Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 23

 

    "పనులు చెయ్యమన్నప్పుడు చేస్తేనే అందం -- చందం , నువ్వు తాత్సారం చేశావు ఈలోగా నాకు సినిమా చాన్సు వచ్చింది. ఏం! నీకు సినిమా ఛాన్సు వస్తే వదులుకునే వాడివా?" అంది కోడలు గట్టిగా.
    "మరి పిల్లలేమయిపోతారు?" అన్నాడు కొడుకు బాగా తగ్గిపోయి.
    "వాళ్ళేమన్నా నేను నోములు నోస్తే పుట్టిన వాళ్ళా ఏమిటి ? వాళ్ళని నువ్వే పుట్టిన్చావు . నువ్వే పెంచు" అంది ఆమె నిర్ధాక్షిణ్యంగా.
    "పెంచరా నాయనా! వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళాలు వచ్చాక నిన్ను అడవిలో వదిలేసి వచ్చేదాకా పెంచు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత" అంది ముసలామె గయ్యాళిగా.
    "ఒసే! పిల్లలు నీకోసం కలవరిస్తూన్నారే! అయిందేదో అయింది -- తిరిగి వచ్చేయ్!" అంటున్నాడు కొడుకు.
    "వాళ్ళు పిల్లలు కాదు -- పిశాచాలు . పాలుకు బదులు నా రక్తం తాగి ఒళ్ళు పిప్పి చేసేశారు. ఆ నరకానికి ఇంకరాను. ఈ సుభాష్ తో స్వర్గం చూస్తా! సినిమా హీరోయిన్ను అవుతా ! సుభాష్ నా పాలిట దేవుడు. సుభాష్!" అని అన్ని వైపులా కంగారుగా చూసింది కోడలు.
    ఇంకెక్కడి సుభాష్!
    రాక్షసుడి వేషాలు వేసే సుభాష్ మాయమాటలతో ఆ అమ్మాయిని లొంగదీసుకున్నాడు. హీరోయిన్ని చేస్తానని ఆశ పెట్టి లేవదీసుకు వచ్చేశాడు. విషయం బయటపడగానే చల్లగా ఎటో జారుకున్నాడు.
    ఇంతలోనే అటు వైపు ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఖరీదైన ఫ్యాన్సీ బట్టలు వేసుకుని వున్నాడు. అతని మొహంలో మహా లౌక్యం కనబడుతోంది.  
    అతన్ని చూడగానే చేతులు రెండూ భక్తిగా జోడించింది కోడలు.
    "ఏయ్! ఇప్పటిదాకా ఎక్కడ పడుకుని వస్తున్నావే. ఒళ్ళు కొవ్వెక్కిందా! పగలుకి రాత్రికి తేడా తెలీటం లేదే!" అన్నాడు అమర్యాదగా.
    బిక్కచచ్చిపోయింది కోడలు పిల్ల. "డైలాగు డెలివరీ గురించి సుభాష్ చెబుతున్నాడు సార్!' అంది ఆదుర్దాగా.
    "నువ్వు సుభాష్ గాడి సుభాషితాలు వినడానికొచ్చావా? నా పిక్చర్ లో ఎగేస్త్రా వేషం వెయ్యడానికొచ్చావా? ఏడీ దొంగ నాయాలూ!" అన్నాడు అతను పౌరుషంగా.
    అంటూనే జేబులో నుంచి ఖరీదైన సిగరెట్ ప్యాకెట్ తీసి ,అందులో నుంచి ఒక సిగరెట్ తీసి దాన్ని ముట్టించుకుని , పాత సిగరెట్టు ముక్కని పొదల్లో పడేశాడు.
    చిన్నగా దగ్గాడు రాజు.
    "మిస్టర్! మీరు చేసింది మంచి పని కాదనుకుంటాను. ఆ సిగరెట్ ని తీసి అర్పేయండి " అన్నాడు మర్యాదగా.
    "నువ్వేవడివిరా , నా కొడుకువి! నాకు చెప్పేటంతవాడివా! నేనెవరో నీకు తెలీదు. బాబూ సెట్ ని - వజ్రాల వ్యాపారం ఉంది. అండర్ వరల్డు కనెక్షన్లు వున్నాయి -- సినిమా ప్రొడక్షన్ వుంది. ఈ బాబుల గాడి దెబ్బ అంటే గోలుకొండ అబ్బా అనాలి !" అన్నాడు పౌరుషంగా.
    "మిస్టర్! ముందు ఆ సిగరెట్ పీకేని తియ్యి" అన్నాడు రాజు శాంతంగా.
    "ఏం! సిగరెట్టు పీకే తియ్యకపోతే నా పీకే పిసుకుతావా?"
    "ముందు తియ్యి!"
    "బాబు సేట్ కొంచెం తగ్గి "ఎందుకు ?" అన్నాడు.
    "ఇట్లాంటి పనులవల్లె అడవులు అంటుకునేది ."
    "నువ్వు ఫారెస్ట్ రెంజరువా?"
    "కాదు "
    "కండలు తిరిగి వున్నాయ్! కొంపదీసి మిస్టర్ యూనివర్స్ వా?" అన్నాడు హేళనగా.
    "అవునూ -- కాదు కూడా" అన్నాడు రాజు కూల్ గా.
    "ఏమిటి ?" అన్నాడు బాబు సేట్ నోరెళ్ళబెట్టి . కొద్ది క్షణాల పాటు రాజునే చూస్తూ వుండిపోయాడు.
    తర్వాత ఉద్వేగంగా అన్నాడు.
    "అరె ఇస్కీ! ఇప్పుడు గుర్తొచ్చింది -- నువ్వు మిస్టర్ యూనివర్స్ వె!    
    టీవీలో చూశాం గదా- మీ పేరు రాజన్"
    "రాజు"
    "అవును ! రాజు ! మిస్టర్ యూనివర్స్ టైటిలు గెలుచుకున్నాక కూడా అది వద్దని వదిలేసి వచ్చినవాడివా" అని ఆనందంగా నవ్వాడు బాబూ సేట్.
    "మీకు న్యూస్ తెలుసా?" అన్నాడు మిస్టీరియస్ గా, ప్రశ్నార్ధకంగా రాజు.
    "మిమ్మల్ని నా నెక్ష్ట్ పిక్చర్ లో హీరోగా బుక్ చేస్తున్నాను. వెధవ ఒక్క నెక్స్ట్ పిక్చరేమిటి ? మీతో మూడేళ్ళ కాంట్రాక్టు. మూడేళ్ళలో మూడార్ల పద్దెనిమిది సినిమాలు తీస్తాను . ఓకే?" అన్నాడు అహంభావాన్ని ప్రదర్శిస్తూ.
    అది పట్టించుకోకుండా "మీరు సిగరెట్ తీయనే లేదు" అన్నాడు రాజు.
    అది వినిపించుకోకుండా , డాబుగా జేబులో నుంచి చెక్కు బుక్కు తీశాడు బాబూ సేట్.
    "నా దగ్గర బేరసారాల్లేవు -- సారీ -- సారా ఉంటుందండోయ్- నాకు లిక్కర్ బిజినెస్ కూడా వుంది . మీకు ఎంత కావాలి ?" చెప్పండి.
    కాలుతున్న సిగరెట్లు పడేయడం వల్ల అడవులు తగలబడిపోతాయ్ -- వన్యప్రాణులు నాశనమైపోతాయి " అన్నాడు రాజు.
    అల్ రైట్ - బ్లాంక్ చెక్కు ఇస్తున్నాను . మీకు కావాల్సిన ఫిగరు ,మీరే వేసుకోండి " అన్నాడు బాబూ సేట్ పొగరుగా.
    "మీరు సినిమా సంగతి చెబుతున్నారు -- నేను సిగరెట్టు సంగతి చెబుతున్నాను ."
    ప్రొడ్యూసర్ బాబూ సేట్ అది వినిపించుకునే మూడ్ లో లేడు. రాజు చేత సినిమా అగ్రిమెంటు ఎట్లాగైనా సరే సైన్ చేయించాలనే తాపత్రయంతో వున్నాడు. చెక్కు మీద చకచక సంతకం పెట్టి.
    "ముందు ఆ చెక్కు తీసుకోండి సార్! ఇది బ్లాంక్ చెక్కు- మీకు ఇష్టమొచ్చిన ఫిగరు వేసుకోండి . అసలు మీరు చెక్కు చెత్తో పట్టుకుంటే చాలు - అగ్రిమెంటు అయిపోయినట్టే . ప్లీజ్ సార్!' - ప్లీజ్!" అన్నాడు బాబూ సేట్ ప్రాధేయపడుతూ.    
    ఓసారి అతనివైపు పరీక్షగా చూసి చెక్కుని అందుకున్నాడు రాజు.
    బ్రహ్మానంద భరితుడయిపోయాడు బాబూ సేట్.
    ఒంగి పొదల్లో పడి కాలుతున్న సిగరెట్ పీకే తీశాడు రాజు. అప్పటికే , కొన్ని ఎండుటాకులు అంటుకున్నాయి. వాటిని కాలితో తొక్కి అర్పేశాడు. ఇంకా కాలుతూనే ఉన్న సిగరెట్ పీకెను చెక్కుకి ఆనించాడు . ఎక్కడా? సరిగ్గా అంకెలు వేసే చోట! చెక్కుకి కన్నం పడింది. తర్వాత సిగరెట్ పీకెని చెక్కుకి ఇంకోచోట అంటే బాబూ సేట్ సంతకం పెట్టిన చోట ఆనించాడు. చెక్కికి ఇంకో కన్నం పడింది. చెక్కుని ఆ విధంగా ఎందుకూ పనికిరాకుండా చేశాక, తాపీగా అన్నాడు రాజు.
    "సారీ చెక్కులతో ఆడుకోవడం నాకు గొప్ప దురలవాటు ! చెక్కులని చూస్తె చేతులూరుకోవు!"
    అవమానంతో బాబూ సేట్ మొహం ఎర్రబడింది. అయితే ,, చాలా మందికిలాగే అతనిది కూడా "అందితే జుట్టు -- అందకపోతే కాళ్ళు -" పట్టుకునే తత్వం.
    మొహం మీద కనబడుతున్న అవమానపు ఛాయను తుడిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కర్చీఫుతో మొహం తుడుచుకుని అన్నాడు బాబూ సేట్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS