 'కోట్' అని పిలిచే జెర్కిను, తలకి పెట్టుకోవడానికి ఉలెన్ క్యాప్, చేతులకి గ్లోప్స్.
ఉలెన్ సాక్సు వేసుకుని, రీబోక్ స్పోర్ట్స్ షూస్ తొడుక్కుని, కార్లో కూర్చున్నాడు ఆనంద్. వాచీలో టైమ్ చూసుకున్నాడు.
పది అవుతోంది.
యదాలాపంగా, డాష్ బోర్డు మీద ఉన్న క్లాక్ వైపు చూశాడు.
అందులో తొమ్మిదే అయింది!
ఒక్కక్షణం పాటు నుదురు చిట్లించి ఆలోచించాడు.
మరుక్షణంలో అతనికి తట్టింది!
ఇది శీతాకాలం!
శీతాకాలంలోనూ, వేసవికాలంలోనూ కూడా అమెరికాలో అధికారికంగా టైమ్ 'మార్చేస్తారు'
శీతాకాలంలో టైమును ముందుకు జరుపుతారు. అంటే పది కాస్తా తొమ్మిది అవుతుంది. తొమ్మిదింటికి ఆఫీసుకి వెళ్ళవలసిన వాళ్ళు ఎనిమిదింటికే వెళ్ళాలన్నమాట! అట్లాగే, సాయంత్రం ఐదింటికి బదులు నాలుగింటికే ఆఫీసులు మూసేస్తారు. ఎందుకంటే, అమెరికాలో శీతాకాలంలో సాయంత్రం నాలుగింటికే వెలుగు తగ్గిపోవడం మొదలవుతుంది. వెలుగు వుండగానే ఇళ్ళకు చేరుకోవాలని ఆ టైము మార్పు.
అట్లాగే వేసవిలో రాత్రి ఎనిమిదీ, తొమ్మిదింటిదాకా చీకటి పడదు!
