Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 23

   
    మేము నిఘావేసిన విషయం దుండగులు పశిగట్టివాళ్ళు తెలివిగ విడిపోయి పలురకాల మార్గాలగుండా యితర కంట్రీస్ కి ప్రయాణమైనారు. నేను మా వాళ్ళు కూడా నాలుగుదార్లు పట్టక తప్పలేదు. నేను విమానంలో ఎక్కాను. ఆ ముఠా తాలూకా దేశ ద్రోహి విమానంలో ప్రయాణిస్తున్నాడని తెలుసు. అయితే ఏ పేరుతో ఏ వేషంలో వున్నాడన్నది తెలియదు. విమానంలో బాంబు పెట్టటం వల్లనో లేక కొత్తప్రక్రియల ద్వారానో విమానంలో మంటలు లేచి కూలిపోయింది.    
    మనం వకటి తలచితే విధి యింకోటి తలుస్తుంది. విమాన ప్రమాదంలో నేను మరణించలేదు. అలాగే స్పైడర్ ముఠా తాలూకు మనిషికూడా. దీనిలో మరో పాత్ర బాజీరావుగారిది వుంది. పూర్తి వివరం చెప్పితే మీకు బాగా అర్ధం అవుతుంది.    
    అంటూ కీర్తి అంతవరకూ మామూలుగ చెప్పి యింక అసలు విషయానికి వచ్చి ఈ కేసు స్వరూపస్వభావాలువిమాన ప్రమాదం దగ్గరనుంచి మొదలు పెట్టి గోమాతిని బందీగా పట్టుకుని  ఆ తర్వాత ఆమె ద్వారా ఆ ముఠా మొత్తాన్ని ఎలా బంధించింది వివరంగ చెప్పింది.    
    "ఇంత వరకు నేను వివరించింది విన్నారు. విమాన ప్రమాదం సృష్టించింది వాళ్ళు చేతులారా వాళ్ళు సృష్టించిన ప్రమాదం ఆ ముఠా బంధించ గలిగేటట్లుగమారింది. అందరూ చిక్కారు. నేను మొదట చెప్పినట్లుగ మనం అనుకున్నవికొన్ని అనుకోని విధంగ జరిగి పోతుంటాయి అది యిలాఅన్నమాట".    
    కీర్తి చెపుతుంటే ఇన్ స్పెక్టర్ శివకాంత్ లేచినుంచున్నాడు.    
    "ఇన్ స్పెక్టర్ మహాశయునికి ఏదో పెద్ద అనుమానమే వచ్చినట్లుంది." కీర్తి చిరునవ్వుతో అడిగింది.    
    "ఎస్ మేడమ్" అన్నాడు ఇన్ స్పెక్టర్ శివకాంత్.    
    అందరి ఎదుట కీర్తి శివకాంత్ గౌరవంగా మన్నింపుగ మాట్లాడుకుంటుంటారు. విడిగ యిద్దరు వుంటే పేరుతో పిలిచి ఏకవచనం ప్రయోగించి మాట్లాడుతారు.    
    "అడగండి." అంది కీర్తి.    
    "అనుకున్నవి అనుకోని విధంగ జరిగి పోతుంటాయి అన్నారు కదా!"    
    "ఊ అన్నాను."    
    "ఆ మాటలలో నాకేదో రాంగ్ గ తోచింది."    
    "తోచింది ఏమిటో అడగండి."    
    "అనుకున్నవి అనుకోని విధంగ జరగటం అంటే ఉదాహరణకి నేను ఈ రోజు సినిమా చూడాలి అనుకుంటాను కాని సినిమా చూడటం కుదరక నాటకం చూస్తాను. దీనినేమంటారంటే అనుకున్నది అనుకోని విధంగ జరగటం కాని మీరు చెప్పింది అలాలేదు. అనుకొన్నవి కొన్ని అనుకోని విధంగ జరిగి పోతుంటాయి అని చెపుతూ...    
    "ఊ చెపుతూ...!"    
    "మీరు దేశ ద్రోహులను పట్టుకోవాలనుకున్నారు. అలాగే పట్టుకున్నారు కదా మరి అనుకోని విధంగ ఎలా జరిగినట్లు!"    
    కీర్తి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.    
    "తేలిగ్గా అర్ధంఆయె వంకాయ భాషలో చెప్పానా?" కీర్తి అడిగింది.    
    "వంకాయ భాష అంటే?"    
    "ఎదుటి వాళ్ళకి తేలికగ అర్ధం కావటానికి ఆడవాళ్ళు వుపయోగించే భాష."    
    "సరే ఏదోవకభాష అర్ధం అయితేసరి చెప్పండి." అన్నాడు శివకాంత్.    
    "ఈ రోజు నేను వంకాయకూర తినాలనుకుని, లేత వంకాయలు కొని యింక వంట చేద్దామని ఆ ప్రయత్నంలో వుండగ మిత్రుడి యింటినుంచి అర్జంట్ కాల్ వస్తుంది. వంట ప్రయత్నం విరమించి మిత్రుడి యింటికి వెళతాను. అతగాడి కొచ్చిన కష్టం చెపుతాడు. దాంతో రెండు గంటలు వాళ్ళింట్లో వుండిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత భోజనం ఏర్పాటు వాళ్ళింట్లో జరిగి అక్కడే భోజనం చేయటం జరుగుతుంది.భోజనంలో గుత్తి వంకాయకూర వేశారు. దీనినే అనుకున్నవి కొన్ని.... అనగా....వంకాయకూర చేసుకుతిందామనుకోటం...దానిని చేసుకో లేక ఏదో అడ్డంకి రావటం, అయినా మరో విధంగ....అంటే....అనుకోని విధంగా జరిగిపోతుంటాయి అంటే మరో విధంగా ఎవరింట్లోనో భోజనంలో అనుకున్న కూర లభ్యం కావటం.    
    అలాగే దేశద్రోహులని పట్టుకుందామని కష్టపడి మారువేషంలో రహస్యంగా బైలుదేరితే నే ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికిలోను కావటం, అయినా ఆ ప్రమాదం లోంచి నేను బతికి బైటపడి దేశద్రోహిబైటపడి, ఆ ద్రోహి నాచేతికే చిక్కి దీనినే అనుకొన్నది అనుకోని విధంగ జరిగి పోవటం. మీకు తేలికగ అర్ధం కావటానికి వంకాయ భాషలో చెప్పాను. దట్సాల్." అంది కీర్తి.    
    కీర్తి చెప్పిన విధానం వింటూనే అక్కడ వున్న అందరూ ఫక్కున నవ్వారు.    
    ఇన్ స్పెక్టర్ శివకాంత్ వెర్రి నవ్వొకటినవ్వి కూర్చుండి పోయాడు.    
    జరిగిందంతా నిదానంగా చెప్పి అభినందన సభ ఏర్పాటు చేసి నందుకు కృతజ్ఞత చెప్పి. "ఏదైనా అనుమానాలున్నా ప్రశ్నలు అడగదల్చినా అడగండి" అంటూ కీర్తి కూర్చుంది.    
    కొందరు తమ చిన్న చిన్న అనుమానాలు తీర్చుకోదలచి ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ చిరునవ్వుతో తేలికగా అర్ధమయేలా జవాబు యిచ్చింది కీర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS