ఒక సాయంత్రం సంధ్యవేళ....
ఆ స్విమ్మింగ్ ఫూల్ లోని నీటిపై నీరెండపడి మరింత స్వచ్చంగా మెరుస్తున్నాయి.
గట్టున ఎందరో యువతీ యువకులు వున్నా ఒకవైపు ప్రత్యేకంగా కూర్చుని వున్న జంటను ప్రత్యేకంగా వేలు పెట్టి చూపించాడు ఆ వ్యక్తి.
చిరునవ్వుతో తల వూపి అతను ఇచ్చిన నోట్ల కట్టను అప్యాయంగా అందుకుని జేబులో కుక్కుకున్నాడు ఆ ఆగంతుకుడు.
అక్కడ కూర్చుని వున్న జంట మరెవరోకాదు...
ఏ.సి.పి వీరేష్... ధీరజ.
నగరంలో వున్న స్విమ్మింగ్ ఫూల్స్ లో ఇది ఒకటి....
నిర్వాహకులు చక్కగా మెయింటెయిన్ చేయడంవల్ల మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అందుకే ఎప్పుడూ బిజీగా వుంటుంది. దానికి అనుబంధంగా వున్న హెల్త్ క్లబ్ లో మెంబర్స్ గా చేరిన వాళ్ళకు మాత్రమే రోజుకు ఒక గంట సమయం స్విమింగ్ చేసుకునే వీలు కల్పించబడింది.
వీరేష్.ధీరజలు కూడా అలా స్విమింగ్ కోసమే వచ్చారు. అసలు ఇద్దరికీ పరిచయం అయింది స్విమ్మింగ్ పూల్ దగ్గరే. అప్పటి నుంచి ఇద్దరూ క్రమం తప్పకుండా వస్తూనే వున్నారు.
డిపార్ట్ మెంట్ లో కేసుల ఒత్తిడి కారణంగాఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒకసారి తప్ప అంతకు ముందులా ప్రతిరోజు వీరేష్ రాలేక పోతున్నాడు.
ధీరజ మాత్రం రెగ్యులర్ గా వస్తూనే వుంది.
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారేతప్ప ఎవరూ కదలడంలేదు.
వాళ్ళనే పరిశీలనగా చూస్తున్న వ్యక్తి క్లబ్ ఆఫీస్ గది వైపు నడిచాడు.
"వీరూ... మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం"
"పెళ్ళా... అది ఎందుకు?"
"ఎందుకా? కలిసి వుండడానికి"
"ఏం... ఇప్పుడు వుండడం లేదా?"
"ఏయ్... నేను సీరియస్ గా అడుగుతుంటే నీకు వేళాకోళంగా వున్నట్టుందే. కలసి వుండడమంటే ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం కాదు. ఎప్పుడు కలసి వుండడానికి... ఒకే ఇంట్లో... ఒకే మంచంమీద ఛీ పో బాబూ... అన్నీ తెలిసికూడా ఏమీ తెలీనట్టు నాతో చెప్పించాలనే"
"ఓ అదా... రేపే చేసుకుందాం"
"నిజంగా"
"అవును.... నిజంగానే"
"వీరూ... తమాషాకాదు... నిజం చెప్పు"
"లేకపోతే ఏమిటి...ఏమిటి.... ఈ రోజు పెళ్ళి... పెళ్ళి అంటూ వసపిట్టలా వాగుతున్నావు__ మనం లైఫ్ లో ఏం సాధించాం అని.... ఏదో ఒక అడ్వంచర్ అయినా చేసి పేరు తెచ్చుకోవాలి.... ఆ తర్వాత మన పెళ్ళి. అర్ధం అయిందా?"
"వీరూ... పెళ్ళికీ దానికీ లింక్ ఏమిటి? నువ్వు తప్ప నాకు ఇంకెవరు వున్నారు చెప్పు.... అయిన వాళ్ళందరూ పోగొట్టుకుని నువ్వు వున్నావు అన్న చిరు ఆశతోనే కదా నేను మొండిగా బతుకుతుంది... ఒంటరితనం గుర్తుకు రాకూడదు అనే ఎప్పుడూ ఏదో ఒకటి నెత్తిన వేసుకుంటూ వుంటాను. అప్పుడేమో జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్ళి చేసుకుందాం అన్నావు.ఇప్పుడేమో ఉద్యోగంలో క్రెడిట్ సంపాదించాక చేసుకుందాం అంటున్నావు. ఈసారి మాత్రం నీమాట నేను వినను. నామాట నువ్వు వినవలసిందే..." ధీరజ బింకంగా అన్నది.
ప్లీజ్ ధీరజా.... ఇప్పుడు టేకప్ చేసిన కేసు సక్సెస్ కావడం ఖాయం. రేపో మాపో దొంగనోట్ల రాకెట్ నడుపుతున్న ఘరానా పెద్ద మనిషిని ప్రభుత్వాన్నికి పట్టి ఇచ్చిన వీరేష్" అన్నా వార్త నువ్వే నీ స్వహస్తాలతో పత్రికలకు ఇవ్వడం ఖాయం. కనీసం అంతవరకు అయినా ఆగుదాం."
"సరేవీరూ... నీ మీద నాకు ఆ నమ్మకం వుంది. అంతవరకూ ఒక కండిషన్. రోజుకు ఒకసారి అయినా ఈ దేవి దర్శనం చేసుకోవాలి నువ్వు. లేదు అంటే వూరుకోను"
"అబ్బ అలాగే అన్నాను కదా"
"అయితే ఇప్పుడు చెప్పు. ఎంతవరకు వచ్చింది నీ ప్రోగ్రెస్"
"అశోక్ ఇంటర్ నేషనల్ లో బొంబాయినుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులను దొంగనోట్ల ముఠావాళ్ళు కలసి వుంటారని నా అనుమానం. వాళ్ళలో వాళ్ళకు ఎందుకు గొడవలు వచ్చాయో మరి ఒకరి నొకరు కాల్చుకుని చచ్చారు. అలా ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే బొంబాయి నుంచి వచ్చిన ముగ్గురి శవాలతోపాటు, ఈ సిటీ గూండా శవం ఒకటి వాళ్ళ గది ముందు పడి వుంది. వాళ్ళు బొంబాయికి చెందిన చీకటి వ్యాపారస్తులు అని నా పరిశోధనలో తేలింది.
చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు తాము గదిని ఖాళీ చేస్తున్నట్టు హోటల్ యాజమాన్యం వారికీ...బొంబాయికి టిక్కెట్స్ బుక్ చేయమని ఒక ట్రావెల్ ఏజన్సీకి ఫోన్ చేశారు వాళ్ళు. హోటల్ వాళ్ళు చెప్పినదాన్నిబట్టి చంపిన వ్యక్తి పారిపోయాడు అనీ.... చనిపోయిన వాళ్ళ గదిలో వుండవలసిన సూట్ కేస్ లేదనీ తేలింది. పారిపోయిన వ్యక్తి వట్టి చేతులతోనే వెళ్ళాడు కాబట్టి ఆ సూట్ కేస్ తప్పనిసరిగా ఆ హోటల్ లోనే ఎవరి వద్దనో ఉండి ఉండాలి.... అ రోజూ వాళ్ళను ఎవరెవరు కలుసుకున్నారో కూపీ లాగాడానికి ప్రయత్నిస్తున్నాను..."
"అదేదో త్వరగా సాధించు వీరూ..."
"ఎందుకూ?"
"ఎందుకేమిటి? త్వరగా పెళ్ళి చేసుకోవడానికి"
"యూ నాటీ..."అంటూ ఆమె బుగ్గపై పొడిచాడు.
"కమాన్ వీరూ.... స్విమ్మింగ్ చేద్దాం"
"ఓకే... నేను రాను... నువ్వు చేస్తూ వుండు.... నేను చూస్తుంటాను"
"ఏయ్.... ఏమిటి చూసేది..."
"నువ్వు ప్రతి మాటకూ అర్ధం వెదుక్కోవద్దు డియర్..."
అప్పుడే హెల్త్ క్లబ్ సర్వెంట్ ఒకడు రెండు కూల్ డ్రింక్ బాటిల్స్ తో వచ్చాడు.
"మేడమ్ ....మీకు డ్రింక్స్ పంపించారు"
ధీరజ ఆశ్చర్యపోయింది.
"ఎవరు పంపించారు?"
"సెక్రటరి మేడమ్..."
ఆమె ఆఫీసు రూమ్ వైపు చూసింది.
దూరంగా వున్న అద్దాల గదిలో నుంచి సెక్రటరీ చేయి ఊపుతూ కనిపించింది.
ఎప్పుడూ లేనది యిప్పుడు ప్రత్యేకంగాఎందుకు పంపించిందో ననుకుంటూ తను ఒకటి తీసుకుని, రెండవది వీరూకి అందించింది.
సర్వెంట్ వెళ్ళిపోయాడు.
ఖాళీ బాటిల్ ను క్రింద పెట్టి స్విమ్మింగ్ పూల్ లోకి డైవ్ చేసింది ధీరజ.
ఆమె చేపపిలల్లా గిరికీలు కొట్టడాన్ని మెల్ల మెల్లగా సిప్ చేస్తూ తిలకిస్తున్నాడు వీరేష్.
నీటిలో కదుపుతూ ఉన్న ఆమె అందాలను సమ్మోహనంగా చూస్తూన్నాడు అతను.
ఆమె నీటి అడుగుకు వెళ్ళిపోయింది.
ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తూనే వుంది.
