Previous Page Next Page 
ఆలింగనం పేజి 23


    ఫోన్ రింగ్ అవుతోంది. ఒకటి, రెండు, మూడు...ఎన్ని రింగులకీ ఎత్తలేదు.

 

    ఎంతో నిరాశగా వెనుతిరుగబోతుండగా సందీప్ కంఠం వినిపించింది.

 

    "హలో..." గబగబా "హలో...సందీప్ నేనే" అన్నాను.

 

    "హాయ్ నీతా... నీ కాల్ కోసమే చూస్తున్నాను" సంతోషంగా అన్నాడు.

 

    నేను ఒక్కక్షణం తెల్లబోయి "సందీప్ నేను...ఆముక్తని!" అన్నాను.

 

    "ఓ...ముక్తా...హౌ ఆర్ యూ?" అన్నాడు అతను.

 

    "నీతా అన్నావేంటీ?" రోషంగా అడిగాను.

 

    "ఎక్స్ కర్షన్ లో పొరపాట్న తన హేండ్ బ్యాగ్ నాతో వచ్చేసింది. అందుకు చేసిందనుకొన్నాను. అయినా నువ్వు రాలేదేంటీ?" అన్నాడు.

 

    తన హేండ్ బ్యాగు నీతో ఎందుకు వచ్చిందీ అని అడుగుదామంటే, పబ్లిక్ బూత్ అబ్బాయి అసహనంగా నన్నే చూస్తూ నిలబడటం కనిపిస్తోంది.

 

    "అమ్మకి ఒంట్లో బాలేదని రాలేదు. నేను అసలు నీకు గుర్తు రాలేదా?" అలా అడుగుతుంటే నా కంఠం జీరపోయింది.

 

    "వచ్చావు...ఎందుకు రాలేదూ?" అన్నాడు సందీప్.

 

    నేను బిచ్చం అడుగుతున్నట్లు అతను దయతలచి నా జోలెలో కాస్త ధర్మం చేస్తున్నట్లూ అనిపించింది.

 

    "అక్కడ నువ్వు బాగా ఎంజాయ్ చేశావా?" అడగకుండా ఉండలేకపోయాను.

 

    "ఆ...చాలా చాలా" అన్నాడు.

 

    నేను బాధగా "ఉంటాను" అన్నాను. "నువ్వులేకుండానా?" అంటాడనుకొన్నాను.

 

    "గుడ్ నైట్" అన్నాడు.

 

    ఏదైనా చిలిపిగా అంటాడనుకున్న నాకు నిరాశే మిగిలింది. ఎక్స్ పెక్టేషన్ ని మించిన బాధలేదీ లోకంలో. ప్రతి నిరాశా ఒక ఆశలోంచే పుడుతుంది! నా హృదయాంతరాలలో ఎన్నో పున్నములు పూయించిన ఈ ప్రేమ, అమావాస్యలను కూడా అందించింది!

 

    నేను ఇంటికి సమీపించేసరికి అరుగుమీద చలిలో ఆయాసపడుతూ అమ్మ కూర్చుని ఉంది!

 

    నేనేం చెప్పాలో ఆలోచించుకునేలోపే "నువ్వు వెళ్ళడం నేను చూశాను. ఇప్పుడేం చెప్పకు. శబ్దం చెయ్యకుండా వెళ్ళి పడుకో. నాన్నగారు చూస్తే బావుండదు!" అంది.

 

    నాకు చిత్రంగా భయం వెయ్యలేదు.

 

    మౌనంగా లోపలికి నడిచాను.

 

    అమ్మ బయట ఆయాసపడడం వినిపిస్తోంది.

 

    నల్లని ముసుగేసుకున్న ఆకాశం ఉండుండీ మూలుగుతోంది. ఇంకాసేపట్లో గుండెలు పగిలేలా ఏడుపు అందుకుంటుందేమో! నాకు సందీప్ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. అతని కంఠంలో నేను ఆశించిన ఆర్తిలేదు. ఒకలాంటి నిర్లక్ష్యం! గుండె నిండా గాలి ఊది బుడగలా చేసి, సూదిగుచ్చిన భావన.


                                    *  *  *


    నేను రాత్రి బయటికి ఎందుకెళ్ళానో అమ్మ అడగలేదు. నేనూ చెప్పలేదు.

 

    సందీప్ కాలేజీలో మామూలుగానే పలకరించాడు.

 

    అతని తత్వం నాకు ఇంకా అర్థంకాలేదు! నేను పక్కనుంటే నేనే తన ప్రాణంలా ఉంటాడు. లేకపోయినా ఉషారుగానే ఉంటాడు.

 

    నేను అతను లేకపోతే అన్నీ పోగొట్టుకున్నదానిలా విషాదంగా ఉంటాను! పరీక్షలు అయ్యాయి. సెలవులిచ్చారు.

 

    "నాతో గోవా వస్తావా?" అడిగాడు సందీప్.

 

    "నేనా!!" ఆశ్చర్యపోయాను.

 

    "నువ్వే...ఏం?" అన్నాడు.

 

    "ఇంట్లో ఒప్పుకోరు" అన్నాను.

 

    "నీ ఫ్రెండ్ పెళ్ళికని చెప్పు" తేలిగ్గా అన్నాడు.

 

    నా ఫ్రెండ్ పెళ్ళికైనా మా ఇంట్లో పరాయి ఊరికి పంపించరని చెప్పాను.

 

    అతను తెగ చిరాకు పడ్డాడు.

 

    "నువ్వు ఎప్పుడూ ఇంతే!" అన్నాడు.

 

    "గోవాలో ఏం ఉందీ? ఇక్కడైతే నేను ఉన్నాను" చిన్నగా నవ్వుతూ అన్నాను.

 

    "గోవాలో ఫారన్ బ్యూటీల నగ్నసౌందర్యం చూడచ్చు!" అన్నాడు.

 

    నాకు చివుక్కుమనిపించింది.

 

    "ఈ రోజు మా ఇంటికి రావా?" అడిగాడు.

 

    అన్నిటికీ కాదనలేక "సరే" అన్నాను.

 

    సందీప్ ఇంట్లో ఆ సమయంలో ఎవరూ ఉండరని నాకు తెలీదు. మ్యూజిక్ సిస్టంలోంచి ఇల్లు అదరగొట్టేంతగా బీట్స్ వస్తున్నాయి.

 

    "కమాన్" న చెయ్యి పట్టుకుని సందీప్ నన్ను తన రూంలోకి తీసుకెళ్ళాడు. అతని రూమ్ లో బెడ్ చూసి నేను నోరు తెరిచేశాను. అంత బావుంది.

 

    "కూర్చో" అన్నాడు.

 

    మెత్తగా ఉండి నేను లోపలికి కూరుకుపోయాను. లేవలేక ఇబ్బంది పడ్తుంటే అతను నన్ను భుజాలుపట్టి లోపలికి అదిమిపెట్టి "బావుందా?" అన్నాడు.

 

    నాకు అతన్ని నా ముఖానికి అంత దగ్గరగా చూసేసరికి సిగ్గేసింది "వదులు..." అన్నాను.

 

    అతను నన్ను వదిలే ప్రయత్నం చేయకుండా నా పక్కన పడుకుని నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతను ముద్దుపెట్టుకోవడం కొత్తకాకపోయినా, ఇలా ఒంటరిగా అనేసరికి ఎందుకోగానీ నాకు భయం వేసింది.

 

    "ఒద్దు...ఒద్దు..." అని లేవబోయాను.

 

    "ఫరవాలేదు" అతను నన్ను గట్టిగా హత్తుకున్నాడు.

 

    నా శరీరంలో ఏదో అవుతోంది. ఒళ్ళంతా కరెంట్ ప్రవహిస్తున్నట్లు ఒకటే అలజడి! ఇంతకు ముందెన్నడూ ఎరగని జడి...తడితడిగా అతని పెదవులు నా కళ్ళమీదా... చెంపలమీదా...భరించలేనంత హాయి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS