Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 23


                                                     వాడు

అందరం కలిసి చేసిన ఈ        
అందమైన వస్తుసముదాయం అంతా
ఎక్కడో ఒక్కడే వచ్చి
ఎత్తుకు పోతూ ఉంటే చూచి,
"అన్యాయం, అన్యాయం?" అని మేమంటే-
"అనుభవించాలి మీ కర్మం" అంటాడు.

పొద్దుపొడిచి పొద్దుగడిచేదాకా
ఎద్దుల్లాగు పనిచేసే మమ్మల్ని
మొద్దుల్నీ, మొరటుల్నీ చేసి
ముద్దకి కూడా దూరం చేశాడు.
"ఘోరం ఇది, దారుణం ఇ"దంటే-
"ఆచారం! అడుగు దాటరా" దంటాడు.

భరించడం కష్టమైపోయి
పనిముట్లు మేము క్రిందను పడవైచి-
"చెయ్యలేం, చస్తున్నాం మేము,
జీవనానికి ఆసరా చూపించ" మంటే-
నోరుమూసి, జోడుతీసి కొట్టి
"దౌర్జన్యానికి దౌర్జన్యం మం" దంటాడు.

                                                                              - 1937 (?)

                                                          * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS