మగాడితో సమానంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నా కూడా కట్నాలు ఇచ్చుకోవల్సిన దౌర్భాగ్యపు పరిస్థితిలో ఆడజాతి ఎందుకుంది?
సాంప్రదాయం పేరుతో సమాజం అని చెప్పబడే మన వ్యవస్థ ఆడదాని చుట్టు అల్లిన విషవలయమే ఈ వరకట్న పిశాచం!"
కట్నం ఇవ్వాలిట. వాడింటి పరువుని కాపాడాలట వాడి తల్లితండ్రికీ, అక్క చెల్లెళ్ళకీ, తమ్ముళ్ళకీ గంపెడు చాకిరి చెయ్యాలట. వాడు కొడితే పడాలట. తిడితే నొరెత్తకూడదట. వాడింట్లో చాకిరీ చెయ్యడానికి డబ్బు ఎదురిచ్చి అసలెందుకు వెళ్ళాలి?
ఇది న్యాయమా?
ఇది ధర్మమా!
పెళ్ళికోసం ఖర్చుచేసే డబ్బుని బ్యాంకులో వేస్తే బతికినంతకాలం సుఖంగా బతికేస్తుంది కదా!" అవంతి ఆవేశంగా అంటుంటే ఆమెగొంతు జీరబోయింది.
ఆడది అడుగువేస్తే వేలెత్తి చూపే సమాజాన్ని కూకటివేళ్ళతో పీకి పారేసి బంగాళాఖాతంలో విసిరేయాలనుండి అవంతికి. ఆమెకి కసిగా వుంది. కోపంగా ఉంది, ముక్కుపుటాలు అదురుతున్నాయి.
"నువ్వాకేసులో అక్కడ జరిగే అన్యాయాన్ని చూసి ఆవేశంతో అంటున్నావే కాని ఆడదానికి పెళ్ళి భర్త, సంసారం, పిల్లలు లేకపోతే జీవితానికి "అర్థం" ఏముంటుంది?" ఆ గదిలో చేరిన ఓ ఫ్రెండ్ అంది.
"నువ్వు "అర్థం" అని చెబుతోన్న మాటని కూడా ఈ చీడపట్టిన సమాజమే సృష్టించింది. పెళ్ళి, భర్త, సంసారం లేకపోతేనేం? మనవాళ్ళు అని చెప్పుకోడానికి పిల్లల్ని కనొచ్చుగా!"
"పెళ్ళి చేసుకోకుండా పిల్లలా? బాపురే!"
"ఏ పుడితే చార్మినార్ ఏమన్నా పడిపోతుందా? పెళ్ళిపేరుతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆడదాని బతుకు సాలిగూటిలో చిక్కిన తూనీగలాంటిది. ఆడది కన్నెత్తిచూస్తే నేరం. అడుగుదాటి అడుగువేస్తే అపరాధం. ప్రతికోణంలోంచి "శీలం" అనే చెరసాల ఆడదాన్ని వెంటాడుతూనే వుంది.
కట్టుకున్న ఆడది నీతి తప్పకుండా పవిత్రంగా వుండాలనుకొనే మగాళ్ళని ఛాలెంజి చేస్తున్నా, గుండెమీద చెయ్యివేసుకుని చెప్పమను. తను ఏక పత్నీ వ్రతుడ్ననీ, రెండో ఆడదాని మొహం తెలీదని చెప్పమను తన పెళ్ళాం పతివ్రతగా వుండాలనుకుంటునే పరాయి వాడి పెళ్ళాన్ని చూసి గుటకలు మింగే మగరాయిళ్ళకి నీతి వుందా! ఛీ..... ఐ హేట్ మగాళ్ళు! ఐ హేట్ బ్లడీ మొగాళ్ళు!!" అంది అవంతి.
"ఏమో, నువ్వంటున్నావే గానీ మన ఆడవాళ్ళు తెగించలేరుగా!" అంది శ్యామల.
"అందుకే ఆడదిలా అన్యాయం అయిపోతుంది. అలనాడు ముక్కు పచ్చలారని ఆడపిల్లల్ని ముసలి వెధవలకిచ్చి చేసివాడు చావగానే సమగమనం పేరుతో ఆడదాన్ని కాష్టంలో పట్టి ఆ చచ్చినోడితోనే కాల్చేసేవాళ్ళు.
రాజారాం మోహన్ రాయ్, విలియం బెంటింక్ ప్రభువు ఆ దారుణాన్ని అరికట్టి సహగమనం అనే నరకాన్ని తప్పించారు. బాల్యదశలో పెళ్ళిళ్ళు వద్దని చెప్పి, వితంతు వివాహాలని ప్రోత్సహించిన మహానుభావుడు వీరేశలింగం పంతులు కన్యాశుల్కం పేరున చిన్న పిల్లల్ని చచ్చేముసలి వెధవలకి ఇచ్చిచేసే ఆచారాన్ని ఖండిస్తూ దానివల్ల జరిగే అనర్ధాలని అద్దంపట్టి చూపించిన ఆదర్శమూర్తి గురజాడ.
ఎంత చేసినా, ఇంకా ఆడదానికి అన్యాయం జరుగుతూనే వుంది.
సహగమనం పేరుతో ఆనాడు వరకట్నం పేర్న ఈనాడు ఆడది దహన కాండకి గురి అవుతూనే వుంది. ఈ కట్న పిశాచాన్ని దేవుడు దిగొచ్చినా అరికట్టలేడు శ్యామలా!" అంది అవంతి.
కుసుమ చివ్వున తలెత్తింది.
"మనం ఎదురు తిరగాలి?"
"ఎవరిమీద ఎదురు తిరగాలి?"
"కట్నం కోసం అమ్ముడుపోతున్న అబ్బాయిలమీద ఇచ్చిన డబ్బు చాలదని భార్యల్న కొట్టి, తిట్టి, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చివరకు పెళ్ళాలని నిలువునా తగలపెట్టే మరోపురుషులపైనా"
"నిజమే సాంప్రదాయాలు వెర్రి తలను వేసినప్పుడు జాతిమొత్తం జాగృతమైతే తప్ప ప్రయోజనం లేదు. అయితే ఇక్కడొక వాస్తవాన్ని కూడా మనం మరచిపోకూడదు. కట్నంకోసం పెళ్ళాన్ని వేధించే భర్తకన్నా కొత్తకోడళ్ళని వేధించే అత్తలు, ఆడబిడ్డలే ఎక్కువగా వుంటున్నారు. ఈ దురాచారపు దురంతాలకు ఆహుతి అయిపోతున్న అబలలపై నూటికి తొంభైశాతం వరకూ మరో ఆడది కిరసనాయల్ పోస్తే ఇంకో ఆడది అగ్గిపుల్ల గీస్తోంది. మన జాతిపై జరుగుతోన్న సజీవ దహనాలకు మనవాళ్ళపాత్రే ప్రముఖంగా వుంటుందన్న కఠిన సత్యాన్ని మరచిపోకూడదు.
కనుక అవసరమైతే అత్తల్నీ, ఆడబిడ్డల్నీ వాళ్ళని అదుపుచెయ్యని మొగుళ్ళనీ బయటకి లాగి "బహిరంగ విచారణ" చేసి సరియైన శిక్షలు వేస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు.
"అయితే ఏం చెయ్యాలి?" రమణి దీర్ఘంగా ఆలోచిస్తూ అడిగింది.
"పులిని చూసి పులి ఈర్ష్యపడదు. కానీ ఆడది మాత్రం మరో ఆడదాన్ని చూస్తే అసూయతో భగ్గుమంటుంది.
ముందుగా ఆడదాన్ని ఆడగి గౌరవించడం నేర్చుకోవాలి. సహజంగా మనలో నిక్షిప్తమై వుండే అసూయని దూరంగా నెట్టగలగాలి మనందరం ఒక్కటి అనుకొన్ననాడు ఈ మగాళ్ళెంత? వాళ్ళ కధెంత?
గొర్రె కసాయివాడిని నమ్ముతుంది. అలాగే మెడలోమూడు ముళ్ళువేసిన మగాడిని ఆడది నమ్ముతుంది. సర్వస్వాన్నీ ధారపోస్తుంది. లెక్కలు కట్టి చూస్తే ఈనాడు ఎనభై కుటుంబాలు దెబ్బతింటున్నాయి.
చదువుకొన్న చదువు మనిషికి సంస్కారాన్ని నేర్పాలి.
జీవితాన్ని పంచుకోడానికి వచ్చే ఆడదానికి రవంత అభిమానాన్ని, మరికొంత ప్రేమనీ పంచితే ఎంతో విశ్వాసంగా పడివుంటుంది. కానీ మగజాతికి స్వార్థం ఎక్కువ. ఆ స్వార్థమే ఆడదాన్ని కాటేస్తోంది" అన్నది అవంతి ఉద్వేగంతో.
రమణి అవంతిని "అక్కా" అని పిలిచింది.
"నువ్వు చెప్పిన ప్రతిమాటలోనూ ఎంత సత్యం వుందో అర్థం చేసుకున్నాను. ఆడజాతి ఉప్పెనలా చెలరేగాలి. మగాళ్ళకి కట్నాలివ్వకూడదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆడదాని జీవితానికి సెక్యూరిటీకోసం కొంత ఆస్తిని, డబ్బునీ ఆమె పేరుతో వుంచాలి. లేకపోతే అసలు ఆడవాళ్ళు పెళ్ళే అవసరం లేదు అని తిరగబడ్డ రోజున మగజాతి మొత్తం మన కాళ్ళదగ్గరకొస్తుంది."
"నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. నాకు పెళ్ళొద్దు. తాళిబొట్టు వద్దు. మొగుడంతకంటే అవసరంలేదు. దీనివల్ల సమాజంలో సంచలనం కలగవచ్చు. అయినా నేను కేర్ చేయను" అంది అవంతి.
"మేమూ నిన్ను అనుసరిస్తాం" ముక్తకంఠంతో ఆ గదిలోని ఆడపిల్లలు అన్నారు.
