Previous Page Next Page 
మంచివాడు పేజి 23

"ఏమిటి అలా చూస్తారు?" రేఖ తల్లి రామ సుబ్బమ్మ అన్నది.
గోపాలరావు కొడుకు తన కూతుర్ని ప్రేమిస్తున్నాడా? తను అకౌంటెంటుగా పనిచేసే కంపెనీ మానేజింగ్ డైరెక్టర్ కొడుకు తన కూతుర్ని పెళ్ళిచేసుకుంటానన్నాడా? తను వెళ్ళి "నీ కొడుకూ నా కూతురూ ప్రేమించుకుంటున్నారు, ఇంకా ఆలస్యం ఎందుకూ? ముహూర్తాలు పెట్టిద్దాం!" అని చెప్పాలా?
శేషయ్యకు దాదాపు మతి పోయినట్టే అయింది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?" భార్య అడిగింది.
"మీ ఇద్దరికీ పిచ్చి పట్టిందా?" ఇద్దర్నీ పిచ్చివాడిలా చూస్తూ అన్నాడు శేషయ్య.
రేఖ చివ్వున తలెత్తి తండ్రి మోహంలోకి చూసింది.
"అదేమిటండీ అలా అంటారు? ఆ అబ్బాయి మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయిని తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోనంటున్నాడట."
"ఎవరితో అంటున్నాడట!" వెక్కిరింపుగా అన్నాడు.
"ఇంకెవరితో మనమ్మాయితోటే."
"అమ్మాయితో అంటే ఏం లాభం? ఆ మాట వాళ్ళ నాన్నతో అనవచ్చుగా?"
"వాళ్ళ నాన్న అంటే రమేష్ కు భయం. నిన్ను అడగమని చెప్పమన్నారు." తలవంచుకొని అన్నది రేఖ.
తండ్రి ఓ క్షణం కూతురి ముఖంలోకి చూశాడు.
"మన అంతస్థేమిటి? వాళ్ళ అంతస్థేమిటి? నేను మాత్రం ఎలా అడగ్గలను"
"ప్రేమకు అంతస్థులు తెలియవు నాన్నా" చివ్వున తలెత్తి తీవ్ర కంఠంతో సినిమా డైలాగు విసిరింది రేఖ.
శేషయ్య కూతురి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
శేషయ్య పెద్దకూతురు రేఖ. ఆ తర్వాత వాళ్ళు నలుగురూ మగపిల్లలే. అందరూ స్కూల్లో చదువుతున్నవాళ్ళే.
రేఖను కాలేజీలో చేర్పించాడు శేషయ్య.
మగపిల్లలు కాలేజీ చదువులకు వచ్చేసరికి రేఖ గ్రాడ్యుయేట్ అయి ఉద్యోగంలో చేరితే, వీళ్ళను చదివించడానికి అట్టే ఇబ్బంది వుండదని శేషయ్య అభిప్రాయం. అందుకే రేఖను కాలేజీలో చేర్పించాడు.
పెద్ద కుర్రవాడు చేతికి అందివచ్చాక పిల్ల పెళ్ళి చేయాలనుకున్నాడు.
"రమేశ్ అంటే వాళ్ళ నాన్నకు ప్రాణం. ఒకే కొడుకు. కొడుకు కావాలనాలేగాని కొండమీది కోతినైనా తెచ్చి ఇస్తాడు." ఆలోచనలో వున్న తండ్రి ముఖంలోకి చూస్తూ అన్నది రేఖ.
కొంచెం ఆగి "కొడుకు ఆనందంకోసం..." అంటూ తండ్రి ముఖంలోకి చూసింది.
శేషయ్య ఆలోచనలో పడ్డాడు.
శేషయ్య ఆ రాత్రంతా ఆలోచించాడు.
తెల్లవారి ఆఫీసుకు వెళ్తూనే మానేజింగ్ డైరెక్టర్ గోపాలరావు గదిలోకి వెళ్ళాడు.
శేషయ్య వళ్ళువంచి పని చేస్తాడు. నమ్మకస్తుడు. గోపాలరావుకు అతనంటే గౌరవం వుంది.
"ఏమిటోయ్ పొద్దున్నే పిలవకుండానే వచ్చావు?" నవ్వుతూ పలకరించాడు గోపాలరావు.
శేషయ్య తటపటాయిస్తూ నిలబడ్డాడు.
"చెప్పు! ఏం కావాలి. కూర్చో!" అన్నాడు గోపాలరావు ఆదరణగా.
శేషయ్య కూర్చోలేదు.
గోపాలరావుకు ఎదురుగా ఏనాడూ కూర్చోలేదు.
"ఏమిటి సందేహిస్తున్నావ్? ఫర్వాలేదు చెప్పు. శెలవుకావాలా?"
"మీ అబ్బాయీ మా అమ్మాయీ ఒకే కాలేజీలో చదువుతున్నారు" నాలుకకు అంటుకుపోతున్న మాటల్ని బలవంతంగా బయటికి తోస్తున్నట్టు అన్నాడు శేషయ్య.
"అయితే?" అడగలేదు. శేషయ్య కళ్ళలోకి గోపాలరావు చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS