"పులిమీద సవారీ చేయడం రావాలేగానీ, వస్తే ఆ పులిచేత గడ్డి తినిపించవచ్చు" అన్నాడు నేప్ కిన్ తో చేతులు తుడుచుకుంటూ సారధి."
"దెన్ బెటర్ లక్" అంది భారతి.
సారధి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
"బావ ఇంత ఫూల్ అని నాకు తెలీదు," అని మనసులో అనుకుంది భారతి.
16
స్నానం చేసి గదికొచ్చి తలుపులు వేసుకొని డ్రస్ చేసుకుంటోంది అవంతి.
నీలిరంగు ళాటిన్ లంగా కట్టుకొని బొందుముడివేసి అద్దంలో చూసుకొంది. నగ్నంగా ఎత్తయిన వక్షోజాలు నున్నగా నునుపుగా అద్దంలో కనిపిస్తుంటే లేడీ బ్రా తీసి అందులో వాటిని బంధించి చేతుల్ని వెనక్కి పెట్టి హుక్సు పెట్టుకొంది.
చాలా రోజులైంది బయట సరదాగా తిరిగి, ఏదన్నా సినిమాచూడాలని తయారవుతోంది అవంతి. నీలంరంగు చైనా సిల్క్ చీరని తీసి కట్టుకోబోతుండగా తలుపుల్ని దబదబ బాదిన చప్పుడు వినిపించి ఉలిక్కిపడింది అవంతి.
తన గది తలుపుల్ని ఎవరూ ఎప్పుడు అలా కొట్టలేదు. ఆ కొట్టడంలో కంగారు ధ్వనిస్తోంది.
"అవంతి, అవంతీ త్వరగా తలుపు తెరు."
అంది శ్యామల గొంతు.
అవంతి చేతిలోంచి చీర కుచ్చెళ్ళు జారిపోయినాయి. దాంతో చైనా సిల్క్ చీర పూర్తిగా కిందికి జారిపోయింది.
అవంతి ఒక్క అంగలో వెళ్ళి తలుపు తెరిచింది. శ్యామల గభాల్న గదిలోకి వచ్చింది.
"ఏం కొంప మునిగిందని తలుపుల్ని అలా బాదేశావు" అంది అవంతి.
"కొంపే మునిగిపోయింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. కుసుమ వాళ్ళక్క సరోజిని చనిపోయిందట" చెప్పింది గుక్క తిప్పుకోకుండా శ్యామల.
శ్యామల చెప్పిన మాటకి అవంతి నిర్ఘాంతపోయింది.
"ఎలా?" అనగలిగింది తేరుకొంటూ అవంతి.
"సూసైడ్ చేసుకొందట."
"ఆత్మహత్యా! పాపం పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు! జాలిగా అంది అవంతి.
"ఆ దిక్కుమాలిన పెళ్ళి దాని పాలిట మృత్యువయింది" అంది శ్యామల.
"పద" అంది గదిలోంచి బయటకు రాబోతూ అవంతి లంగా జాకెట్ తోనే.
"ఏమిటా కంగారు ముందు చీర కట్టుకో" శ్యామల అవంతి అలానే బయటికి రాబోవటం చూసి అంది.
అవంతి గబగబ చీర కట్టుకుని కుసుమ గదివైపు వెళ్ళింది. వెనకే శ్యామల కూడా నడిచింది.
కుసుమ చుట్టూ స్నేహితురాళ్ళు కూర్చుని వున్నారు. కుసుమ మంచంమీద బోర్ల పడుకొని బోరుమని ఏడుస్తోంది. ఆమెకి కొందరు ఓదారుస్తున్నారు.
అవంతికి కన్నీళ్ళు తిరిగాయి. సరోజిని అక్కడ వాళ్ళందరికీ తెలుసు. ఆమె పెళ్ళికి అవంతి, శ్యామల, రమణి మిగిలిన వాళ్ళందరు కూడా వెళ్ళారు. వాళ్ళంతా ఎంతో హడావుడీ, సందడి చేశారు ఆ పెళ్ళిలో.
ఆ పెళ్ళిరోజును వాళ్ళింకా మరచిపోనుకూడాలేదు. నిన్నకాకమొన్న జరిగినట్టుగా ఉంది. కానీ పెళ్ళికూతురు మాత్రం బూడిద అయిపోయింది.
అవంతి మెల్లగా ముందుకు కదిలింది. కుసుమ భుజంపైన చేయి వేసింది.
కుసుమ మెల్లగా తలెత్తి స్నేహితురాల్ని చూసి ఆమెకి కౌగలించుకొని ఘొల్లుమంది.
"మా అక్కని ఆ దుర్మార్గులే చంపేశారు అవంతి. నాకు తెలుసు పెళ్ళి అయిన రోజునుంచీ కూడా అది తేలేదని, ఇది తేలేదని అక్కని చాలా హింసలు పెట్టారు. ప్రతి దానికి అక్కని కొట్టి ఇంటికి పంపేసేవారట."
"ఊరుకో, ప్లీజ్ ఏడవకు జరగకూడనిది జరిగిపోయింది. అంతే అయిపోయింది. ఇప్పుడేం చేయగలం?" వూరడింపుగా అంది శ్యామల.
"పెళ్ళప్పుడు కూడా కట్నం చాల్లేదని వాళ్ళత్త పేచీ పెట్టింది. అప్పుడు నా చేతి గాజులు అమ్మేసి అప్పటికి సర్దుబాటు చేశాం. ఆ తర్వాత టి.వీ కావాలని ఓ సారి, డైనింగ్ టేబిల్ అని మరోసారి..... ఈ సంవత్సరంగానూ దాన్ని సాధించి పాదించి చంపేశారు" అని చెబుతూ ఏడుస్తోంది.
ఆ మాటలు వింటుంటే అవంతి మొహంలోకి రక్తం ఉప్పెనలా పొంగింది.
ఈ వివాహ వ్యవస్థపైనా, కట్నంకోసం ఆడపిల్లల నిండు జీవితాలని బలితీసుకునే అత్తలమీద, మొగుళ్ళపైన ఈసడింపుతో కూడిన జుగుప్స కలిగింది.
"కిరసనాయిల్ పోసుకు చచ్చిపోయిందిట అక్క. కానీ నేను నమ్మను అక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిదికాదు. వాళ్లే చంపేసి వుంటారు అక్కని మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టిపెరిగే ఆడపిల్లల్ని ప్రతిదీ కావాలని పుట్టింటికి తోలుతూ అవి తేలేదని వాళ్ళని పొట్టన పెట్టుకొనే "కరోడా జాతిని" సజీవంగా నడిరోడ్డుపైన నించోబెట్టి తగలబెట్టాలని వుంది అవంతీ!" కుసుమ ఏడుస్తూనే కఠినంగా అంటోంది.
అవంతి పెదిమలని బిగపట్టింది. ఆమెకి ఎక్సైట్ మెంట్ వస్తోంది. ఆమె శరీరం వణికిపోతోంది.
"కుసుమా!" గంభీరంగా పిలిచింది అవంతి.
ఆమె కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఆ గొంతులోని తీవ్రతకి ఆ గదిలో పూర్తిగా నిశ్శబ్దం అలుముకొంది కొన్ని నిముషాల పాటు.
"ఆడపిల్లలుగా పుట్టడం మనతప్పుకాదు. కానీ మనని కన్నతండ్రులు చేస్తోన్న తప్పు అంతా ఇంతాకాదు. కాస్తో కూస్తో ముట్టజెప్పి ఆడపిల్లని వదిలించుకోవడానికి, బాధ్యత తీరిందని చెప్పుకోవడానికి చూస్తారే తప్ప దాని బతుకేమవుతుందోనని ఒక్కతండ్రైనా కన్నబిడ్డకి పెళ్ళిచేసేముందు ఆలోచిస్తున్నాడా! అలా చేతకానప్పుడు, స్థోమతలేనప్పుడు అసలెందుకు పెళ్ళిచెయ్యాలీ, వాళ్ళచేత ఎందుకు తగలబెట్టించాలి?"
"మనం అనుకొని ఏం చెయ్యగలం? మనకి తెలిసిన మనిషి పోయింది. కనక బాధపడుతున్నాం కానీ రోజూ ఎంతమంది ఆడపిల్లలు ఇలాంటి దారుణానికి గురై పోతున్నారో పేపర్లో రాస్తూనే వున్నారు. ఆడపిల్లలుగా పుట్టినందుకు మనజాతికి జరుగుతోన్న అన్యాయానికి మనం ఆందోళన చెందినంత మాత్రాన మార్పుని తేలేముగా! అంది రమణి.
"ఎందుకు మార్పుని తీసుకురాలేం? ఆడది పాపం చేసుకొని పుట్టలేదు. మగాడు పుణ్యం చేసుకొని అంత కంటే పుట్టలేదు. అసలు మగాడికి కట్నం ఎందుకివ్వాలి?
