అభ్యుదయం
ఏవో.
ఏవేవో, ఏవేవో
ఘోషలు వినబడుతున్నాయ్!
గుండెలు విడిపోతున్నాయ్!
ఎవరో,
ఎవరెవరో, ఎవరెవరో
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు! భయో
ద్విగ్నంగా వర్తిస్తున్నారు!
అవిగో! అవిగవిగో! అవిగవిగో!
ఇంకిన, తెగిపోయిన, మరణించిన
క్రొన్నెత్తురు! విపంచికలు! యువయోధులు!
నేడే, ఈనాడే, ఈనాడే-
జగమంతా బలివితర్ది!
నరజాతికి పరివర్తన!
నవజీవన శుభసమయం!
అభ్యుదయం!
2-4-1937
* * *
