వ్యత్యాసం
అదృష్టవంతులు మీరు,
వెలుగును ప్రేమిస్తారు,
ఇరులను ద్వేషిస్తారు,
మంచికీ చెడ్డకీ నడుమ
కంచుగోడలున్నాయి మీకు.
మంచి గదిలోనే
సంచరిస్తాయి మీ ఊహలు.
ఇదివరకే ఏర్పడిందా గది.
అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం.
నిశ్చల నిశ్చితాలు మీవి.
మర్యాద, మప్పితం గురించి,
నడతా, నాణ్యం, విలువల విషయం
నిశ్చల నిశ్చితాలు మీవి.
మీ కన్నుల చూపులు సరళరేఖలో!
రేఖ చెదిరితే గొల్లుమని పోతారు.
రేఖ కవతలి వారంతా నేరగాళ్ళు.
రేఖను రక్షించడానికే
న్యాయస్థానాలు, రక్షకభటవర్గాలు,
చెరసాలలు, ఉరికొయ్యలు,
రేఖను కాపాడక తీరదు.
* * *
అభాగ్యులం మేము,
సరిహద్దులు దొరకని
సంధ్యలలో మా సంచారం.
అన్నీ సమస్యలే సందేహాలే మాకు.
వెలుగులోని చీకట్లే,
ఇరులలోని మిణుగురులే చూస్తాం.
నూరు దోషాలలోని ఒక సుగుణం,
నూరు పుణ్యాలలోని ఒక ఘోరం!
వ్యత్యాసాలూ, వ్యాఘాతాలే
అడుగడుగునా మాకు.
మా వంట మేమే వండుకోవాలి.
ఒక్కొక్క మారు విస్తరే దొరకదు,
జీవితపు సన్నని సందులకే
ఆకర్షణ మాకు.
మా దృష్టిది వర్తుల మార్గం.
ఆద్యంత రహితం.
సంధ్యాజీవులం, సందేహభావులం.
ప్రశ్నలే, ప్రశ్నలే.
జవాబులు సంతృప్తిపరచవు.
మాకు గోడలు లేవు.
గోడలను పగులగొట్టడమే మా పని.
అలజడి మా జీవితం.
ఆందోళన మా ఊపిరి.
తిరుగుబాటు మా వేదాంతం
ముళ్లూ, రాళ్ళూ, అవాంతరాలెన్ని ఉన్నా
ముందు దారి మాది
ఉన్నచోట చాలును మీకు.
ఇంకా వెనక్కి పోతామంటారు కూడా
మీలో కొందరు.
ముందుకుపోతాం మేము.
ప్రపంచం మా వెంట వస్తుంది.
తృప్తిగా చచ్చిపోతారు మీరు.
ప్రపంచం మిమ్మల్ని మరిచి పోతుంది.
అభిప్రాయాల కోసం
బాధలు లక్ష్యపెట్టనివాళ్ళు
మాలోకి వస్తారు.
అభిప్రాయాలు మార్చుకొని
సుఖాలు కామించే వాళ్లు
మీలోకి పోతారు.
25-4-1937
* * *
