Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 23


    భావరహితంగా చూశాడు.


    "అవును శశాంకా... ఏమీ జరగదని మనసు పొరల్లో ఎక్కడో వున్న మీరు వారి మాటలకి కొంత ఉపశమించారూ అంటే అదీ కరప్షన్ అన్నది నా సిద్దాంతం. కాకపోతే అధికారంలో వున్నవాళ్ళు 'సిన్ ఫుల్ కరప్షన్'కి సిద్ధపడుతుంటే ఈ సానుభూతిపరులు కాస్త "ఆనెస్ట్ కరప్షన్'కి సంసిద్ధులౌతుంటారు. ఈ సోకాల్డ్ ప్రతిపక్షాలు ఏ సమస్యనీ లోతుగా పరిశీలించలేవు. అదీ మన ప్రాజాస్వామ్య దేశంలో అనుశ్రుతంగా వస్తున్న వాస్తవం. ఈ రాష్ట్రంలో ఎన్ని బంద్ లు జరగలేదు... మరిన్ని హర్తాళ్ళతో అట్టుడికి పోలేదు? ఒకనాడు రమీజాబీ, తర్వాత షకీలా, మరెందరి కోసమో ఉద్యమం చేపట్టారు. గొంతులు చించుకున్నారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు పోయేవరకు ప్రతిఘటించబోయారు. కమీషన్లతో ఉద్యమలాకి వారధి పడింది. కమీషన్ నివేదికల్ని బట్టి తప్పు చేసిన పోలీసాఫీసరుని సస్పెండ్ చేశామన్నారు. ఒడ్డును దాటి వెళ్ళాలనే కెరటంలా పైకెగసి విరిగి మళ్ళీ ఉద్యమాలు వెనక్కి జరిగిపోయాయే తప్ప అసలు నిజంగా ఆ తప్పు చేసిన పోలీసాఫీసరు శిక్షింపబడ్డాడా లేక అదో స్టంటా అన్నది ఎవరైనా ఎలా నిర్ధారించగలరు? వెళ్ళి రికార్డ్స్ చెక్ చేయగలరా? ఈ ప్రభుత్వాలకి, ప్రతి రాజకీయ నాయకునికీ, బ్యూరో క్రాట్స్ కీ ప్రజల నాడి బాగా తెలుసు శశాంకా... ప్రతి ఉద్యమాన్ని 'డిలేట్ టేక్టిక్స్' తో చల్లార్చే సాంప్రదాయం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని మన చరిత్ర చెప్పిన సత్యం. అమ్మ గర్భమైతే బిడ్డను మోసి భూమి పైకి రప్పించేక కూడా మంచి ఫలితం కోసం ఎదురుచూసే అవకాశముంది కాని కాలగర్భానికి ఆ శక్తిలేదు... సమస్యల్ని సమాధి చేయడం తప్ప... ఒక రకంగా కాలానికున్న మహత్తరమైన శక్తి కూడా అదే... ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే ఒక్క రణధీర్ తో న్యాయం జరుగుతుందన్న హేంగోవర్ తో మీరు మరోసారి ఆయనపై తిరగబడకూడదని..."


    విభ్రమంగా చూశాడు. అంటే వినీల తనను వెంటాడుతూ అన్ని విషయాలూ సేకరిస్తుందన్నమాట.


    "ఆశ్చర్యపోకండి శశాంకా... ఇంటికెళ్ళేసరికి మీరు లేరు. ఎక్కడికి వెళ్ళిందీ ఊహించగలిగాను. నేను స్టేషన్ కి వచ్చేసరికి అప్పటికే అక్కడ నుంచి మీరు వెళ్ళిపోయారని తెలిసింది" ఆమె కళ్ళలో అదే లాలిత్యం... విడీ విడని పెదవుల్లో అదే చెరగని చిరునవ్వు. "అసలు మీకేమిటి ఇంట్రెస్ట్ అని మీరు అడిగితే వట్టి స్నేహమే అని చెప్పి తప్పించుకోను."


    సాలోచనగా చూశాడు.


    "నేను జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేట్ ని అంటే ప్రస్తుతం ఫ్రీ లాన్సర్ గా జర్నలిజాన్ని వృత్తిగా తీసుకున్నదాన్ని."


    "జర్నలిస్టు అయ్యుండి మీరెందుకీ కోణంలో ఆలోచిస్తున్నారు?" అడిగాడు అన్యమనస్కంగా.


    "వృత్తిని చేపట్టిన స్వల్ప కాలంలోనే అర్థమైపోయింది."


    "ఏమని?"


    "నిజానికి, జర్నలిజానికి మధ్య దూరం చాలా వుందని" మృదువుగా నవ్వేసింది.


    కూల్ డ్రింక్స్ తాగేక బయలుదేరారు.


    అప్పుడు టైమ్ మధ్యాహ్నం ఒంటిగంట కావస్తూంది.


                                                     *    *    *    *


    ప్రమాదాన్ని పసిగట్టిన రావూఫ్ అనుకున్న ప్రకారం ఉదయం అయిదు గంటలకే నిద్రలేచినా వెంటనే గది దాటి బయటకు రాలేదు.


    మనసు కీడు శంకిస్తుంటే మధ్యాహ్నం దాకా కిటికీలో నుంచే పరిసరాలను గమనిస్తూ వుండిపోయాడు.


    హోటలు క్రింద భాగంలో వున్న రెస్టారెంట్ లోకి కస్టమర్స్ రాకపోకలు ఎక్కువ కావడంతో అదే అదనుగా భావించి క్రిందికి దిగాడు. వస్తూ ఓవర్ కోట్ చుట్టిన స్టెన్ గన్ తీసుకురావడం అతడు మరిచిపోలేదు.


    డ్రయివర్ అతడిని అనుసరించి ముందుగా తనే పార్కింగ్ చేసిన కారును చేరుకున్నాడు. ఒక మామూలు డ్రైవర్ లా గుడ్డతో కారు బోనెట్ ని, అద్దాల్ని తుడుస్తుంటే కారు డోర్ కీని తెరుస్తున్న రావూఫ్ ఓ క్షణంపాటు అవుట్ గేట్ వేపు చూశాడు.


    "ఎక్స్ క్యూజ్ మీ"


    ఓ సూట్ కేసుతోబాటు కవరు తొడిగిన వయొలిన్ తో అక్కడ నిలబడిన రాజన్, సురేంద్రలు కనిపించారు.


    ఆ వయొలిన్ కవరులోనే వారి ఆయుధాలున్నాయి.


    "ఎండెక్కువగా వుంది." సురేంద్ర అన్నాడు.


    "అవును, చలి కాలంగా" రావూఫ్ జవాబిచ్చాడు. అది వారి తొలి సంకేతం. "మీ కారు నెంబరిస్తారా?" వెంటనే రావూఫ్ అడిగాడు.


    "865" రాజన్ జవాబు చెప్పి "మరి మీ కీ నెంబరు" అన్నాడు సాలోచనగా చూస్తూ.


    "626"


    క్షణాల్లో అటుపక్క రావూఫ్, ఇటు సురేంద్ర రెండు నెంబర్లనీ కలిపారు.


    మామూలు అర్థమేటిక్స్ ప్రకారం రెండు సంఖ్యల్ని కలిపితే వచ్చే సంఖ్య 1491.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS